Translate

29 January, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 052 (256 – 260)




ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
 


1. సైంధవుని చంపటానికి వెళ్లే అర్జునుడు ధర్మరాజు రక్షణకు ఎవరిని నియోగించాడు?
2. పద్మ వ్యూహంలో అందరూ చుట్టిముట్టినపుడు అభిమన్యుని విల్లు నరికిన దెవరు?
3. అశ్వత్థామా హతః అని చెప్పమని సలహా ఇచ్చినదెవరు?
4. కవిత్రయం వ్రాసిన భారతభాగాల విభజన ఏమిటి?
5. యుద్ధంలో అర్జునుడు పాశుపతాస్త్రం ఎప్పుడు ఉపయోగించాడు?
------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. సాత్యకిని. ద్రోణపర్వము తృతీయాశ్వాసము 19 వచనము; 20 పద్యము.
|| . తమకు విజయ ప్రదంబులుఁ గౌరవులకు విపరీతంబులు నైన గంధవాహాది నానానిమిత్తంబులను సంధించి యాసవ్యసాచి సాత్యకితో నిట్లనియె. (19)
|| మనకు నిమిత్తము లెంతయు
   ననుకూలము లయ్యె గెలుతు మాహవమున కేఁ
      జనియెదఁ బ్రతిజ్ఞ దీర్పఁగ
   ననఘా ధర్మసుతురక్ష కరుగుము నీవున్. (20)
|| విను సింధురాజవధయును
   మనుజాధిపరక్షణంబు మనకు సరియ కా
      వున నేనొకపని నీ వొక
   పని మేకొని చేయు టరయఁ బాడియ కాదే. (21)

2.
చాటునుండి విల్లునరికి వేశాడు కర్ణుడు. ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము 106 పద్యము
|| అన విని సూతసూనుఁడు భయం బెదఁ గూరినవాఁడపోలె నై
    వెనుక కొదింగి యారధికవీరుపిఱిందికిఁ జుట్టి వచ్చి వం
    చనకు సహాయు లై యచటిసైనికు లన్నరపుత్రు బిట్టు మా
       ర్కొని పెనఁగంగఁ జేరి యలఘుప్రదరంబున విల్లు ద్రుంచినన్. (106)

3. కృష్ణుడు. ద్రోణపర్వము పంచమాశ్వాసము 304 వచనము & 305 పద్యము
|| ఎవ్వరికేని నిలువరింప నలవిగాదు నరుండును ధర్మపరుండై యూరకున్న వాఁడు తెగువకుఁ జొరం డనుచుఁ దలంకిరి వారి తెఱంగు కనుంగొని కమలనాభుండు తమతేరు వారలకడకుం గొని పోయి కిరీటితో ని ట్లనియె. (304)
|| అనిమొన దేవదానవుల కైనను గెల్వ నశక్య మిమ్మాహా
    త్ముని నొకమందు చెప్పెద సుతున్ హతుఁడయ్యె ననంగ విన్నయం
    తన యితఁ డాయుధంబు దిగఁ ద్రావి యచేష్టతఁ బొందు నప్పు డీ
    తనిఁ బరిమార్ప వచ్చు నిది తప్ప నుపాయము కల్గ దెమ్మెయిన్. (305)

4. 1) నన్నయ ఆది, సభా పర్వాలు; ఆరణ్యపర్వములో చతుర్థాశ్వాసము, 142 పద్యము వరకు
 2)
ఎఱ్ఱన ఆరణ్యపర్వ శేషము
   3) తిక్కన విరాటపర్వము మొదలు స్వర్గారోహణపర్వము వరకు

5. సైంధవుని తల వృద్ధక్షత్రుని తొడపై పడగొట్టడానికి. ద్రోణపర్వము చతుర్థాశ్వాసము 328&330 వచనములు;329 పద్యము
|| వినుము వృద్ధక్షత్రుండనుసింధుదేశాధీశుండు సంతానకరణతపోవిశేషంబున నీ జయద్రథుం బడసె నితండు  కుమారుం డై వర్తిల్లుసమయంబున నొక్కనాఁ డశరీరవాణి వీఁడు సంగ్రామంబున నేమఱి తలదునుమం బడు నని యాదేశించిన నతం డెల్లవారును విన వీనిమస్తకంబు మహిం బడ నెవ్వఁ డేసె వానిశిరంబు శకలశతం బయ్యెడు మని తనతపంబుబలిమిం బలికి యతనిఁ బట్టంబు కట్టి వనంబునకు నియతుం డై యరిగె నట్లు కావున. (328)
|| ఈతల పుడమిం బడ నీ
    కాతనితొడమీఁద వైచునది యాపని వి
    ఖ్యాతం బగుపాశుపతము
    చేతన యగుఁ గాక యొంటఁ జెల్లునె మనకున్. (329)
|| వృద్ధక్షత్రుండు శమంతపంచకసమీపంబున నుండు నీ వమ్మహీయాస్త్రంబు నాశ్రయింపు మనవుడు నర్జునుం డట్లకాక యని భక్తియుక్తంబుగా నియతమతిం దత్ప్రయోగం బాచరించిన నద్దివ్యసాధనంబు సాయకపరంపరాకారం బయి యాశిరం బట గొని చని తదాశ్రమద్వారంబు చొచ్చునప్పు డజ్జనపతి జపయుక్తుండై యుండ నమ్మహాస్త్రంబుమాహత్మ్యంబున నమ్మస్తకం బతనితొడ మీఁదఁ బడిన నతండు తదీయస్పర్శనంబున నెఱింగి దిగ్గన లేచుచుం ద్రోచిన నది భూతలపతితం బగుటయు. (330)

***********************************************************************************************

No comments:

Post a Comment