తెలుగు సుద్దులు…..(1౩౦)
ఆ.వె||పాల గలయు నీరు పాలెయై రాజిల్లు,
నదియు సాంబ యోగ్యమై`న యట్లు
సాధు సజ్జనముల సాంగత్యముల చేత,
మూఢజనుడు ముక్తి మొనయు వేమా!.
భావముః
పాలతో కలసిన నీరు పాలలాగా విలువపొందుతుంది, అంతేకాకుండా ఆ పాలు పరమేశ్వరుని అభిషేకానికి వాడినపుడు ఆనీరుకూడా పరమేశ్వరార్పితమవుతుంది. అలాగే మూఢుడు (లోకజ్ఞానము లేదా పరమేశ్వరుని గురించి తెలియనివాడు కూడా) సాధువుల, సజ్జనుల సాంగత్యము (సహవాసము, కూడిక) వలన అతనూ విజ్ఞత పొంది చివరకు ముక్తి మార్గము చేరుటకు పూనిక పూనుతాడు. ఇందులో సత్ సంగముల యొక్క విశిష్టతను వేమన తెలియపర్చుతూ సామాన్య జనులను ఎల్లప్పుడు సజ్జనులతోను, ధార్మికులతోను, సాధువులతోను సహవాసము చేయవలసినదిగా హితవు పలుకుతున్నారు.
ఇదే
పాలు, నీరు ఉదాహరణలుగా తీసుకొని సుమతీ శతకకారుడు మరియొక పద్యం చెప్పారు…
క॥పాలను గలిసిన జలమును
బాల విధంబుననె నుండుఁ బరికింపంగా
బలచవిఁ బెఱచు గావునఁ
బాలసుఁ డగువాని పొందు వలదుర సుమతీ!
పాలలాంటి మంచివారిని, నీరులాంటి మూర్ఖులతో కలువద్దని బోధిస్తారు. పాలుతో నీరు కలిపినపుడు నీరు పాలరుచిని (నాణ్యతను) పాడుచేయటము మనకు తెలిసినదేకదా!
కనుక సత్సంగములలో ప్రతి ఒక్కరూ జాగురూకతతో మెలుగుతూ ఉండాలి. ||03-01-2015||
No comments:
Post a Comment