Translate

31 December, 2014

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి)-128



తెలుగు సుద్దులు…..(128)
.వె||ధనము గూడ బెట్టి ధర్మంబు సేయక;
            తాను దినక లెస్స దాచుగాక
            తేనె నీ` గూర్చి తెరవరి కి`య్యదా?
            విశ్వదాభిరామ వినర వేమా!.         
భావముః
ధనం సంపాదించి, దానం చేయకుండా (బీదలకు సహయం చేయకుండా), ధర్మకార్యాలకు, మంచిపనులకు కూడా వాడకుండా, కనీసం తాను సైతం అనుభవించకుండా పరమ లోభిగా దాచిపెట్టవచ్చు; కాని చివరికి ధనం (సంపద), తేనెటీగ ఎలా ఎంతోకష్టపడి మకరందాన్ని పోగుజేసి, తేనెపట్టుగా దాచుకుంటే, చివరికి అది దారినపోయేవారి కంటపడి వారిపాలవుతుందో అలాగే లోభి సొమ్ము పరుల (దొంగల, ప్రభుత్వము-రాజుల, లేదా నేల) పాలవుతుందని వేమన లోభత్వాన్ని చక్కటి ఉపమానంతో మనకు తెలియచెప్పుతూ, సంపాదించినదాన్ని సహేతుకంగా, ధార్మికంగా అనుభవించి, ఉన్నంతలో ఇతరులకు సైతము సాయపడాలని హితవుపలుకుతున్నారు.
ఇదే హితవుని మనం సుమతీశతకంలో కూడా చూడవచ్చు.
తాననుభవింప నర్ధము
    మానవతిఁ జేరుఁ గొంత, మఱి భూగతమౌ
      గానల నీఁగలు గూర్చిన
    దేనియ యొరుఁ జేరునట్లు తిరముగ సుమతీ! 30-12-2014||

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 036 (176 – 180)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|


దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]

1. తనకిస్తానన్న కన్యను కొడుకుకు చేసుకున్న వ్యక్తి ఎవరు?
2.
అజ్ఞాత వాసమ్లో ద్రౌపది పేరేమి?
3.
ఉత్తర గోగ్రహణం నాటికి అజ్ఞాతవాసంపూర్తయినదని నిర్ధరించి చెప్పిన దెవరు?
4.
వివేకధను డెవరని విదురుడు చెప్పాడు?
5.
దక్షులెవ్వార లుపేక్ష చేసి రదివారలచేటగు మాటలు ఎవరు ఎవరితో చెప్పుమన్నవి?
------------------------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. అర్జునుడు ఉత్తరను కోడలుగా చేసుకొన్నాడు.- విరాటపర్వము పంచమాశ్వాసము 361 పద్యము
||ఈకన్నియఁ గోడలిఁగాఁ
  గైకొనియెదఁ గాని యిది దగ దుచితవృత్తిన్ (దు శిష్యగతిన్; దు శిశువృత్తిన్)
  నాకడన యబల మెలఁగుట
 లోకము శంకించు నన్ను లోలాత్మునిఁగాన్ (361)

2.
మాలిని - విరాట పర్వము ప్రథమాశ్వాసము 105 & 106 పద్యములు
||సైరంధ్రీవేషంబునఁ
  జేరుదు నంతఃపురంబుచెంతకు నన్నా
  భూరమణుదేవి యెంతయు
  గారవమునఁ బిలువ నంపఁగా వినయమునన్. (105)
||కని కొలువు సేసికొని మా
  లిని
నాఁ జని సాధ్వి యిది మలీమసవృత్తం
  బునపొంతఁ బోవ దెన్నఁడు
  ననువ్రేఁకఁదనంబు దోఁచు నట్లు చరింతున్. (106)

3.
భీష్ముడు. - విరాటపర్వము చతుర్థాశ్వాసము - 232 పద్యము
సీ||రెండవయేఁట నొక్కం డధిమాస మి ట్లెక్కినయన్నెల లెల్లఁ గూర్చి
   కొనఁ బదుమూఁడు హాయనములు దప్పక నిన్నటితోడన నిండె నంత
   యెఱిఁగియ తమపూన్కియెల్లను దీర్చితి మని పొడసూపె నర్జునుఁడు నేఁడు
   పాండుపుత్రులు ధర్మపరులు ధర్మాత్మజుం డేరి కధిష్ఠాత వారు ధర్మ
తే||పథము దప్పుదురే యన్ని పాటు లట్లు
   పడినవారలు దఱియంగఁ బాఱ నేర్తు
   రెట్లు దమకించి నీతివిహీనవృత్తిఁ
   దమకు నొకకీడు వచ్చువిధంబు గాఁగ. (232)

4.
బుద్ధితో, కర్తవ్యాకర్తవ్యములు నిశ్చయించుకొని, శత్రుమిత్రదాసీనులను, చతుర్విధోపాయాలతో వశపరుచుకొని, పంచేంద్రియములను జయించి, షడ్గుణాలు తెలిసి, సప్త వ్యసనాలు విడిచి జీవించేవాడే వివేకధనుడు. ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము 37 పద్యము
తే||ఒకటిఁ గొని రెంటి నిశ్చలయుక్తిఁ జేర్చి
   మూఁటి నాల్గింటఁగడువశ్యములుగఁజేసి
   యేనిటిని గెల్చి యాఱింటి నెఱిఁగి యేడు
   విడిచి వర్తించువాఁడు వివేకధనుఁడు. (37)

5.
ధర్మరాజు ధృతరాష్ట్రునితో చెప్పుమని కృష్ణునికి చెపుతాడు. ఉద్యోగపర్వము తృతీయాశ్వాసము 273 పద్యము
||సారపుధర్మమున్ విమలసత్యముఁ బాపముచేత బొంకుచేఁ
   భారముఁ బొంద లేక చెడఁ బాఱిన దైనయవస్థ దక్షు లె
   వ్వార లుపేక్ష సేసి రది వారలచే టగుఁ గాని ధర్మ ని
   స్తారక మయ్యు సత్యశుభదాయక మయ్యును దైవ ముండెడున్. (273)
**********
 

మసనోబు ఫుకుఓకా కస్తూరి పలుకులు(20)


30 December, 2014

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 035 (171 – 175)




ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       

నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|


దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|


[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
 


1. జూదరి ఆలికి గరువతనం ఎక్కడి నుండి వస్తుంది? మాటలెవరివి?
2.
ఒంటరిగా కీచకుని మందిరానికి వెళ్ళిన మాలినిని కీచకు నుండి ఎవరు రక్షించారు?
3.
ఒక చెట్టు పేరున్న పాండవుడు ఎవరు?
4.
కంకుభట్టు రక్తాన్ని మాలిని తన చీర కొంగుతో తుడవటానికి కారణం ఏమిటి?
5.
అర్జునునకు కృష్ణుడనే పేరు ఎలా వచ్చింది?
--------------------------------------------------------------------------------
 సమాధానములు (జవాబులు):
1. ద్రౌపదివి కంకుభట్టుతో; విరాటుని సభలో ద్రౌపదిని కీచకుడు తన్నినపుడు. - విరాట పర్వము  
     ద్వితీయాశ్వాసము 153వచనము
|| అ ట్లగుటంజేసి నాకు నాట్యంబును బరిచితంబ మత్పతి శైలూషుండ కాఁడు కితవుండునుం గావున
      జూదరియాలికి గఱువతనం బెక్కడియది యనుచు నచ్చోటు వాసి తనచిత్తంబున. (153)

2.
సూర్యుడు పంపిన రాక్షసుడు. - విరాట పర్వము ద్వితీయాశ్వాసము 110 & 126 పద్యములు
|| తరణియు దుఃఖిత యగున
   త్తరుణిం గాచుటకు నత్యుదగ్రభుజావి
   స్ఫురణాఢ్యు నొక్క రక్కసుఁ
   గరుణార్ద్రమనస్కుఁడగుచు గ్రక్కున బనిచెన్. (110)
|| తనుఁ గాచి వెనుక వచ్చిన
   దనుజుమహాబలము దనదుతను వొందిన నా
   తనిచే విదిల్చి రభసం
   బునఁ దన్మందిరము ద్రుపదపుత్రిక వెడలెన్. (126)

3.
అర్జునుడు అర్జున వృక్షం ఒకటి ఉన్నది. - - విరాటపర్వము చతుర్థాశ్వాసము - 91 పద్యము
|| వెరవరి గాక వీడు కురువీరులకుం బొడసూపువాఁడె
     చ్చెరు వొక మ్రానిపేర నిట నేరఁగ చ్చుచు నున్నవాఁ డహం
     కరణమ కాని యొం డొకటి గానఁడు మూర్తివిశేష మారయన్
     సురపతియట్ల వీనిమదిచొ ప్పది యెట్లొ యెఱుంగ నయ్యెడున్. (91)

4.
ఉత్తమ ద్విజుని రక్తపాతం దేశానికి కీడు అని. - - విరాటపర్వము పంచమాశ్వాసము - 261 పద్యము & 262  
      వచనము
తే|| విమలవంశంబునను బుణ్యవృత్తమునను
    వఱలునీతనిరక్తంబు వసుమతీ
    ధరణిపై నెన్నిబిందువుల్ దొరఁగె నన్ని
    వర్షములుగల్గు నిం దనావర్ష భయము. (261)
|| అని చెప్పి యుత్తమద్విజలోహితపాతం బెట్లునుం గీడు గావున నీకు నొకహాని వుట్టుటకుఁ జాలక యిబ్భంగిం  
      జేసితి నని వెండియుఁ గొండొకకీలాలంబు దొరఁగం దొరఁగం దుడుచు చుండె నంత నట యుత్తరు నెదుర్కొనం
      బోయి. (262)

5.
ఖాండవాన్ని దహించినపుడు శివుడు, బ్రహ్మ ప్రత్యక్షమయి పేరు ఇచ్చారు. - - విరాటపర్వము
     చతుర్థాశ్వాసము - 149 వచనము
||……..ఖాండ్వం బేర్చినప్పుడు మెచ్చి భద్రమూర్తు లైనరుద్ర విరించులు సన్నిధిసేసినం బెన్నిధి గన్న పేదచందంబున సంభ్రమించునాకుం గరుణించి కృష్ణుం డనునేకాదశనామంబును నప్రతిహత బాణంబులు నొసంగిరి……(149)
******