Translate

09 December, 2014

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి) - 118

తెలుగు సుద్దులు…..(118)
ఆ.వె||అంకిలె`రిగి మాటలా`డ నేర్చిన`పుడె
         పిన్న పెద్ద తనము లెన్ననే`ల?
         పిన్న చేతి దివ్వె పెద్దగా వెలగదా?
         విశ్వదాభిరామ వినర వేమా!.   
భావముః
కిటుకు, మంచి, చెడు తెలుసుకొని సమయస్ఫూర్తి కలిగి మాట్లాడటము తెలిసినవానిని పిల్లవాడని, తగిన వయస్సులేదని వంకలు పెడుతు నిర్లక్ష్యము చేయకూడదు. చిన్న పిల్లవాడు దివిటీ (కాగడా, దీపము) పట్టుకున్నా దాని వెలుగు తగ్గదు, వెలగటం మానదు అలాగే తగిన విజ్ఞత ఉంటే వయస్సుతో సంబంధములేదని వేమన తెలుపుతున్నారు.

ఉదాహరణగా ద్రౌపది ప్రశ్నకు సభలో అందరూ మౌనం వహించగా వికర్ణుడు చొరవచూపి ఆవిడ ప్రశ్నకు సమాధానం చెప్పినప్పుడు విదురుడు వికర్ణుని ప్రశంసిస్తూ పలికిన పలుకులు. ఎందుకు ప్రశంసించాడో అవలోకించండి….
   
వ॥అనుచు దుఃఖితు లగుచున్నపాండవులను దుశ్శాసనాపకృష్ణ యై సభాంతరంబున నున్న ద్రౌపదిం జూచి 
     వికర్ణుండన్యాయశ్రవణ వికర్ణు లైమిన్నకున్న సభ్యుల కిట్లనియె.  (225)
క॥సమచి త్తవృత్తు లగుబు
    ద్ధిమంతులకు నిపుడు ద్రౌపదీప్రశ్నవిచా
    రము సేయవలయు నవిచా
    రమునఁ బ్రవర్తిల్లు టది నరకహేతు వగున్. (226)
వ॥ఇక్కురువృద్ధు లైనభీష్మధృతరాష్ట్రవిదురాదులును నాచార్యు లయినద్రోణకృపాదులుం బలుకరైరి
     యున్నసభాసదు లెల్లం గామక్రోధాదులు దక్కి విచారించి చెప్పుం డనిన నెవ్వరుం బలుక కున్న నేనిందు
     ధర్మనిర్ణయంబు సేసెద నెల్లవారును వినుండు జూదంబును వేఁటయుఁ బానంబును బహుభక్షణాసక్తియు నను
     నాలుగు దుర్వ్యసనంబులం దగిలినపురుషుండు ధర్మువుం దప్పి వర్తిల్లునట్టివనికృత్యంబులు సేకొనందగవు  
     కితవాహుతుం డై వ్యసనవర్తియయి పరాజితుండయినపాండవాగ్రజుండు పాండవుల కందఱకు సాధారణ
     ధనంబయినపాంచాలిఁ బణంబుఁ జేసెం గావున ద్రౌపది యధర్మవిజిత యక్కోమలి నేకవస్త్ర నిట దోడ్కొనితెచ్చుట
     యన్యాయం బనిన వికర్ణుపలుకుల కొడంబడక కర్ణుండు వాని కి ట్లనియె. (227)
మత్తకోకిలము॥ఈవికర్ణుండు బాలుఁ డయ్యును నేర్పరించి యథావిధిన్
                       దేవమంత్రియపోలె ధర్మువుఁ దెల్పె నీతనిబుద్ధి మీ
                       రేవగింపక చేకొనుం డిది యెల్లయందును ధర్మస
                       ధ్బావ మొక్కని కేర్పరింపఁగ బ్రహ్మకైనను బోలునే. (236)
             (శ్రీమదాంధ్రమహాభారతము - సభాపర్వము – ద్వితీయాశ్వాసము)
 ||08- 12-2014||


No comments:

Post a Comment