Translate

07 December, 2014

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 016 (076 – 080)


ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
__/\__

నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
 [డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. ద్యూతంలో ఓడిపోయిన రాజ్యం ధర్మరాజుకు అనుద్యూతానికి ఎవరి వల్ల వచ్చింది? 
2.  ద్రౌపది తాను ధర్మవిజితనా, అధర్మవిజితనా అని అడిగినపుడు ఎవరూ మాట్లాడలేదు.  అపుడు   
   ఒకరు లేచి అధర్మవిజిత అని తేల్చి చెప్పారు, అతనెవరు? 
      3.  మయసభ నిర్మిచేందుకు ఎంత సమయము పట్టింది? 
      4.  జరాసంధుని అల్లుడెవరు? 
      5.  జరాసంధుని ఆప్తులు (వామ దక్షిణ భజములంటివారు) (మహాసేనానులు) హంస, డిభకుల మరో 
      పేర్లేవి?

సమాధానములు (జవాబులు):

1. ద్రౌపదికి సభలో జరిగిన అవమానం తరువాత గాంధారి చెప్పగా ద్రౌపదిని పిలిపించి, ద్రౌపదిని  
   వరములను కోరమనగా- ధర్మరాజుకు దాస్యవిముక్తి; ధర్మరాజు నలుగురు తమ్ములకూ దాస్య 
   విముక్తితో వారి, వారి కవచములు, ఆయుధములు తిరిగి పొందునట్లు రెండు వరములు తీసుకొనెను. 
   మూడవవరము కోరుకొనమనగా, క్షత్రియ స్త్రీ రెండు వరములకన్నా ఎక్కువ కోరుకొనుట ధర్మము 
   కాదనగా, కోడలి గుణమునకు, ధర్మజ్ఞానానికి మెచ్చి ధృతరాష్ట్రుడు ధర్మరాజును తిరిగి 
   ఇంద్రప్రస్థమునకు వెళ్ళి  రాజ్యమేలుకొనమని వరమివ్వడం వలన ధర్మరాజునకు రాజ్యము దక్కినది.  
    –  సభాపర్వము –  ద్వితీయాశ్వాసము – 257,259,261,263 పద్యములు; 258,260,262,264 
    వచనములు.
క॥సుందరి నాకోడండ్రు ర
     యం దభ్యర్చితవు నీవ యతిముదమున నీ
     కొందఁగఁ బ్రియంబు సేసెద
     నిందుముఖీ వేఁడు మెద్ది యిష్టము నీకున్. (257)
వ॥అనినం బాంచాలి యి ట్లనియె. (258)
ఆ॥కరుణతోడ నాకు వరము ప్రసాదింప
     బుద్ధియేని లోకపూజితుండు
     మనునిభుండు ధర్మతనయుండు దాస్యంబు
     వలనఁ బాయవలయువసుమతీశ. (259)
వ॥అ ట్లయినం గురుకుమారులు గురువృద్ధజనలాలితుం డై పెరిఁగినప్రతివింధ్యు దాసపుత్రుం డన 
     కుండుదు రిదియ నాయిష్టం బనిన నిచ్చితి నింక రెండవవరంబు వేఁడు మనిన ద్రౌపది యి ట్లనియె. 
     (260)
క॥నెమ్మిని ధర్మజునలువురు
     దమ్ములుఁ దమయాయుధముల తమ వర్మవరూ
     ధమ్ములయుఁ దోడ సకలహి
     తమ్ముగఁ బాయంగ వలయు దాస్యమువలనన్. (261)
వ॥అనిన ధృతరాష్ట్రుండు నీకోరినవరం బిచ్చితి నింక మూఁడవవరంబు వేఁడు మనిన ద్రౌపది యి ట్లనియె. (262)
ఆ||వైశ్యసతికి నొక్కవరము సత్క్షత్రియ
     సతికి రెండు శూద్రసతికి మూఁడు
     విప్రసతికి నూఱు వేఁడఁజ న్వరములు
     గాన నింక వేఁడఁ గాదు నాకు. (263)
వ॥అనిన ధృతరాష్ట్రుండు కోడలిగుణంబులకు ధర్మం బెఱుంగుటకు సంతసిల్లి యనుజసహితుం డయిన 
     యుధిష్ఠిరు రావించి నీవు సర్వసంపదలు స్వరాజ్యంబును నొప్పుగొని యెప్పటియట్ల 
     యింద్రప్ర్స్థపురంబున కరిగి సుఖం బుండుము నీకు ల గ్గయ్యెడు మని వెండియు. (264)

2.వికర్ణుడు, దుర్యోధనుని తమ్ముడు – సభాపర్వము – ద్వితీయాశ్వాసము – 227 వచనము.
వ॥ఇక్కురువృద్ధు లైనభీష్మధృతరాష్ట్రవిదురాదులును నాచార్యు లయినద్రోణకృపాదులుం బలుకరైరి
     యున్నసభాసదు లెల్లం గామక్రోధాదులు దక్కి విచారించి చెప్పుం డనిన నెవ్వరుం బలుక కున్న 
     నేనిందు ధర్మనిర్ణయంబు సేసెద నెల్లవారును వినుండు జూదంబును వేఁటయుఁ బానంబును  
     బహుభక్షణాసక్తియు నను నాలుగు దుర్వ్యసనంబులం దగిలినపురుషుండు ధర్మువుం దప్పి 
     వర్తిల్లునట్టివనికృత్యంబులు సేకొనందగవు కితవాహుతుం డై వ్యసనవర్తియయి 
     పరాజితుండయినపాండవాగ్రజుండు పాండవుల కందఱకు సాధారణ ధనంబయినపాంచాలిఁ బణంబుఁ 
     జేసెం గావున ద్రౌపది యధర్మవిజిత యక్కోమలి నేకవస్త్ర నిట దోడ్కొనితెచ్చుట యన్యాయం బనిన 
     వికర్ణుపలుకుల కొడంబడక కర్ణుండు వాని కి ట్లనియె. (227)
 
3.పదునాలుగు నెలలు – సభాపర్వము – ప్రథమాశ్వాసము – 14 వచనము
వ॥మఱియుసకలజనమనోహరంబు లైన ననావిధయంత్రంబులునుననవరతకుసుమఫలభరితంబు      

     లైనతరువనంబులును విక చకమలకుముదాభిరమంబు లైనజలాశయంబులును  
     వివిధవిచిత్రపతాకావిలంబితతోరణ విటంకప్రదేశంబులునుం గలిగి దశకిష్కు 
     సహస్రప్రమానవృత్తయతంబును సహస్రకరప్ర్భప్రసర(విస్తార) విభూతియును 
     వివిధరత్నవిభవాభిశోభితంబునుం గానపూర్వసభాభవనంబుఁబదునాలుగునెలలు నిర్మించి దాని 
     నెనిమిదివేల రాక్షసకింకరుల మహాకాయుల మహజనవసత్త్వసంపన్నుల నంతరిక్షచరులం బనిచి  
     మోపించికొనివచ్చి ధర్మరాజున కిచ్చి గదయును శంఖంబును భీమార్జునుల కిచ్చి ధర్మరాజుచేత 
     సత్కృతుం డయి మయుం డరిగిన. (14)

4.కంసుడు - సభాపర్వము – ప్రథమాశ్వాసము – 114 పద్యము

ఉ|| ఘోరరణంబులోన నధికుం గృతబంధుజనాపకారు నే
     దారుణలీలఁ గంసు నతిదర్పితుఁ జంపుటఁజేసి యమ్మహా
     క్రూరుఁడు కంసుభార్య దనకూఁతురు గావున దానిసంతత
     ప్రేరణ నా కుపద్రవముఁ బెక్కువిధములఁ జేసె నీసునన్. (114)

5.కౌశిక, చిత్రసేనులు - సభాపర్వము – ప్రథమాశ్వాసము – 112 పద్యము; 113 వచనము
క॥ఆయాతభుజవీర్యులు మా
    యాయోధులు హంస డిభకు లనువార లని
    ర్జేయులు పరస్పరస్నే
    హాయత్తసుచిత్తు లతనియాప్తు లధీశా. (112)
వ॥అయ్యిద్దఱును గౌశికచిత్రసేను లనునమంబులతో మహాసేనాన్వితు లైవానికి 

      వమదక్షిణభుజంబులుణ్బోలె సర్వసాధనసమర్థు లయి వర్తిల్లుదురు......(113)
***

No comments:

Post a Comment