Translate

19 December, 2014

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 028 (136 – 140)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|

దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|


[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]

1. మరణించినవానికి బంధువెవరు?

2. నన్నయ కవిత్వములో చివరి పద్యంలో ఏది వర్ణించబడినది?

3. కిమ్మీర వధను గూర్చి కౌరవులకు తెలిపినదెవరు? వివరించిచెప్పిన దెవరు?

4. అరణ్యవాసంలో వ్యాసమహర్షి ఎన్నిసార్లు దర్శనమిస్తాడు? ఎపుడెపుడు?

5. కురుక్షేత్రంలో కాక కర్ణుడు యుద్ధంలో పారిపోయిన ఘట్టాలున్నాయా? ఏవి?

సమాధానములు (జవాబులు):

1. తాను చేసిన ధర్మము. ఆరణ్యపర్వము సప్తమాశ్వాసము - 439 వచనము.
  చెప్పిన నయ్యక్షు డతనితోఁ దెరువు నడుచువానికి రోగార్తునకు గృహస్థునకు మృతింబొందినవానికి 
       నెవ్వరెవ్వరుచుట్టంబు లనిన నప్పుడమిఱేఁ డన్నలువురకుం గ్రమంబున సార్థంబును వైద్యుడును
       సద్భార్యయుఁ గృతం బగుధర్మంబును బరమమిత్రంబు లని నిర్దేశించుటయు వాఁడు వెండియు ని  
      ట్లనియె.         (439)

2. శారదా రాత్రులు. - ఆరణ్యపర్వము చతుర్థాశ్వాసము - 142 పద్యము.

||శారదరాత్రు లుజ్వలలసత్తర తారకహారపంక్తులం

    జారుతరంబు లయ్యె వికసన్నవ కైరవగంధబంధురో

    దార సమీర సౌరభము తాల్చి సుధాంశు వికీర్యమాణక

    ర్పూర పరాగపాండురుచిపూరములం బరిపూరితంబు లై. (142)

3. మైత్రేయుడు; విదురుడు - ఆరణ్యపర్వము ప్రథమాశ్వాసము - 106 పద్యము; 107&121 వచనములు.

కిమ్మీరుం డనురక్కసుఁ
    డమ్మారుతతనయుచేత నత్యుగ్రవనాం
    తమ్మున నిహతుం డయినవి
    మ్మెట్టులు సెప్పు మద్భుతం బిది యనినన్. (106)
  నాపలుకులు నీకొడుకు వినం డయ్యె నేనేల చెప్పెద దీనిం బాండవసహాయులైన విప్రులచేత విదురుం
      డిమ్ముగా నెఱిఁగినవాఁ డతనివలన విను మని చెప్పి మైత్రేయుండరిగినం
      గిమ్మీరవధకథాశ్రవణపరుండైతన్నడిగినధృతరాష్ట్రునకు విదురుం డిట్లనియె. (107)
   ఇట్లు ధర్మరాజువచనంబునఁ గిమ్మీరు నశ్రమంబున వధియించి తద్వనవాసులకు రాక్షసభయం
       బుడిపినమహావీరు నమ్మారుతాత్మజుధర్మార్జుననకులసహదేవులును ధౌమ్యాదిమహీసురవరులును
       బ్రశంసించి రని విదురుండు గిమ్మీరువధ సెప్పిన విని ధృతరాష్ట్రునకు హృదయచలనం బయ్యెనిట
       పాండవులు కామ్యకవనంబున నుండునంత. (121)

4. అయిదుసార్లు:
  1. పాండవులపైకి దండెత్తే దుర్యోధనుని వారించటానికి హస్తినలో - ఆరణ్యపర్వము ప్రథమాశ్వాసము - 75
      వచనము


  సమరసన్నద్ధుఁ డై సమస్తబలంబును సమకట్టి వెలువడినం దనదివ్యదృష్టి నంతయు నెఱింగి 
      కృష్ణద్వైపాయనుండు వచ్చి యిది ధర్మంబుగా దుడుగుమని దుర్యోధనుని వారించి ధృతరాష్ట్రున కి ట్లనియె.
      (75)

  2. అర్జునుని తపస్సుకు పురికొల్పటానికి పాండవుల దగ్గరకు వస్తాడు. - ఆరణ్యపర్వము ప్రధమాశ్వాసము
       272 పద్యము

||వారలపుణ్యోదయమున
   వారిజభవనిభుఁడు లోకవంద్యుఁడు వచ్చెం

   బారాశర్యుఁడు ధర్మశ

   రీరుఁడు కృష్ణాజినోత్తరీయుఁడు ప్రీతిన్. (272)

3. అర్జునునికి పాశుపతాది దివ్యాస్త్రాలు లభించాయని ధృతరాష్ట్రునికి ముందుగా చెప్పింది ఇతడే. –
     ఆరణ్యపర్వము ప్రథమాశ్వాసము - 377 వచనము.


||… నిట ధృతరాష్ట్రుం డర్జునుదివ్యాస్త్రలాభంబుఁ బారాశర్యు వలన నెఱింగి పరమ వ్యాకులహృదయుం డై     
      సంజయున కిట్లనియె. (377)


4. తీర్ధయాత్రలకు వెళ్ళే పాండవులను దీవించడానికి. - ఆరణ్యపర్వము ద్వితీయశ్వాసము - 307 పద్యము.

||పారాశర్యుఁడు బర్వత

   నారదులును బాండురాజనందనుల గుణో

   దారుల ననఘులఁ దీర్ధ
   ప్రారంభులఁ గాన వచ్చి పరమప్రీతిన్. (307)

5. పాండవులు కామ్యకవనంలో తృణబిందుని ఆశ్రమంలో ఉండగా వచ్చాడు. అప్పటికి ఆరణ్యవాసము 11 ఏళ్ళు
      గడిచింది. న్యాయార్జితమయిన విత్తమ యొక్క మహిమ చెప్పి వ్రీహిద్రోణాఖ్యానం (తూమెఁడు వడ్ల
      ఉపాఖ్యానము) చెపుతాడు. - ఆరణ్యపర్వము షష్ఠమాశ్వాసము -103 పద్యము.

శా||ప్రీతుం డై చనుదెంచె నాశ్రితజనాభీష్టక్రియాశీలుఁ డు

    ద్గీతామ్నాయుఁడు నిర్విధూతదురితక్లేశుండు యోగామృత

    స్ఫీతస్వాంతుఁ డనంతసంతతసమావిర్భూత కారుణ్యధా

    రాతో యస్నపనైకశీలుఁ డగుపారాశర్యుఁ డచ్చోటికిన్. (103)

5. రెండు ఘట్టములు.- ఘోషయాత్ర మరియు ఉత్తరగోగ్రహణము.
   1) ఘోషయాత్ర - ఆరణ్యపర్వము పంచమాశ్వాసము - 401 వచనము
   వఇట్లు విరథుం డయి కర్ణుండు రథం బెక్కి రణభూమికిం దొలంగి చనియె (401)

   2) ఉత్తర గోగ్రహణము - విరాటపర్వము పంచమాశ్వాసము - 108 పద్యము & 109 వచనము
 ||అఱిముఱి నంగము లెల్లను
      నుఱుముగ నిట్లడరు నర్జునునియమ్ములకున్

      వెఱ చఱచి సూతపుత్రుఁడు

      పఱచెఁబుడమియద్రువమత్స్యపతిసుతుఁ డార్వన్. (108)


  ఇట్లు కర్ణుండు గయ్యంబు విడిచి పాఱినఁ బార్థుండు దేవదత్తంబు పూరించి యుత్తరున కి ట్లనియె. (109)
******

No comments:

Post a Comment