Translate

Showing posts with label Safety oriented Short Stories - భద్రత లఘు కథలు. Show all posts
Showing posts with label Safety oriented Short Stories - భద్రత లఘు కథలు. Show all posts

27 October, 2014

శృతిమించిన పరాచికం - బావగారి ఇరకాటం (భద్రతా నేపథ్య లఘు కథ)

శృతిమించిన పరాచికం - బావగారి ఇరకాటం (భద్రతా నేపథ్య లఘు కథ)
“అమ్మా!” అంటూ గట్టికేక వినపడగనే,అందరూ ఒక్కసారి హాల్లోకి గాబరాగా వచ్చి ఈజీచైర్ మధ్యలో ఇరుక్కుని క్రిందపడి లేవటానికి ప్రయత్నిస్తున్న రామన్ని చూసి నిశ్చేష్టులైనారు.  అందరిలోకి పెద్దవారైన రామం మామగారు,నొచ్చుకొంటూ… “బాబూ… దెబ్బ గట్టిగ తగిలిందా?”  అంటూ సాయంపట్టి రామాన్ని లేవతీసి,మెల్లగా నడిపించుకొనివెళ్ళి లోపల పందిరిమంచం మీద పడుకోబెట్టారు.
ఈలోగా, అపుడే ప్రక్కింటి స్నేహితురాలి దగ్గరనుండి పుస్తకం తీసుకొని లోపలికి అడుగుపెట్టిన వాసంతి, అందరూ హైరానా పడుతూ, తన కోసమే ఎదురుచూస్తున్నట్లు గ్రహించి,ఏమి తెలియనట్లు లోపలి తొట్రుపాటును కప్పిపుచ్చుకొనటానికి ప్రయత్నిస్తూ….
“ఏమైంది?ఏమిటి హడావుడి? అంటూ ప్రశ్నిస్తున్న వాసంతిని, కూతురు నిర్వాకం గ్రహించిన రామం అత్తగారు తన  సహజ ధోరణిలో ….
”ఏమైందా?నిన్ను నిలువున చీరేసినా పాపం లేదు.  నీవు చేసిన నిర్వాకం వలన బావగరు కుర్చీలో కూర్చోబోయి క్రింద పడ్డారు. ఎన్నిసార్లు చెప్పాను నీకు…అమ్మాయీ! పరాచికాలకు హద్దుండాలని. ఆకుర్చీపట్ట కఱ్ఱ నీవే కదూ తీసింది? నిజం చెప్పు…ఆ పని మీనాన్నగారు,నేను,అక్క చేయలేదు….ఇపుడు బావగారికి గట్టి దెబ్బ తగిలి ఏదన్నా ఐతే….ఎంత అప్రదిష్ట!!!”అని సణుగుకొంటూ రామాన్ని విచారించడానికి లోనికి వెళ్ళింది.
ఆ రాత్రి రామానికి నెప్పి ఎక్కువ అవటంవలన, తాత్కాలికంగా ఉపశమనానికి,బ్రూఫెన్ మాత్రవేసి మర్నాడు ఉదయం రామం మావగారు డాక్టరు దగ్గరకు తీసుకొనివెళ్ళారు.అనుకొన్నంతా అయింది. రామం పడటంలో వెన్నుపూసచివరిది కొంచెం చిట్లిందని డాక్టరు చెప్పారని చెప్పగనే మరలా అందరూ ఒక్కసారి వాసంతిమీద విరుచుకుపడ్డారు.
అంతనొప్పిలోను, బేలగా తనలో తను కుమిలిపోతు,పెద్దల చీవాట్లకు జవాబు చెప్పలేక, చేసిన దానికిపశ్చాత్తాపపడుతూ నేల చూపులు చూస్తున్న వాసంతిని చూచి, రామం వాతావరణాన్ని తేలికపరచడానికాఅన్నట్లు….
“వాసంతీ!ఇలారా…నాకేమి కాదులే…ఇంజక్షనులు వాడితే నెప్పితగ్గి, నిదానంగా ఎముక మాములు అవుతుందని డాక్టరుగారు చెప్పారు.  పరాచికాలు ఒక్కోసారి చాలా ప్రమాదభరితాలు సుమా!  ఇకమీదటఎప్పుడూ ఇలాచేయకేం…మేము కాలేజీలో చదివేటప్పుడు జరిగిన సంఘటన ఒకటి చెప్తా విను…..పరాచికాలు ఎంత ప్రమాదానికి దారితీస్తాయో నీకే తెలుస్తుంది.”  అంటూ తను కాలేజిలో చదువుకొనేటప్పుడు కెమిస్ట్రీ లాబ్ లో జరిగిన ఒక ప్రమాదాన్ని చెప్పడం మొదలుపెట్టేడు రామం.
“బియస్సీచదివేరోజలవి,మామూలుగా లాబ్లో ఒకరిమీదొకరు డిస్టిల్డ్ వాటరును వాష్బాటిల్తో పిచికారి చేసుకొంటూ పరచికాలాడుకొనటం మామూలే.  డిమానుస్ట్రేటర్లు, లెక్చరర్లుచూసి కోప్పడడంకూడా జరుగుతుండేది.  ఒకరోజు, తను సరదాగా తన ప్రక్క బెంచిపైన ఉన్న వాష్బాటిలు తీసి తన క్లాసుమేటు చొక్కాపై వెనుకవైపు గట్టిగా పిచికారి చేసాడు.  అంతే…అతను కెవ్వుమని కేక వేసాడు.  ఏమిటాని చూస్తే, చొక్కా అంతా తడిసి, వీపు మండుతున్నదని  అతను గబ, గబా చొక్కావిప్పుకొని, టాపుక్రిందకి నీళ్ళుపోసుకుందుకు పరిగెత్తాడు..   ఎమిజరిగిందో తను తెలుసుకొనేలోపలే, హెడ్డు గారు రావటం, తన్ను తన రూములోకి తీసుకొనివెళ్ళి, తనను నోరు విప్పనీయకుండ అరగంటగట్టిగా వాయించి, కొట్టకుండానే కొట్టినంతపని చేసి, మొదటి తప్పిదం కనుక అపాలజీ లెటరు వ్రాయించుకొని ఒదిలిపెట్టారు..  ఈలోగా, మాక్లాసుమేటుని మిగతావాండ్లు ఫస్ట్ఎయిడ్ సెంటరుకు తీసుకొనివెళ్ళి ప్రధమచికిత్స చేయించారు. ఆ తరువాత, పాపం నా కారణంగా అతను వారం రోజులు కాలేజికి రాలేకపోయినాడు..  ఇంతా జరిగింది ఏమటంటే, ఇంకో అతను, తన ప్రక్కవానిని ఎడిపించడానికి, అతని ఎక్స్పరిమెంటును పాడు చేయాలని, డిస్టిలు  వాటరు బాటిల్లో సల్ఫూరిక్ యాసిడు కలిపాడు., అది నాకు తెలియక నేను మామూలు  డిస్టిలు  వాటరనుకొని పిచికారి చేసాను. ఇప్పటికీ తనుకల్సినప్పుడెల్లా, ఆ సంఘటన తల్చుకొని సిగ్గుపడుతుంటాను…” అని, చెప్పడం పూర్తిచెస్తూ……
“కాబట్టి,వాసంతీ! నాకు తగిన శాస్తి ఈవిధంగా జరిగిందిలే…నీవేమి బాధపడకు, కాని, ఇంకెప్పుడూ శృతిమించిన పరాచికాల జోలికి వెళ్ళకుసుమా…!” అని సుతిమెత్తని హెచ్చరిక చేసాడు..
రామం మావగారు కల్పించుకొంటూ –“అవును బాబు, నీవు చెప్పింది అక్షరాలా నిజం!  నేను ఫ్యాక్ట్రీలో పనిచేస్తున్నప్పుడు కూడా ఇలాంటిదే జరిగిందంటూ …తను చూసిన శృతిమించిన పరాచికంవలన కల్గిన అనర్ధాన్ని చెప్పడం మొదలుపెట్టారు.
“ఒక రోజు, మా కొలీగు ఒకరు, పరాచికానికి కంప్రెస్డ్ ఎయిరు ప్రక్కవాని  ముఖము మీదికి పెట్టాడు..  అంతే,అతను,“అమ్మా!” అంటూ కండ్లు మూసుకొని “మంట…మంట…కండ్లు మండుతున్నాయి”అని కూలబడ్డాడు. వెంటనే దాక్టరు దగ్గరకు తీసుకొనివెళ్ళితే, అదృష్టవశాత్తు,ఇనుపరజనేమి కంట్లో గుచ్చుకోలేదు.కండ్లు శుభ్రంగా క్లీనుచేసి,ద్రాప్స్ వేసి, ఆయింటుమెంటు ఇచ్చి పంపారు.అప్పటినుండి,కంప్రెస్డ్ ఎయిరుతో పరాచికలు మానివేసాము.”అని,రామం మావగారు తన అనుభవాన్ని చెప్పడం పుర్తిచేసారు.
ఇంతలో రామం అత్తగారు, వంటింటిలోనుండి …“సరే,ఇకచాలు…రండర్రా!అన్నం చల్లగా పోతోంది,అన్నాలు తిందురు…”అని పిలివటంతో …
రామం వాసంతితో..” ‘శృతిమించిన పరాచికం-మాబావగారికి ఇరకాటం’ అని నీవు ఓ కథ రాయకూడదూ…కావాలంటే మీ అక్కయ్య సాయం తీసుకో…” అంటుంటే..
“కథ కంచికి, మనం వంటింట్లోకి” అంటూ రామం మామగారు,అందరిని వంటింటివైపు తీసుకొనివెళ్ళారు.. ||౧౦-౦౬-౨౦౧౩||||10-06-2013||


తప్పెవరిది? - APPM Safety Magazine, Vol.10.No.1,March,1994 లో ప్రచురితమైన కథ

https://fbcdn-sphotos-a-a.akamaihd.net/hphotos-ak-xap1/v/t1.0-9/s720x720/10590593_1886765141462782_7226003906016731828_n.jpg?oh=949cc288fa1c3dbf1d2299736b8965bf&oe=54F38024&__gda__=1424715036_ee737ee5594f208243809445b9d3d722

26 October, 2014

పరిష్కారము - 1986లో నేను వ్రాసిన ఓ చిన్నకథ

పరిష్కారము
(“APPM Safety Bulletin, March 1986” లో ప్రచురితమైన – నేను వ్రాసిన ఓ చిన్నకథ)

“కుటుంబరావూ! ఓ కుటుంబరావూ! నిన్నేనయ్యా పిలుస్తూంట…. ఆగూ,నేనూ వస్తున్నాకదా!” అంటూ పిలుస్తున్న ఆనందరావు మాటలు వినిపించుకోలేదు. భుజంమీద చేయి పడేసరికి పరధ్యానము నుండి తేరుకొని, “ఎవరూ, నువ్వా ఆనందరావు! ఏమిటి విశేషాలు?” అంటూ పలకరించాడు.
“రోడ్డు మీద అంత పరధ్యానమా?”- ఆనందరావు
“ఏం చేయమంటావయ్యా?” ఉన్న ఇద్దరూ ఆడపిల్లలే అయినా, నీవు చక్కగా చదివించి, ఏవోమంచి సంబంధాలు చేసి బరువు బాధ్యతలను దించుకొన్నావు.  పేరుసార్ధకం చేసుకున్నావు” భారంగా అన్నాడు కుటుంబరావు.
ఆనందరావు, కుటుంబరావు ఇద్దరూ చిన్నప్పటి నుండి నేస్తులు.  ఒకేసారి ఇద్దరూ పేపరుమిల్లులో ఎలక్ట్రీషియన్సుగా చేరారు.  ఆనందరావు“చిన్న కుటుంబము – చింతలు లేని కుటుంబము” అన్న ప్రభుత్వ ప్రకటనకు విలువిచ్చిఇద్దరూ ఆడపిల్లలైనా తృప్తిపడి కుటుంబ నియంత్రణ ఆపరేషను చేయించుకొని ఒడిదుడులులేని జీవనం సాగిస్తున్నాడు.
కుటుంబరావు మటుకు “అపుత్రస్య గతిః నాస్తి” అంటూ ఆరుగురు ఆడపిల్లల తండ్రై కూర్చున్నాడు.  దాంతో అనారోగ్యపు భార్య, ఆలనాపాలన లేని పిల్లలు –అన్నీసమస్యలే మఱి.
కుటుంబరావు చీకటి జీవితంలో చిరుదివ్వె పెద్దమ్మాయి సుగుణ.  ఆమె ఇంటివద్దే ట్యూషన్స్ చెబుతూ వేన్నీళ్లకు చన్నీళ్ల సాయంగావుంది.  అయితే వచ్చిన చిక్కల్లా యిక్కడే. ఈ మధ్య వచ్చిన పెళ్లి సంబంధాల వారికి సుగుణ నచ్చింది, పాతికవేల కట్నకానుకలతో పాటుగా.  అది తెలిసినప్పటి నుండి కుటుంబరావు మనసు మనస్సులో లేదు.  కానీ, పాపం ఏం చేస్తాడు! ఉద్యోగానికి వెళ్ళకపోతే బాధ మరీ ఎక్కువవుతుందని డ్యూటీకి బయలుదేరాడు.
పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ మిల్లుకు చేరుకున్నారు.  షిఫ్టు ఇంజనీరు నుండి జాబ్స్ లిష్టు తీసుకొని పల్పుమిల్లు దగ్గర మోటారు విప్పి బాగు చేస్తున్నాడు కుటుంబరావు.  రౌండ్సుకు వచ్చిన ఇంజనీరు, సుగుణాకర్ స్థబ్దుగా వున్న కుటుంబరావును పలకరింపుగా అన్నాడు, “ఏం కుటుంబరావుగారూ! అలావున్నారేం? ఆరోగ్యం బాలేదా…? సెలవు పెట్టలేక పోయారా..?” ప్రశ్నల పరంపర. “ఈ మోటారు రడీ అయ్యాక చెప్పండి, నేను చూశాక రన్నింగ్లో పెడ్దాము, అలా పేపరుమెషీను వైపుకు వెళ్లొస్తాను” అంటూ వెళ్లాడు సుగుణాకర్.  మానసికాంధొళనతోనున్న కుటుంబరావు క్రమంతప్పకుండా తాను నిత్యమూ వాడే భద్రతా పరికరాలు లేకుండగనే తిరిగి పనికి ఉపక్రమించాడు.  “గురువుగారూ! భద్రతా పరికరాలు విధిగా వాడాలని చెప్పే మీరే ఈ రోజిలా పని చేస్తున్నారేమిటీ?” అంటూ అతనిహెల్పరు సహాయకరావు ప్రశ్నించేసరికి ప్రస్తుతానికి వచ్చి, రబ్బరుగ్లౌజువేసుకొని పని ప్రారంభించాడు.  మొత్తానికి హెల్పరు సాయంతో ఆ పని అయిందనిపించి ఇంజనీరు కోసం హెల్పరును పంపాడు.
ఇంతలో “అసలే ఈ రోజు మనసు సరిగ్గా లేదు, అంతా ఏమరుపాటుగ చేస్తున్నాను” అనుకుంటూనే ఇంజనీరు కోసం హెల్పరును పంపిన సంగతి విస్మరించి మోటారు స్విచ్ ఆన్ చేసాడు.
అంతే, ఒక్కసారిగా మోటారు ఫేన్ గార్డు విష్ణుచక్రంలా పైకిలేచి కుటుంబరావు తలకు తగిలి క్రింద పడింది.  బరువైన అలోచనలతోనున్న కుటుంబరావు బలమైన దెబ్బకు కుప్పకూలిపోయాడు. తిరుగుతున్న మోటారు మీదపడటంతో తలకు తగిలిన గాయనికి తోడు పనిచేయడానికి అవసరమైన రెండు చేతులు తెగిపోయాయి.
మోటారు చూడ్డానికి సహయకరావుతో వచ్చిన సుగుణాకర్ కుటుంబరావు పరిస్థికి చలించి ప్రక్కకు తీసి వెంటనే హాస్పిటల్ కి పంపి వైద్య ఏర్పాట్లు గావించాడు.  ఇంటికి వెళ్ళి ధీర్ఘాలోచనలోపడిన సుగుణాకర్ “అవును, పరధ్యానం, అజాగ్రత్త ప్రాణాలను తీస్తాయి.” అనుకొని, “తను ఒక తర్ఫీదు పొందిన ఇంజనీరుగా భద్రతానియమాలను , సూచనలను త్రికరణశుద్ధిగా ఆచరిస్తూ, తన తోటివారు, కార్మికులు కూడా తూచతప్పక పాటించేటట్లు చూస్తాను”అని ఆలోచిస్తూ చల్లగా నిద్రలోకి జారాడు.
“భద్రత పాటించు –ఆనందంగా జీవించు”

నిచ్చెన తెచ్చిన తంటా - 1991 భద్రతాదినోత్సవాల సందర్భంగా నేను వ్రాసిన ఓ చిన్న కథ

నిచ్చెన తెచ్చిన తంటా
(1991 భద్రతాదినోత్సవాల సందర్భంగా నేను వ్రాసిన ఓ చిన్న కథ)
సాయత్రం అయిదు గంటలయింది…
లక్ష్మి మాటిమాటికి పెండ్లికి తన స్నేహితురాళ్ళు – మంగ, మేరి, ముంతాజ్ కలసి ఇచ్చిన గడియారం వంక తమ ఒంటిగదివాటా గుమ్మం వంక అసహనంగ చూసుకొంటోంది.
“బావ మధ్యాహ్నం భోజనానికి వచ్చినపుడు సైరన్ కాగానే ఇంటికి వస్తానన్నాడు… ఇంకా రాలేదేమిటిచెప్మా….అనుకొంటూ ఇంకొకసారి గుమ్మం బయటకు వచ్చి వీధి చివర దాక దృష్టి సారించి, తన బావ జాడ కానరాక నీరసంగా మరల లోపలికి వెళ్లింది.
ఆరోజు తమ పెండ్లిరోజవటంతో సాయంత్రం “కొబ్బరిబొండం”సినిమాకు, అటుతర్వాత హోటల్కి వెల్దాం రెడీగాఉండమని చెప్పివెళ్లటంతో, పాపం లక్ష్మి తన బావకు ఇష్టమైన తెల్ల ఆర్ట్ సిల్క్ చీర కట్టుకొని, ఇంటిగలవరమ్మాయి ఇచ్చిన సన్నజాజిపూవులతో మాలకట్టుకోని, బావచేత తలలో పెట్టించుకొందామని దాచిఉంచుకుంది.  మంచం మీదనున్న ఆమాల, తన్ను చూసి వెక్కిరిస్తూ…
“ఏడీ! మీబావ! ..”అన్నట్లనిపించి, దాన్ని విసురుగా ప్రక్కకు నెట్టింది. వెంటనే ఏదో స్ఫురించినట్లు… “ఓటీకి ఏమన్నా ఉన్నాడా అబ్బా! … అయినా ఈ మధ్య ఓటీలు లేవుగా! మరి…. ఆలస్యం ఎందుకైనట్లు??? బావకు బాతాఖానీలు కొట్టే అలవాటు కూడాలేదే! కొంపదీసి….ఏమన్నా ప్రమాదం జరిగిందా???…” అని మనస్సు పరిపరివిధాలుగా పరిగెత్తుతుంటే, ఆలోచనలకు కళ్ళెం వేద్దామనట్లు మరలా ఒకసారి గోడకు వ్రేలాడుతున్న అద్దంలో ముఖం చూసుకొని, అనవసరం అనిపించినా  మరలా ఒకసారి దువ్వెనతో ప్రక్కవంకీలు సరిచేసుకొని, చీర కుచ్చెళ్ళు సరి చేసుకుంది.
ఆరు గంటలయింది.  లక్ష్మిలో స్త్రీ స్వభావపు అసహనం, అనుమానం, ఉక్రోషం, భయం ఒకదాని వెంట ఒకటి చోటు చేసుకుంటున్నాయి.
“అయ్యో! నా మతి మండ! ఆలోచనలోపడి, సంధ్యవేళ దీపం వెలిగించకుండా ఇలాకూర్చున్నానేమిటీ?” అనుకుంటూ గదిలో ఉన్న 40కాండిలు బల్బు స్విచ్ వేసింది.  పసుపుతాడు, సూత్రాలు బయటకు తీసుకొని, భక్తితో కళ్లకద్దుకొని, తన ఇష్టదైవాలైన ఆ ఏడుకొండలవానికి, సాయిబాబాకు తన భర్త క్షేమంగా ఇంటికి చేరాలని మొక్కుకుంది.  గుమ్మం తలుపు జారవేసి వచ్చి కూర్చుంది.
కాని బల్బునుండి వెదజల్లే కిరణాలు, గుచ్చిగుచ్చి .. “ఏడీ మీ బావ? సినిమాకు తీసుకొనివెల్తానన్నాడుగా? అని శూలపుపోట్లు పొడుస్తున్నట్లు అనిపించి, మూలగనున్న మంచంమీదవాలి, ప్రక్కకుతిరిగి పడుకొంది. క్రిందపడిఉన్నప్రక్కవాటావారి సితార తీసుకొని పేజీలు తిరగవేయటం మొదలుపెట్టింది.  కానీ, దృష్టి బొమ్మలమీదనిలవటంలేదు.  ఎందుకో…ఓమూల కీడు శంకిస్తోంది….
ఇంతలో, గుమ్మంలో అలికిడైంది.  ఆలస్యంగా వచ్చిన బావను చెడామడా దులిపేద్దామని ఒక్క ఉదుటన లేచిన లక్ష్మి నోటిమాటరాక అచేతనమైంది.
ఇంతలో నారాయణను ఇద్దరు భుజాలమీద ఆసరాగ తీసుకొని వచ్చి మెల్లగా మంచం మీద పడుకోబెట్టారు.  కుడికాలి పాదానికి వేసిన సిమెంట్ కట్టు క్రింద ఎత్తు సరిచేసి, వచ్చిన నారాయణ మిత్రులిద్దరూ అవాక్కై చూస్తున్న లక్ష్మితో ఓదార్పుగా –
“కంగారేమిలేదమ్మా … మనవాడు పెండ్లిరోజుకదా … మిల్లులో సర్కస్ ఫీట్స్ చేసి…ఇదిగో ఇలా మాచేత సపర్యలు చేయించుకుంటున్నాడు.  ఎంత! మూడువారాలు…జాగ్రత్తగా ఉంటే విరిగిన పాదం ఎముక పూర్తిగా అతుక్కొని మామూలుగ అవుతుందని పెద్ద డాక్టరుగారు చెప్పారు.  నీవేమి భయపడవద్దు.  నీవు గాబరాపడతావనే ఆంబులెన్సను దూరంగా ఆపించి, మేము వీడిని మోసుకొని తీసుకువచ్చాము.... మరి మేము వస్తాము… రేపు సాయంత్రం మరలా వస్తాము. ఏరా! నారాయణా! వెళ్ళిరామా? " అంటూ వారిద్దరూ గుమ్మందాకా వచ్చిన తర్వాత చేతనావస్థలోకి వచ్చి,
 “అయ్యో! కూర్చోండి! కొంచెం టీ తీసుకొని వెల్దురుగానీ.... మీరీ రోజు చేసిన మేలు నేనెన్నటికి మరువలేను” అని అంటున్న లక్ష్మిని వారింపుగా –
“ఇందులో పెద్ద ఘనతేముందమ్మా! తోటి వారము ఆమాత్రం సహాయం చేసుకోపోతే ఎలా?  రేపు వచ్చినపుడు తప్పక టీ తీసుకుంటాము… ఇప్పటికే ఆలస్యం అయింది, అక్కడ మీ వదినలు కారాలు-మిరియాలు నూరుతుంటారు,”అని నారాయణ మిత్రులిద్దరూ శెలవు తీసుకున్నారు.
వారు బయటకు వెళ్ళగానే గది తలుపు గడియపెట్టి, అంతవరకు కళ్ళల్లో సుడులు తిరుగుతున్న కన్నీటికిక అడ్డుకట్టకట్టలేక నారయణ ఎదమీదవాలి కన్నీటి కడవలతో తడిపిముద్దచేస్తూ, వెక్కుతూ… పసిపిల్లవలే…
“ఏమండీ! ఏమిటిది? ఎందుకిలా అయింది? మిల్లులో సర్కస్ ఫీట్సు చేయటం ఏమిటి? నాకేమి అర్ధం అవలేదు.  ఎందుకిలా జరిగింది? మీకేమన్నా అయితే నేనేమైపోతాను?” అంటూ రోదిస్తున్న లక్ష్మిని అనునయంగా వెన్నుతట్టుతూ…
“ఇపుడు నాకేమైందని! పాదం ఎముకవిరిగింది అంతే! మూడువారాలలో కాలునయమవుతుంది.  దీన్ని గురించి నీవు అనవసరపు అలోచనలు పెట్టుకోకు.”అంటూ మాటమార్చడానికి, “సారీ లక్ష్మీ! ఈరోజు కులాసాగ గడుపుదామని నిన్ను రెడీగా ఉండమన్నాను.  పోనీ! సెకండ్ షోకి వెల్దామా? అంటున్న నారాయణ  నోటికి తన అధరాలతో తనకేమి కోపం లేదనట్లు తాళం వేసింది తను.
తలుపు చప్పుడవటంతో, లేచివెళ్ళి తలుపు తీసి గుమ్మ బయట నిల్చున్న ఇంటివోనరు రామయ్యగారిని ఆదరంగా … “రండి..బాబాయిగారూ, కూర్చోండంటూ” నారాయణ మంచం దగ్గరగా కుర్చీవేసింది లక్ష్మి.
రామయ్యగారు తన సహజ ధోరణిలో – “ఏమయ్యా! నారాయణా!ఏమిటిది? పనిలో జాగ్రత్తగా ఉండాలని తెలియదటయ్యా? నీకు తెలియకపోయినా… మీమిల్లులో భద్రతాశాఖ లేదా ఏమి?”అని అంటుండగా నారయణ అడ్డుకొని,
“భద్రతాశాఖ లేకేమండి, ఉన్నది.  వారు మాకు తరచూ పనిలో చూపవలసిన జాగ్రత్తలు తెలియ పరుస్తుంటారు.  మా పైఅధికారులూ చెప్పుతుంటారు.  ఈ రోజు నాకీ ప్రమాదం కేవలం నా అశ్రద్ధ వల్ల జరిగిందంతే.. నేనీరోజు మధ్యాహ్నం డ్యూటీ ఎక్కగానే, మిల్లులో కిటికీలకు రంగు వేయాలని పురమాయించారు.  ఆ పని చేస్తూ ఓ కిటికీకి రంగు వేసేముందు ఒక మేకు అడ్డుగావుంటే దాన్నిపీకి, శుభ్రంచేసి రంగువేద్దామని లాగుతున్నప్పుడు, ఆమేకు దూరంగా ఉండటంతో, నేను బాలెన్స్ తప్పి, కంగారులో, పడిపోతున్న నిచ్చెన పైనుండి దూకటంతో నిచ్చెన క్రిందనున్న మెట్లపై పడటం వలన కుడిపాదం విరిగింది.” అంటూ తనకు ఎలా ప్రమాదం జరిగింది వివరింఛాడు.
అంతా విన్న రామయ్యగారు, “చూసావా! నారాయణా! అందుకే అన్నారు మనవాండ్లు – ‘పనిలో అలక్ష్యం మన మనుగడకే ముప్పని’, ఇకమీదన్నా నీవు జాగ్రత్తగా మసులుకో; ముఖ్యంగా – నిచ్చెనలమీద పనిచేసేటప్పుడు ప్రక్కకు వంగి పనిచేయడం చాలాప్రమాదకరం.  అలా మనం వంగినప్పుడు, మనిషి యొక్క గరిమనాభి నిచ్చెన కర్రలకు వెలుపలపడి ఆనిచ్చెన ఒరిగిపోయే అవకాశము కల్గి, ప్రమాదం జరుగవచ్చు.  ఒకవేళ, నిచ్చెనకు దూరంగా పని చేయవలసివస్తే, నిచ్చెనదిగి, పని చేయవలసిన చోటికి నిచ్చెన మార్చుకొని, పనిచేయాలి సుమా! అంతే కాకుండా, సేఫ్టీబెల్ట్ వాడటం చాల అవసరం.  దీనివలన ఎన్నో ప్రమాదాలు తప్పింపబడ్డాయి.  వాటి సంగతి తర్వాత మాట్లాడుకుందాము.  ఇప్పటికే ప్రొద్దుపోయింది.  కొంచెం ఎంగిలిపడి విశ్రాంతి తీసుకో.  అమ్మాయ్! లక్ష్మీ! నీవుకూడా అధైర్యపడకుండా నారాయణకు త్వరలో నయమయ్యేటట్లు చూసుకో, ఏదన్నా కావలిసివస్తే మొహమాటపడకుండా వచ్చి మీ పిన్నిని అడగమ్మా..”అంటూ, తన కళ్ళజోడు సరిచేసుకుంటూ బయటకు వెళ్ళిపోయారు.
‘నిచ్చెన తెచ్చిన తంటాకు’, లక్ష్మి బాధపడుతూ, తామూ భోజనం చేయడానికి ఏర్పాట్లు కుపక్రమించింది.

తాతయ్యచెప్పిన కథ

తాతయ్యచెప్పిన కథ (1997)
          అది వైశాఖమాసం,  ఎండ తీవ్రత ఎక్కువైంది.రోజూ సాయం సమయంలో తను వెళ్ళి కూర్చుని గతాన్ని నెమరువేసుకొనే పార్కులోకిదారి తీసారు రామయ్యగారు.  ప్రభుత్వంవారి పుణ్యమా అని, సంధ్యాసమయంలో దీపాలు వెలిగించుకొనడానికికూడా నోచుకొని రోజులవి. ఇక ఎండ ఉక్కకు ఉపసమననాకి వాడే కూలర్స్,పంకాలుకు స్వస్తి చెప్పి అందరూ ఒంటరిగా, జంటగా,గుంపుగా, దిగులుగా, కేరింతలుకొడ్తూ బిల, బిలా ఆ ఊరిలోఉన్న అపురూపమైన పార్కుకు చేరుకుంటారు. 

          దీపాలు లేకపోయినా,అ పార్కును దత్తత తీసుకొన్న కొందరి ధర్మదాతల పుణ్యమా అని, ఆ పార్కుని తన కన్నబిడ్డ వలె కాపాడుకొంటూ వస్తున్న తోటమాలి రంగయ్య నిరంతర శ్రమవలన,చల్లని సువాసనలు వెదజల్లే పూలచెట్లు, పట్టుపరుపులాంటిమెత్తని పచ్చిక వారందరికీ ఓ వరం! ఓ దివ్యస్థలి.  అటువంటి అ పార్కుకి రామయ్యగార్కిఓ మరుపురాని మధురమైన బంధం. తను భద్రతాధికారిగా బొంబాయిలో ఓ మిల్లులోఉద్యోగ విరమణ చేసి, తన శేషజీవితాన్ని ప్రశాంతంగా తన స్వస్థలంలోగడపాలని తనకు రావలసిన మొత్తం డబ్బును తీసుకొనివచ్చి, ఈ ఊరిలోఓ ఇల్లు కొనుకొన్నారు.  పిల్లాజెల్లా బాదరబందీ లేకపోవటంతో రోజూ కాలక్షేపానికి ఈ పార్కుకు వచ్చేవారు.  అలా గత పదిహేను సంవత్సరాలనుంచీ వస్తున్నారు.  కానీ, ఐదు సంవత్సరాలక్రితం జరిగిన ఓ సంఘటన రామయ్యగారి రాకకు ఓ మలుపు, ఓ ప్రత్యేకతచేకూర్చింది.

          ఆరోజు, రామయ్యగారు ఎప్పటిలాగే సాయంత్రం పార్కులో కుర్చుని ఉన్నారు.  ఇంతలో ఓ ఆక్రందన… “అమ్మా!”అన్న కేక,  వెనువెంటనే కీచుమని పెద్ద శబ్దంచేస్తూ బస్సు ఆగిన శబ్దం.  అరుపులు, కేకలు…

          ఏమిటా అని బయటకు వచ్చిన రామయ్యగారు,రక్తపుమడుగులో పడిఉన్న ఓ పదేళ్ళ బాలున్ని చూసి.. ఒక్కసారి నిశ్చేష్టుడై, వెంటనే తన గత ఉద్యోగానుభవం వెన్నుతట్టగా..ఒక్కసారి,  ఆ బాలుడు దగ్గరకు చేరుకొన్నారు. అప్పటికే, చాలామంది ఏమిచేయాలో తోచక వింతచూద్దామన్న వింత తాపత్రయంతో నెట్టుకొని ముందుకొస్తున్నారు.  కొంతమంది, బహుజాగ్రత్తపరులు, ఎందుకొచ్చిన పెంట.. ఇక్కడుంటేపోలీసులు, సాక్షాలూ, కక్షలూ తలనొప్పనుకొంటూచకచక దాటి వెల్తున్నారు.   బాలుడి నాడి చూసిన రామయ్యగారు చలించి పోయారు.  తలకు బలమైన గాయం తగలడమ్తో,ఆ పదేళ్ళ పసిప్రాణం అప్పటికే అనంతవాయువులో కలసిపోయింది.  ఈలోగా పోలీసుస్టేషన్ దగ్గరలోనే ఉండటంతో,పోలీసులు రంగంలోకి దిగి తమ కర్తవ్యాన్ని వారు చేసుకొనిపోతున్నారు.

          ఆరోజు ఇంటికి తిరిగివెళ్ళినరామయ్యగారు మనసు భారంతో చాలా మదన పడ్డారు. దానికితోడు తన సర్వీసులో జరిగిన కొన్ని దురదృష్టకర ప్రమాదాలుఒక్కసారి స్ఫురణకువచ్చి మనసును మరింత కలతపర్చాయి.  కానీ, అనుభవంనేర్పిన మనోనిబ్బరంతో ఒక నిశ్చయానికి వచ్చారు రామయ్యగారు ఆ రాత్రి. అది…. రోజూ తను వెళ్ళే పార్కులోకిచాలామంది పిల్లలు వస్తుంటారు.  వారికి తన అనుభవ సారాన్ని చిన్న చిన్న  కథలుగా వీలుపడ్డప్పుడల్లా చెప్తుంటే,వారికి చిన్నప్పటినుండే ‘భద్రత’మీద అవగాహన ఏర్పడి, వారి జీవితాలు,వారి భవిష్యత్తు భద్రంగా మలుచుకోవడానికి వీలుకలుగుతుందన్న ఆలోచనే– రామయ్యగారి నిశ్చయం.

          అంతే, మరుసటిరోజునుంచి ఆ పార్కుకు వచ్చే చిన్న చిన్న పిల్లలతో మెల్లగా మాటలు కల్పి,కొద్దిరోజులలోనే, ‘తాతయ్యా! తాతయ్యా!’ అని పిలిపించుకొనే బంధాన్నిఏర్పరుచుకొన్నారు.  అంతే,అప్పటిదాకా స్థబ్ధతగ ఉండే రామయ్యగారి జీవితంలోకి ఓ స్పందన వచ్చింది.  తనకు మనుమలు, మనుమరాండ్రు లేరన్న అంతర్గత లేమి ఈరోజు లేదు. ఎందరో అప్యాయతను,అనురాగాన్ని చూరగొనఁగల్గుతున్నారు.

          పార్కులోకి చేరుకొన్న రామయ్యగారు, తాము రోజూ కూర్చునేఅశోకవృక్షం దగ్గరకు వచ్చారు.  అప్పటికే, ఓ అరడజను మంది పిల్లలు చేరి తన కోసం ఎదురుచూస్తున్నారు. వారంతా ఒక్కసారి లేచి..
          ‘తాతయ్యవచ్చారు… తాతయ్య వచ్చారు’
అంటూ చేతులుపట్టి లాక్కొనివెళ్ళి కూచోబెట్టారు.  రామయ్యగారు, ఒక్కసారి తన పైకండువాతో ముఖానికి పట్టిన చమటను ఒత్తుకొని, గాలి సరిగలేక స్థంభించడమ్తో కండువానే విసనకర్రలాగా విసురుకుంటూ…
          “ఇక మన కథ మొదలుపెట్టుకుందామా పిల్లలూ?” అన్నారు.
           “ఊ… ఇప్పటికే లేటయిపోయింది తాతయ్యా!త్వరగా చెప్పు మరి.. అన్న పిల్లల్ని ఆప్యాయంగాచూస్తూ—

          “ఈరోజు పరిశుభ్రతగురించి తెల్సుకుందామే!! ఎందుకంటే పరిశుభ్రతఅన్నది మనందరికి చాలా అవసరం.  ఈ పరిశుభ్రత అన్నది, మన ఇంట్లో, మన వీ ధిలో, మన ఊరిలో, మనము చదువుకొనేస్కూల్సులో, మనం ప్రయాణించే బస్సులలో, రైల్లలో,రేపు మీరు పెద్దైన తరువాత పనిచేసే ఆఫీసులలో, ఫ్యాక్టరీలలోప్రతిచోట ఎంతో అవసరం.  కాబట్టి పిల్లలూ! మీరు పరిశుభ్రత అన్నది ఇప్పటినుండేఅలవర్చుకోవాలి సుమా!!
           ఆఁ…రామూ! నీవు చెప్పు.. పరిశుభ్రత వల్ల కల్గే లాభాలు, నీవు స్కూలు పాఠాలలో చదివుంటావుగా…”అని ఓ అబ్బాయిని ప్రశ్నించారు.

          “ఓ యస్…తాతగారూ…ఎందుకుచెప్పలేనూ…. ఆఁ…ఒకటి…పరిశుభ్రంగ మనం రోజూ స్నానంచేస్తూ, బట్టలు మురికి చేసుకున్నా, రోజూఉతికి శుభ్రం చేసుకొని వేసుకుంటే మనకు చర్మవ్యాధులురావు.  మన శరీరం కంపుకొట్టి, మనలను చూసి ప్రక్కకు తప్పుకొని ఎవరూ పోరు… మనతో దోస్తీకి ఎక్కువమంది వస్తారు.  రెండు… మన పుస్తకాలు, పెన్నులు, నోట్సులు అన్నీ వాటిని మన ఇంట్లో జాగ్రత్తగాఅలమారులోకాని, పెట్టెలోకాని ఒక చోట గుర్తుగా పెట్టుకోవాలి;అలాగైతే మనకు అవసరమైనపుడు ఎతుక్కునే శ్రమ ఉండదు.  అంతేకాదు… మన నోట్సులు, కాగితాలు అమ్మవాండ్లకు సరిగా తెలియకపోతే, ఏవో చెత్తకాగితాలనిచెత్తబుట్టలో పారవేయవచ్చు, లేదా ఎవరికన్నా ఏమన్నా ఇవ్వాల్సివస్తే,వీ టిలో పొట్లంకట్టి ఇవచ్చు!! ఆఁ … ఆఁ … సోఫాలో, కుర్చీలలో పడేస్తే, ఎవరన్నా పసిపాపలు వస్తే వాండ్లు వాడితోఆడుకొని చించివేస్తే మనం మరలా కష్టపడి రాసుకోవాలికదా!!”

          “భేష్! రామూ చాలాచక్కగా చెప్పావు. ఆఁ..కమల నీవు చెప్పమ్మా…”
“మరేమో తాతయ్యగారూ… జోళ్ళు, బట్టలు .. అవి కూడా జాగ్రత్తగావాటి జాగాల్లో ఉంచాలి.  నేను ఓ రోజు నా వైట్ సాక్స్ విడిగ పడేసాను… మా అమ్మగారు ఉతకాలేమో అని తడిపారు, ఉతికి ఆరేయటం మర్చిపోయారు; దానితో మర్నాడు నేను బూట్లులేకుండా వెళ్ళాను.  స్కూలునించిపంపించి వేసారు కూడా!!” అంటూ తన స్వానుభావాన్ని చక్కగాఅరమరికలేకుండా చెప్పిన కమలను భుజం తట్టి అభినందించి తను చేస్తున్న ప్రయత్నానికి చక్కటి ఫలితం కన్పించటంతోఆనందంగా రామయ్యగారు…..

          “పిల్లలూ… మీరు చెప్పిన ఈ పరిశుభ్రతా సూత్రాలనే మేము ఫ్యాక్టరీలలో ‘గుడ్ హౌస్కీపింగ్ – పరిసరాల పరిశుభ్రత ‘అంటాము.  దీనివలన ఎంతో పెద్ద ప్రమాదాలను, ఆస్తి, ప్రాణ నష్టాలను ఆపడానికి వీలు కలుగుతుంది.  ఎలాగంటే, ఒకఫ్యాక్ట్రీలో కావల్సిన పరికరాలు, వైర్లు, బోల్టులు, నట్లు మొదలైనవన్నీ ఒక క్రమ పద్ధతిలో అమర్చిఉంచాలి;అలాకాక పోతే, అవి సరైన టైములో దొరకకపోతే,పనికి ఆటంకం కల్గి, ఉత్పప్తికి నష్టం రావచ్చు.  తర్వాత ఆ పని చేసేవారు మాటపడవలసివస్తుంది.  అంతేకాక, దారికిఅడ్డంగా ఉంటే, కాలికి గాయాలు కల్గించవచ్చు సుమా!”

          “అలాగే ఓ చిన్న సిగరెట్టు లేదాబీడీ కాల్చి అజాగ్రత్తగా  పారేసిన ముక్క ఓ పెద్ద అగ్ని ప్రమాదాన్ని కల్గించవచ్చు.  ముఖ్యంగా, పూరిపాకలవద్ద,కాగితం, కలప, పొట్టు,కిరసనాయిలు, పెట్రోలు బంకులవద్ద ఇ విషయంలో చాలజాగ్రత్తగా ఉండాలి.  అలాగేపిల్లలూ! మీరు ఏదన్నా నుని అదీ పారబోసిన వెంటానే గుడ్డతో శుభ్రంగాతుడిచి, అవసరం అయితే శుబ్రంగ కడిగించాలి; లేకపోతె కాలు జారి పడి, ఎముకలు విరిగి ఆసుపత్రి పాలుకావలసి ఉంటుంది.  అలగేఫ్యాక్టరీలలో కూడా గ్రీజు, ఆయిలు వాడుతుంటారు.  అవి ఒలికితే అశ్రద్ధ చేస్తే చాలాప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.”

          “ఇక లేవండి.. పిల్లలూ.. చాలా సేపైంది.  మీ ఇండ్లలలో మీకోసం ఎదురు చూస్తుంటారు.  జాగ్రత్తగా వెళ్ళండి సుమా!రోడ్డు మీద దిక్కులు చూస్తూ వెళ్లకండి…. అసలే గోతుల రోడ్లూనూ…”అంటూ రామయ్యగారు, బట్టలకు అంటుకొన్న గడ్డిని దులుపుకొని, పిల్లలతో పార్కుబైటికి వచ్చారు.  మునిసిపాలిటీవారి రేడియోలో అపుడే కరెంటు వచ్చినట్లున్నది., ‘బహుదూరపు బాటసారి! నీ పయనమెటు..’అంటూ గరగర శబ్దం చేస్తున్నది.
                             సర్వేజనాఃసుఖినోభవంతు।
                             సర్వేజనాః భద్రతానుగ్రహ ప్రాప్తిరస్తూ॥

పరాకేలనయ్యా! రాధామాధవా! (భద్రత తత్వాన్ని విస్తరింపచేయాలని చిన్ని, చిన్ని తపన, ఆశతో…. )

పరాకేలనయ్యా! రాధామాధవా!
(APPM Safety Magazine, March 1995 నందు ప్రచురింపబడినది)

          ట్రింగ్! ట్రింగ్! ట్రింగ్! అంటూ కాలింగ్ బెల్ మోగటంతో కునుకుతీస్తున్న శారదాంబ ఉలిక్కిపడిలేచింది.
          “ఇంత ఎండలో ఎవరబ్బా!!”అనుకొంటూ బద్దకంగా లేచివెళ్ళి తలుపు తీసింది.
          ఎదురుగా టెలిగ్రాముల కట్టతో నిలబడిన తపాలాఉద్యోగిని చూడగానే ఒక్కసారి ఆమెలో కునుకు మత్తు వదలి, ఆంధోలన చోటు చేసుకొంది.
          “టెలిగ్రాం అండీ..” అంటూ కవరు, పెన్ను చేతికిచ్చి సంతకం పెట్టమని అతను చూపించిన చోట యాంత్రికంగా సంతకం బరికి, అతని పెన్నును అలాగే పట్టుకొని నిలబడ్డ తనను, “పెన్నమ్మా..”అంటూ అతను పిలవటంతో చేతనావస్థలోకి వచ్చిన శారదాంబ, కవరు చింపి, టెలిగ్రాం కాగితాన్ని బయటకు తీసింది.
          “రాధామాధవరావ్ మెట్ విత్ యాక్సిడెంట్(.) అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్(.) స్టార్ట్ ఇమ్మీడీయట్లీ(.)
                   - శంకరం. హైద్రాబాద్. ”
అంటూ వచ్చిన టెలిగ్రాం చదువుకొన్న శారదాంబ ఒక్కసారి అచేతనంగా మంచం మీద వాలిపోయింది.
                “ఇపుడేమిచేయాలి?” …. సమయానికి ఈయన ఇంట్లోలేరు… గీతోపన్యాసం వినడానికి వెళ్ళిన ఈయన వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది… ఎలాగా???”అనుకొంటూ తనలోతాను మదన పడుతున్న శారదాంబ, జీవితంలో నేర్చుకున్న సమయస్ఫూర్తితో వెంటనే లేచి ప్రక్కవాటావారింటికి పరుగు తీసినట్లు వెళ్ళి, వారికి తనకు వచ్చిన టెలిగ్రాం చూపించి, వాండ్ల బాబీని –
                “బాబాయిగారిని అర్జంటుగా పిలుచుకొనిరా బాబూ.. రామమందిరంలో గీతోపన్యాసం దగ్గర ఉంటారు.  నీకు పుణ్యం ఉంటుంది. శ్రమనుకొకుండా సాయం చేయి నాయనా…” అంటూ వేడుకోలుగా చెప్పి పంపించింది.
          ప్రక్కింటామె ఊరడిస్తూ శారదాంబ్ను ఇంట్లోకి తీసుకొని వెళ్ళి హైద్రాబాద్ వెళ్ళడనికి ఏర్పాట్లు చేసుకోమని ప్రోత్సహించగా, అన్యమనస్కంగా ప్రయాణానికి ఆదరాబాదరాగా సర్దుకోవటం మొదలెట్టింది. 
          ఆ భగవంతుడే తన ఒక్కగానొక్క వంశాకురాన్ని కాపాడాలని మౌనంగ వేడుకొంటూ రామారావుగారి కోసం మధ్య, మధ్యలో వీధిగుమ్మంవైపు ఆత్రుతగా చూస్తూ సూటుకేసు సర్దటం పూర్తిచేసింది.
          “బహుశా, ఈ ఆపదకు అవసరం అవుతుందని కాబోలు, ఎప్పుడూ ఆలశ్యంగా వచ్చే ఇద్దరి పెన్షనుల్లు ఈ నెల సరిగ టయిముగ రావటంతో ప్రయాణ ఖర్చులకు ఇబ్బందిలేదు.  కాని, అక్కడ పరిస్థితి ఏమిటో? ఎంత డబ్బుకావాలో. ఏమో!!..” అనుకొంటూ వీధి గుమ్మంలోనే చతికిలబడింది.
                రామారావుగారు రామమందిరంలో గీతాచార్యులవారి గీతామృతాన్ని ఆస్వాదిస్తున్నవాడల్లా, తమ ప్రక్కింటి బాబి వచ్చి చెవిలో – “బాబాయిగారు, పిన్నిగారు మిమ్మల్ని అర్జంటుగ పిలుచుకురమ్మన్నారు.  హైద్రాబాద్ నుండి ఏదో టెలిగ్రాం వచ్చిందట” అని చెప్పగానే ఒక్కసారి ఇహలోకంలోకి వచ్చి హడావుడిగాలేచి,బాబి వెంట ఇంటి ముఖం పట్టారు.
                అసలే విజయవాడ ఎండలు.. చీకటిపడినా గాడ్పు ఉదృతం మాత్రం తగ్గలేదు.  దానికితోడు… “టెలిగ్రామ్ ఏమిటబ్బా!! మా అబ్బాయికి ఏమి ఇబ్బంది కలుగలేదు కదా?” అని మధన పడుతూ, అంతలోనే వయస్సుతో ఒచ్చిన నిబ్బరంతో,
          “అన్నిటికీ ఆ సర్వేశ్వరుడే ఉన్నాడు.  చేసేది, చేయించేది అన్నీ ఆయనే”
అనుకొంటూ గీతోపదేశాన్ని వంటపట్టించుకొన్న తత్త్వవేత్తలా, వడివడిగా అడుగులు వేస్తూ ఇల్లు చేరారు.
                గుమ్మంలోనే శోకతప్తురాలైయున్న శారదాంబ చేతిలో పెట్టిన టెలిగ్రాం ఒక్కసారి చూడగానే, ఎంతో గాంభీర్యంగా ఉండే రామారావుగారు ఒక్క క్షణం కలవరపాటుచెందారు. కానీ, ఒత్తిడి తట్టుకొనటంలో తర్ఫీదుపొందిన రామారావుగారు, వెంటనే బీరువాలో చేతికి దొరికిన డబ్బును పర్సులోకుక్కుని, అప్పటికే చేతిలో సూటుకేసుతో సిద్ధంగాఉన్న శారదాంబ వైపు, ఆమె గుండెనిబ్బరనికి, మనోధైర్యానికి, మెచ్చుకోలుగాచూస్తూ –
                “ఇక వెల్దామా?” అంటూ బయటకు నడిచి వీధి గుమ్మానికి తాళంవేసారు. ప్రక్కవాటావారికి చెప్పి, వీధిలో కన్పించిన ఆటో ఎక్కి… బస్ స్టేషన్ కి పొమ్మని చెప్పి, సీటులో కూలబడి, కండ్లు రుద్దుకుంటూ అలోచనలో పడ్డారు.
          ఆదంపతుల అదృష్టమా అన్నట్లు ఒక ప్రైవేటు బస్సు హైద్రాబాదుకు వెళ్ళడానికి సిద్ధంగఉన్నట్లుతెల్సుకొన్న రామారావుగారు వెంటనే ఆటో అతనికి డబ్బులిచ్చి, బస్సు టికెట్లు తీసుకొనిబస్సు ఎక్కి, దైవం మీద భారం వేసి, మనస్సులో తన కిష్టమైన నామ జపాన్ని చేసుకోవడంమొదలుపెట్టారు.
          తెల్లవారుఝాముకిహైద్రాబాదు చేరిన రామారావు దంపతులు, ముందుగా వాండ్ల అబ్బాయి పనిచేసే ఆఫీసులో అతని సహద్యోగైనశంకరంతో అంతకుముందే బాగా పరిచయం ఉండటంతో అతని ఇంటికి ఆటో కట్టించుకొని వెళ్ళారు.
          శంకరమేటెలిగ్రాము ఇవ్వటంవలన, వీరు ఏక్షణాన్నైనా రావచ్చని ఎదురుచూస్తుండటంతో, రామారావుగారుతలుపుతట్టిన వెంటనే తలుపుతెరచి సాదరంగా లోపలికి తీసుకొని వెళ్ళి, వారి ఆంధోళన పసిగట్టి–
“ మాధవరావు కులాసాగనే ఉన్నాడండి.  ఆంధోళనచెందవలసినది ఏమిలేదు.  ఆఫీసులో లిఫ్టు రిపేరులోఉంటే,మనవాడు పగటికలలు కంటూమెట్లు ఎక్కుతూ కాలిజారిపడ్డాడు.  దురదృష్టవశాత్తు ఆ పడటంలో, కుడిచేయికి వత్తిడి తగిలిమోచేతికీళు పట్టుతప్పింది.  దానితో, వెంటనేహాస్పిటల్లో చేర్పించాము.  ఆఫీసు వాండ్లుతగిన ఏర్పాట్లు చేసారు.  నేను రాత్రిపొద్దుపోయిందాకా ఉండివచ్చాను.  మీరు ముఖంకడుక్కొని, కొంచెం కాఫీతీసుకొని, అలసట తీర్చుకోండి.  రాత్రంతా ఆంధోళనతో,బస్సు కుదుపులకు పూర్తిగాడీలా పడిఉంటారు.” అంటూ వారికి వారివిడిది చూపించి, వంటింట్లోఉన్న తన శ్రీమతిని వారికి పరిచయం చేసాడు.
          కుదుటపడ్డమనస్సులతో రామారావు దంపతులు శంకరం శ్రీమతిని కుశలప్రశ్నలువేసి తమ వంశాకురానికి ప్రాణాపాయముకాని,పెద్దప్రమాదంకాని జరగనందుకు లోలోపల తమ ఇష్టదైవాలకు కృతజ్ఞతలు తెల్పుకొంటూ తమకు చూపించినగదిలోనికి దారి తీసారు.
          త్వర,త్వరగ తమ్ పనులు పూర్తిచేసుకొని, శంకరం భార్య ఆప్యాయతతో కొసరి, కొసరి వడ్డిమ్చిన అల్పాహారముతీసుకొని, శంకరాన్నితోడు తీసుకొని ఆసుపత్రికి వెళ్ళారు.  చేతికి కట్టుతో మంచంమీదున్న కొడుకుని చూడగనే నిబ్బరంగఉన్న శారదాంబ కండ్లనుండి కన్నీరు ఒక్కసారి ఉబుకొనిరాగా, కన్నీరుపొరగుండా మసకగ కన్పిస్తున్నతన కొడుకుని, తనివితీర చూసుకోడనికా అన్నట్లు, చీరకొంగుతో కన్నీటిని తుడుచుకుంటూ ఆప్యాయంగా,నుదిటిమీద చేయివేసి నిమురుతూ—
                “పెద్దవాడవై,బాధ్యతాయుతమైన ఉద్యోగివై ఈ పగటికలలేమిటి? ఈ అప్రమత్త ఏమిటిరా కన్నా? ఇదే,ఏరోడ్డుమీదో, స్కూటరుమీద వెల్తున్నప్పుడైతే, ఏమైయ్యేది బాబు!ఒక్కగాని ఒక్కడివైన నీమీద ఆశలుపెట్టుకొని బ్రతుకుతున్న మేమ్ ఏమికావాలిరా నాన్నా!! ….”అంటూ తన పుత్రవాత్సల్యాన్ని వెళ్ళగ్రక్కుతున్న శారదాంబకు అడ్డువస్తూ… రామారావుగారు,
                “అబ్బాయ్! నేను నీకుచిన్నప్పటినుండి నూరిపోస్తున్న భద్రతా సూచనలు అన్నీబూడిదలోపోసిన పన్నీరులాగ అయినవా బాబూ!! నేను,పెద్ద పరిశ్రమలో ఉద్యోగిగాపని చేసిన అనుభవరీత్యాచెప్పుతున్నాను; నాది చాదస్తంఅని కొట్టిపారేయకుమరి!  ప్రమాదాలు సంభవించవురా…వాటిని మనమే కొనితెచ్చుకుంటాము.  నీ సంగతే చూడూ… నీవు నిన్నపరాకుగా మెట్లు ఎక్కకపోతే,నీకాలుజారదు; జారినా, హ్యాండ్రైలింగ్పట్టుకొని మెట్లుఎక్కిఉంటే ఇంత ప్రమాదం జరిగేదికాదుకదా?  ఏ బెణుకుతోనో సరిపెట్టేది.  కాబట్టి, భద్రతా సూచనలుపాటించడం అనేది కర్మాగారాల్లోఉద్యోగులకు మాత్రమే కాక,మనందరికి నిత్యజీవితంలో కూడా ఎంతో అవసరము.ఇకముందైనా, జాగరూకతతో మెలుగుతూ, ఎటువంటి ఉపద్రవాలను కొనితెచ్చుకోకుండా,సురక్షితంగా, చల్లగ జీవించు బాబూ!....” అంటూ అటుగ వస్తున్న డాక్టరును చూసిన రామారావు దంపతులు, శంకరం ముకులిత హస్తాలతోఅభివాదం చేస్తూ నిలబడ్డారు.
భద్రత తత్వాన్ని విస్తరింపచేయాలని చిన్ని, చిన్ని తపన,ఆశతో…. __/\____/\__ __/\__