Translate

14 January, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 046 (226 – 230)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|


దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]

1. ఉత్తర గోగ్రహణ సమయంలో యుద్ధం చివర అర్జునుడు వెళ్ళివస్తానని దుర్యోధనునితో ఎట్లా చెప్పాడు?
2. అశక్త దుర్జనత్వానికి భారతంలో ఒక ఘట్టం తార్కాణం. ఘట్టం ఏది? దుర్జనుడెవరు?
3. నడవడి కొప్పుసేయు ఏవి?
4. చిత్తశాంతికి మార్గమేమిటని విదురుడు చెప్పాడు?
5. కిరీటి అనే పేరు అర్జునునకు ఎలా వచ్చింది?
---------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. అతని కిరీటంలోంచి మణులు రాలగొట్టి. విరాటపర్వము పంచమాశ్వాసము 221 వచనము.
|| కిరీటి శంఖరవజ్యానాదంబులు సెలంగఁ గొండొకదవ్వు వెన్నడిం దఱిమి బిరుదులతోడిగొడుగులును  వడియాలంబులతోడిసిడంబులను వైపించుకొని తృప్తిం బొంది మరలువాఁడై యెల్లవారును వినం బెద్దయెలుంగునం బోయి వచ్చెద నని చెప్పి గాంగేయద్రోణకృపాచార్యులకుఁ బ్రణామబాణంబు లేసి వారి వీడ్కొనినవాఁడై మిట్టకోలల రారాజుమకుటంబుమణులు డులిచి యతని కిం జెప్పినవాడై యఖర్వబాహాగర్వనిర్వహణంబు మెఱయ నప్పుడు మధ్యం దినమార్తాండప్రపంచండుం డగుచుండఁ గౌరవవీరు లతనిం దేఱి చూడనుం జాలక చని రతండును జూపఱం దోలి నిలిచిన మదపుటేనుంగుచందంబున నిలిచి విరాతయున కి ట్లనియె. (221)

2. కృష్ణుని రాయబారం సందర్భంలో దుర్యోధనుడు కృష్ణుని బంధించాలని ప్రయత్నించడం. దుర్జనుడు -
        దుర్యధనుడు. - ఉద్యోగపర్వము తృతీయాశ్వాసము 396 పద్యము
|| అదె కౌరవ్యు లశక్తదుర్జనత సేయం బూని పైఁ బాఱ జూ
     చెద రమ్మై దమచేతఁ దీఱునె జయశ్రీకాంతు దైత్యాంతకుం
     బొదువం దారు దలంచు టెల్ల ననలంబుం జీర బంధింపఁగా
     మది నూహించినయట్ల కాక తమదుర్మంత్రంబులం బోవునే. (396)

3.  1) తగిన వేషము 2) తనను తాను పొగడుకోక పోవడం 3) తాను బాధపడినా కీడు మాట్లాడక
      పోవడం 4) ఇచ్చిన తరువాత బాధ పడకపోవడం    5) తనకెంత గతిలేకపోయినా సన్మార్గం
      విడవక పోవడం - ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము 45 పద్యము
తే|| తగినవేషంబు దనుఁదానపోగడుకొనమి
    నొచ్చియును గీడువలుకమి యిచ్చివగవ
    కునకి దనకెంత నడవకయున్నఁ బథము
    దప్ప కుండుట నడవడి కొప్పు సేయు. (45)

4. 1) నియతమైన తపస్సు 2) ఇంద్రియ నిగ్రహము 3) భూరివిద్య 4) అన్నిటినీ మించి లోభం విడవడం
     -
ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము 84 పద్యము
తే|| నియతతపమును నింద్రియనిగ్రహంబు
    భూరివిద్యయు శాంతికిఁ గారణములు
    వానియన్నింటికంటె మేలైనశాంతి
    కారణము లోభ ముడుగుట కౌరవేంద్ర. (84)

5. ఇంద్రుడిచ్చిన కిరీటం తలపై కలవాడు. - విరాటపర్వము చతుర్థాశ్వాసము 143 పద్యము

|| రవి యుదయించునట్లు సమరంబున నాతలమీఁదఁ గాంతిమూ
    ర్తి వెలుఁగు నింద్రుఁ డిచ్చినకిరీట మభేద్యమహోగ్రసుస్థిర
    త్వవిభవరూఢిమై జనులు దానన నన్నుఁ గిరీటినామసం
    స్తవనవి శేషపాత్రముగ సమ్మతిఁ జేసిరి మాత్స్యనందనా. (143)

********************************************************************************************
 

No comments:

Post a Comment