Translate

30 November, 2014

మసనోబు ఫుకుఓకా కస్తూరి పలుకులు(3)



మసనోబు ఫుకుఓకా గారి గడ్డిపరకతో విప్లవం పుస్తకమునుండి సేకరించబడినది


కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి – 010 (046 – 050)


ఓం గణేశాయనమఃగురుభ్యోనమః  
_/\__

నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి ((క్విజ్ పుస్తకము (1994) ఆధారంగా]

1. తెలుగు భారతంలోని పర్వాలెన్ని, అవిఏవి? ఆశ్వాసాల సంఖ్య ఎంత?
2. నిద్రాభంగం  చేసినందులకు భార్యను విడిచిపెట్టి తపోవనానికి వెళ్ళిన దెవరు?
3. భారతంలో కృష్ణుడు మొదటగా ఎపుడు కనిపిస్తాడు?
4. శమంత పంచకం ఎక్కడుంది?
5. అర్జునుడు తన తండ్రి అయిన ఇంద్రునితో యుద్ధం ఎప్పుడు, ఎందుకు చేసాడు?

సమాధానములు (జవాబులు):

1. 18 పర్వములు; 63 ఆశ్వాసములు– 63 ఆశ్లేషానికి గుర్తు; 63 లో ఆరూ మూడూ ఒకదాని కొకటి 
    కౌగలించుకొన్నట్లు అభిముఖంగా ఉంటాయి. భారత సారాంశమైన “ మునుజులతో పొంది పొసగి మనుటొప్పు”
    అనుదానికి సంకేతముగా కూడా 63 ని తీసుకొనవచ్చునేమో.  -
    ఆది పర్వము – 8 ఆశ్వాసములు ; సభా పర్వము – 2 ఆశ్వాసములు;
    ఆరణ్య పర్వము – 7 ఆశ్వాసములు; విరాట పర్వము – 5 ఆశ్వాసములు
    ఉద్యోగ పర్వము – 4 ఆశ్వాసములు; భీష్మ పర్వము – 3 ఆశ్వాసములు
    ద్రోణ పర్వము – 5 ఆశ్వాసములు; కర్ణ పర్వము – 3 ఆశ్వాసములు
    శల్య పర్వము – 2 ఆశ్వాసములు; సౌప్తిక పర్వము – 2 ఆశ్వాసములు
    స్త్రీ పర్వము – 2 ఆశ్వాసములు; శాంతి పర్వము – 5 ఆశ్వాసములు
    అనుశాసనిక పర్వము – 5 ఆశ్వాసములు; అశ్వమేధ పర్వము – 4 ఆశ్వాసములు
    ఆశ్రమవాస పర్వము – 2 ఆశ్వాసములు; మౌసల పర్వము – 1 ఆశ్వాసము
    మహాప్రస్థానిక పర్వము – 1 ఆశ్వాసము; స్వర్గారోహణ పర్వము – 1 ఆశ్వాసము

2. జరత్కారుడు. - ఆదిపర్వం – ద్వితీయాశ్వాసము - 160 పద్యము & 161 వచనము
కం॥ఇనుఁ డస్తమింపఁ బోయిన
       ననఘా బోధింప వలసె ననవుడు నామే
       ల్కనునంతకు నుండక యినుఁ
       డొనరఁగ నస్తాద్రి కేగ నోడఁడె చెపుమా. (160)
వ॥నీవు నా కవమానంబు దలంచితివి నీయొద్ద నుండ నొల్లఁ దొల్లి నీకు నాచేసిన సమయంబు నిట్టిద నీగర్భంబున
     నున్నవాడు సూర్యానలసమప్రభుం డైన పుత్రుం డుభయ కులదుఃఖోద్ధరణసమర్థుండు సుమ్ము నీవు వగవక
     నీయగ్రజు నొద్దనుండు మని జరత్కారువు నూరార్చి జరత్కారుండు తపోవనంబునకుం జనియె.... (161)

3. ద్రౌపదీ స్వయంవరంలో – ఆది పర్వము–  సప్తమాశ్వాసము – 171 వచనము; 174 పద్యము
వ॥అని ధృష్టద్యుమ్నుండు మూఁగిన రాజపుత్రులకు నెల్ల నెఱుంగం జెప్పి ద్రుపద రజపుత్రిం జూచి
     యఖిలజలధివేలావలయవల్యితమహీతలంబునం గలరాజనందనులెల్ల నీస్వయంవరంబునకు వచ్చినవారు
     వీరలం జూడు మని దుర్యోధన దుశ్శాసన దుర్ముఖ ప్రముఖ లయినధృతరాష్ట్రనందనుల నూర్వురం,
     దత్సమీపంబున నున్న కర్ణాశ్వత్థామసోమదత్తభూరిశ్రవ శ్శ్రుతసేనాదులను, బుత్రభ్రాతృసమేతు లయి యున్న
     శల్య విరాట జరాసంధ గాంధారపతులను, నక్రూర సారణ సత్యకిసాంబ సంకర్షణ ప్రద్యుమ్న కృష్ణ 
     కృతవర్మానిరుద్ధయు యుధానప్రముఖు లైనయదు వృష్ణి భోజాంధకవరులను, సుమిత్ర సుకుమార సుశర్మ
     సుదక్షిణ సుషేణ సేనాబిందు చంద్రసేన సముద్రసే నౌశీనర చేకితాన శిశుపాల శ్రేణిమ జ్జన మేజయ జయద్రథ
     బృహద్రథ సత్యవ్రత చిత్రాంగద శుభాంగద భగీరథ భగదత్త పౌండ్రకవాసుదేవ వత్సరాజ ప్రభృతు లయిన
     నాదేశాధీశులను వేదధ్వనిసనాథం బై యొప్పుచున్న బ్రాహ్మణసమూహంబును జూపి. (171)
చ॥అవిరళభస్మ మధ్యమున నగ్నికణంబులువోలె బ్రాహ్మణ
     ప్రవరులలోన నేర్పడక పాండవు లేవురు నున్నఁ జూచి యా
     దవవృషభుండు కృష్ణుండు ముదంబున వారి నెఱింగి పార్థుఁ డీ
     యువతిఁ బరిగ్రహించు ననియుం దలఁచెన్ హృదయంబులోపలన్. (174)

4. కురుక్షేత్ర ప్రదేశము.  పరశురాముడు దుర్జనులైన రాజులను 21 మార్లు చంపినపుడు రక్తం అయిదు మడుగులు
    కట్టింది.  అపుడు పరశురాముడు తమ పిత్రుదేవతలకు తర్పణములిచ్చి శాంతించాడు. అదే శమంతపంచకం.
    కురు పాండవులు యుద్ధం అక్కడ చేయటంవలన ఆ ప్రదేశానికి కురుక్షేత్రము అని పేరు వచ్చినది. - ఆదిపర్వం
    –  ప్రథమాశ్వాసము – 78 పద్యము; 79&81 వచనములు
శా॥త్రేతాద్వాపరసంధి నుద్ధతమదాంధీభూతవిద్వేషిజీ
     మూతోగ్రశ్వసనుండు రాముఁ డలుకన్ ముయ్యేడుమాఱుల్ రణ
     ప్రీతిన్ వైరిధరాతలేశరులఁ జంపెం బల్వురన్ దీర్ఘ ని
     ర్ఘాతక్రూరకుఠారలూననిఖిలక్షత్త్రోరుకాంతారుఁ డై. (78)
వ॥అప్పరశురాముండు నిజనిశితకుఠారధారావిదళితసకల క్షత్త్రురుధిరాపురంబులుగానేనుమడుంగులు గావించి
     తద్రుధిరజలంబులఁబితృతర్పణంబుసేసి తత్పితృగణప్రార్థన నుపశమితక్రోధుం డయ్యె దాననచేసి
     తత్సమీపప్రదేశంబు శమంతపంచకంబు నాఁ బరఁగె మఱి యక్షౌహిణీసంఖ్య వినుండు. (79)
వ॥....కురుపాండవులు యుద్ధంబు సేయుటం జేసి యాశమంతపంచకంబు కురుక్షేత్రంబు నాఁబరెంగె నట్టి
     కురుక్షేత్రంబు నందు. (81)

5. ఖాండవవనం దహించే సమయంలో ఇంద్రుడు వర్షం కురిపిస్తే, దాని నుండి తొలగించేందుకు.ఆదిపర్వం –
    అష్టమాశ్వాసము -276,277&282 పద్యములు
ఉ|| ఆనరుమీద ఘోరనిశితాశని వైచె నఖండచండఝుం
     ఝూనిలజర్జరీకృతమహాజలధారలతో నిరంతరా
     నూనపయోధరప్రకర ముద్ధత మై హరిదంతరంబులనన్
     భానుపథంబు నొక్క మొగిఁ బర్వి భయంకర లీలఁ గప్పగాన్. (276)
ఉ|| అన్నవవారివాహనివహమ్ములఁ జూచి భయప్రసున్నుఁ డై
     యున్న హుతాశనున్ విజయుఁ డొడకు మంచును మారుతాస్త్ర మ
     త్యున్నతచిత్తుఁ డేసె నదియున్ విరియించె రయంబుతో సము
     త్పన్న సమీరణాహతి నపార పయోదకదంబకంబులన్, (277)
క॥కొడుకుభుజవిక్రమమునకుఁ
    గడు సంతసపడియుఁ దృప్తిగనక చల మే
    ర్పడఁగ హూతాశను నార్పం
    గడఁగి మహారౌద్రభంగిఁ గౌశికుఁడు వడిన్. (282)
*****************************************************

29 November, 2014

మసనోబు ఫుకుఓకా కస్తూరి పలుకులు(1)

మసనోబు ఫుకుఓకా గారి గడ్డిపరకతో విప్లవం పుస్తకమునుండి సేకరించబడినది

మసనోబు ఫుకుఓకా కస్తూరి పలుకులు(2)

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి)-114

తెలుగు సుద్దులు…..(114)
ఆ.వె||స్వానుభూతి లేక శాస్త్రవాసనలచే
        సంశయంబు చెడదు సాధకునకు;
        చిత్రదీపమునను జీకటి చెడన`ట్లు
        విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
దీపము చిత్రము (బొమ్మ) వలన, బొమ్మ ఎంత సహజత్వము ఉట్టిపడుతున్నా, ప్రజ్వలనము చూపిస్తున్నా ఎలా చీకటిపోదో అలాగే కేవలము శాస్త్రపఠనవలన, తెలుసుకొనుటవలన సాధకునికి సంశయములు (సందేహములు) తీరవు, పోవు. అనగా, పరమాత్మ (తత్వము) గురించిన సత్యము, చేరు మార్గము; లేదా తెలుసుకున్న ఏవిషయముపైననైనా పూర్తిగా అవగాహన కలుగదు. ఈ పద్యములో వేమన సాధకునికి, లేదా సామాన్య విద్యార్ధికి, ఎవరికైనా సైతము తెలుసుకున్నది, చదివినది, విన్నది పూర్తిగా అవగాహన చేసుకొని, జీర్ణించుకొని, ఆచరణకు ప్రయత్నించి ఆచరించినపుడే, సాధనచేసి స్వానుభవము సంపాదించినపుడే, ఉపయోగముంటుంది; కేవలము చిలుకపలుకల వలన ఉపయోగముండదని హితవు పలుకుతున్నారు. కనుకనే ప్రతి విద్యకు శిక్షణ, అభ్యాసము, ఆచరణ, అనుభవము అవసరము. శిక్షణ, అనుభవము లేకుండా ఎన్ని ఉన్నతమైన డిగ్రీలున్నా ఉపయోగముండదు. ||28-11-2014||

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 009 (041 – 045)

ఓం గణేశాయనమఃగురుభ్యోనమః  
__/\__
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. శుక్రుని కూతురెవరు?
2. విదురుడు పూర్వం ఎవరు? ఎవరి శాపం వలన విదురుడయ్యాడు?
3. పాండవులు చనిపోలేదని ద్రుపదునకు ధైర్యం చెప్పినది ఎవరు?
4. ద్రౌపది గాక సహదేవుని భార్య ఎవరు?  ఆమె కొడుకు ఎవరు?
5. వ్యాసుడు ఎవరి ఆజ్ఞతో సోదరక్షేత్రాలలో సంతానం కన్నాడు?
--------------------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. దేవయాని. - ఆదిపర్వం – తృతీయాశ్వాసము – 107 వచనము
వ॥దుహితృ స్నేహంబునం జేసి యద్దేవయానిపలుకులు శుక్రుం డతిక్రమింపండు గావున నీనేర్చువిధంబున దాని  
     చిత్తంబు వడసి శుక్రు నారాధించిన నీకిష్ట్సిద్ధియగు నని దేవతలు ప్రార్థించి పంచినం.... (107)

2. యముడు.  మాండవ్యుని శాపం వలన. [బాల్యంలో (పదునాలుగు సంవత్సరములు దాటువరకు) చేసిన
    తప్పులకు తల్లిదండ్రులు బాధ్యులు.  ఈ న్యాయం విడిచి యముడు మాండవ్యునికి కొఱత వేశాడు.  అందుచేత
    (మర్త్య) మనుష్య లోకములో శూద్రయోని పుట్టమని మాండవ్యుడు యముని శపించాడు.] - ఆదిపర్వం –
    చతుర్థాశ్వాసము -270&272 వచనములు; 271పద్యము
వ॥అనిన మాండవ్యునకు ధర్మరాజిట్లనియె. (270)
కం॥సొలయక తూనిఁగలం గొ
      ఱ్ఱుల్ఁ బెట్టితి నీవు నీ చిఱుతకాలము త
      త్ఫల మిప్పు డనుభవించితి
      తొలఁగునె హింసాపరులకు దుఃఖప్రాప్తుల్.(271)
వ॥అనిన విని మాండవ్యుం డలిగి జన్మంబు మొదలుగాఁ బదునాలుగువత్సరంబులు దాటునంతకుఁ బురుషుండు
     బాలుండు వాఁ డెద్దిసేసినఁ బాపంబుం బెద్ద పొరయండు వానికి నొరు లెగ్గుసేసినఁ బాతకు లగుదు రిది నా చేసిన
     మర్యాదనీవిట్టి ధర్మంబు దలంపక బల్యంబున నల్పదోషంబుఁ జేసిన నాకు బ్రాహ్మణోచితంబుగాని
     క్రూరదండంబు  గావించిన వాఁడవు మర్త్యలోకంబున శూద్రయోనింబుట్టు మని శాపం బిచ్చుటంజేసి వాఁడు
     విదురుండై పుట్టె.(272)

3. పురోహితుడు.  ఉపశ్రుతితో అతడు గ్రహిస్తాడు.  ఇతడే రాయబారానికి కౌరవసభకు వెళ్ళాడు.  -  ఆదిపర్వం –
    సప్తమాశ్వాసము– 25వచనము
వ॥తొల్లి దేవేంద్రుండు గొండొకకాలం బదృశ్యుం డై యుండిన నతనిం గానక శచీదేవి శోకింపం బోయిన నుపశ్రుతిం
     జేసి బృహస్పతి దనికి దేవేంద్రాగమనంబు సెప్పె నని వేదవచనంబుల వినంబడుం గావున నేను
     నుపశ్రుతింజూచితినిది దప్పదు పాండవులు పరలోకగతులు గరు పరమానందంబున నున్నవారు వార
     లెందుండియు నిందులకు వత్తురు నీవును సుచిత్తుండ వయి స్వయంవరం బిప్పురంబున ఘోషింపం బంపు
     మిది కన్యాదానంబునందు రాజులకు శాస్త్ర చోదితం బనినం బురోహితువచనంబునమ్ జ్సి యూఱడి
     ద్రుపదుండు నేఁటికి డెబ్బదియే నగుదివసంబునం బౌషమాసంబున శుక్లపక్షంబున నష్టమియు రోహిణినాఁడు
     స్వయంవరం బని ఘోషింపంబంచి. (25)

4. స్వయంవర లబ్ధయైన విజయ; సుహోత్రుడు- ఆదిపర్వం – చతుర్థాశ్వాసము -116 వచనము
వ॥....స్వయంవరలబ్ధయైనవిజయకు సుహోత్రుండుపుట్టె మఱియు భీమసేనునకు హిడింబకు
     ఘటోత్కచుండుపుట్టె నిప్పాటం బాండవపుత్రు లైనపదునొక్కండ్రయందును వంశకరుం డైనయభిమన్యునకు
     విరాట్పుత్రి యయినయుత్తరకుం బరీక్షితుండు పుట్టె. (116)

5. తల్లియైన సత్యవతి ఆజ్ఞతో. - ఆదిపర్వం – చతుర్థాశ్వాసము -245-247 పద్యములు; 248 వచనము
కం॥ధృతి నీయనుజుండై వి
      శ్రుతుఁ డైనవిచిత్రవీర్యుసుక్షేత్రముల న్
      సుతులం బడయుము కులమవి
      రతసంతతి నెగడ దేవరన్యాయమునన్. (245)
కం॥నీకారణమున వంశ మ
      నకుల మై నిలుచుటయుఁ దదాప్తులుఁ బ్రజలున్
      శోక భయంబులువిడుతురు
      నాకును భీష్మునకుఁ గడు మనఃప్రియ మెసంగున్. (246)
కం॥అని సత్యవతి నియోగిం
      చిన వేదవ్యాసుఁ డట్ల చేయుదు నిది యెం
      దును గలధర్మువ యెప్పుడు
      వినఁబడు నానాపురాణవివిధశ్రుతులన్.(247)
వ॥ఇక్కాశీరాజదుహితలయందు ధర్మస్థితిం బుత్రోత్పత్తిఁ గావించెద వీరలు నా చెప్పినవ్రతంబొకసంవత్సరంబు సేసి
     శుద్ధాత్మలగుదురురేని సత్పుత్త్రులు పుట్టుదురనిన సత్యవతి యి  ట్లనియె. (248)
****************************************************************

25 November, 2014

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి – 007 ( 031 - 035)


ఓం గణేశాయనమఃగురుభ్యోనమః  
__/\__

నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|

దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా] 

1. భీష్ముడు వేదాభ్యాసం ఎవరిదగ్గర చేసాడు?
2. వ్యాసుని భారతాన్ని మనుష్యలోకంలో చెప్పినదెవరు?
3. ద్రోణుని గురుదక్షిణ తీర్చటానికి పాండవులలో ఒకరు తప్ప నల్వురూ వెళ్ళారు – ఆ మిగిలిన ఒక్కరూ ఎవరు?
4. తెలుగు భారతంలో ఎక్కువ ఆశ్వాసాలున్న పర్వం ఏది? ఎన్ని?
5. జనమేజయుని తమ్ములు ఎంతమంది? ఎవరు?

 సమాధానములు (జవాబులు):

1. వసిష్టుని దగ్గర - ఆదిపర్వం – చతుర్థాశ్వాసము -169 పద్యము
సీ|| సాంగంబు లగుచుండ సకలవేదంబులు సదివె వసిష్టుతో సకలధర్మ     
      శాస్త్రాదిబహువిధ శాస్త్రముల్ శుక్రబృహస్పతుల్ నేర్చినయట్ల నేర్చె
      బరమాస్త్రవిద్య నప్పరశురాముండెంత దక్షుఁ డంతియ కడుదక్షుఁ డయ్యె
      నాత్మవిజ్ఞాణబునందు సనత్కుమారాదులయట్టిఁడ యనఘమూర్తి
ఆ|| నొప్పుకొనుమ వీని నుర్వీశ యని సుతు
       నిచ్చి గంగ సనిన నెఱిఁగి తనయు
       నెమ్మిఁ దోడుకోనుచు నిధిఁ గన్నపేదయ
       పోలె సంతసిల్లి భూవిభుండు.(169)

2. వైశంపాయనుడు.- ఆదిపర్వం – ప్రథమాశ్వాసము -66 వచనము
           దేవలోకం- నారదుడు
           పితృలోకం – దేవలుడు
           గరుడ,గంధర్వ,యక్ష,రాక్షస లోకములు – శుకుడు
           నాగలోకం – సుమంతుడు
           మనుష్యలోకం- వైశంపాయనుడు
వ॥ఇట్టిమహాభారతంబు ననేకవిధపదార్థప్రపంచసంచితంబు నుపపర్వమహాపర్వోప శోభితంబు
     నుపద్వీపసంభృతం బయినభువనం బజుండు నిర్మించినట్లు కృష్ణద్వైపాయనుండు నిఖిలలోకహితార్థంబు
     దత్తావధానుం డై సంవత్సర త్రయంబు నిర్మించి దాని దేవలోకంబునందు వక్కాణింప నారదుం బనిచెఁ బితృ
     లోకంబున వక్కాణింప నసితుం డైనదేవలుం బనిచె గరుడగంధర్వయక్షరాక్షసలోకంబులందు వక్కాణింప
     శుకుం బనిచె నాగలోకంబునందు వక్కాణింప సుమంతుం బనిచె మనుష్యలోకంబున జనమేజయునకు
     వక్కాణింప వైశంపాయనునిం బనిచె నే నావైశంపాయనమహామునివలన విని వచ్చితిఁ దొల్లి
     కృతత్రేతావసానసమయంబుల దేవాసుర రామరావణ యుద్ధంబులునుం బోలె ద్వాపరాంతంబునం
     బాండవధార్తరాష్ట్రులకు మహాఘోరయుద్ధంబయ్యె నందు. (66)

3. ధర్మరాజు ( అర్జునుడు ధర్మరాజును మీరు చూస్తూ ఉండండి, మేము వెళ్ళి ద్రుపదుని బంధించి తెస్తామన్నాడు.)
    -  ఆదిపర్వం – షష్ఠాశ్వాసము-76 వచనము
వ॥ఇట్లు పాంచాలుబాణవృష్టికి నిలుపోపక కురుకుమారులు కుమారశర నిహత సురారికుమారులుంబోలె
     వెఱచఱిచి పాండ్వులయొద్దకుం బఱతెంచినం జూచి యర్జునుం డాచార్యధర్మజులకు నమస్కరించి మీర లింద
     యుండుం డేనీక్షణంబ యప్పాంచాలుం బట్టి తెచ్చెద నని విజృంభించి సంరంభంబున భీమసేనుండు దనకు
      సేనాగ్రచరుండు గా మాద్రేయులు రథచక్రరక్షకులుగా ద్రుపదరాజ వాహినీ సముద్రంబు దఱియం జొచ్చిన. (76)

4. ఆదిపర్వం – 8 ఆశ్వాసాలు

5. జనమేజయుని తమ్ములు ముగ్గురు. – అ)శ్రుతసేనుడు ఆ)భీమసేనుడు ఇ)ఉగ్రసేనుడు - ఆదిపర్వం –
    ప్రథమాశ్వాసము - 83 వచనము
వ॥ఆ ప్రదేశంబునకు సమర యను దేవశునికొడుకు సారమేయుం డను కుర్కుర కుమారుండు క్రీడార్థంబు వచ్చి
     క్రుమ్మరుచున్న నలిగి జనమేజయుతమ్ములు శ్రుతసేనుండును భీమసేనుండును నుగ్రసేనుండును ననువార
     లాసార మేయు నడిచిన నది యఱచుచుం బఱ తెంచి తమతల్లికిం జెప్పిన నాసరమయు నతికోపాన్విత యై
     జనమేజయునొద్దకు వచ్చి యి ట్లనియె. (83)
****

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 008 (036 – 040)


ఓం గణేశాయనమఃగురుభ్యోనమః 
 __/\__

నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్| 

[డా.తిప్పాభట్లరామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్)పుస్తకము (1994) ఆధారంగా[

1.‘వసుషేణుడు’ ఈ పేరు భారతంలో ఒక ప్రసిద్ధ వ్యక్తిది, ఆ వ్యక్తి ఎవరు?
2. ద్రౌపది స్వయంవరం ఎప్పుడు జరిగింది?
3. భీష్మునికి స్వచ్ఛంద మరణం అనే వరం ఎవరివల్ల వచ్చింది?
4. ఇది నాకు తప్ప ఇతరులకు తెలియదు కదా అని ధార్మికులు అసత్యమాడవచ్చునా? అని ఒక  రాజును ఒక స్త్రీ
    అడిగింది, ఎవరా స్త్రీ? ఎవరిని?
5. ద్రోణునికి పూర్వం కురు కుమారులకు విలువిద్య నేర్పినదెవరు?
----------------------------------------------------------------------------------------------------------

సమాధానములు (జవాబులు):

1. కర్ణుడు.  కుంతి తన కొడుకును ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలింది.  అందులో రత్నాలు, మణులు, బంగారమూ
    పెట్టింది.  వసువంటే బంగారము.  బంగారముతో సహా దొరికాడు కనుక వసుషేణుడు అయ్యాడు. - ఆదిపర్వం –
    పంచమాశ్వాసము -33 వచనము
వ॥ఇట్లు వసునివహంబుతో వచ్చుటంజేసి వసుషేణుం డనునామంబునం బరఁగి కర్ణుండు రాధేయుం డై
     సూతగృహంబునం బెరుఁగు చుండె నంత నిట. (33)

2. పౌష్య శుక్ల అష్టమి రోహిణి నక్షత్రమున. - ఆదిపర్వం – సప్తమాశ్వాసము -25 వచనము & 282 పద్యము.
వ॥...నేను నుపశ్రుతిం జూచితి నిది దప్పదు పాండవులు పరలోకగతులు గారు పరమానందంబున నున్నవారు
      వార లెందుండియు నిందులకు వత్తురు నీవును సుచిత్తుండ వయి స్వయంవరం బిప్పురంబున ఘోషింపం
      బంపు మిది కన్యాదానంబునందు రాజులకు శాస్త్ర చోదితం బనినం బురోహితువచనంబునం జేసి యూఱడి
      ద్రుపదుండు నేఁటికిడెబ్బదియే నగుదివసంబునం బౌషమాసంబున శుక్ల పక్షంబున నష్టమియు రోహిణినాఁడు
      స్వయంవరం బని ఘోషింపంబంచి. (25)
ఆ|| నేఁడు పుణ్యదినము నెమ్మితో రోహిణీ
     యుక్తుఁ డయి శశాంకుఁ డున్నవాఁడు
     మంత్రవంతముగఁ  గ్రమంబున  నేవురుఁ
     బెండ్లి యగుఁడు కృష్ణఁ బ్రీతితొడ. (282)

3. శంతనుని వలన.  తనతండ్రి వివాహము కొరకు తను వివాహమాడనని భీష్మమయిన ప్రతిజ్ఞ చేసినందులకు
    సంతసించి శంతనుడావరమిచ్చాడు. - ఆదిపర్వం – చతుర్థాశ్వాసము-193 వచనము
వ॥శంతనుండును బరమానురాగంబున సత్యవతిని వివహం బై యతిమానుషంబయినయాభీష్ము
      సత్యవ్రతంబునకు సంతసిల్లి యాతనికి స్వచ్ఛందమరణంబుగా వరం బిచ్చి .... (193)

4. శకుంతల దుష్యంతునితో అన్న మాటలివి. - ఆదిపర్వం – చతుర్థాశ్వాసము -79 పద్యము
ఆ|| ఏల యెఱుక లేని యితరులయట్ల నీ,
      వెఱుఁగ ననుచుఁబలికె దెఱిఁగి యెఱిఁగి
      యేన కాని దీని నెఱుఁగ రిందొరు లని,
      తప్పఁ బలుక నగునె ధార్మికులకు. (79)

5. కృపాచార్యుడు. - ఆదిపర్వం – పంచమాశ్వాసము – 191 వచనము &192 పద్యము
వ|| అట్టి కృపాచార్యు రావించి భీష్ముం డతిభక్తిం బూజించి వానితోడఁ దనమనుమల నందఱ
      విలువిద్యఁ గఱవం బంచిన.(191)
క||సవిశేషముగ ధనుర్వే
    దవిశారదు లైరి కడుజితశ్రములై పాం
    డవధృతరాష్ట్రాత్మజయా
    దవు లాదిగ రాజసుతులు తత్కృపశిక్షన్. (192)
**********************************************************