Translate

16 June, 2016

శ్రీమదాంధ్రమహాభాగవతము- దశమస్కంధము – ప్రశ్నోక్తి


ప్రార్థనా పద్యములు


శ్లో. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం|

      దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్||


శా. శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర

      క్షైకారంభకు భక్తపాలనకళాసంరంభకున్ దానవో

      ద్రేక స్తంభకుఁ గేళిలోలనిలసద్దృగ్జాలసంభూతనా

      నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్.


ఉ. వాలినభక్తి మ్రొక్కద నవారితతాండవకేలికిన్

      శాలికి శూలికిన్ శిఖరిజాముఖపద్మమయూఖమాలికిన్

      బాలశశాంకమౌలికిఁ గపాలిక్ మన్మథగర్వపర్వతో

      న్మూలికి నారదాదిమునిముఖ్యమనస్సరసీరుహాలికిన్.


ఉ. ఆతతసేవఁ జేసెద సమస్త చరాచరభూతసృష్టివి

     జ్ఞాతకు భారతీహృదయసౌఖ్యవిధాతకు వేదరాశిని

     ర్ణేతకు దేవతానికరనేతకుఁ గల్మషజేతకున్ నత

     త్రాతకు దాతకున్ నిఖిలతాపసలోక శుభప్రదాతకున్.


ఉ. ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతాహృదయానురాగసం

      పాదికి దోషభేదికిఁ బ్రసన్న వినోదికి విఘ్నవల్లి కా

      చ్ఛేదికి మంజువాదికి నశేషజగజ్జననందవేదికిన్

      మోదక ఖదికిన్ సమదమూషక సాదిక్ సుప్రసాదికిన్.


ఉ. క్షోణితలంబునన్ నుదురు సోకగగ మ్రొక్కి నుతింతు సైకత

     శ్రోణికిం జంచరీకచయసుందరవేణికి రక్షితామర

     శ్రేణికిఁ దోయజాతభవచిత్తవశీకరణైకవాణికిన్

      వాణికి నక్షదామశుకవారిజపుస్తకరమ్యపాణికిన్


శా. పుట్టం బుట్ట శరంబునన్ మొలవ నంభోయానపాత్రంబునన్

     నెట్టం గల్గను గాళిఁ గొల్వను బురాణింపన్ దొరంకొంటి మీఁ

     దెట్టేవెంటఁజరింతుదత్సరణినాకీవమ్మ యోయమ్మ మేల్

     పట్టున్ నాకగుమమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీదయాంభోనిధీ.


ఉ. శారదనీరదేందుఘనసారపటీరమరాళమల్లికా

      హారతుషారఫేనరజతాచలకాశఫణీశకుందమం

      దారసుధాపయోధిసితతామరసామరవాహినీశుభా

      కారత నొప్పునిన్ను మదిఁ గానఁగ నెన్నఁడు గల్గు భారతీ!


ఉ. అంబ నవాంబుజోజ్జ్వలకరాంబుజ శారదచంద్రచంద్రికా

     డంబరచారుమూర్తిప్రకటస్ఫుటభూషణరత్నదీపికా

     చుంబితదిగ్విభాగ శ్రుతి సూక్తివివిక్తనిజప్రభావ భా

     వాంబరవీథివిశ్రుతవిహారిణి నన్ గృపఁజూడు భారతీ!


ఉ. అమ్మలఁ గన్నయమ్ ముగురమ్మలమూలపుటమ్మ చాలఁ బె

     ద్దమ్మ సురారులమ్మకడు పాఱడివుచ్చినయమ్మ దన్నులో

     నమ్మినవేల్పుటమ్మలమనమ్ముల నుఁడెడియమ్మ దుర్గ మా

     యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వపటుత్వసంపదల్.


మ. హరికిం బట్టపు దేవి పున్నెములప్రోవర్ధంపుఁబెన్నిక్క చం

      దురుతోఁబుట్టువు భారతీగిరిసుతుల్ దోనాడుపూఁబోడి దా

      మరలం దుండెడిముద్దరాలు జగముల్ మన్నించునిల్లాలు భా

       సురతన్ లేములు వాపుతల్లి సిరియిచ్చున్ నిత్య కల్యాణముల్.


క. శ్రీకంఠచాప ఖండన!

     పాకారి ప్రముఖ వినుతభండన! విలస

     త్కాకుత్స్థవంశ మండన!

     రాకేందుయశోవిశాల! రామనృపాలా!!


హరిఓం