Translate

02 December, 2014

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 012 (056 – 060)


ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
     [డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]

  1. ఖాండవవనం నుండి రక్షింపబడ్డ ఆరుగురు ఎవరు?
  2.  ద్రోణుడు ఎవరి అంశవలన పుట్టాడు?
  3. కృపుడు ఎవరి అంశతో పుట్టాడు?
  4. ధర్మరాజుకు ద్రౌపదిగాక ఉన్న మరో భార్య పేరేమి? ఆమె వలన కలిగిన పుత్రుని పేరేమి?
  5. తన పేరు గల గంధర్వునితో యుద్ధంచేసి చనిపోయిన భారత వీరుడెవరు?
-------------------------------------------------------------------------------------------------------------                             
సమాధానములు (జవాబులు):
1.మయుడు; అశ్వసేనుడు; మందపాలుని కొడుకులు నలుగురు - ఆది పర్వము అష్టమాశ్వాసము - 292 పద్యము.
తే||మయుఁడు నశ్వసేనుండును మందపాల
    సుతులు నలుగురు శార్జ్ఞ్గకు లతులదావ
    దాహభీతి కయ్యార్వురుఁ దప్పి రన్య
    జీవు లెల్ల నం దపగతజీవు లైరి. (292)

2.బృహస్పతి అని ఒక చోట - ఆది పర్వము తృతీయాశ్వాసము - 78 పద్యము.; శుక్రుడని ఒక చోట ఆది పర్వము పంచమాశ్వాసము - 195 పద్యము.
||అనఘుఁడు సురగురు నంశం
   బునను భరద్వాజు కలశమునఁ బుట్టె శరా
   సన విద్యాచార్యుఁడు భూ
   వినుతుఁడు ద్రోణుండు నిఖిల వేదవిదుండై. (78)
      (భరద్వాజుడు ఒకరోజు స్నానానికి గంగకి వెళ్ళినపుడు అక్కడ జలక్రీడలాడుతున్న ఘృతాచి అను అప్సరసను చూచి అతిగా కామించడము వలన వీర్యస్కలనము జరుగగా, దానిని తెచ్చి ఒక కుండలో భద్రపరచగా ద్రోణుడుద్భవించెను.)
తే||తనకు శుక్ల పాతం బైనదానిఁ దెచ్చి
    ద్రోణమున సంగ్రహించిన ద్రోణుఁడనగఁ
    బుట్టె శుక్రునంశంబునఁ బుణ్యమూర్తి
    ధర్మతత్వజ్ఞుఁడై భరద్వాజమునికి. (195)

3.ఏకాదశ రుద్రుల అంశ - ఆది పర్వము తృతీయాశ్వాసము - 80 వచనము
మఱియు నేకాదశ రుద్రుల యంశంబునఁ గృపుఁడు పుట్టె… (80)

4.దేవిక (స్వయంవరలబ్ధ) యౌధేయుడు - ఆది పర్వము చతుర్థాశ్వాసము – 116 వచనము.
..ధర్మరాజునకు స్వయంవరలబ్ధయైన దేవికయనుదానికి యౌధేయుండు పుట్టె .(116)

5.చిత్రాంగదుడు సత్యవతి,శంతనుల పెద్దకొడుకు; శ్శశనన తరువాత భీష్ముడు ఇతనికే పట్టాభిషేకం చేసాడు. - 
   ఆది పర్వము చతుర్థాశ్వాసము – 193 వచనము;  194-195 పద్యములు
శంతనుండును బరమానురాగంబున సత్యవతిని వివాహం బై యతిమానుషంబయినయాభీష్ము సత్యవ్రతంబునకు సంతసిల్లి యాతనికి స్వచ్చందమరణంబుగా వరం బిచ్చి సత్యవతియందుఁ జిత్రాంగదవిచిత్రవీర్యు లన నిద్దఱు గొడుకులం బడసి వారలు సంప్రాప్తయౌవనులు గా కుండఁ బరలోకగతుం డైనఁ దండ్రికి భీష్ముండు పరలోకక్రియలు నిర్వర్తించి చిత్రాంగదు రాజ్యాభికషిక్తుం జేసిన నాతండును నతివ్యాలోలుం డై గర్వంబున నెవ్వరి నుఱక సుర దనుజ మనుజ గంధర్వాదుల నాక్షేపించు చున్నవాని కలిగి చిత్రాంగదుం డనుగంధర్వపతి యుద్ధార్థి యయి వచ్చినం గురుక్షేత్రంబునందు. (193)
||నరగంధర్వాధిపుల
   య్యిరువురు చిత్రాంగదులు సహింపక యని నొం
   డొరుఁ దాఁకి వీఁకఁ బొడిచిరి
   హిరణ్వతీతీరమున నహీనబలాఢ్యుల్. (194)
||వదలక మాయాయుద్ధా
   తిదక్షుఁ డయి వంచనోన్నతిన్ గంధర్వుం
   డుదితరవితేజుఁ జిత్రాం
   గదుఁ జంపె విచిత్ర పత్త్ర కార్ముకహస్తున్. (195)
*****

No comments:

Post a Comment