Translate

28 October, 2015

శ్రీ ఆంజనేయ దండకము



శ్రీ ఆంజనేయ దండకము
శ్లో|| ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణుశివాత్మకమ్ |
      తరుణార్క ప్రభో శాన్తమ్ రామదూతం నమామ్యహం||
శ్రీ ఆంజనేెయం! ప్రసన్నాంజనేయం! ప్రభాదివ్యకాయం! ప్రకీర్తిప్రదాయం! భజేవాయుపుత్రం! భజేవాలగాత్రం! భజేహం పవిత్రం! భజే సూర్యమిత్రం! భజే రుద్రరూపం! భజే బ్రహ్మతేజం! బటంచుఁ ప్రభాతంబు, సాయంత్రమున్నీనామ సంకీర్తనల్ చేసి, నీరూపు వర్ణించి, నీమీద నే దండకం బొక్కటిం జేయ నూహించి, నీ మూర్తినిన్ గాంచి, నీ సుందరంబెంచి, నీదాస దాసాన దాసుండనై, రామభక్తుండనై నిన్ను నే గొల్చెదన్, నీ కటాక్షంబునన్ జూచితే, వేడుకల్ జేసితే, నామొరాలించితే నన్ను రక్షించితే, అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచ నేనెంతవాడన్, దయాశాలివై జూచితే, దాతవై బ్రోచితే, దగ్గరన్ బిల్చితే, తొల్లిసుగ్రీవునకు న్మంత్రివై స్వామికార్యార్థివై యేగి శ్రీరామ సౌమిత్రులన్ జూచి, వారన్విిచారించి,  సర్వేశుబూజించి, యబ్భానుజుం బంటుగావించి, యవ్వాలినిన్ జంపి కాకుత్ఠ్సతిలకున్ దయాదృష్టివీక్షించి, కిష్కింధ కేతెంచి, శ్రీరామ కార్యార్థమై లంకకేతెంచియున్, యాలంకిణిన్ జంపి, యాలంకయున్ గాల్చి, యాబ్భూమిజంజూచి, యానంద ముప్పొంగ యాయుంగరంబిచ్చి, యారత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషునిన్ జేసి, సుగ్రీవున్నింగదుఁ జాంబవంతున్నలున్నీలునిన్ గూడి యా సేతువున్ దాటి, వానరల్పెన్మూకలై దైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగావచ్చి కోరి బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వైచి యాలక్ష్మణున్ మూర్ఛ నొందింపగా, నప్పుడే బోయి నీవు సంజీవినిన్ దెచ్చి సౌమిత్రి కిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా, కుంభకర్ణాది వీరాళితోబోరి చెండాడి శ్రీరామ బాణాగ్ని వారందరిన్, రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ, నవ్వేళనన్ నవ్వీభీషణున్ వేడుకన్ దోడుకన్వచ్చి పట్టాభిషేకంబు జేయించి సీతా మహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి, నయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమై యున్న నీకన్ననాకెవ్వరుంగూర్మిలేరంచు మన్నించినన్,  శ్రీరామభక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ నామసంకీర్తనల్ జేసినన్ బాపముల్బాయునే, భయములున్దీరునే, భాగ్యముల్గల్గునే, సకలసామ్రాజ్యము ల్సకల సమ్పత్తులున్ గల్గునోవానరాకార! యో భక్తమందార! యో పుణ్యసంచార! యో వీర!యో శూర! నీవే సమస్తంబు,  నీవే మహాఫలమ్ముగ వెలసి యా తారకబ్రహ్మమంత్రంబు పఠించుచున్ స్థిరమ్ముగా వజ్ర దేహంబునుం దాల్చి 'శ్రీరామ, శ్రీరామ' యంచున్ మనఃపూతమై (పూర్ణమై) యెప్పుడున్ తప్పకన్ తలతునాజిహ్వయందుండి నీ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారివై, రామనామాంకిత ధ్యానివై, బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ వెల్గొందువో,  రౌద్రనిజ్వాల, కల్లోల హా! వీరహనుమంత! యోంకార హ్రీంకార శబ్దంబులన్, భూత,ప్రేత,పిశాచ,శాకినీ,డాకినీ,గాలి, దెయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలం బడంగొట్టి నీ ముష్టిఘాతంబులన్, బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభాభాసితంబైన నీ దివ్య తేజంబునుం జూపి రారా నా ముద్దు నరసింహా యనుచున్, దయాదృష్టివీక్షించి నన్నేలు నా స్వామి! యోయాంజనేయా!  నమస్తే సదా బ్రహ్మచారీ! వ్రతాపూర్ణహారీ! నమస్తే వాయుపుత్రా! నమస్తే నమస్తే నమః.
__/\__  __/\__  __/\__





















27 October, 2015

శ్రీ విఘ్నేశ్వర దండకము


శ్రీ విఘ్నేశ్వర దండకము
శ్రీపార్వతీపుత్ర! లోకత్రయస్తోత్ర! సత్పుణ్యచారిత్ర! భద్రే భవక్త్రా! మహాకాయ! కాత్యాయనీనాధ సంజాతస్వామీ! శివాసిద్ధి విఘ్నేశ! నీ పాదపద్మంబులఁ, నీదుకంఠంబు, నీబొజ్జ, నీమోము, నీమోవి, బాలేందు ఖండంబు, నీనాల్గుహస్తంబులఁ, నీకరాళంబు, నీపెద్ద వక్త్రంబు, నీఏకదంతంబు, నీపాదహస్తంబు, లంబోదరంబుఁ, సదా మూషికాశ్వంబు, నీమందహాసంబు,
నీచిన్నతుండంబు, నీగుజ్జురూపంబు, నీశూర్పకర్ణంబు, నీనాగయజ్ఞోపవీతంబు, నీభవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతిమొక్కంగ, శ్రీగంధముఁ, కుంకుమంబక్షతల్లాజులఁ, చంపకంబుల్, దగఁ మల్లెలఁ, మంచిచేమంతులఁ, దెల్లగన్నేరులఁ, మంకెనల్, పొన్నలుఁ, పువ్వులుఁ మంచిదూర్వంబులుఁ దెచ్చిశాస్త్రోక్తరితిఁ సమర్పించి, బూజించి, సాష్టాంగముఁ జేసి విఘ్నేశ్వరా నీకుటెంకాయలున్నరటిపండ్లుఁ, మదిఁమంచివౌ నిక్షుఖండంబుులఁ,  రేగుబండ్లప్పడంబుల్, నడల్, నేతిబూరెల్ మరిం గోధుమన్పడంబుల్, వడియముల్, పుణ్కులుఁ, బూరెలుఁ, గారెలుఁ, చక్కనౌ చక్కెరల్ చల్మిడిఁ, దేనియుఁ, జున్ను, శాల్యన్నము, న్నాన్నబియ్యంబు, నామ్రంబు, బిల్వంబు, మేల్ బంగరుఁ పళ్ళెమందుంచి నైవేద్యముఁ బెట్టి, నీరాజనంబుఁ, నమస్కారముల్ జేసి, విఘ్నేశ్వరా! నిన్ను పూజింపకే అన్యదైవంబులఁ బ్రార్థనల్ సేయటల్ కాంచన బొల్లకేయిన్ముదాగోరు చందంబుగాదే మహాదేవా! యోభక్తమందార! యోసుందరాకారా! యోభాగ్యగంభీర! ఓ దైవచూడామణీ! లోకరక్షామణీ! బంధుచింతామణీ! స్వామి, నిన్నెంచ నేనెంత! నీదాసదాసాన దాసుండ, శ్రీదొడ్డ రాజన్వయుండఁ రమానాథదాసుండ నన్నిపుడు చేపట్టి సుశ్రేయునింజేసి, శ్రీమంతుగాజూచి, హృత్పద్మసింహాస నారూఢతన్నిచ్చి కాపాడుటే కాదు, నిల్గొల్చి ప్రార్థించు భక్తాళికి కొంగుబంగారమై, కంటికిఁ రెప్పవై, బుద్ధియుఁ, విద్యయుఁ, బాడియుఁ, బంటయుఁ బుత్రపౌత్రాభివృద్ధిఁ దగఁ గల్గగాజేసి, పోషించుమంటిఁ, గృపగావుమంటిఁ, మహాత్మా! యివే వందనంబుల్ సదా శ్రీగణేశా! నమస్తే, నమస్తే నమ:! 
 __/\__ __/\__ __/\__






































16 October, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి – 110 (546-550)



ఓం గణేశాయనమః గురుభ్యోనమః  
 __/\__
నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారముగా.]

1.   ధర్మరాజు ధ్వజం ఏమిటి?
2.  పాండవుల కొడుకు ఒకడు, మనుమడొకడు ధర్మరాజు అశ్వమేధం చూశారు ఎవరు వారు?
3.  తాను మరణిస్తూ భీష్ముడు పాండవులకు ఏమని సలహా ఇచ్చాడు?
4.  వీని మనస్సు ఇప్పుడు నిష్కల్మషమయింది అని వ్యాసమహర్షి ఒకరిని మెచ్చుకున్నారు, అతను ఎవరు?
5.  చివరగా వ్యాసుడు ధృతరాష్ట్రునికి చెప్పిన ధర్మమేమిటి?
----------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.   చంద్రుడు   
2.   బభ్రువాహనుడు, పరీక్షిత్తుడు- అశ్వమేధపర్వము- చతుర్థాశ్వాసము – 208 పద్యము
తేబభ్రువాహనునకుఁ బరమవిశేషంబు
    మెఱయ గారావించి మేలివస్తు
    కోటు లొసఁగి ప్రీతిఁ గూరినమనముతో
    నతనిఁ దత్పురమున కరుగఁబమనిచె. (208)
3.ఆనృశంస్యము, సత్యము విడువక బ్రతుకుడని ఆనుశాసనికపర్వము పంచమాశ్వాసము – 468 వచనము
నీకు నే ననుజ్ఞ యిచ్చితి వసువులం బొందు మనినం బరమానందంబునం బొంది పాండునందనులను ధృతరాష్ట్రునిం దక్కటివారలను గనుంగొని మీచేత ననుజ్ఞాతుండన కదా యని పలికి యందఱం గౌఁగలించుకొని యానృశంస్యంబును (అక్రూరభావమును) సత్యంబును నిత్యంబులుగాఁ బాటించి బ్రదుకుం డనిచెప్పి తాను దొల్లి రాజులగెల్చి తెచ్చినధనంబులు విప్రజనంబుల్ కిచ్చి ధర్మతనయుం జూచి యెల్ల బ్రాహ్మణులునుం బూజనీయులు ఋత్విజులు నాచార్యులు వృద్ధులు విశేషించి పూజింపవలయువా రని నిర్దేశించి యూరకుండి ధారణానుక్రమంబున సమాహితాత్ముండయి వాయువుల సన్నిరుద్ధంబుచేసిన నవిఉర్ధ్వగతిం గైకొనియె నమ్మహాత్ముండవయవంబులం బ్రాణంబులు పాపికొనుచు వచ్చునయ్యై చోట్లు శల్యరహితంబులగు చుండె నట్లగుటం గాంచి కృష్ణాదులగు నఖిల జనంబులు నాశ్చర్యభరితాంతఃకరణు లగుచుఁ గీర్తించి రాసంయమచతురునిచే సర్వావయతబను సన్నిరుధ్ధం బై యాత్మ మూర్ధంబు భేదించి మహోల్కా కారంబున నాకసంబున కెగసి కొంతదవ్వరిగి యంత నంతర్హితం బయ్యెనప్పుడు పుష్పవృష్టి గురిసె దేవదుందుభులు మొరసె నంబరంబున సిద్ధులు సాధ్యులుం బొగడుచుం బ్రమోదంబునొంది రిట్లు దేవవ్రతుండు దివంబునకుం జనుటయు. (468)
4.ధృతరాష్ట్రుని ఆశ్రమవావాసానికి వెళ్లేముందు. ఆశ్రమవాసపర్వము ప్రథమాశ్వాసము – 51,52 పద్యములు
సీఅనుటయుఁ బ్రియమంది యమ్మాహాముని యమ్మహీశ్వరుతోఁ బాండుఁనృపాలు
    గద్దియ నిడికొని క్రతువులు చేయించి యవిరళభోగానుభవము నడిపి
    యీతనివారలఁ బ్రీతి నీక్షించి తా శిష్యుండపోలె సంసేవనంబు
    భక్తిమై నొనరించెఁ బదపడి నీవును దిగ్విజయాదులఁ దేజ మితని
తేనొందునట్లుగఁ జేసితి వొనరఁ బిదపఁ
    దాన పదమూఁడువర్షముల్ ధరణియేలె
    నీవు శుశ్రూష యెంతయు నియతి నడపి
    తితనిమది లేదు కలఁక యొక్కింతయేని. (51)
కేవలతపఃక్రియాసం
    సేవనతాత్పర్య మిపుడు చిత్తంబునతయం
    దావేశించినయది యీ
    భూవరునకు నితని ననిచి పుచ్చు మడవికిన్. (52)
5.ధీర్ఘవైరమూ, క్రోధమూ లేకుండా మనస్సు వాక్కూ ఏకాగ్రమయితే అదే పరమపదాప్తి సాధనం. మోక్షకారణం. ఆశ్రమవాసపర్వము ద్వితీయాశ్వాసము - 75పద్యము.
వినుము దీర్ఘవైరవృత్తియుఁ గ్రోధచిం
    తనము లేక వాక్కు మనమునొక్క
    అంద మగుట సకలజనముల కనుబద్ధ
    సంపదా ప్తిపరమసాధనంబు. (75)
 సమాప్తము   
__/\___
******************************************************************************

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి – 109 (541 - 545)



ఓం గణేశాయనమః గురుభ్యోనమః  
 __/\__
నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారముగా.]
1. ధర్మరాజు సత్యం విడువ డని దుర్యోధనునకు కూడా నమ్మకం - దీనికి ఉదాహరణం ఏమిటి?
2.ధృతరాష్ట్రుని వనవాసానికి పౌరుల సమ్మతిని తెలిపినది ఎవరు?
3. కృష్ణుడు అశ్వత్థామను ఏమని శపించాడు?
4.ధృష్టద్యుమ్నునికి మరో పేరు ఉంది, అదేమి?
5.ఉద్యోగం అంటే ఏమిటి? ఉద్యోగపర్వం అనే పేరు ఎందుకు వచ్చింది
----------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. భీష్ముడు చెప్పినా నమ్మక దుర్యోధనుడు ధర్మరాజు దగ్గరకు అజ్ఞాతవాసం చెడిపోయిందని దూతను పంపాడు.  అపుడే ధర్మరాజు నిండె సమయాబ్దములు నిండె నిండె అని ముమ్మారు నిండినట్లు చెపుతాడు. విరాటపర్వము పంచమాశ్వాసము – 367 వచనము; 368- 370 పద్యములు
.. గాంగేయునివచనంబు లప్రమాణంబులు సేసి ధర్మతనయుం డసత్యంబున కియ్యకొనమి యెఱింగి యాతనిపాలికి దూతం బుత్తెంచిన వాఁడు నేతెంచి కాంచి యిట్లనియె. (367)
తేవాలి యజ్ఞాతవాససంవత్సరంబు
     నిండ కుండంగ మున్నపార్థుండు బయలు
     మెఱసి సమయంబు దప్పె నీ వెఱిఁగి దీని
     కేది దగు నది సేయుము మేదినీశ. (368)
అని పునర్వనవాసకరణంబు దోఁప నాడిన నవ్వి యధిష్ఠితసత్యవ్రతుం డ్యిన యుధిష్ఠిరుం డతని కి ట్లనియె. (369)
నిండె సమయాబ్దములు నిం
     కొం డన లే దిపుడ చని సుయోగధనుతో భీ
     ష్ముండును గురుఁడును వినఁగా
     నిండె ననుము నిండె నిండె నిక్కంబునకున్. (370)
2.శంభువనే విప్రుడు ఆశ్రమవాసపర్వము ప్రథమాశ్వాసము -97 వచనము
అట్లేడ్చి యుడిగి తమయంతవట్టునుం గూడుకొని కార్యవచనంబు లార్యచరితుండును జాతురాలాపకల్యుండును నగు శంబువను విప్రోత్తమునకుం జెప్పి యిత్తెఱంగున ధృతతరాష్ట్రునితో నాడు మని నియోగించిన నాతం డారాజు నగ్ర భాగంబునఁజేరి సవినయంబుగా ని ట్లనియె. (97)
3.నీవు బాలఘాతివి అయ్యావు అన్నం దొరకక అసహాయుడవై దుర్గంధ రక్తంలొ శరీరం తడుస్తూ మూడువేల ఏళ్ళు తిరుగుతావుఅని శపించాడు,  దీన్ని వ్యాసుడు కూడా ధ్రువీకరించాడు. సౌప్తికపర్వము ద్వితీయాశ్వాసము – 86 వచనము
తనచిత్తంబున రోషం బావహిల్లుటయు బాలఘాతి వగునీకు నశనంబు దుర్ల భం బై సహాయరహితుండ వై దుర్గంధరక్తంబు నంగంబు దిగ్ధం బగుచుండ మూఁడువేలేండ్లు తిరుగుము నాచేత రక్షితుండై యక్కుమారుండు కృపాచార్యువలన ధనుర్వేదవిదుం డై సర్వశస్త్రాస్త్రంబులు పడసి బహుసంవత్సరంబులు వసుధఁ బాలింపఁగలవాడు వానికి జనమేజయుం డనుమహారాజు ప్రభవించి నీవు చూచుచుండ నుజ్జ్వలుం డై ప్రవర్తించు మదీయంబు లగుతపస్సత్యంబులమహనీయప్రభావంబులు చూడు మని యాడె నప్పుడు కృష్ణద్వైపాయనుండు గురునందనున కి ట్లనియె. (86)
4.శ్వేతుడు - 
5.ప్రయత్నం సంధికోసం ప్రయత్నాలు సాగిన పర్వము కనుక. ******************************************************************