తెలుగు సుద్దులు…..(128)
ఆ.వె||ధనము గూడ బెట్టి ధర్మంబు సేయక;
తాను దినక లెస్స దాచుగాక
తేనె నీ`గ గూర్చి తెరవరి కి`య్యదా?
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
ధనం సంపాదించి, దానం చేయకుండా (బీదలకు సహయం చేయకుండా), ధర్మకార్యాలకు, మంచిపనులకు కూడా వాడకుండా, కనీసం తాను సైతం అనుభవించకుండా పరమ లోభిగా దాచిపెట్టవచ్చు; కాని చివరికి ఆ ధనం (సంపద), తేనెటీగ ఎలా ఎంతోకష్టపడి మకరందాన్ని పోగుజేసి, తేనెపట్టుగా దాచుకుంటే, చివరికి అది ఏ దారినపోయేవారి కంటపడి వారిపాలవుతుందో అలాగే లోభి సొమ్ము పరుల (దొంగల, ప్రభుత్వము-రాజుల, లేదా నేల)
పాలవుతుందని వేమన లోభత్వాన్ని చక్కటి ఉపమానంతో మనకు తెలియచెప్పుతూ,
సంపాదించినదాన్ని సహేతుకంగా, ధార్మికంగా అనుభవించి,
ఉన్నంతలో ఇతరులకు సైతము సాయపడాలని హితవుపలుకుతున్నారు.
ఇదే హితవుని మనం సుమతీశతకంలో
కూడా చూడవచ్చు….
క॥తాననుభవింప నర్ధము
మానవతిఁ జేరుఁ గొంత, మఱి భూగతమౌ
గానల నీఁగలు గూర్చిన
దేనియ యొరుఁ జేరునట్లు తిరముగ సుమతీ! ॥30-12-2014||
No comments:
Post a Comment