తెలుగు సుద్దులు…..(115)
కం||శాంతమున సకలకార్యము (నన్ని పనులను*)
సంతోషంబునను బొందు (గూడు*) సత్యము జయమౌ;
పంతము చెల్లును ధర్మజుఁ
డెం`తే`సి ప్రయాసముల జయించెను (జయింపుడె*) వేమా!
భావముః
ప్రశాంతంగా ఆలోచించి, చిరాకు, కంగారు,
హడావుడి పడకుండా పనులు చేస్తే, అవన్ని తప్పకుండా
శుభప్రదం అయి సంతోషాన్ని కలిగిస్తాయి. అలాగే సత్యప్రవర్తన వలన
కార్యసిద్ధి, ప్రతిజ్ఞాపాలన కలుగుతుంది. సత్యం ఎప్పటికైనా జయం పొందుతుంది, ధర్మరాజు సత్యపరిపాలనకోసం
(ధర్మం కోసం) ఎన్నోబాధలు, కష్టాలు పడ్డా చివరికి జయం పొందాడు కదా! కనుక,
ధర్మపాలనలో, సత్యశోధనలో కష్టాలు, ఇబ్బందులు వచ్చినా, భయపడక, అధైర్యపడక,
శాంతంగా ఉంటూ, శాంతములేకపోతే క్రోధం పెరుగుతుంది
కనుక, పనులు నెరవేర్చుకోవటం అలవాటు చేసుకోవాలని వేమన వ్యక్తిత్వవికాస
సూత్రాన్ని తెలుపుతున్నారు.
మహానుభావుడు శ్రీ త్యాగరాజస్వామి
కూడా తన కీర్తనలో…
“శాంతము లేక సౌఖ్యము లేదు సరసదళనయనా॥
దాంతునికైన వేదాంతునికైనా।”(దాంతుడు-నిగ్రహచిత్తుడు, ఋషి)
అని శెలవిచ్చారు కదా! ॥30-11-2014||
No comments:
Post a Comment