Translate

31 January, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 054 (266 – 270)




ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. భీముడి చేతిలో ధార్తరాష్ట్రులు ఎన్నవరోజునుండి చనిపోవడం మొదలయింది?

2. యుద్ధానికి ముందు ఏ పక్షం వారు ముందుగా శంఖధ్వానం చేశారు? ఎవరు?
3. యుద్ధం చెయ్యటానికి పూర్వం ధర్మరాజు భీష్ముని అనుమతిని కోరినట్లే మరొక ప్రసిద్ధ వ్యక్తి కూడా కోరాడు, ఎవరాతడు?
4. చంపకుండా ధర్మరాజును ప్రాణాలతో పట్టి తీసుకురమ్మని దుర్యోధనుడు గురుని కోరాడు, ఎందుచేత?
5. కౌరవులకు పాండవులతో వైరం బలువు (మిక్కుటము) చేశానని ఒప్పుకున్నాడు కర్ణుడు, ఎప్పుడు?
----------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. నాలుగవరోజు. భీష్మపర్వము ద్వితీయాశ్వాసము 236 & 257 వచనములు
|| ..నజ్జరాసంధమర్దనుండు ఘనశార్దూలంబు బాలమృగంబులం గని కవియు చందంబున నెదుర్కొని సేనాపతిశిరంబు భల్లంబునం ద్రుంచి బాణత్రయంబున జలసంధు నంతకాలయంబున కనిచి సుషేణువక్షస్థ్సలంబున వలుఁదనారసంబునాటించి పడవైచి భీమబాహునస్త్రపంచకంబునం జంపి నుగ్రు నుత్తమాంగంబు వెడఁదవాతియమ్మునం గుండలంబులతోఁ గూల్చి భీమ భీమరథుల నొక్కుమ్మడిం బెక్కమ్ములంగూలనేసి నగుచు మిక్కుటమ్మగునాలుగమ్ముల సులోచనుం గీటడంగించిన. (236)
|| అని యిట్లు నాలవనాఁడు ధార్తరాష్ట్రులు తూలపోవుట చెప్పిన విని సంజయునకు నాంబికేయుండిట్లనియె. (257)

2. కౌరవపక్షం భీష్ముడు. - భీష్మపర్వము ప్రథమాశ్వాసము 174,176 వచనములు; 175 పద్యము
|| ……యమ్మహీపతికిఁ బ్రియంబు పుట్ట శాంతనవుండు సింహనాదంబు చేసి శంఖంబు పూరించిన. (174)
|| తనతనశంఖంబును ద
      క్కును గలదొర లెల్ల ననికి గొనకొని పూరిం
      చినవివిధతూర్యనాదం
      బును జెలఁగె నభంబు దిశలుఁ బూర్ణంబులు గాన్. (175)
|| అప్పుడు కృష్ణార్జునులు పాంచజన్య దేవదత్తంబులును భీమసేనుండు పౌండ్రంబును యుధిష్ఠిరుం డనంతవిజయంబును నకులసహదేవులు సుఘోషమణిపుష్పకంబులును పాంచాల విరాట సాత్యకి ధృష్టద్యుమ్న శిఖండి ప్రముఖదండ నాయకులు తమతమశంఖంబులు బూరించిన. (176)

3.కర్ణుడు 11వ రోజున. ద్రోణపర్వము ప్రథమాశ్వాసము 39 వచనము ; 40-47 పద్యములు
|| నడచి నదీనందనుఁ డున్న యెడకుఁ జేరంబోయి శోషించినసముద్రంబు చందంబున విమానంబు విఱిగిపడినదివ్యుని తెఱంగున భూతలపతితుం డయినపతంగుభంగిని భగ్నపక్షం బైనమైనాకంబుమాడ్కి బొలుచునతనికడకుం బాదచారియై యరిగి యాఫల్గునునారాచనిచయంబునం బొదువంబడి యమునానదీహ్రదస్థితంబును మదనిమీళితంబును నై శోభిల్లుశుండాలంబు ననుకరించుచు వీరశయన మహనీయుండైన యమ్మాహానుభావునియడుగులపైఁ గన్నీరు తొరఁగం బ్రణమిల్లి కేలు మొగిడ్చి వినయవినమితశరీరుం డై. (39)
వచ్చితి రాధేయుఁడఁ గను
    విచ్చి ననుం జూడు భరతవీరాగ్రణి నీ
    సచ్చిరితముఫల మే యి
    ట్లిచ్చట నీయునికి ధాత నే మన నేర్తున్. (40)
పావనంబు లయినపలుకులు నా చెవు
     లార నెమ్మి నన్ను నాదరింపు
     మయ్య ధర్మనిత్య యంచితసత్య శం
     తనుకుమార గాఢధైర్యసార. (41)
పేర్చినమూఁకఁ గూడ నడపింపఁగఁ గోల్తల సేయఁ దీవ్రబా
     ణార్చుల మార్బలంబుల రయంబున నీఱుగఁ గాల్ప నాజి నీ
     నేర్చినభంగి నొం డొకఁడు నేర్చునె పాండవబాహుసంపదల్
     పేర్చు నెలర్చు నింకఁ గురుబృందము లెల్లను దల్లడిల్లఁగన్. (42)
శరజిహ్వాభీకరుఁ డగు
    నరుడను శిఖ నిగుడఁ జేసి నారాయణదు
    ర్భరపవనుఁ డింక బంధుర
    కురుసేనాకాననంబు క్రొవ్వడఁగించున్. (43)
భరితాశాంతరపాంచజన్యరవదృప్యద్దేవదత్తధ్వని
     స్ఫురణన్ వీలును వ్రయ్యఁ గేతనకపి స్ఫూర్జత్ప్రభం జూడ్కు లా
       తురతం బొందఁగఁ జండగాండివసముద్భూతాస్త్రజాలంబు లె
       వ్వరు సై రింతురు నీవు దక్క భుజగర్వస్ఫూర్తినిర్వాహకా. (44)  
మెయిమెయిం బెనంగి మెచ్చించి ముక్కంటి
     చే వరంబు గొని విశిష్టదివ్య
     కర్మదీప్తుఁ డైనగాండీవి నొరుఁ డాజిఁ
     జెనయఁజాల కునికి చెప్ప నేల. (45)
అని పెక్కుమాట లాడిన
    విని యాదరభరితనేత్రవిస్తారుం డై
    యనిమిషనదీతనూజుఁడు
    కనుఁగొనుటయు మఱియు మ్రొక్కి కర్ణుఁడు పలికెన్. (46) 
|| ఆనరు నే నొకండన విషానలదుస్సహదృష్టిభీషణం
  బైనమహాభుజంగమము నద్భుతమంత్రనిరస్తదర్పముం
  గా నొనరించునట్లు భుజగర్వ మడంచెద నస్త్రశస్త్రవి
  ద్యానిపుణత్వసంపద నుదాత్తగుణోత్తర నీవు పంపఁగాన్. (47)

4.ధర్మరాజును చంపితే అర్జునుడు ఎవరినీ బ్రతుకనీయడనీ, ప్రాణాలతో పట్టితెస్తే మళ్లీ జూదమాడించి అడవులకు పంపవచ్చనీ. - ద్రోణపర్వము ప్రథమాశ్వాసము 111 పద్యము
సీ|| ఆధర్మసూనుఁ గయ్యంబునఁ జంపినఁ గోపించి గాండీవి కురుబలంబు
    సమయించు మన మోపి సర్వపాండవులను జంపితి మేనిఁ బ్రచండచక్ర
    ధారఁ గౌరవకోటితల లేఱి రాజ్యంబు గోవిందుఁ డీకున్నె గొంతి కయినఁ
    గాన యుధిష్టిరుఁ గాయంబు నొంపక తెచ్చి జూదం బాడుతెఱఁ గొనర్చి
తే|| మగుడ నడవికి ననిచినఁ దగిలి యతని
    తోడఁ దమ్ములుఁ బోనంతతోనయెల్ల
    దొసఁగు మాలు నప్రతిహతదోర్విభూతిఁ
    బెద్దకాల మే నేలుదుఁబృథివి యెల్ల. (111)

5. అంపశయ్యమీద భీష్మునితో 10వ రోజు. భీష్మపర్వము తృతీయాశ్వాసము 449 పద్యము
|| మాటలు పెక్కు లాడి యనుమానము లేక సభం గడంగి ప
    ల్మాటుఁ బరాభవించితిఁ జలంబునఁ బాండవకోటి కెప్పుడుం
    జేటు దలంచి యే బలువు చేసితి వైరము నాకు నింక నీ
    వీటికి వారివీటికిని వెక్కస మయ్యెడు కయ్య మొప్పగున్. (449)
******************************************************************************************

30 January, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 053 (261 – 265)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]

1. అశ్వత్థామ నారాయణాస్త్రం నుండి పాండవ సేన ఎలా రక్షింపబడింది?
2. కర్ణుని జన్మ గురించి భీష్ముని కెట్లా తెలుసును?
3. యుద్ధం మొదటిరోజు కౌరవపాండవులలో ఎవరిచేయి పైగా ఉంది?
4. యుద్ధంలో కర్ణుడు భీముని పరాక్రమం ప్రశంసిస్తాడు ఎప్పుడు?
5. సువర్ణష్ఠీవి చరిత్ర ఎవరు ఎవరికి చెప్పారు? ఎపుడు? ఎందుకు చెప్పవలసి వచ్చింది?
----------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. నమస్కారంతో భూమికి దిగి నమస్కరిస్తే నారాయణాస్త్రం ఏమీ చెయ్యదని కృష్ణుడు చెప్పాడు. పాండవసేన అలాగే చేసింది. భీముడు చేయనంటే కూడా బలవంతాన చేయించారు కృష్ణార్జునులు. ద్రోణపర్వము పంచమాశ్వాసము 382 వచనము
|| అనిన విని జనార్ధనుండు సత్వరుం డై పెద్దయెలుంగున నెల్ల వారును విన సైనికులారా సామజహయరథంబులు డిగ్గి యాయుధంబులు పెట్టి నిలువుండు భూమి గతు లగునిరాయుధుల నిమ్మహాస్త్రం బేమియుం జేయ దది యెట్లనిన ని ట్లగుట దీనికిఁ బ్రతివిధానంబుగా దీని నొసంగినమహాత్ముండు విధియించె ననుటయు సకలజనంబులు నమ్మాట కియ్యకొని యట్లుచేయం జూచినసమయంబున సమీర నందనుండు. (382)

2. వ్యాసమహర్షి ఏకాంతంగా చెప్పాడు. - భీష్మపర్వము తృతీయాశ్వాసము 445 వచనము

|| ఇది కృష్ణద్వైపాయనుండు నాకు నేకాంతంబున నెఱింగించె నేనును భవదీయ తేజోవిశేషంబువలననుం గనుంగొనియుండుదుఁ బాండుతనయుండ వగుటంజేసి నీయెడ వాత్సల్యంబ కాని మాత్సర్యంబు లే దొక్కటి చెప్పెద విను మేను గురుపాండవుల వైరం బుడిపి పుచ్చితి నప్పాండవేయు లజయ్యు లప్రమేయుండగు
కృష్ణుండు వారికి విధేయుండు కవున వారలతోడివిరోధం బొప్పదు నీవును నొండుదలంపు దక్కి యక్కౌంతేయులం గలిసి యుండు మనినఁ గర్ణుం డతని కి ట్లనియె. (445)

3. యుద్ధం మొదటిరోజు కౌరవపాండవులలో కౌరవులచేయి పైగా ఉంది. భీష్మపర్వము ప్రథమాశ్వాసము 297 300 పద్యములు
తే|| ఇట్లు పాండవసైన్యంబు లెల్లఁ గలఁగి
    యిక్కడక్కడఁ బడుచుండ నక్కజంపుఁ
    గడిమి కచ్చెరువడి యొక్కకడకు వచ్చి
    పాండుసూనులు నివ్వెఱపాటు నొంద. (297)
|| శాంతనవుఁడు తేజోదు
    ర్దాంతుం డై నావెలుంగు ధర కెల్లను జా
    లింతు నినుఁ డస్తశైలో
    పాంతమునకుఁ జనిన నేమి యనిన ట్లుండెన్. (298)
|| సోమాన్వయప్రదీపకుఁ
   డీమెయిఁ దేజోవిశేష మెసకం బెసఁగం
   గా మెఱయుట కనుఁగొని సి
   గ్గై మఱువడుమాడ్కిఁ గ్రుంకె నర్కుం డంతన్. (299)
తే|| జలరుహంబులు పాండవసైనికుల మొ
    గంబులట్టుల విన్ననై కాంతి తఱిఁగె
    వారిమనముల భీత్యంధకార మడరు
    కరణిఁ జీఁకటి యెడనెడఁ గవియు దెంచె. (300)

4. 12 రోజున ద్రోణునిచేత బాధింపబడుతున్న భీముని చూసి పరిహసిస్తూ దుర్యోధనుడు మాట్లాడితే కర్ణుడు భీముని పరాక్రమం ప్రశంసిస్తాడు. - ద్రోణపర్వము ప్రథమాశ్వాసము 304
|| భీముఁడు నట్టివాఁడె యరిభిషణవిక్రముఁ డస్మదీయసం
    గ్రామజయంబు ప్రాణములు కల్గఁగ సైఁచునె పాండవేయు లు
    ద్ధామబలాఢ్యు లాహవముతక్కుదు రే యది గాక వారు నీ
    చే మును పడ్డపాట్లు తమచిత్తములన్ మఱవంగ నేర్తురే. (304)

5. అభిమన్యుని మరణానికి విలపించే ధర్మరాజు నోదార్చటానికి వ్యాసుడు చెప్పవలసి వచ్చింది. ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము 187,189,191,194 వచనములు; 188,190,192,193,195 పద్యములు
|| అది ట్లుండె మహితాత్ము లయిన మహీపతులవరిష్ఠకర్మానుష్ఠానంబుల తెఱంగెఱుంగుట మేల కాదె యంత  లంతలు మానుసులు మడిసిరి గాని పుడమి నిత్యులై నిలువం బడ రది వినుటయు నీమనోరోగశమనంబుచేయుం జెప్పెద నాకర్ణింపుము. (187)
|| జనపాలక సృంజయుఁ డను
 మను జేంద్రుఁడు పుణ్యమూర్తి మహిమాస్పదుఁడి
 వ్వననిధివలయములోనియ
 వని నొక్కఁడ యేలు దుర్నివారస్పురణన్. (188)
సంతానార్థ యయి సంతతంబును భూసురపూజనంబులు చేయుచుండు నానరపతికి నరదుండు సఖుం డగుట నతనిపాలికిఁ బలుమాఱు నరుగుదెంచుచుండు నొక్కనాఁడు పిప్రవరు లతిప్రయత్నంబునం గూడికొని యమ్మునివరునితో నిమ్మహీపతికోర్కి తీర్ప వలదే యని చెప్పిన. (189)
అతఁ డతనితోడ భవదీ
    ప్సిత మెయ్యది నాకు నేల చెప్ప వనుడు నం
    చితగుణుఁడు రూపసియు నగు
    సుతుఁ గోరుదు నెపుడు నేను సురగణవంద్యా. (190)
అక్కుమారుండును మూత్రపురీషలాలాశ్రుస్వేదంబులు సువర్ణంబు లగునట్టివాఁడు కావలయు ననిన నమ్మహీపతికి నమ్మహాత్ముం డవ్వరం బిచ్చె నాసృంజయుండు నత్తెఱంగుతనయుం బడసి సువర్ణష్ఠీవి యనుపేరిడి ప్రియంబునం బెనుచుచు వానివలనం గనకం బనుదినంబు నుత్తరోత్తరాభివృద్ధి యగుచుండ సమృద్ధి నొంది శయనాసనసదనప్రాకారప్రభృతిసమస్తవస్తులును గాంచనమయంబులు కావించికొని యసమానమహిమానందంబునం బ్రకాశుం డై. (191)
విలసిల్లుచు నుండఁగ మ్రు
    చ్చిలి పట్టి కుమారునోరఁ జీరఁ దుఱిమి వెం
    గలు లగుక్రూరులు గొందఱు
    వెలువడఁగొనిపోయి యొక్కవిపినములోనన్. (192)
కడుపు వ్రచ్చి యొడలు కలయంగ జల్లించి
     పాపి పాపి చూచి పసిఁడి కాన
     కచట శవము వైచి యరుగుచు నుండి త
     త్కర్మఫలముఁదమ్ముగలఁచుటయును. (193)
ఆపాపాత్ములు తమలోనం గలహించి యొండొరుల వధియించి యందఱు నధోగతిం జెందిరి సృంజయుండును గొడుకుం గానక వెదకి తత్కళేబరంబు గని పరలోకక్రియలు  నిర్వర్తించి శోకంబునం బలవించుచున్న నన్నరేంద్రుకడకు నారదుం డరుగుదెంచి యతనిచేత నర్చితుం డై. (194)
|| జననాథ యిట్లు శోకం
 బునఁ గుందినఁ దనువు విడిచి పోదె యుసుఱుచ
    చ్చినవారలు వత్తురె యే
 డ్చినఁ జెలిమింజేసి హితము చెప్పెద నీకున్. (195)
******************************************************************************************