Translate

17 December, 2014

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి - 026 (126 – 130)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|


[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]

1. స్త్రీ మొగమెరుగని మునికుమారుడు విలాసినీ మోహితుడై ఆశ్రమం విడిచి వెళ్ళాడు -
   ఎవరాతడు? ఎవరికొడుకు?
2.
అర్జునుని దివ్యాస్త్ర లాభం గురించి పాండవులకు చెప్పినదెవరు?
3.
సత్త్వరజస్తమో గుణాల లక్షణాలు ఏవి?
4.
ధర్మవ్యాధునకు అంతటి జ్ఞానం దేనివల్ల కలిగింది?
5.
దుర్యోధనుని తొడలు విరుగగొట్టడానికి ఒక ముని శాపం కూడా కారణం ఎవరా ముని?
--------------------------------------------------------------------------------
 
సమాధానములు (జవాబులు):
1.
ఋష్యశృంగుడు; విభాండకుని కొడుకు. - ఆరణ్యపర్వము తృతీయాశ్వాసము 102 & 112 వచనములు
  ట్లు ఋష్యశృంగుం బ్రబోధించి వేశ్యాపుత్రి యరిగిన దానిపోయినవలను సూచుచు ఋశ్యశృంగుం 
      డగ్నిహోత్రంబు వేల్వక మఱచి విపరీతబుద్ధి యైయున్న నంత నడవినుండి వన్యఫలంబులు గొనివచ్చి 
      విభాండకుండు కొడుకుం జూచి యి ట్లేల చింతాపరుండ వై యగ్నహోత్రంబు వేల్వక కాలాతిక్రమణంబు సేసె
      దనినఁ దండ్రికి ఋశ్యశృంగుం డిట్లనియె. (102)
  ఇట్లు ఋశ్యశృంగుండు విలాసినీమోహితుడయి తండ్రి కెఱింగింపక స్వచరితంబయిన తనయాశ్రమంబు విడిచి
      మనుష్యయోగంబునం దగిలి యక్కోమలి పిఱుందన చని యంగదేశంబు సొచ్చి యందు
      రోమపాదునాదేశంబున రాజాశ్రయం బనుభవనంబున నుండనంత. (112)

2.
రోమశుడు. - ఆరణ్యపర్వము ద్వితీయాశ్వాసము 295 పద్యము; 293 & 297 వచనము
ఇట్లు వచ్చినమహాముని నతిభక్తి ననుజబ్రాహ్మణసహితుండై ధర్మజుండు పూజించి మునీంద్రా యెం దుండి
       వచ్చితి రని యడిగిన నాతనికి రోమశుం డి ట్లనియె. (293)
  ||ఈశున నీశుఁ దొట్టి సుర లెల్ల నభీష్టవరంబు లిచ్చుటం
      జేసి కృతార్థుఁ  డైనకురుసింహము నూర్జితశౌర్యు నర్జునున్
      భాసుర తేజు విశ్వపరిపాలకుఁ డైనమహేద్రుతోడ నే
      కాసన మెక్కి యున్న మహిమాస్పదు నింద్రతనూజుఁ జూచితిన్. (295)
  అతనియున్న విలసంబుచూచి విస్మితుండ నయిన నాకు నింద్రుండు తాత్ప్రభావంబు చెప్పి వీం        
       డమృతసంభవం బయినపాశుపతం బనుదివ్యాస్త్రంబుఁ బరమేశ్వరుచేతను, నాచేతను
       యమవరుణకుబేరాదులచేతను దివ్యాయుధంబులఁ బడసె నితండు మనుష్యుండు కాఁడు దివ్యపురుషుం
       డన్యుల కశక్యం బయిన దేవకార్యంబుదీర్చి మసలక వచ్చు నని మర్త్యలోకంబునకుం బోయి భ్రాతృసహితుం
       డయిన ధర్మరాజునకుం జెప్పు మనిన వచ్చితి నని వెండియు నిట్లనియె. (297)

3.1)
ధైర్యము, శాంతి, కరుణ, సంతోషము, విద్య, జ్ఞానము మొదలగునవి సత్త్వ గుణ లక్షణములు.
   2)
రాగము, లోభము, జడత్వము, మానము, మొదలగునవి రాజసగుణములు.
  3)
దుఃఖము, నిద్ర, దైన్యము, మోహము, అసహనము మొదలగునవి తమౌ(తామస) గుణ
     లక్షణములు. - ఆరణ్యపర్వము పంచమాశ్వాసము 96 & 97 పద్యములు
  అతినిందితము తమోగుణ
      మతిమోహమయంబు సత్వ మనయంబుఁ బ్రకా
      శతనొప్పు నుభయగుణమి
      శ్రతఁ బరఁగు రజోగుణంబు సన్నుత చరితా. (96)
 అసుఖాకారత నిద్ర దైన్యము విమోహం బక్షమత్వంబుఁ దా
        మసభావంబులు రగ లోభ జడతా మనంబు లూహింప రా
        జసవృత్తంబులు ధైర్య శాంతి కరుణా సంతోష విద్యాదు లిం
        పెసఁగన్ సాత్వికచేష్టి తంబులు నిజం బి ట్లాత్మఁ న్మింతయున్. (97)

4.
గురు శుశ్రూష చేత. - ఆరణ్యపర్వము పంచమాశ్వాసము 135 వచనము
  గురుశుశ్రూషం జేసి నీకుఁ బరమశోభనం బగు జాతిస్మరత్వంబును గలుగు నపరజన్మంబునం
       బరమబ్రాహ్మణుండ వయ్యెద వని యనుగ్రహించిన నవ్విప్రుని దేహంబునందు నాటినబాణంబు మెత్తన వెఱికి 
       యతనిం దదీయాశ్రమంబునకుం జేర్చితి నాచేసినపుణ్యంబున నమ్మహాత్ముండు నపాయంబు వొందండయ్యె
       నాకు నిట్టిజన్మంబు నొంద వలసె నని చెప్పినం గౌశికుం డి ట్లనియె. (135)

5.
మైత్రేయుడు. పాండవులతో కలసి ఉండుమని మైత్రేయుడు ధృతరాష్ట్రునితో చెపుతూంటే దుర్యోధనుడు
     మాటలు పెడచెవిని పెట్టి తొడలు చఱచి నవ్వాడు. మైత్రేయుడు భీముని చేత నీ తొడలు విరుగగొట్ట
     బడతాయి. అని శపించాడు. ఆరణ్యపర్వము ప్రథమాశ్వాసము- 103 వచనము.
  వారికి వాసుదేవ ధృష్టద్యుమ్నులు సంబంధ సహాయుఅలు జరామరణవంతులైన మనుజులు వారిం జెనకి
       యెట్లు జీవింతురు నీవు వారితో నొడంబడి యుండు మది కార్యం బనిన మైత్రేయుపలుకు లాదరింపక
       పాదాంగుష్ఠంబున నేల వ్రాయుచు బాహువెత్తి దొడలు సఱచి నగుచున్న యాదుర్యోధనుం జూచి మైత్రేయుం
       డలిగి యీయపరాధంబున నాహవంబగు నందు భీముగదా భూతంబున నీయూరు యుగళంబు భగ్నం 
      బయ్యెడు మని శాపం బిచ్చిన వెఱచి ధృతరాష్టృండు మునీంద్రా యట్లు గాకుండం బ్రసాదింపు మనిన
      నమ్మునివరుం డి ట్లనియె. (103)
****

No comments:

Post a Comment