ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. ధర్మరాజును రాజసూయం చేయుమని ప్రేరేపించిన దెవరు?
2. శిశుపాలుడు ఏదేశానికి రాజు? కృష్ణునితో అతనికి గల సంబంధం
ఏమిటి?
3. రాజసూయానికి ముందు ధర్మరాజు తమ్ములు ఏ ఏ దిక్కులు జయించారు?
4. అనుద్యూతనికి ధర్మరాజును తీసుకురమ్మని ఎవరిని పంపారు?
5. కృష్ణాదులు పురద్వారముగుండా జరాసంధుని పురమును ఎందులకు ప్రవేశించలేదు?
సమాధానములు (జవాబులు):
1.నారదుడు – పాండురాజు కోరికగా నారదుడు వచ్చి ధర్మరాజుకు రాజసూయయాగం చేయమని
చెపుతాడు. - సభాపర్వము – ప్రథమాశ్వాసము – 88-90 పద్యములు & 91 వచనము
కం|| జనపతులు రాజసూయం
బొనరించినవారు శక్రునొద్దను సురపూ
జన లొందు చుండుదురు కో
రినకోర్కులు వడయుచును హరిశ్చంద్రుక్రియన్. (88)
చ|| కొనకొని మర్త్యలోకమునకుం జని సన్మునినాథ యిందు నా
యునికియు రాజసూయమఖ మున్నతిఁ జేసినధన్యు లింద్రునం
దునికియు నా తనూజున కనునయశోనిధి యైనధర్మనం
దనునకుఁ జెప్పి వాని నుచితస్థితిఁ బన్పుఁడు దానిఁ జేయఁగన్. (89)
చ|| అనుపమశక్తిమంతులు మదాత్మజు లేవురు దేవతావరం
బున నుదయించి యున్న కృతపుణ్యులు వారలలోన నగ్రజుం
డనఘుడు రాజసూయము మహామతిఁ జేయఁగ నోపు శత్రుసూ
దనుఁ డయి సార్వభౌముఁ డయి తమ్ములబాహుబలంబుపెంపునన్. (90)
వ|| అట్లేని నాకు నస్మత్పితృపితామహనివహంబుతోడ నాకాధిపలోకసుఖావాప్తి యగు ననిన
నప్పాండురాజువచనంబు నీ కెఱింగించువేడుక నిట వచ్చితి. (91)
2.శిశుపాలుడు చేది దేశానికి రాజు. కృష్ణుని మేనత్త సాత్వతి (దమఘోషుని భార్య) యొక్క కుమారుడు. -
సభాపర్వము – ద్వితీయాశ్వాసము – 52, 58 వచనములు; 55,57 & 59 పద్యములు
వ॥ఇట్లు నిఖిలక్షత్రియత్రాసజననంబుగా నలిగి దంతసందష్టదారుణ ముఖుండై శిశుపల
నిర్మూలనాభీలసంరంభమున నున్న భీమసేను వరించి భీష్ముం డి ట్లని చెప్పె నిద్దురాత్ముండు తొల్లి
చేదివంశంబున దమఘోషుండనువానికి సాత్వతికిం జతుర్భుజలలాటనేత్రంబులతో నుదయించి
రసభరవంబున నేడ్చుచున్నం జూచి తల్లిదండ్రులు భయవిస్మయాధీనమనస్కు లయి యున్న వారికి
నొక్క యశరీరభూతం బి ట్లనియె. (52)
ఆ॥వీని నొరులు చంపఁగా నోప రెవ్వరు
నెవ్వరేని వీని నెత్తికొనుడు
మిగిలి యున్న బహుయుగళంబుఁ గన్నును
నడఁగు వీని కతఁడ యంతకుండు. (53)
చ|| అతివికృతస్వరూపధరుఁ డైనకుమారకుఁ బ్రీతితోడ సా
త్వతిఁ దమమేనయత్తను ముదంబునఁ జూడఁగఁ గోరి యద్భుత
ప్రతిభులు రామకేశవులు పన్నుగ నేగిరి చేదిధారుణీ
పతిపురి కొక్కనాఁ డఖిలభాంధవ మంత్రి సుహృత్సమేతులై. (55)
కం॥అక్కొడుకు నబ్జనాభుం
డక్కజముగ నెత్తికొనుడు నందఱున్ జూడన్
గ్రక్కున నొక్కట నడఁగెను
మిక్కిలిచేతులును వాని మిక్కిలి కన్నున్. (57)
వ॥దానిం జూచి సాత్వతి యద్భుతచిత్తయై యశరీరిపలుకు లప్పుడు దలంచి తన పుత్రునకు
మురవైరివలన మరణం బగుట తెఱింగి యతని కి ట్లనియె. (58)
కం|| కుపథప్రవృత్తుఁ డయి వీఁ
డపనయమున నీ కనిష్టుఁ డయినను గరుణా
నిపుణుఁడ వై నీమఱఁదికి
నపరాధశతంబు సైఁపు మయ్య యుపేంద్రా. (59)
3.రాజసూయానికి ముందు ధర్మరాజు తమ్ములు, భీమసేనుడు – తూర్పు దిక్కు; అర్జునుడు – ఉత్తర
దిక్కు; సహదేవుడు – దక్షిణదిక్కు ; నకులుడు – పశ్చిమ దిక్కు జయించారు. - సభాపర్వము –
ప్రథమాశ్వాసము – 229,241,265 పద్యములు & 242,246 వచనములు
సీ॥అగ్నిదత్తం బైనయద్దివ్యరథ మెక్కి గాండీవధరుఁ డతిఘర్మసమయ
ఘర్మాంశుఁడునుబోలెఁ గౌబేర దిగ్విజయార్థ ముగ్రప్రతాపాగ్ని వెలుఁగఁ
జని పుళిందావనీశ్వరు నోర్చి ప్రతివింధ్యుఁ డనువాని నోడించి యశ్రమమున
మఱి యఖిలద్వీపమండలేశుల నెల్ల వశవిధేయులఁ జేసి వరు తన్ను
ఆ॥భక్తిఁ గొలిచి రాఁగఁ బ్రాగ్జ్యోతిషంబుపై
విడిసెఁ దత్పురమున విభుఁ డనంత
బలముతోడఁ బన్ని భగదత్తుఁ డేతెంచి
విజయుఁ దాఁకె సమరవిజయకాంక్ష. (229)
తరలము॥తరణిసన్నిభు ధర్మపుత్రునుదార తేజము పర్వ భా
స్వరసుసంపదఁ బాకశాసనిశాసనంబున నిట్టు లు
త్తరకురూత్తముఁ దొట్టి యుత్తరధారుణీశులు వశ్యు లై
కరధనంబులు దెచ్చి యిచ్చిరి గైరవంబున ధన్యు లై. (241)
వ॥అట భీమసేనుండునుం బరచక్రమర్దనం బయిన బలచక్రంబుతోఁబూర్వ దిక్కునకుం జని
పాంచాలపతిచేత సత్కృతుం డయి విదేహరాజు జనకుండనువని జయించి దశార్ణ పతి
యయినసుధన్వుతో మహయుద్ధంబు సేసి తత్పరక్రమంబునకుం మెచ్చి వనిం దనకు సేనపతిం
జేసికొని యశ్వమేధేశ్వరుం డయిన రోచమాను ననుజసహితు నిహతుం జేసి చేదివిషయంబునకుం
జనిన. (242)
వ॥అట సహదేవుండు దక్షిణదిక్కున కరిగి సుమిత్ర శూరసేన దంతవక్త్ర యవనులను
గోశృంగగిరివాసులను జయించి కుంతిభోజుచేతం బ్రియపూర్వకంబునం సత్కృతుం డయి. (246)
కం॥నకులుఁడు పశ్చిమదిక్కున
కకుటిలశౌర్యంబు మెఱయ నరిగి యరాతి
ప్రకరభయానకసేనా
ధికుఁ డయి నిజ తేజ మెల్లదిక్కుల వెలుఁగన్. (265)
4.పాండవులు తను చెప్పినట్లు ఇంద్రప్రస్థానికి ఇంకా పూర్తిగా వెళ్ళకుండానే మళ్ళీ
జూదానికి(అనుద్యూతానికి) పిలుచుకురమ్మని ధృతరాష్ట్రుడు దుర్యోధనుని ప్రోద్భలంతో ప్రాతికామినిని
పంపాడు. - సభాపర్వము – ద్వితీయాశ్వాసము – 274 వచనము.
వ॥కావున వారల ననుద్యూతంబునఁ బరజితులం గావించి విరళదేశనిర్వాసితులం జేయుట కార్యం
బనిన విని ధృతరాష్ట్రుం డొడంబడి యప్పుడ యనుద్యూతార్థంబు ధర్మనందనుం దోడి తేరం
బ్రాతికామిం బంచినం బితృనియోగంబును విధి నియోగంబు నతిక్రమింప నగునే యని. (274)
5.శత్రునివాసమును ద్వారం నుండి ప్రవేశింపరాదను న్యాయంచేత. - సభాపర్వము – ప్రథమాశ్వాసము 185 వచనము
వ॥ద్వారంబున మిత్రనివాసంబును న ద్వారంబున నమిత్ర నివాసంబును జొచ్చుట యిది
బాహువీర్యసంపన్ను లయినక్షత్రియులకుం గర్తవ్యంబు మఱి గంధమాల్యంబులయందు
లక్ష్మియుండుంగావున బలాత్కారంబునగంధమాల్యంబులు గొంటిమి నీయందుల మాకు
నొండుకార్యంబు గలుగుటం జేసి నీయిచ్చు నర్ఘ్యంబు గొన నొల్ల మనిన జరాసంధుం డి ట్లనియె. (185)
*************************
No comments:
Post a Comment