Translate

05 January, 2020

ఆధ్యాత్మికవేత్త బ్రహ్మ శ్రీ గుండ్ల పుండరీకాక్ష రావు గారి ముక్కోటి ఏకాదశి వివరణ....

ముక్కోటి ఏకాదశి (6-1-2020, సోమవారం)🕉
ముక్కోటి ఏకాదశి పర్వదినము నాడు
శ్రీ మన్నారాయణుని...శ్రీ రంగనాధుని...
కలియుగ వైకుంఠధాముని, శ్రీరామచంద్ర ప్రభువు దివ్యమంగల రూపాన్ని ప్రాతఃకాలంలో దర్శనం చేయండి.
ప్రాతఃకాలం సత్వగుణం కలది. ఈ కాలంలో స్వామిని దర్శించుకున్న వారికి సత్ బుద్ధి కలుగుతుంది. సత్ బుద్ధి వలన సన్మార్గం అనగా దేవమాన మార్గంలో జీవితం గడుపుతుంటారు.

ప్రత్యక్షదైవం శ్రీ సూర్యనారాయణుడు 6 నెలలు దక్షిణం వైపు తన ప్రయాణం ముగింపు చేసుకుంటూ ఉత్తరం వైపు 6నెలలు ప్రయాణం చేయడానికి తన ముఖం ఏకాదశి రోజున తిప్పుతారు. ఈ 6 నెలలు అర్చిరాజి మార్గం. అనగా అగ్ని మార్గం. స్వామిని చేరు మార్గం. 

ఉత్తరాయణానికి ముందు వచ్చే ఏకాదశి విష్ణువు యోగ నిద్ర నుండి లేచే క్షణం. స్వామి తన దర్శనం కోసం వేచివున్న భక్తులను చూస్తాడు. స్వామి చూపు ఎవరిపై పడునో వారు అఖండ ఐశ్వర్యములను, ముక్తిని పొందుదురు. 

ప్రతి ఏకాదశి శుభకరమే. ముక్కోటి ఏకాదశి విశేషంగా 33 మంది దేవతలు అనగా 12 మంది సూర్యులు, 8 మంది వసువులు, 11 మంది రుద్రులు మరియు ఇద్దరు అశ్వనీ దేవతలు... మొత్తం 33; మరియు వారివారి ఉపదేవతలు అనేకులు (కోటి, సమూహం) బ్రహ్మాండములో నిండి వున్న వీరంతా స్వామిని (శ్రీమన్నారాయణుని) దర్శించుకోడానికి సూర్యోదయానికి ముందే వచ్చి కృతాంజలులై వుంటారు. కనుక మరింత విశిష్టమైనది.

పంచేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు మరియు మనస్సు మొత్తం 11. వీటికి సంకేతంగా రెండు చేతులు జోడించిన నమస్కారం 🙏. ఇది శరణాగతికి సూచకం. ఇక12 వది బుద్ధి.

ఏకాదశి రోజున, ఈ పదకొండు (పంచేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు) స్వామి పాదపద్మాలపై వుంచి అనగా ఉపవాసముండి దైవచింతనతో గడిపి మరుసటిరోజున అనగా ద్వాదశినాడు పారణ చేయాలి. పారణ అనగా ద్వాదశి ఘడియలలో భగవత్భక్తులకు భోజనాలు పెట్టి తాను భోజనం చేయాలి.

ఏకాదశి రోజున కటిక ఉపవాసము చేయలేనివారు.. బాలలు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, అనారోగ్యులు పాలు, వండనివి అనగా ఫలములను అల్పంగా తీసుకోవాలి.

ఇలా చేసిన స్వామి బుద్ధి యోగమును ప్రసాదిస్తాడు. ఈ యోగం సిద్ధించిన వారికి ముక్తి లభిస్తుంది.

ఇక తత్త్వపరంగా పరిశీలిస్తే..

ముప్పదిమూడు దేవతలు మనలో వున్నారు. వారికి ప్రభువు మనలో వున్న పురుషుడు అనగా పరమాత్మ లేక శ్రీమన్నారాయణుడు. వీరంతా మన ఇంద్రియాల సహాయమున స్వామిని దర్శనం చేసుకొంటారు. 
 
నారాయణుడు అవ్యక్తము కంటే పరుడు.
ఈ బ్రహ్మాండము అవ్యక్తము నుండి పుట్టినది. ఈ బ్రహ్మాండములోనే ఈ భూమి వున్నది. ఈ భూమి పైన మనం వున్నాం. కనుక మనకు అడ్డుగా అవ్యక్తము వున్నది. దానిని దాటిన నారాయణ దర్శనం. 

అవ్యక్తము దాటటానికే ముక్కోటి ఏకాదశి. 
ప్రతి సంవత్సరం ముక్కోటినాడు శ్రీీీమన్నారాయణుని ప్రాత:కాల దర్శనం చేయండి. 
నమో నారాయణాయ!
నమో నారాయణాయ!
నమో నారాయణాయ!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

                   *************