తెలుగు సుద్దులు…..(142)
కం||వినవలె నె`వ్వరు చెప్పిన;
వినినం`తనె తమక పడక వివరింపవలెన్;
విని కని వివరము దెలసిన
మనుజుడు పో నీతిపరుడు మహిలో వేమా!
భావముః
చిన్న,పెద్ద అనే తారతమ్యము లేకుండా ఎవరు చెప్పినా విషయాన్ని, సలహాను, సూచనలను జాగ్రత్తగా పరిశీలించి, విశ్లేషించుకొని, మంచి,చెడు,
లాభ,నష్టాలు బేరీజు వేసుకొని జాగురూకతతో తొందరపడకుండా
ధర్మబద్ధంగా స్వయం నిర్ణయము తీసుకోవాలి. అటువంటి వాడే ఈ లోకంలో
ధర్మపరుడనబడుతాడు. చెప్పుడుమాటలకు తలఒగ్గికాని, ఒంటరిపోకడతో తొందర్పాటు నిర్ణయాలు తీసుకొనడం తగదని వేమన హితవు పలుకుతున్నారు. ఇదే భావాన్ని తెలుపుతూ కొద్ది పదాల
మార్పుతో సుమతీ శతకంలో కూడా ఇటువంటి పద్యాన్నే మనం చూడవచ్చు. కం||వినదగు నె`వ్వరు చెప్పిన;
వినినం`తనె వేగవడగ వివరింపఁదగున్;
గని కల్ల నిజముఁ దెలసిన
మనుజుండె పో నీతిపరుడు మహిలో సుమతీ!
కొంతమంది శతక పరిష్కర్తలు ఇది ఎవరో వేమన మకుటం చేర్చి వేమనశతకంలో చేర్చారని అన్నా బ్రౌన్ సంకలనములో చేర్చబడినది కనుక వేమన పద్యంగా గ్రహించాలనే వాదనకూడా కన్పిస్తుంది. పద్యభావము ముఖ్యం కాబట్టి ఎవరి పద్యం అన్నది భాషాకోవిదులకు వదిలి, ఇద్దరూ చెప్పారనుకొని మనజీవనానికి ఎంతో అవసరమైనది కనుక మరింత ప్రాధాన్యత ఇద్దాము. ||29-01-2014||
No comments:
Post a Comment