Translate

10 December, 2014

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 019 (091 – 095)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
__/\__


నారాయణం నమస్కృత్య  నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్||
 [డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి  (క్విజ్) (1994) పుస్తకము ఆధారముగా

1.     కురుక్షేత్రంలో, ఉత్తరగోగ్రహణ సమయంలో కాకుండా కర్ణార్జునులు పరస్పరం యుద్ధం చేసినదెప్పుడు? 
2.     పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినపుడు కుంతి ఎక్కడుంది? 
3.     యయాతి భార్యలెంతమంది? ఎవరు? 
4.     కర్ణుడు ఎవరి అంశతో పుట్టినాడు? 
5.     వ్యాసమహర్షి తల్లి ఏవరు?

సమాధానములు (జవాబులు):

1.కుమారాస్త్ర విద్యాప్రదర్శనా సమయం; ద్రౌపదీ స్వయంవరసమయం. అది పర్వము షష్ఠాశ్వాసము 40 పద్యము ; 41 వచనము & ఆది పర్వము సప్తాశ్వాసము 198 పద్యము.
|| జనితమర్షణుఁ డంతఁ బార్థుపయిఁ బర్జనాస్త్ర మక్కర్ణుఁ డే
      సె నపారం బయి భూనభోంతరముఁ దజ్జీమూతయూథంబు గ
      ప్పినఁ దద్ధ్వాంతతిరోహితాపఘనుఁ డై బీభత్సుఁడుండెన్ విరో
      చనుఁ డాత్మద్యుతి విస్తరించె సుతుపై సంప్రీతచేతస్కుఁ డై. (40)
|| అయ్యవసరంబున దుర్యోధనుం దొట్టి ధృతరాష్ట్రనందను లందఱుఁ గర్ణువలన నుండిరి భీష్మద్రోణకృపపాండవులు పార్థువలన నుండి రంత. (41)
శా|| కర్ణుండున్ విజయుండు నొండరులఁ జుల్కం దాఁకి చాపంబు లా
      కర్ణాంతంబులుగా వడిం దిగిచి యుగ్రక్రోధు లై యేసి రా
      పూర్ణం బయ్యెఁ దదియబాణతతి భోభృత్పథం బెల్ల నా
      స్తీర్ణం బయ్యె ధరిత్రి యెల్ల నవిసెన్ దిక్చక్ర మెల్లన్ వడిన్.(198)

2.విదురుని ఇంటిలో. సభాపర్వము ద్వితీయాశ్వాసము 281 పద్యము & 292 వచనము
|| వనవాసపరిక్లేశం
    బున కోపదు కుంతిదేవి భోజాత్మజ గా
    వున నాగృహమున నుండెడు
    ననవరతము భక్తితో మదభ్యర్చిత యై. (281)
|| అని యిట్లు కోడలిం గొడుకులను దీవించి కుంతీదేవి విదురుగృహంబున నుండెనంత. (292)

3.ఇద్దరు. దేవయాని; శర్మిష్ట.- ఆదిపర్వము తృతీయాశ్వాసము 174 పద్యము & 179 వచనము.
|| నీలగళోపమాన కమనీయగుణోన్నతిఁ జెప్పఁ జాలు న
    న్నేలినదేవయానికి నరేశ్వర భర్తవు గాన నాకునుం
    బోలఁగ నీవ భర్త విది భూనుత ధర్మపథంబు నిక్కు వం
    బాలును దాసియున్ సుతుడు నన్నవి వాయనిధర్మముల్ మహిన్. (174)
ఈయేనింటియందు నసత్యదోషంబు లేదని మునివచనప్రమాణంబుగలదు నీవు వివాహసమయంబున 
    నొడంబడితివి కావున నసత్యదోషంబు నిన్నుఁ బొంద దనిన నయ్యయాతి యొడంబడి శర్మిష్ఠకు నభిమతం
    బొనరించె నదియుఁ దత్సమాగమంబున గర్భిణీ యై కొడుకుం గనిన విస్మయం బంది దేవయాని దానికడకు
    వచ్చి యి ట్లనియె. (179)

4.సూర్యుని అంశ. ఆదిపర్వము పంచమాశ్వసము 25 వచనము.
|| అనిన విని సూర్యుండు దానికిఁ గరుణించి నికు సద్యోగర్భంబునఁ బుత్త్రుఁ డుద్భవిల్లు నీకన్యాత్వంబును
    దూషితంబు గా దని వరం బిచ్చినఁ దత్క్షణంబ యకన్యకకు  నంశుమంతునంశంబునం గానీనుం డై. (25)

5.మత్స్యగంధిః దాశరాజు కూతురు సత్యవతి, పరాశరులకు వ్యాసుడు జన్మించాడు. ఆదిపర్వము తృతీయాశ్వాసము 43,44&45 పద్యములు
కం|| పరమేష్టికల్పుఁ డగున
      ప్పరాశరు సమాగమమునఁ బరమగుణై కా
      భరణకు ననవద్యమనో
      హరమూర్తికి సత్యవతికి నమ్మునిశక్తిన్. (43)
కం|| సద్యోగర్భంబున నహి
      మద్యుతి తేజుండు వేదమయుఁ డఖిల మునీం
      ద్రాద్యుఁడు వేదవ్యాసుం
      డుద్యజ్జ్ఞానంబుతోడ నుదితుం డయ్యన్. (44)
కం|| ఆ యమునాద్వీపమున న
      మేయుఁడు కృష్ణుఁడయిపుట్టి మెయిఁ గృష్ణద్వై
      పాయనుఁ డనఁ బరఁగి వచ
      శ్శ్రీయుతుఁడు తపంబువలనఁ జిత్తము నిలిపెన్. (45)
*************

No comments:

Post a Comment