Translate

02 November, 2014

తెలుగు సుద్దులు - వేమన పద్యములు(తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి) -మొదటి సంపుటి- 001-101

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి)
తెలుగు సుద్దులు…..(1)

‘తెలుగులో సుద్దులు’సామాన్య (పామర) జనులకు నీతిశతకాల రూపంలో అందివ్వబడ్డాయన్నది మనందరికి తెలిసిన విషయమే. తెలుగులో బహుల ప్రాచుర్యము పొందిన నీతిశతకాలలో ‘వేమనశతకము’ ఒకటి. ఇది సుమారు మూడు శతాబ్దాలకు పూర్వము నాటి ఆచార, వ్యవహారాలు,పరిస్థితుల ననుసరించి వ్రాసినది కనుక కొన్ని పద్యాలు అప్రస్తుతముగా అనిపించవచ్చు. మనం కొని చదివే చిన్నపుస్తకాలలో 108-125 దాకా ఉంటుంటుంటాయి. కాని, తిరుమల తిరుపతి దేవస్థానము వారు 1992లో ప్రచురించిన “వేమన పద్యాలు –సి.పి.బ్రౌన్ 1839 నాటి సంకలనం”ప్రకారము మొత్తం 1171 పద్యాలు.అవి –నీతి (Moral), మతపరమైన/ఆధ్యాత్మికం (Religious) వ్యంగం (Satirical) కి సంబంధించినవిగా మూడు భాగాలుగా విభజింపబడ్డాయి. వేమన పద్యాలలో, సింహభాగము ఆటవెలదులుగా; మనకు సుపరిచతమైన “విశ్వదాభిరామ వినురవేమా!” మకుటంతోపాటు కొన్ని పద్యాలు “వేమ” మకుటంతో కూడా ఉన్నట్లు ఈ సంకలనములో తెలుపబడినది.
కవి స్తుతి (ప్రార్ధనా) పద్యం
క|| శివ కవులకు, నవ కవులకు,
శివ భక్తికి, తత్త్వమునకుఁ, జింతామణికిన్,
శివ లోక ప్రమథులకును,
శివునకు, గురువునకును శరణు సేయర వేమా!
భావము:
వేదకాలము (ఆది)కవులకు, నవీన కవులకు (తన సమకాలికులకు), శివభక్తికి, మూలాధారమునకు (పరమాత్మకు), సకల కోరికలను తీర్చునటువంటి దివ్యమణైన చింతామణికి, శివలోక గణములకు ( కైలాసంలోని శివ భటులుకు), పరమేశ్వరునకు, గురువునకు (అభిరామయ్యకు) నమస్కారము. వారిని వేమన తన పద్యరచన సవ్యంగ సాగేటట్లు అనుగ్రహించమని సవినయంగా విన్నవించుకోవడం జరిగినది. వేమనశివ భక్తి కూడా ప్రస్ఫుటమవుతున్నది. దీనిని బట్టి మనం గ్రహించవలసినది ఏదైనా బృహత్తర కార్యక్రమము/పని ప్రారంభించేటప్పుడు పెద్దల, శ్రేయోభిలాషుల, దైవముయొక్క, గురువుయొక్క ఆశిస్సులు అర్ధించాలి/తీసుకోవాలని తెలియజెప్పటం జరిగినది.  ll 21-04-2014 ll


తెలుగు సుద్దులు….(2)

ఆ.వె|| ఆత్మ శుద్ధిలేని యాచార మదియేల?
భాండశుద్ధిలేని పాకమేల?
చిత్తశుద్ధిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమా!
భావముః
సర్వత్రా ఒప్పిదమైన (అందమైన) ఈ వేమన పలుకు వినండి. ఆత్మ శుద్ధిలేని ఆచరణ, నడత, మడి ఎందుకు? పాత్ర శుద్ధి (పరిశుభ్రత) లేని వంట ఎందుకు? చిత్తశుద్ధి (ఏకాగ్రత) లేని శివ పూజలు ఎందుకు?
ఎంత రుచికరమైన వంటకమైనా అది వండిన లేక ఉంచిన పాత్ర పరిశుభ్రంగా లేకపోతే ( పూర్వము ఎక్కువగా కళాయి పోసిన ఇత్తడిగిన్నెలలో (గుండిగలలో) వంటకము చేసేవారు – ఆ కళాయి సరిగాలేకపోతే, లేక సరిగ కడగకపోతే, చిలుము పట్టితే) ఆహార పదార్ధము విషపూరితమయి ఎలా వ్యర్ధము, ప్రమాద భరితమవుతుందో ( food poisoning) అలాగే అంతః పరిశుభ్రత (మనస్సులో కల్మషము, పాపపు ఆలోచనలు, కోరికలు, పరుల మీద కక్షలు మొదలైనవి లేకుండుట) లేని నడత, ఆచరణము, మడి; ఏకాగ్రత, నిష్ఠ లేని ఆడంబరపు పూజలు, వ్రతాలు, యజ్ఞాలు వలన ఉపయోగమేమి లేదు; అవి సత్ఫలితాలని ఇవ్వవని అందరికీ తెలిసిన చక్కటి ఉపమానం ద్వారా వేమన మనకు జ్ఞానబోధ, హెచ్చరిక చేస్తున్నాడు.
‘శివపూజలు’అనే పదం అతని శివభక్తి తెలుపుతున్నది. ‘శివ’అంటే సంస్కృతంలో నక్క అనే అర్ధం కూడా ఉంది కనుక ‘నక్క వినయాలు లాగా’ చిత్త శుద్ధిలేని దొంగ పూజలు వలన ఉపయోగం లేదు సుమా అని చురకంటించారు. ll 23-04-2014 ll


తెలుగు సుద్దులు…..(3)

ఆ.వె|| నిక్కమైన మంచినీల మొక్కటిచాలుఁ
దళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల
చదువ పద్యమరయ జాలదా యొకటై న?
విశ్వదాభిరామ వినుర వేమా!
భావముః
దేనికైనా ‘రాసి’(శి) కన్నా ‘వాసి’ ముఖ్యం అన్నది ఈ పద్యం చెప్పుతున్నది.
నిజమైన, స్వచ్ఛమైన నీలమణి (Sapphire)-[మలయప్పస్వామి-శ్రీ వేంకటేశ్వరస్వావారి ఉత్సవమూర్తి కంఠాభరణంగా మనం చూడవచ్చు] ఒకటున్నా చాలు; రంగురాళ్ళు (కృత్రిమ రత్నాలు) తట్టెడు (బుట్టెడు) ఉన్నా విలువేముంటుంది. అలాగే అర్ధవంతమైన పద్యము ఒకటి చదివినా చాలు; అర్ధం పర్ధం లేని, ఉపయోగంలేని ఎన్ని పద్యాలు (తట్టెడు) చదివినా ఉపయోగం ఉండదు.
చదివినది ఒకటైనా (స్వల్పమైనా ) దానిని (వాటిని) పూర్తిగా అర్ధంచేసుకొంటూ, అవగాహనచేసుకొని; అందులోని మంచిని గ్రహించి, ఆచరిస్తూ, ఇతరులకు ఉపయుక్తంగ ఉండేటట్లు ప్రయత్నిస్తే రత్నంలా ప్రకాశింపవచ్చు, ఇతరులకు జ్ఞాన జ్యోతిని అందించవచ్చు.  ll 24-04-2014 ll

తెలుగు సుద్దులు…..(4)
ఆ.వె|| నిన్ను జూచె నే`ని తన్ను తా మరచును;
తన్ను జూచె నే`ని నిన్ను మరచు;
నే`విధమున జనుడు నెరుగు నిన్నును దన్ను?
విశ్వదాభిరామ వినుర వేమా!
భావముః
నిన్ను (భగవంతుని) కనుగొంటే ( సంపూర్ణంగాసమర్పించుకుంటే) తనని తాను మర్చిపోతాడు (అహం –నేను అనేది గుర్తుండదు); కాని, తనగురించి మాత్రమే ఆలోచిస్తూ మొహం (తాపత్రయం) లోనుండి బయటపడలేకపోతే (అహం - నేను అనేది విడువలేకపోతే) నీ మీద దృష్టి పెట్టి నిన్ను దర్శించలేడు. పరమేశ్వరా! ఈ మానవుడు ఏలాగా తన్ను-నిన్ను సమన్వయము చేసుకొంటూ నిన్ను దర్శించగలడు (ముక్తి పొందగలడు)? అని ఆ పరమాత్మనే దారి జూపమని వేడుకొంటున్నాడు. దీనివలన వేమన యొక్క మానవ ఉద్ధరణాభిలాష మనం గ్రహించవచ్చు.
పద్యంలోని పదాలు సామాన్యంగా ఉన్నా వాటివెనుక 'భోగి' స్థితి నుండి 'యోగి' స్థికి మారిన వేమన గంభీరమైన జీవిత సత్యాన్ని , మానవునికి తరుణోపాయాన్నిఅంతర్లీనంగ ‘మజ్జిగ చిలికితే కాని వెన్న బయటపడనట్లు’ పొందుపర్చడం మనం గ్రహించవచ్చు.
దీనిని మనం ‘మానవుడు-సమాజం’కి అన్వయించుకుంటే – మానవుడు పూర్తిగా స్వార్ధపరుడైతే సమాజం కనిపించదు; అలాగని పూర్తిగా సమాజ సేవలో మునిగిపోయి తనగురించి/తన బాధ్యతలగురించి మరచిపోతే తన కుటుంబం (సంసారం) అస్తవ్యస్తం కావచ్చు. సమతుల్యత అవసరము.||25-04-2014||


తెలుగు సుద్దులు…..(5)
ఆ.వె|| మురియువా డె`వండు? మురియని దె`వ్వండు?
          పాటుజేసి చూడ బట్ట బయలు;
          సొరది జలఘటమున సూర్యుని చందంబు
          విశ్వదాభిరామ వినర వేమ.
భావముః
నీటికుండలో విలీనమైన (ఇమిడిపోయిన) సూర్యని ప్రతిబింబము ఛాయామాత్రమేనని, అది నిజము కాదని మనము ఎలాగ్రహించాలో అలాగే ఆశపడేవారిని, ఆశపడనివారిని; స్వార్ధముబారిపడినవారిని, స్వార్ధము బారిపడనివారిని; అతిశయించేవారిని (గర్వముపడేవారిని), అతిశయించనివారిని (గర్వముపడనివారిని) కష్టపడి (జాగ్రత్తగా) తెలుసుకోవచ్చు.
ఛాయా – పురుష లక్షణములు గురించి చెప్పారు. అంటే నిజస్వరూపాలు వేరు –ప్రతిబింబించే స్వరూపాలు వేరుగా ఉంటాయి – తస్మాత్ జాగ్రత్తా ! అని మనకు ఒక హెచ్చరిక లాంటిది.

పైది, నాకు తోచిన భావం.

కాని, ఆదిశంకరులు రచించిన “వివేకచూడామణి” లోని ఈ క్రింది శ్లోకం చదివిన తరువాత వేమనకు ప్రేరణ బహుశా ఈ శ్లోకం అయిఉండవచ్చనిపిస్తున్నది.

“చలత్యుపాధౌ ప్రతిబింబలౌల్యమౌపాధికంమూఢధియో నయన్తి|
 స్వబింబ భూతం రవివద్వినిష్క్రియంకర్తాస్మి భోక్తోస్మి హతో2స్మి హేతి|| (507)”

జలం అనే ఉపాధి (ఆధారం, వ్యాజము –means, cause) చంచలంగా (మురియు=కదులు) ఉండటంవల్ల, ఆఉపాధిలో ప్రతిబింబించే సూర్యుని చూచి, మూఢుడు సూర్యుడే చంచలంగా కదులుతున్నాడని అనుకొంటాడు.  అంటే ఉపాధియొక్క చంచలత్వాన్ని బింబ భూతమైన సూర్యునిలోఆరోపిస్తాడు.  అట్లాగే కదలకుండా ఉన్న సూర్యునిలాగానిష్క్రియంగా ఉన్న ఆత్మయందు చిత్తంయొక్క చాంచల్యాన్ని ఆరోపించి ‘నేను కర్తను,నేను భోక్తను, నేను చచ్చితిని’ అని అంటూ ఉంటాడు. (వివేక చూడామణి – వ్యాఖ్యాత- శ్రీ నోరి శ్రీనాథవేంకట సోమయాజులు గారు –పుట 202-203)

దీన్నిబట్టి శరీరము-చిత్తం (ఘటం-జలం) ఆత్మ(సూర్యడు)మధ్య గల తేడాను గురించి తెలుసుకోవడానికి పాటుపడమని ఒక తత్త్వవేత్తగా, వేమన మనకు హితోపదేశము(బోధ)చేస్తున్నాడనిపిస్తున్నది.||26-04-2014||


తెలుగు సుద్దులు…..(6)

ఆ.వె|| గాజు కుప్పెలోన కడగుచు దీపంబు
          యెట్టు లుం`డు జ్ఞానమ`ట్టులుం`డు;
          తెలిసి న`ట్టివారి దేహంబు లం`దుల
          విశ్వదాభిరామ వినర వేమ.
భావముః
గాజుబుడ్డీలో నిలకడగా వెలిగే దీపంలా వివేకవంతునిలోని జ్ఞానము కూడా నిశ్ఛలంగా ఎల్లప్పూడూ ప్రకాశిస్తూ ఉంటుంది, ఇతరులకూ మార్గదర్శకం అవుతుంది. జ్ఞానజ్యోతిని (వెలుగును) పంచుతుంది.

పూర్వము నూనిదీపాలు గాలికి ఆరిపోకుండా నిలకడగా వెలుగుతూ వెలుతురు ప్రసరింపచేయడానికి గాజు బుడ్డీలను వాటికి ఆచ్ఛాదనగా ఉపయోగించేవారు. (కిరోసిన్ బుడ్డి దీపం, లాంతరు మొ||వి .) ఇప్పుడు కూడా వ్రతాలు, పూజలు చేసేటప్పుడు దీపారాధన దీపాలు ఆరిపోకుండా గాజు కుప్పెలు పెట్టుతుంటారు. 

అలాగే మానవునికి వివేకము (తెలిసినట్టివారు) [మంచి-చెడు; ధర్మము-అధర్మము; కామము-నిష్కామము; త్రిగుణ ( సత్త్వ,రజో, తమో ) లక్షణ విచారణ] అనేది గాజు కుప్పెలాగా అతనిలోని జ్ఞాన, విజ్ఞానాలను కామ, లోభ, మద, మాత్సర్యాల నుండి ఒక రక్షణ వలయముగా కాపాడుతుంటుంది. సత్త్వ గుణం స్వచ్ఛమైనదగుటచే కాంతిమంతమును, దోషరహితమును, అయి ఉండును. (తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయమ్|-శ్రీమద్భగవద్గీతా-పదునాల్గవ అధ్యాయము-6శ్లోకం)

దీపం నిలకడగా వెలుగుతున్నా ఈ గాజు బుడ్డీ (కుప్పె) మసకబారితే, పొగకప్పితే మనకు వెలుతురు ఎలా పూర్తిగాలభించదో అలాగే వివేకవంతుని లోని వివేకము కూడా మసకబారితే అతనిలోని జ్ఞాన,విజ్ఞానములు నిష్ప్రయోజనములు, కొండకచో అనర్ధములు కూడా.  

మానవాళి ఉపయోగార్ధం అని ప్రకటిస్తూ కనుగొన్న ఎన్నోవిషయాలు, వస్తువులు, పరిజ్ఞానం మానవ, ప్రకృతి వినాశానికి దారిదీయడం, దోహదపడటం నేడు మనం చూస్తున్నాము కదా!||27-04-2014||


తెలుగు సుద్దులు…..(7)
ఆ.వె|| కల్ల గురుడు గట్టు నె`ల్ల కర్మంబుల;
        మధ్య గురుడు గట్టు మంత్ర చయము;
        ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు
        విశ్వదాభిరామ వినర వేమ.
భావముః
శ్రీవేమనయోగీశ్వరులు గురువిషయమై  ఎంతో గౌరవభావము వ్యక్తపరుస్తూ పద్యాలు చెప్పినా కూడా,  వారు బోధించే పద్ధతిని బట్టి, విషయము బట్టి వారిని మూడు తరగతులుగా విభజించారు.

ఒకరు కర్మ సిద్ధాంతాన్ని, రెండవవారు మంత్రోపదేశాన్ని, మూడవవారు యోగసిద్ధాంతాన్ని బోధిస్తారు.

మొదటి వారు, ధార్మిక, అధార్మిక కర్మలను నిర్వర్తించి, ఐహిక వాంఛలు (మానసిక, శారీరక, ఆర్ధిక మొ.వి ) తీర్చుకొనటానికి/ సాధించుకొనటానికి ఉపయుక్తంగా  (బండికట్టు=బండి ప్రయాణానికి తయారుచేయడం) తయారుచేసే గురువులు కాని గురువులు (వారు ఆత్మ జ్ఞానమునకు సంబంధించిన అజ్ఞాన-చీకటిని పారద్రోలె ఎటువంటి జ్ఞాన- వెలుగును చూపరు కనుక; కోరికలవైపు మరింత దృష్టి మళ్లించి మోహంలో పడద్రోసి ఆత్మజ్ఞానంకు, పరమాత్మకు దూరం చేస్తారుకనుక).

రెండవశ్రేణివారు –మంత్ర చయము- మంత్రోపదేశాలద్వారా  తాత్విక విషయాలు బోధించి తత్వము వైపు మళ్ళడానికి తయారుచేస్తారు. వీరు గుడ్డిలో మెల్ల.

ఉత్తమశ్రేణి గురువులెవరంటే అవిద్య నుంచి, సంసార బంధాల నుంచి విమోచనం కలిగించి నిష్కామయోగసాధన ద్వారా మోక్ష సామ్రాజ్యప్రయాణానికి తయారుచేసేవారు.

గురు త్రయ విభాగం: {గురు త్రయ విభాగం: పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010 - ఆంధ్రభారతి - నిఘంటుశోధన}

"సాధకులకు మూడు విధాలైన గురువులు ఉండవచ్చు. చోదకులు, బోధకులు, మోచకులు అని మూడు విధాలవారు.
'చోదకో బోధకశ్చైవ మోచకశ్చ పరస్మృతః’ అని బ్రహ్మవిద్యోపనిషత్‌ వాక్యం.
చోదకులు అంటే కర్మోపాసన ఎలా చేయాలో చెప్పే ఉపదేష్టలు.
బోధకులు జీవబ్రహ్మైక సిద్ధాంతాన్ని ప్రత్యక్షంగా బోధిస్తారు.
ఇక మోచకులు ‘తాను వేరు, బ్రహ్మ వేరు కాదు’ అనే సత్యా’న్ని బోధించి, అవిద్య నుంచి, సంసార బంధాల నుంచి విమోచనం కలిగిస్తారు.
చోదక బోధక గురువులు పరోక్ష జ్ఞాన (ఇతరుల నుంచి తెలుసుకున్న జ్ఞానం ) సంపన్నులైనా కావచ్చు, అపరోక్ష జ్ఞానం  (స్వానుభవంతో సంపాదించు కున్న బ్రహ్మజ్ఞానం)  కలిగిన వారైనా కావచ్చు. కాని, మోచక గురువులు మాత్రం అపరోక్ష జ్ఞానులై ఉంటారు."  ||28-04-2014||


తెలుగు సుద్దులు…..(8)

ఆ.వె|| పెట్టి పొయ్యలేని వట్టి నరులు భూమి
        పుట్టనే`మి? వారు గిట్టనే`మి?       
        పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా?   
        విశ్వదాభిరామ వినర వేమ.   
భావముః
ఇతరులకు సాయంచేయని, పెట్టిపోతలు గురించి తెలియని, దానం, ధర్మం గురించి ఆలోచించని మనుషులు పుట్టటం(ఉండటం) వలన ఎటువంటి ఉపయోగం లేదు; అట్టి వారు చచ్చినా నష్టమేమి లేదు. వేమన దృష్టిలో వారి జీవితాలు పుట్టలు పెట్టి కుప్పలు తెప్పలుగా పుట్టి, చచ్చే చెదపురుగుల వలె వ్యర్ధ్యం.

కటువుగా అనిపించినా, ఈ పద్యం మనకు పరోపకారం/దానం యొక్క విశిష్టత/ప్రాధాన్యత తెలుపుతున్నది. ||29-04-2014||


తెలుగు సుద్దులు…..(9)
ఆ.వె|| తాము గన్నవారు దము గన్నవారును
చచ్చు టె`ల్ల తమకు సాక్షి గాదె?
బ్రతుకు టె`ల్ల తమకు బ్రహ్మకల్పంబులా?
విశ్వదాభిరామ వినర వేమ.
భావముః
తమ శరీరము, సంపదా శాశ్వతమని మోహంలొ పడి; తాము కన్న తమ పిల్లలు, తమని కన్న తమ తల్లిదండ్రులు వారి, వారి ఆయుష్షుతీరగానే తమముందరే చనిపోవటం చూస్తున్నా, తాము శాశ్వతంగా ఉంటామను [కల్పము (బ్రహ్మ గారి దినము) లతరబడి – ప్రళయం వరకు] కోవటమేమిటి? అమాయకంలో పడటం కాక? మోహము వీడి, “జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం”- పుట్టిన దెల్లను గిట్టక మానదు – “పుట్టుట గిట్టుట కొరకే” అనే సత్యాన్ని గ్రహించి, యోగిగా జీవించమని, మరో జీవనప్రయాణానికి సిద్ధమవమని బోధిస్తున్నారు.||30-04-2014||

తెలుగు సుద్దులు…..(10)
 ఆ.వె|| కూటికి నె`డబాసి కూర్చిన మనుజుడు;
          వెలదుల గనుగొన్న వెతల జిక్కు;
          చెలగి యగ్ని చూచు శలభంబు చాడ్పున   
          విశ్వదాభిరామ వినర వేమ.

భావముః
తిండి లేక దానిగురించేఆలోచిస్తున్న వానికి (బీదవానికి) అందమైనస్త్రీల (విలాసవంతులు) మీద దృష్టి పడితే,వెలుగు చిమ్ముతూ మండుతున్న అగ్నిని చూసి ఆశబడి దగ్గరకు వచ్చి అందులోపడి మాడిపోయె (కాలిపోయె) మిడుత లాగా కష్టాలలోచిక్కుకుంటాడు.

అందని ద్రాక్షపండ్లకు ఆశ పడకూడదు అనేది ఒకటి; రెండవది, తినడానికే స్థోమతలేనివాడు విలాసవంతుల గురించి కూడా ఆలోచించడం మొదలుపెడితే అతను అధర్మకార్యాలు చేయడానికి కూడా వెనుకాడక, మిడుత్లాగా ఆకర్షితుడై చిక్కుల్లో పడ్డానికి అవకాశం ఉన్నది కనుక, జాగ్రత్త సుమా! అని వేమన హెచ్చరిస్తున్నారు. ||01-05-2014||

తెలుగు సుద్దులు…..(11)
ఆ.వె|| ఎరుక మాలు వాడు యే మే`మి చదివిన;
         చదివి నం`త సేపు సద్గుణి యగు;
         కదసి తామరందు కప్ప గూర్ఛుండదా
         విశ్వదాభిరామ వినర వేమ.
భావముః
తెలివిలేనివాడు, సోమరి, చెడ్దవాడు ఎన్ని చదివినా అవి వానిలో పూర్తిగా మార్పుతేలేవు; ఆ చదివినంతవరకు మంచివాడిగా ఉండవచ్చు. బురదనీటిలో జీవించే కప్ప కష్టపడి కాసేపు నిర్మలమైన తామరాకు మీద ఎక్కి కూర్చున్నా, అది అక్కడే ఉండలేదుకదా? వెంటనే బురదనీటిలోకి దూకేస్తుంది. అలాగే వీరు తరువాత తమ సహజ లక్షణాలను విడువలేరు.
ప్రస్తుత పరిస్థితులకు అన్వయించుకొంటే – మనం ఎన్ని సత్సంగాలకు వెళ్లినా, ప్రవచనాలు విన్నా, ఆధ్యాత్మిక పుస్తకాలు చదివినా, వీడియోలు చూసినా మన అంతరంగ లక్షణాన్ని, మన దుర్వ్యాపారాలను శుభ్రపర్చుకోనిది, మార్చుకోనిది ఎటువంటి ఉపయోగం లేదు. ఆ కాసేపు మంచిగా ఉండాలనిపించవచ్చు. ప్రసవ, శ్మశాన వైరాగ్యాల లాగా.. ||02-05-2014||

తెలుగు సుద్దులు…..(12)
 ఆ.వె|| కసువు బసికి జేసె గాలి ఫణికి జేసె;
          మన్నె`రలకు జేసె మరవకె`ట్లు;
          కుంభిని జనులకును కూడ`ట్లు చేసెరా?         
          విశ్వదాభిరామ వినర వేమ.
భావముః
ఆవు (పశువు) కు గడ్డి, పాముకు గాలి, (ఎర(ఱ)లకు) వానపాములకు మట్టి (మన్ను), కోడికి అలాగే మనుషులకు భూమిని నుండి ఆహారము (తిండి, కూడు) పొందేఎర్పాటు ఆ సృష్టికర్త చేసాడు. 

మిగతావాటికి సహజసిద్ధంగా ఆహారము పొందే ఎర్పాటు చేసి, రెండు కాళ్ల కోడికి భూమినుండి వెతుక్కొని (పురుగులు, గింజలు)తినే ఏర్పాటు చేసి, రెండుకాళ్లతోపాటు రెండు చేతులిచ్చిన మనిషికి భూమినుండి పండించి, పెంచి ఆహారము పొందే ఏర్పాటు చేయడం గమనించి మానవుడు “కష్టేఫలి”అన్నది గ్రహించి ప్రవర్తించాలి.

అంతేకాకుండా పశువువలె గడ్డితిని నెమరువేసుకొన్నట్లు, గతంలోని చెత్త (కసువు) విషయాలను నెమరువేసుకుంటూ కూర్చోకుండా, పాము వలె తుస్సూ, బుస్సూ అంటూ బుసలు కొట్టకుండా(రజోగుణం నియత్రించుకుంటూ), మన్నుతిన్నపామువలె మత్తుగా ఉండకుండా (తమోగుణం నియత్రించుకుంటూ) ఇష్టమైన ఆహారాన్ని వెదుకుకుంటూ కష్టపడే కోడివలే ఈ భూమిమీద మానవుడుకూడా జీవనం తెలివిగా సాగించాలని సర్వేశ్వరుడు పొందుపర్చాడు. ||03-05-2014||
* ఈ పద్యము యొక్క అంతర్గతభావమును నేను సంత్రుప్తిగా వివరించలేకపోతున్నాను కనుక పండితులు, కవిమిత్రులు సరిదిద్దగలరని ప్రార్ధన __/\__


తెలుగు సుద్దులు…..(13)
ఆ.వె|| ఎవ్వరి గుణములును యేమ`న్న మానవు;
        చక్క జేయరాదు కుక్కతోక;
        గడుసురాలు మగని గంప బెట్ట`మ్మురా    
        విశ్వదాభిరామ వినర వేమ.   
భావముః
కుక్కతోకవంకను ఎన్నివిధాలుగా ప్రయత్నించినా ఎలాసరిచేయలేమో అలాగే ఎవ్వరి (వారి, వారి) సహజగుణములను మనమేమి బోధించినా, చెప్పినా ఏమాత్రమూ మారవు, మనము మార్చలేము; గడుసుదనముకల (తనకేదికావాలో, ఎలా సంపాదించుకోవాలో తెలిసిన) స్త్రీ – మాయలమారి – దుష్టురాలు భర్తను సైతం గంప(బుట్ట) లో పెట్టి అమ్మడానికి సైతంవెనుకాడదు.

మరి ఈ శతకాలు, ప్రవచనాలు, మన వేద వాజ్ఞ్మయాలు, నేటి మానవ వికాస బోధనలు అన్నీ ఎందుకు? అని అనిపించవచ్చు. కాని, ఎన్ని బోధించినా, చెప్పినా ప్రవర్తన మారని కొద్ది మంది ఉండడానికి అవకాశముంది కనుక, వారిని సైతము గుర్తించి జాగ్రత్తగా మసలుకోవలసినదిగా వేమన హెచ్చరిస్తున్నారు.  అందుకే రెండవ ఉదాహరణలో అతి దుష్టత్వ గుణమును ఉదహరించడానికి, అరుదుగా జరుగడానికి అవకాశం ఉన్న; వేమన స్త్రీలను ఇంతగా కించపరుస్తున్నారేమిటనిపిస్తున్న ఉదాహరణమును వాడారేమో!!! ||04-05-2014||


తెలుగు సుద్దులు…..(14)
ఆ.వె|| వేరుపురుగు చేరి వృక్షంబు జెరుచును;
          చీడపురుగు చేరి చెట్టు జెరుచు;
          కుత్సితుండు చేరి గుణవంతు జెరుచురా         
          విశ్వదాభిరామ వినర వేమ. 
భావముః
దుష్టులు (చెడ్డవారు, నీచులు) మంచివారిని (గుణవంతులను, బుద్ధిమంతులను) చేరి (స్నేహము చేసి), వేరు పురుగు (వేరును పట్టి చెట్టును నాశనం చేసేపురుగు) ఎంత పెద్దచెట్టు నైనా జీవంలేకుండాచేసి మ్రోడు (మోడు)గా మార్చినట్లు; చీడపురుగు (పైరులను నాశనంచేసే పురుగు) చెట్లను ఎండిపోయేటట్లు చేసి పనికిరాకుండాచేసినట్లు మంచివారిని పూర్తిగా పాడుచేస్తారు. కనుక, మంచివారు అప్రమత్తతో మెలిగి‘దుష్టులకు దూరంగా ఉండమని’వేమన హెచ్చరిస్తున్నారు. 

ఇక్కడ రెండు ఉదాహరణలు ఇవ్వటం – చీడపురుగు, వేరుపురుగు –వాటి యొక్క తీవ్రత (చెడు ప్రభావం) ద్వారా దుష్టుల యొక్క దుష్టత్వం తెలపడానికి; రెండవది వేరు పురుగు ఎలా చెట్టుకు మూలాధారమైన వేరును ఎలా నిర్జీవం చేస్తుందో అలాగే కుత్సితుడు మంచివారి అంతరంగాన్ని (మనస్సును) కలుషితం చేస్తే మానవత్వం నశిస్తుంది, తద్వారా విపరీత అనర్ధాలు జరుగుతాయి అని కూడా మనకు తెలియచెప్పుతున్నదీ పద్యం.

చెట్టు బలహినంగా ఉంటే ఎలా చీడ, పీడలు తేలికగా పట్టి పీడిస్తాయో అలాగే ఏమాత్రం బలహీనతలున్నా, ముఖ్యంగా పిల్లలు, యువత దుష్టుల బారినపడితే మంచివారు సైతం త్వరగా చెడ్డవారుగా  మారడానికి అవకాశం ఉన్నది కనుక బలహీనతలకు, దుష్టులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ||05-05-2014||

తెలుగు సుద్దులు…..(15)
ఆ.వె|| ఉప్పు కప్పురంబు నొ`క్క పోలికె నుం`డు
          చూడ జూడ రుచుల జాడ వేరు;         
          పురుషులందు పుణ్య పురుషులు వేరయా        
          విశ్వదాభిరామ వినర వేమ.  
భావముః
మనకు చూడటానికి ఉప్పు, కర్పూరము తెల్లగా ఒకేలాగా కన్పించవచ్చు.  కాని, వాటి పదార్ధ గుణాలను పరిశీలించితే,కర్పూరము తనదైన విశిష్టమైన పరిమళం వెదజల్లుచూ, వెలిగించినప్పుడు మండి దివ్యమైన వెలుగును ఇచ్చే ప్రత్యేకత కల్గిఉంటుంది. అలాగే మానవులలో (పురుష పదాన్ని స్త్రీ, పురుష ఉభయులకు అన్వయించుకొని) పుణ్యాతులు, ధార్మికులు, యోగీశ్వరులు, సద్గురువులు కర్పూరము  వలే వారు మిగతావారి కన్నా విశిష్టంగా ఉంటారు సుమా అని వేమన మనకు తెలియజెప్పుతున్నారు.

కర్పూరము మనము భగవంతునికి హారతికి ఉపయోగిస్తాము;అంతేకాని తెల్లగా ఉన్నదికదా  అని ఉప్పును కర్పూరముకి ప్రత్యామ్నాయంగా వాడముకదా? అంతే కాకుండా కర్పూరముకి కొన్ని ఔషధ గుణాలుకూడా ప్రత్యేకంగా ఉన్నాయికదా? అలాగే పుణ్యాతులు, ధార్మికులు, యోగీశ్వరులు, సద్గురువులు కర్పూరము  వలే వారు మిగతావారి కన్నా విశిష్టంగా ఉండి మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ, మన మానసిక రుగ్మతలకు, మన ఆలోచనలకు పట్టే చీడ, పీడలకు ఔషధంలాగా పనిచేస్తూ మనలని సన్మార్గంలో నడుపుతారు.

కనుక, పైపై వేషభాషలకు మోసపోయి నకిలీల బారిన పడకుండా అట్టివారిని గుర్తించి జాగ్రత్తగా మసలుకోమని వేమన హెచ్చరిస్తునారు.  ||06-05-2014||

తెలుగు సుద్దులు…..(16)
ఆ.వె|| జీవి పోక ముందె జీవ వస్తువులి`చ్చి
        జీవి నిలుప వలయు జీవనముగ;
        జీవి తొలగు వెనక జీవ వస్తువులే`ల?
        విశ్వదాభిరామ వినర వేమ.
భావముః
మనిషికి ప్రాణము పోకముందే ఇవ్వవలసిన మందులు లేదా కావలసిన జీవనాధారములు కల్పించి (ఇచ్చి) మనిషి బ్రతికి జీవించేటట్లు చేయాలికాని మనిషి ప్రాణము పోయిన తరువాత ఎన్ని ఇచ్చినా, అతనికొరకు ఎన్ని చేసినా వ్యర్ధము; చనిపోయిన జీవిని తిరిగి తీసుకొని రాలేము కదా? అని వేమన అందరిని తమ,తమ కర్తవ్యాన్ని గుర్తెరిగి మసలు కోమని బోధిస్తున్నారు.

చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నా ఉపయోగం ఉండదు కదా అలాగే ఎప్పుడు చేయవలసిన పనిని అప్పుడు చేసినట్లైతేనే దాని వలన సార్ధకత, ఫలితం ఉంటుందని కూడా మనం గ్రహించవలసి ఉంటుంది.

నేడు మనము తరచూ వింటున్న ప్రమాదాల తరువాత, ఆకలి చావుల తరువాత, పంటల, చేనేత ఋణాలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకొంటున్నవారికి ప్రభుత్వములవారి కంటితుడుపు ధనవితరణ (Ex-gratia) గురించి యోగివేమన ముందుచూపుతో చెప్పారేమో!!! ||07-05-2014||

తెలుగు సుద్దులు…..(17)
ఆ.వె|| *కల్ల నిజము రెండు కరకంఠు డె`రుగును;
          నీరు పల్ల మెరుగు నిజముగాను;   
         *తనయుని జననంబు తల్లి దా నె`రుగును
          విశ్వదాభిరామ వినర వేమ.   

* కల్ల నిజములె`ల్ల గరళకంఠు డె`రుగు
  తల్లితానె`రుగును తనయుని జన్మంబు (పాఠాంతరము)

భావముః
అసత్యము (అబద్ధము) ఏదో, సత్యము (నిజము) ఏదో (ఈ రెండూ) విశ్వ శ్రేయస్సు కొరకు తన కంఠంలో కాలకూట విషాన్ని నిలుపుకున్న ఆ సర్వేశ్వరునికి  తెలుసు. నీటికి పల్లము వైపు పారటము సహజము; అలాగే బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి తన బిడ్డ గురించి ఆమెకు సహజంగా తెలుస్తుంది, ఇంకొకరు చెప్పనవసరం లేదు.

ఎవరికీ తెలీయకుండా రహస్యంగా చేస్తున్నామని అధర్మకార్యాలు చేసేవారి గురించి, బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి తన బిడ్డ గురించి ఎలా పూర్తిగా తెలుసో; నీరు పల్లము వైపు పారటం ఎంత సహజమో అలాగే ఆ పరమేశ్వరుడుకి అధర్మ పరుల గురించి పూర్తిగా తెలుసు. తాత్కాలికంగా తప్పించుకున్నా ఆయన దృష్టి నుండి తప్పించుకోలేరు కనుక ధర్మనిరతితో మెలగమని ఈ పద్యంలో వేమన బోధిస్తున్నారు. ||08-05-2014||

తెలుగు సుద్దులు…..(18)
ఆ.వె|| అంగమె`ల్ల వదలి యటు దంతములునూడి
         తనువు ముదిమిచేత దరుచు వడక;
         ముప్పు తిప్పల బడిమోహంబు విడువడు 
         విశ్వదాభిరామ వినర వేమ.
భావముః
శరీరములోని అవయవాలన్నీ పటుత్వము కోల్పోయి సరిగా పనిచేయలేనిస్థితిలోను, పండ్లు సైతము ఊడిపోయి, ముసలితనము చేత శరీరము జవసత్వాలు కోల్పోయినా (శక్తిలేకపోయినా)మోహము విడువలేక (కోరికలను అదుపులో పెట్టుకోలేక) మానవుడు నానా తిప్పలు (అధిక బాధలు)పడుతుంటాడు.
కనీసము వృద్ధాప్యంలో అన్నాఅశాశ్వతమైన ఈ శరీరము మీద,భౌతిక వాంచల (కోరికల) మీద మోహము వీడి మోక్షసాధనవైపు (యోగసామ్రాజ్యమువైపు) పయనించమనిఒక యోగిగా వేమన మనకు ఉద్భోధ చేస్తున్నారు. ||09-05-2014|


తెలుగు సుద్దులు…..(19)
ఆ.వె|| ఆడువారి గన్న న`ర్థంబు పొడ గన్న;
          సార మై`న రుచుల చవులు గన్న;
          నయ్యగాంళ్లకై`న నా`శలు బుట్టవా? 
          విశ్వదాభిరామ వినర వేమ.
భావముః
స్త్రీలను చూసినా, ధనముచూచినా, మంచి రుచికరమైనపదార్ధముల రుచి చూచినాఎంతో నిష్ఠాగరిష్టులకి సైతము కోరికలు(ఆశ,ప్రలోభాలు) కలుగవా?  కలుగుతాయి - కనుక వాటికి (స్త్రీ వ్యామోహం,ధనాపేక్ష, జిహ్వచాపల్యానికి) సరిఆయిన కట్టడి చేయండిసుమా లేకపోతే, కష్టపడిపొందిన నిష్ఠాగరిష్టత, పూజనీయత (గురుత్వము, పెద్దరికము)
మంటగలిసిపోగలవు సుమా అనివేమన హెచ్చరిస్తున్నారు. వీటి గురించి మనంరోజు వింటున్నాము, చదువుతున్నాము, చూస్తున్నాము కదా! తస్మాత్ జాగ్రత్తా!!!||10-05-2014||


తెలుగు సుద్దులు…..(20)
ఆ.వె|| అనువు గాని చోట న‘ధికుల మ‘నరాదు;
        కొంచె ముండుటెల్ల కొదువ గాదు;
        కొండ యద్ద మందు కొంచమై యుండదా?
        విశ్వదాభిరామ వినర వేమ.
భావముః
మనకు ప్రతికూలమైన చోట (అనుకూలముగాని ప్రదేశంలో), పరిస్థితులలో మనము మన ఆధిక్యతను, గొప్పతనమును, విశిష్ఠతను ప్రదర్శించకూడదు. పరిస్థితులను బట్టి తాత్కాలికముగా ఒదిగి ఉండటం వలన, అద్దములో కొండను చూచినపడు చిన్నదిగా కనిపిస్తున్నా, ఎలాగా అసలు కొండ ఏమాత్రమూ చిన్నదైపోదో అలాగే మనకు నష్టమేమి ఉండదు, మన కీర్తి ప్రతిష్టలకు భంగముండదు. అంటే పరిస్థితులను బట్టి సమయస్ఫూర్తితో ప్రవర్తిస్తే సమస్యలు రావు తద్వారా గౌరవము ఇనుమడిస్తుందే తప్ప తరిగిపోదు అని వేమన దిశానిర్దేశము చేస్తున్నారు. ||11-05-2014||

తెలుగు సుద్దులు…..(21)
ఆ.వె|| తన మది కపటము కలిగిన;
          తన వలెనే కపటముం`డు తగ జీవులకున్        
          తన మది కపటము విడిచిన;
          తన కె`వ్వడు కపటిలేడు ధరలో వేమా!.         
భావముః
తన మనస్సులో కపటముంటే (మోసము, దగా, మాయ, మనసులో ఉండేది ఒకటి బయటకు చెప్పేది ఇంకొకటి) మిగతావారిలో కూడా కపటముందని భావిస్తాడు. రంగద్దాలు వేసుకున్నవాడికి లోకమంతా రంగుల్లో కనిపించినట్లు లేదా కామెర్ల జబ్బు వచ్చినవానికి అంతా పచ్చగా (పసుపు రంగు) ఉన్నట్లు, తనలాగే మిగతావారూ కపటమున్నవారనుకొంటాడు. రంగద్దాలుతీసివేయగానే, అలాగే కామెర్ల జబ్బు తగ్గగానే ఎలా తను చూచేవి మామూలుగ కనిపిస్తాయో అలాగే తన మనస్సులో కపటము లేకుండా చేసుకుంటే ఇక తనకు ఈ భూమి మీద ఎవరూ కపటిగా కనపడరు.  కనుక‘ఇతరులలో మంచి చూడగలగాలంటే ముందు నీలో చెడు తొలగించుకో’అని వేమన చెప్పుతున్నారు. ||12-05-2014||


తెలుగు సుద్దులు…..(22)
ఆ.వె|| చంప దగినయట్టి శత్రుడు తనచేత;
        జిక్కెనే`ని కీడు సేయరాదు
        పొసగ మేలు జేసి పొమ్మ`నుటే చావు(చాలు)
        విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
దొరికితే చంపదగ్గ శతృత్వమున్న శత్రువు తనకు చిక్కినా, తటస్థపడినా అతనికి హాని చేయకుండా తగురీతి మంచిచేసి పొమ్మనటమే ఉత్తమము; అదే అతనికి చావుతో సమానము. అంటే అపకారికి సైతము ఉపకారము చేసె సత్వ గుణము కలిగి ఉండటము వలన మనిషి ఔన్యత్వము పెరగటమే కాకుండా రాగద్వేషాలకు అతీతుడుగా యోగసామ్రాజ్యము వైపు పయనమునకు వీలుకలుగుతుంది కనుక “అపకారికి సైతము ఉపకారము చేయమని” వేమన సూచిస్తున్నారు. ఇదే భావన సుమతీ శతకకారుడూ తన పద్యంలో వ్యక్తపరిచాడు….
క|| ఉపకారికి నుపకారము
      విపరీతముగాదు సేయ వివరింపంగా
      నపకారికి నుపకారము
      నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ !
ఇది ప్రస్తుతము సాధ్యమా? కష్టం కాబట్టే ప్రయత్నించమని మనకి నీతిశతకములలో బోధించబడ్దది. కోపము తద్వారా ద్వేషము, పగ, ప్రతీకారచర్య మొ.వి ఉత్పన్నమవుతాయి కనుక వాటిని నిగ్రహించుకోవడం వలన (వదిలి పెట్టడము వలన) ఆరోగ్యమూ బాగుపడుతుంది కనుక మేలు చేకూరు అని చెప్పియుంటారు.||13-05-2014||

తెలుగు సుద్దులు…..(23)
ఆ.వె|| తామసించి సేయ తగ దె`ట్టి కార్యంబు;
          వేగిరింప న`దియు విషమమ`గును
          పచ్చికాయ దెచ్చి పడ్వేయ ఫలమౌ`నె?                               
          విశ్వదాభిరామ వినరవేమా!.
భావముః        
ఏ పనైనా చేయటం బద్దకించి, అలసత్వముతో, నిర్లక్షముతో ఆలస్యముచేయరాదు; అలాగే కంగారుపడి, తొందరపడి, ఉక్రోషంతో చేసిన పనులూ క్లిష్టమైచెడుతాయి;  సత్ఫలితాలివ్వవు. కంగారుపడి పక్వానికి రాని పచ్చికాయను కోసుకొని వచ్చి పండవలేదని నేలమీద కొట్టితే పండవదుకదా? దానిని సరియైన సమయములో కోసి, సరియైన పద్ధతిలో కాపువేస్తే మధురఫలంగ మారుతుంది. అలాగే  ఏపనైన సరియైన సమయంలో, సరియైన పద్దతిలో చేస్తే మన శ్రమ వృధాకాదు, ఫలితముంటుందని వేమన తెలుపుతున్నారు.(Neither Procrastination-Nor Hastiness) ||14-05-2014||


తెలుగు సుద్దులు…..(24)
ఆ.వె|| నీళ్ల  లోన వోడ నిగిడి తిన్నగ బ్రాకు;
        బైట మూరెడైన బ్రాకలేదు;
        నెలవు దప్పుచోట నేర్పరి కొరగాడు;
        విశ్వదాభిరామ వినర వేమా!.   
భావముః   
నీటిలో ప్రయాణసాధనంగా వాడబడే ఓడ (పడవ,నావ) నీటిలో సునాయాసంగా, సాఫీగా వెల్తుంది (పయనిస్తుంది); అదే ఓడ నీటి బయట నేల మీద మూరెడుకూడా కదలుదు కదా; అలాగే ఎవరైనా తను ఎంతనేర్పరి (తెలివిగలవాడైనా) ఐనా తనకు సంబంధించనిచోట, తనకు అవగాహనలేనిచోట, తనకు తెలియని విషయంలో ఎందుకూపనికిరాడు (ఉపయోగింపడు). తగుదునమ్మాని అన్నిటిలో వ్రేలుపెట్టితే, కల్పించుకొంటే, తలదూరిస్తే అభాసుపాలు కాక తప్పదని వేమన హెచరిస్తున్నారు.  ||15-05-2014||

తెలుగు సుద్దులు…..(25)
ఆ.వె|| నీళ్ల లోన మొసలి నిగిడి యేనుగు బట్టు;
        బైట కుక్కచేత భంగపడును;
        స్థాన బలిమి గాని తన బల్మి కాద`యా!
        విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
నీళ్లలో ఉన్న మొసలి సునాయాసంగ మదగజాన్ని సైతము కాలుపట్టుకొని నీల్లలోకి లాగి హింసించగలదు. అదే మొసలి నీటి బయటకు వస్తే చివరకు కుక్కను కూడా ఏమిచేయలేదు; అది వేగంగ దాడి చేయలేదు కనుక కుక్క చేత కూడా బాధింపబడుతుంది. దీన్ని బట్టి మనము గ్రహించవలసినది, ఒకరి శక్తి వారున్న స్థానాన్ని బట్టికూడా మారుతుంటుంది. కనుక అది గుర్తెరిగి మసలుకోవాలి, లేకపోతే భంగపాటు తప్పదు. మనము పోట్లాటలలోతరచూ వింటుంటాముగదా – “ మావీధికి రా, మా అడ్డాకి రా, మా బస్తీకి రా!!” వగైరా, వగైరా….||16-05-2014||
తెలుగు సుద్దులు…..(26)
ఆ.వె|| కులములో నొకండు గుణవంతు డుం`డెనా
         కులము వెలయు వాని గుణము చేత
         వెలయు వనములోన మలయజంబున్న`ట్లు          
         విశ్వదాభిరామ వినర వేమా!.       
భావముః        
అడవిలో మంచిగంధపు చెట్టు ఒకటున్నా, దాని సుగంధపరిమళముచేత వనమంతా ఎలా గుబాలిస్తుందో, శోభిల్లుతుందో అలాగే వంశములో (కుటుంబంలో) ఒక్క గుణవంతుడు (సత్ప్రవర్తన, సదాచార సంపన్నుడు, ఉత్తముడు) ఉన్నా వానియొక్క ఉత్తమ గుణము (ప్రవర్తన, నడవడిక) చేత ఆ వంశము (కుటుంబము) కీర్తి పొందుతుంది (ప్రసిద్ధిచెందుతుంది). కనుక మంచిగంధపు చెట్టులాగా సద్గుణవంతునిగా వంశానికి, కుటుంబానికి కీర్తి, ప్రతిష్టలు తీసుకొనిరావడనికి ప్రయత్నించమని వేమన కోరుకొంటున్నారు. వేరే పద్యంలో శ్రీరామచంద్రున్ని, దుర్యోధనుని ఉదహరిస్తూ దీనియొక్క ఆవశ్యకతను మరింత తేటతెల్లంచేసారు.


తెలుగు సుద్దులు…..(27)
ఆ.వె|| పంది పిల్లలీ` ను పదియు నై`దిం`టిని;
         కుంజరంబు యీను కొదమ నొ`కటి.
         యుత్తమ పురుషుండు యొక్కడె జాలడా?   
         విశ్వదాభిరామ వినర వేమా!.       
భావముః        
పంది సహజంగా ఎక్కువ పిల్లలని(10-15) కంటుంటుంది.  ఏనుగు ఒక పిల్లనే కంటుంది.  కాని ఏనుగు పిల్లకున్న విలువ 10-15 పంది పిల్లలకు ఉండదుకదా? అలాగే సద్గుణవంతుడు (శ్రేష్ఠుడు) ఒక్కడు పుట్టినాచాలుకదా? సామాన్యులు, గుణహీనులు ఎంతమంది పుట్టినా ఉపయోగమేమిటి? అంటే రాశి కన్నా వాసి ముఖ్యము. వేమన ఇదే భావాన్ని “గంపెడు రంగురాళ్లకన్నా నిఖార్సైన ఓకేఒక మంచినీలం చాలు” అని కూడా వ్యక్తపర్చారు కదా! ||18-05-2014||

తెలుగు సుద్దులు…..(28)
ఆ.వె|| ఎరుగు వాని దెలుప నె`వ్వడై`నను జాలు;
         నొ`రుల వశము గాదు వోగుదెల్ప;
         యేటి వంక దీర్ప నె`వ్వరి తరమ` యా?      
         విశ్వదాభిరామ వినర వేమా!.       
భావముః        
బుద్ధిఉన్నవానికి, చెప్పింది గ్రహించేవానికి తేలికగా ఎవ్వరైనా మంచి, చెడు తెలియ చెప్పగలరు. ఏరు (నది) ప్రవాహ దిక్కు మార్చటం ఎలా సాధ్యపడదో అలాగే మూర్ఖుడికి (బుద్ధిహీనుడు)దుష్టుడికి తెలియజెప్పటం (మార్చడం) కూడా ఒకరికి సాధ్యపడే విషయం కాదు. ఇదే భావాన్ని మరొక పద్యంలో (ఎలుగుతోలు…)  కూడా వేమన మనకు చెప్పుతారు.
భర్తృహరి సుభాషితము (నీతి శతకము) కూడా ఇదే మనకు చెప్పుతున్నదికదా …..
లభేత సికతాసు తైలమపియత్నతః పీడయన్‌
పిబేచ్చ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దితః ।
కదాచిదపి పర్యటన్‌శశ విషాణమాసాదయేత్‌
న తుప్రతినివిష్ట మూర్ఖ జనచిత్తమారాధయేత్‌ ॥
… ప్రయత్నించి ఇసుకనుండి నూనైనా తీయవచ్చు [చమురు(పెట్రోలు) బావులు అవేకదా]; మృగతృష్ణ (ఎండమావులు) నుండైనా దాహం తీర్చుకొనవచ్చునేమోకాని; తిరిగి, తిరిగి కొమ్మున్న కుందేలు పట్టుకొని దాని కొమ్ము సంపాదించవచ్చునుకాని మూర్ఖుని మనస్సు మార్చడం మటుకు సాధ్యం కాదు. ||19-05-2014||


తెలుగు సుద్దులు…..(29)
ఆ.వె|| అల్పు డె`పుడు బల్కు నా`డంబరము గాను;
         సజ్జనుండు బలుకు చల్ల గాను
         కంచు మోగి న`ట్లు కనకంబు మోగునా?     
         విశ్వదాభిరామ వినర వేమా!.       
భావముః        
అల్పుడు (బుద్ధిహీనుడు; విజ్ఞత, పాండిత్యము, సంపద, ఐశ్వర్యము లేనివాడు) తన తక్కువతనాన్ని, లోపాన్ని కప్పిపుచ్చుకొనే ప్రయత్నంగా అతిగా ప్రవర్తిస్తూ, లేనిదాన్ని ఉన్నట్లు చూపడానికి సజ్జనులను, గొప్పవారిని, పండితులను మిడిమిడి జ్ఞానమ్తో హేలనచేస్తూ, కించపరుస్తూ, అవమానకరంగమాట్లాడుతూ డాంభికాలు పలుకుతుంటాడు. అదే సజ్జనుడు,  విజ్ఞుడు తన స్థాయికి తగ్గట్టు హుందాగా, వినమ్రంగా మసులుతూ, మెల్లగా, మధురంగా, అవసరమేర మితంగా, సౌమ్యంగా మాట్లాడుతుంటాడు. విలువైన బంగారపు ఘంట, కంచు ఘంట ఇచ్చేంత శబ్దాన్ని (ద్వనిని) ఇవ్వదుగదా? ఇందులో అల్పుని, ఉత్తముని గుణముల తారతమ్యాన్ని గుర్తెరిగి మసలుకోమని వేమన సూచిస్తున్నారు.
“ఏమిలేని ఆకులు (ఖాలీ విస్తరాకులు)యెగిసిపడితే, అన్నీ ఉన్న ఆకులు (పదార్ధములన్నీ  వడ్డించిన విస్తరాకులు) అణిగిఉన్నవి” అనే సామెత దీన్నే సూక్ష్మంగా మనకు చెప్పుతున్నది.||20-05-2014||

తెలుగు సుద్దులు…..(30)
ఆ.వె|| ఓగు నో`గు మెచ్చు నొ`నరంగ న`జ్ఞాని       
         భావమి`చ్చ మెచ్చు పరమ లుబ్ధు;
         పంది బురదమెచ్చు పన్నీరు మెచ్చునా?     
         విశ్వదాభిరామ వినర వేమా!.       
భావముః        

స్వభావాలు చక్కగాకలుస్తాయి కనుక దుష్టుడు దుష్టున్ని, మూర్ఖున్ని మూర్ఖుడు పరస్పరముమెచ్చుకొంటుంటారు. అలాగే అజ్ఞాని (తెలివిలేనివాడి) యొక్క చేష్టలు,అభిప్రాయాలు తనకు లాభిస్తాయి కనుక పరమ లోభి, అత్యాశాపరుడు అతనిని విపరీతంగాఇష్టపడతాడు. అశుద్ధం తింటూ బురదలో తిరిగే పంది, బురదనే ఇష్టపడుతుందికాని విలువైనది అయినా పన్నీరు ఇష్టపడదుకదా? అలాగే ఎవరి స్వభావాలని బట్టివారు ఇతరులని కూడుతారు, మెచ్చుకుంటుంటారు తప్ప అవతలివారి విలువ బట్టికాదు. దుష్టులకు, మూర్ఖులకు సజ్జనుల, బుద్ధిమంతుల విలువ తెలీయదు కనుక వారి మాటలకు క్రుంగి పోకండని వేమన అనునయిస్తున్నారు.
“రత్నాలన్నీ ఒకచోట, నత్తగుల్లన్నీ ఒకచోట”; “ఏ గూటి పక్షులు ఆగూటికి”అంటే ఇదేకదా! ||21-05-2014||

తెలుగు సుద్దులు…..(31)
ఆ.వె||గంగ పారుచుం`డు* కదలని గతి తోడ;
         మురికి కాల్వ* పారు మ్రోత తోడ;            
         దాత యోర్చిన`ట్ల ధము డో`ర్వగా లేడు*.
         విశ్వదాభిరామ వినర వేమా!.        
*పారునెపుడు; వాగు; పెద్దపిన్నతనముపేర్మియీలాగురా (పాఠాంతరాలు)
భావముః        
జీవనది గంగ ఎన్నో కొండలు, కోనలు, అవరోధాలు సమర్థవంతంగా దాటుకుంటూ తన సంగమస్థావరం సాగరం చేరేదాకా గంభీరంగా, ప్రశాంతంగా (వరదల సమయంలో ప్రవాహాన్ని ఉధృతిచేసినా, వెంటనే శాంతించి) సతతమూ ప్రవహిస్తూ ఉంటుంది; కాని అతి చిన్న మురుగుకాల్వ (వాగు)రణగొణ ధ్వనితో ఉరుకుల పరుగులతో పారుతుంటుంది. ఏమాత్రము అవరోధము వచ్చినా ఆగిపోయి, చెల్లాచెదురై తన గమ్యం చేరలేదు. అలాగే దాతృత్వము కల్గిన సద్గుణ సంపన్నుడు గంగానది వలె తన దాతృత్వపు కార్యములను (మంచిపనులను) ఆడంబరము, ఆర్భాటము లేకుండా నిరాడంబరంగా సతతము ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి కొనసాగిస్తుంటాడు. కాని, డాంబికాధములు, దుష్టులు, తారతమ్యములుతెలియనివారు చేసేది కొంచమైనా మురుగుకాల్వవలే హడావుడి ఎక్కువచేస్తారని వేమన ధార్మికులకు- అధములకు, సజ్జనులకు-దుష్టులకు గలతారతమ్యం మనకు చక్కని పోలికలతో వివరిస్తున్నారు. చక్కని తేలికైన ఉపమానాలతో సన్మాన జీవిత మార్గాన్నిఅవలభించవలసిన ఆవశ్యకత, విషయాన్ని ప్రతిఒక్కరికి తేలికగా అర్ధమయేటట్లు, మనస్సుకు హత్తుకునేటట్లు చెప్పడంలో వేమనకు వేమనే సాటికదా!
“నిండుకుండ తొణకదు” అనేది కూడా మనకు ఇదే తెలుపుతుందికదా! ||22-05-2014||

తెలుగు సుద్దులు…..(32)
ఆ.వె||కాని వాని చేత కాసు వీసము లి`చ్చి
         వెంట దిరుగుటె`ల్ల వెర్రితనము;               
         పిల్లి బట్ట కోడి పిలిచిన పలుకునా?
         విశ్వదాభిరామ వినర వేమా!.        
భావముః        
అసమర్ధునికి,పనికిమాలినవానికి లేదా మనకు కిట్టనివానికి డబ్బు (ధనము) ఇస్తే అవి తిరిగిరావటముకల్ల.  పిల్లి పట్టుకున్న(నోటకరిచిన) కోడిని  పిలిస్తే ఎలా పలుకలేదో (కోడి మనకు దక్కదో) అలాగే కానివానికిచ్చిన వాటిగురించి అతని వెంట తిరగటం వెర్రితనమే – వృధాప్రయాసే.కనుక పాత్ర ఎరిగి, మనిషి నైజము తెలుసుకొని లావాదేవీలు లేదా సాయం చేయాలి సుమా అని వేమన హెచ్చరిస్తున్నారు. ||23-05-2014||

తెలుగు సుద్దులు…..(33)
ఆ.వె||పిసినివాని యింట పీనుగు వెడలిన,
         కట్ట కోలలకును కాసు లి`చ్చి;  
         వెచ్చ మా యనం`చు వెక్కి వెక్కేడ్చురా
         విశ్వదాభిరామ వినర వేమా!.        
భావముః        
ఈ పద్యంలో వేమన పిసినిగొట్టు(లోభి) యొక్క మనస్తత్వము (ధోరణి) ఎంత దారుణంగా ఉంటుందో తెలుపుతున్నారు.
పిసినిగొట్టు ఇంటిలో కుటుంబ సభ్యులెవరన్నా చనిపోతే, వారి చనిపోయినందుకు బాధపడడుకాని, వారి ధహన సంస్కారానికి కట్టెడు పుల్లలకు డబ్బు ఖర్చైందని వెక్కి, వెక్కి ఏడుస్తాడుట. కాబట్టి పిసినిగొట్టు(లోభి) వలన ఎవరికీ ఉపయోగం ఉండదని మనము గ్రహించాలి. వారి నుండి ఏమీ ఆశించకూడదు; వారి మీద ఎవరూ ఆధారపడకూడదు. ||24-05-2014||


తెలుగు సుద్దులు…..(34)
ఆ.వె||కష్టలోభి వాని కలిమికి నా`సించి,
         బడుగువాడు దిరిగి పరిణమించు;           
         తగరు వెంట నక్క దగిలిన చందంబు
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః        
బీదవాడు పాపిష్టి  పిసినారిగొట్టు సంపదను చూసి ఆశపడి ఏమన్నా ఇస్తాడేమో అని అతని చుట్టూ తిరుగుతు, సంతోషపడుతుంటాడు. కాని అది వ్యర్ధమని  గ్రహించడు. అది ఎలాంటిదంటే బాగా బలిసిన పొట్టేలును చూచి, నక్క లొట్టలేసుకొంటూ దానికోసం ఆశక్తి చూపడటంలాంటిది. ఆశకు సాధ్యాసాధ్యల గురించి పట్టదు సుమా అని వేమన గుర్తుచేస్తున్నారు.||25-05-2014||

తెలుగు సుద్దులు…..(35)
ఆ.వె||లోభివాని జంప లోకంబు లోపల
         మందు వలదు వేర మతము గలదు;    
         పైక మ`డుగ చాల భగ్గున పడిచచ్చు
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః        
లోభి (పిసినారి) మనస్తత్వమును గురించి వేమన చెప్పిన మరొక పద్యమిది. పిసినారిని చంపాలంటె ఏమందో, మాకో అక్కరలేదు. అతనిని చంపే పద్ధతి వేరే ఉంది. అతనిని ఎవరన్నా డబ్బు ఇవ్వమని అడిగితే చాలు కడుపు మండి, కోపంతో అగ్గి బుగ్గై చస్తాడు. ధనం మీద లోభికి ఉన్న వ్యామోహం ఇది తెలియపరుస్తున్నది, వ్యామోహము, విపరీతమైన క్రోధం వలన వచ్చే అనర్ధాన్ని (చావు కొనితెచ్చుకోవటం) తెలియచెప్పుతున్నది.  పిసినారితనం (లోభత్వం) మంచిదికాదు సుమా అని కూడా హెచ్చరిస్తున్నది. ||26-05-2014||

తెలుగు సుద్దులు…..(36)
ఆ.వె||మాట లె`ల్ల కల్ల మనసె`ల్ల దొంగల్కె
         మేటి ప్రాణ మిం`క నే`టి బ్రతుకు?
         మాట సత్యమైతె మరి శతాయుష్యంబు                        
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః        
మనంమాట్లాడే మాటలు, మన మనస్సు ఆలోచనలు, మనప్రాణం, ఇంకా మన బ్రతుకు (జీవితం) అంతా అబద్ధం (అశాశ్వతం). కాని, మన సత్యవాక్యవ్రతపాలనకు మటుకు నిండు నూరేల్లు. ఇచ్చిన మాట, నీటి మూటలు చేయకుండా నిలబెట్టుకోవటం సర్వోతృష్టమని వేమన గుర్తుచేస్తున్నారు. ||27-05-2014||


తెలుగు సుద్దులు…..(37)
ఆ.వె||కలిమినాడు నరుడు కానడు మదమున
         లేమినాడు మొదలె లేదు పెట్ట
         కలిమి లేమి లేని కాలంబు గలుగునా?  
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః        
సంపద ఉన్నప్పుడు ధనమదముతో (అహంకారముతో) మనిషికి ఇతరులు కనుపించరు కనుక ఇతరులకు పెట్టడు (సాయం, దానం చేయడు); ధనము, సంపదపోయి బీదతనమువస్తే పెట్టడానికి, సాయం చేయడానికి అతని దగ్గరేముండదు. మరి కలిమి-లేమి లేని కాలము, ధార్మిక బుద్ధి అతనికి కలిగేదెప్పుడు? అని వేమన పరోక్షంగా మనలను  ధార్మిక బుద్ధి అలవర్చుకొని కలిమితనాన్ని సద్వినియోగపర్చుకొనమని హెచ్చరిస్తున్నారు. ||28-05-2014||

తెలుగు సుద్దులు…..(38)
ఆ.వె||కనియు గానలేడు కదిలింపడా`  నోరు;
         వినియు వినగ లేడు విస్మయమున ;
         సంపద గలవాని సన్నిపాతక మి`ది        
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః        
ధనము, అధికార సంపద కలిగినవారు, ఏవరన్నా వారి దగ్గరికి వచ్చి వారి సహాయము అర్ధిస్తుంటే, గర్వము చేత, మిడిసిపాటుతనంతో వారికి కన్నులున్నా చూడనట్లు, చెవుల్లున్నా విబడనట్లు, నోరున్నామాటలు మాట్లాడలేనట్లు వింతగా ప్రవర్తిస్తుంటారు. అవతలి వారి ఉనికిని సైతము అసలు పట్టించుకోరు; ఈ పద్యంలో సంపద (ఐశ్వర్యము) గలవారి ప్రవర్తనను వేమన కటువుగానే తెలుపుతున్నారు.  వారిని సన్నిపాతక జ్వరము వచ్చినవారితో అంటే కఫ, వాత, పిత్త లక్షణాలు మూడూ ప్రకోపించి తీవ్ర జ్వరముతో మాటపడిపోయి, కళ్లు మూతలుపడిపోయి, చెవులు దిమ్మర్లు పోతూ అపస్మారక స్థితికి చేరి అవసాన దశలో ఉన్న రోగితో పోల్చారు. అందరూ అలా ఉంటారని కాకపోయినా ఎవరూ అలా ఉండకూడదు అని హిత బోధ చేస్తున్నారు. ||29-05-2014||

తెలుగు సుద్దులు…..(39)
ఆ.వె||తీర్ప నా`ర్పలేని తీర్పరితన  మే`ల?
         కూర్ప విప్పలేని నేర్పరే`ల?
         పెట్టి పొయ్యలేని వట్టి బీరములేల?       
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః        
తగవు తీర్చలేని పెద్దరికము, న్యాయాధిపత్యమెందులకు? సమస్యను పరిష్కరించలేని నేర్పరి తనమెందులకు? దానధర్మాలు చేయలేని వట్టి డాంబిక వాచాలత ఎందుకు? అవి వ్యర్ధము అని కనుక “వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి పనులు చేపట్టవలెను”అని  గ్రహించండని వేమన కోరుకొంటున్నారు. ||30-05-2014||

తెలుగు సుద్దులు…..(40)
ఆ.వె||తాను గుడువ లేక తగ వే`ది యాప్తుల
         జేర`నివ్వడ`ట్టి చెనటి గోవు
         చేని లోన బోమ్మజేసి కట్టిన యట్లు          
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః        
తాను తినడు; పెట్టవలసి వస్తుందని ఆప్తులను,బంధువులను (ఇతరులను) దగ్గరకుచేరనీయడు. ఆవును పంటచేల్లో లేదా అడవిలో బొమ్మలాగా కదలకుండా కట్టిపడేస్తే ఆవుకు, తద్వారా ఇతరులకూ ఎలాఉపయోగం ఉండదో అలాగా అట్టి కుత్సితుడు వల్ల ఉపయోగములేదు, వ్యర్ధము. ||31-05-2014||

తెలుగు సుద్దులు…..(41)
ఆ.వె||పూర్వ జన్మమందు పుణ్యంబు సేయని
         పాపి ధనము కా`శపడుట యెల్ల
         విత్త మరచి గోయ వెదకిన చందంబు       
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః        
పూర్వ జన్మలో ఎట్టి పుణ్యకార్యము చేయని పాపి, పూర్వ జన్మ పుణ్య ఫలంగా సంప్రాప్తించే (లభించే) సిరి సంపదలను (ధనమును) ఆశించడము, విత్తనము నాటకుండానే చెట్టు పండ్లు కాచిందేమో కోసుకుందామని చెట్టుకోసము వెదుకులాడటములాంటిది. కనుక ఈ జన్మలోనన్నా పుణ్య కార్యములు చేసి పుణ్యము సంపాదిచుకోమని  వేమన తెలియపరుస్తున్నారు. అందుకే “చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా”అని పెద్దలు చేప్పారుకదా! ||01-06-2014||


తెలుగు సుద్దులు…..(42)
ఆ.వె||చమురు గలుగు దివ్వె సరవితో మండును
         చమురు లేని దివ్వె సమసి పోవు;
         తనవు తీరెనేని తలపు తోడనె తీరు          
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః        
నూనె ఉన్నంతవరకు దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంది;నూని అయిపోగానే దీపము ఆరి పోతుంది. అలాగే శరీరము (దేహము) పడిపోగానే అంటే మనిషి చనిపోగానే  చింత, కోరిక వెంటనే సమసిపోతాయి. అంటే విషయలంపటాలు, చీకు చింతలు శరీరము ఉన్నంతవరకూ( బ్రతికినన్నాలు) వదలవు సుమా అని వేమన  గుర్తుచేస్తున్నారు. ||02-06-2014||

తెలుగు సుద్దులు…..(43)
ఆ.వె||భూపతి కృప నమ్మి భూమి జెరుచువాడు,
         ప్రజల యుసురు దాకి పడును పిదప,
         యెగర వేయు బంతి యెందాక నిల్చురా 
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః        
రాజుగారి అండచూసుకొని విర్రవీగి రాజ్యాన్ని భ్రష్టుపట్టించినవాడు,ప్రజలకు సుఖశాంతులు లేకుండా చేసినవాడు, గాలిలోకి (పైకి) ఎగురవేసిన బంతి తిరిగి ఎలా క్రింద పడుతుందో, అలాగా ప్రజల ఉసురు తగిలి తన అధికారాన్ని పోగొట్టుకొని చతికిల పడుతాడు, అనామకుడు అవుతాడు. అధికారాన్ని దుర్వినియోగము చేయకూడదు, ప్రజా సంక్షేమానికి, దేశాభివృద్ధికి సద్వినియోగం చేయాలి అని, అధికా గణానికి వేమన చక్కటి నీతి సూత్రాన్ని అందించారు. మనము తరచూ, ఇటీవల కూడా ఇది గమనిస్తూనే ఉన్నాము కదా?||03-06-2014||

తెలుగు సుద్దులు…..(44)
ఆ.వె||పాపమ`నగ వేరె పర దేశమున లేదు
         తనదు కర్మములను దగిలియుండు;
         కర్మతంత్రి గాక గనుకని యుంటొ`ప్పు      
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః        
పాపమనేది బయటనుంచి లేదా ఎక్కడినుంచో వచ్చిచేరదు; అది మనము చేసె పనులబట్టి ఆధారపడియుంటుంది. చెడుపనుల ఫలితమే పాపము, మరి వేరు కాదు. కనుక కుటిలత్వముతో గ్రుడ్డిగా పాపపు పనులు చేయకుండా జాగురూకతో (కనుకని) పారదర్శకత్వముతో మెలుగుట ఉత్తమము అని వేమన హితవు పలుకుతున్నారు. ||04-06-2014||

తెలుగు సుద్దులు…..(45)
ఆ.వె||నక్క వినయములను నై గారములు బల్కి
         కుడవకె`ల్ల ధనము కూడబెట్టు
         కుక్క@బోను వాత కూడు చల్లిన రీతి        
         విశ్వదాభిరామ వినర వేమా!.
@కొక్కు(పాఠాంతరము)
భావముః        
దొంగ వినయము  (కపటముతోకూడిన వినయము) నటిస్తూ, మెచ్చుకోలు మాటలు చెప్పి , నేటి పరిభాషలో మస్కాకొట్టి లేదా కాకాపట్టి, నానా గడ్డి కరిచి ధనము, సంపద సంపాదించి కడుపుమాడ్చుకొని (తిండికూడా సరిగా తినక, కనీసము తన అప్తులకు కూడాపెట్టక) పోగేసుకోవడము ఎలాంటిదంటె కుక్కలేదా పందికొక్కులేదా ఎలుక అంతకుముందు తెచ్చుకొన్నవి తినక కక్కుర్తి పడి బోను ముందర చల్లిన మెతుకులకు (ఆహారము/ఎరకు) ఆశపడి బోనులో చిక్కి ముందు సంపాదించుకొన్నదంత పోగొట్టుకున్నట్లు అని లోభి నైజాన్ని వేమన చక్కగా తెలియచెప్పారు. పందికొక్కులాగా బ్రతకకండీ అని హెచ్చరిస్తున్నారు.||05-06-2014||


తెలుగు సుద్దులు…..(46)
ఆ.వె||వెళ్లి వచ్చునాడు మళ్లి పొయ్యే నాడు;
         వెంటరాదు ధనము కొంచ బోడు;             
         తాను యేడ బోనో ధనమే`డ బోవునో?    
         విశ్వదాభిరామ వినర వేమా!.      

భావముః        
పుట్టినపుడు ధనము వెంటపెట్టుకొని రాడు; అలాగే  చనిపోయినపుడూ ధనము తన వెంటతీసుకొని పోలేడు. ఎంతో కష్టపడి లేదా నానాగడ్ది కరచి సంపాదించి పోగేసుకొన్నా ధనము (సంపద) తనవెంట రాదు. చివరికి తానే ఎక్కడికి పోతాడో (ఏ జన్మ ఎత్తుతాడో) తెలియదు; తన మరణానంతరము తన సంపద, డబ్బు ఏమవుతుందో కూడా తెలియదు.  కనుక అటువంటి ధనము మీద మోహము కూడదు అని వేమన భావన. ఎంతటి రాజైనా, కోటీశ్వరుడైనా రిక్త హస్తాలతోనే ఈ లోకము విడవలసిందేకదా! కనుక, ఓ మనిషీ (ముఖ్యంగ లోభీ) బ్రతికినన్నాళ్లు సంపాదించిన ధనమును సత్కర్మలకు వినియోగించి, ఎత్తిన మానవజన్మకు, సంపాదించిన ధనమునకు, సంపదకు సార్ధకత చేకూర్చుకో అని వేమన బోధిస్తున్నారు. చివరకు ప్రపంచాన్నే జయించిన అలెగ్జాండరూ ఇదే చెప్పారని చెప్పుతారు కదా! ||06-06-2014||

తెలుగు సుద్దులు…..(47)
ఆ.వె||పుట్టు బిత్తలి వలె పోవు బిత్తలి వలె
         తిరుగు బిత్తలి వలె దేహి ధరణి
         యున్ననాటి`కైన ను`పకారి గాలేడు
         విశ్వదాభిరామ వినర వేమా!.          

భావముః        
మనిషి పుట్టినపుడూ ఒంటిమీదనూలుపోగు లేకుండా (సిగ్గనేదిలేకుండా, తెలుసుకోలేని స్థితిలో) దిశమొల్తో వస్తాడు; అలాగే చనిపోయిన తరువాత కూడా దిశమొలతోనే సాగనంపుతారు (పోతాడు). ఈ భూమిమీద బ్రతికినన్నాళ్లూ పరోపకారము అనేది చేయకుండా (పరోపకారత్వములేకుండా) సిగ్గులేకుండా ప్రవర్తిస్తుంటాడు అని వేమన మానవ నైజాన్ని ఎండకట్టుతూ, బ్రతికినన్నళ్లానా పరోపకారిగా బ్రతకటం నేర్చుకోమని ఉద్భోస్తున్నారు. ||07-06-2014||

తెలుగు సుద్దులు…..(48)
ఆ.వె||కాశి బోదు ననుచు కడ కట్ట గానే`ల?
         వాశి తీర్థములను వగవనే`ల?
         దోషకారికెట్లు దొరకురా యా కాశి?
         విశ్వదాభిరామ వినర వేమా!.          

భావముః        
కాశీకి వెల్లుతానని పట్టుపట్టినా,  గొప్ప పుణ్య నదులలో మునుగడానికి వెంపర్లాడినా, ఎన్ని చేసినా, ఎంత శ్రమ పడినా అంతఃకరణ శుద్ధిలేని, తప్పులు చేసినవానికి ఆ శ్రమ నిష్ప్రయోజనమని వేమన బాహ్యాడంబరాలతోకూడిన తీర్థయాత్రల గురించి చురకంటిస్తున్నారు. తీర్థయాత్రలు పాపాలు కడిగేసుకోవడానికికాదు, స్వచ్ఛమైన మనస్సుతో, దోషరహితంగా చేస్తే ఫలితముంటుంది, లేకపోతే వృధాశ్రమే అని సత్ప్రవర్తన యొక్క ఆవశ్యకతను తెలియచచెప్పుతున్నారు. ||08-06-2014||

తెలుగు సుద్దులు…..(49)
ఆ.వె||ఇనుము విరిగె నే`ని యిను మారు ముమ్మారు
         కాచి యతక నేర్చు కమ్మరీడు;
         మనసు విరిగెనే`ని మరి యంట నేర్చునా?
         విశ్వదాభిరామ వినర వేమా!.          

భావముః        
కఠినమైన ఇనుప వస్తువు సైతము, ఏదైనా విరిగిపోతే, కమ్మరి (ఇనుప పని చేయువాడు) భగ,భగా మండే కొలిమిలో రెండు, మూడు సార్లు ఎర్రగ కాల్చి, సమ్మెటతో బాది అతకగలుగుతాడు.కాని,  అతిసున్నితమైన మానవ మనస్సు ఏకారణం చేతనైనా (పరుష పదజాలంతో కాని, చేష్టలతోకానీ, అవహేలనలతోకాని…) విరిగితే (నొచ్చుకుంటే) అది అతకడం (బాగుచేయడం) ఎవరివల్లా సాధ్యపడదు. ఆ బాధను ఉపసమింపచేయటము కష్టతరముకనుక ఇతరులను (ఇతరుల మనస్సును) ఎట్టిపరిస్థితులలోనునొప్పించకండి అని వేమన మనకు హెచ్చరిక చేస్తున్నారు.||09-06-2014||


తెలుగు సుద్దులు…..(50)
కం||పరనారి దూరగుడై;
      పరధనముల కా`స పడక పరహితచారై;  
      పరు ల`లిగిన తా`నలుగక
      పరు లె`న్నగ బ్రతుకువాడు ప్రాజ్ఞుడు వేమా!.               

భావముః        
పర స్త్రీ వ్యామోహములేకుండా(పరస్త్రీలయందు అనురక్తుడు కాకుండా, దూరంగా ఉండువాడు), ఇతరుల ధనమునకు (సంపదకు)ఆశపడకుండా (అత్యాశలేకుండా),ఇతరులకు మేలు, మంచికోరుతూ, ఇతరులు కోపగించుకొన్నా, ద్వేషించినా తాను తన శాంతాన్ని పోగొట్టుకోకుండా, (రోషపడకుండా) వారి మీద కోపము, ద్వేషము పెంచుకొనకుండా ఇతరులు మెచ్చుకొనే విధంగా జీవించేవాడే వివేకి( తెలివైనవాడు), బుద్ధిమంతుడు, సమర్ధుడు అని వేమన మనకు వివేకి యొక్క లక్షణాలని ఈ పద్యము ద్వారా తెలుపుతున్నారు.||10-06-2014||
తెలుగు సుద్దులు…..(51)కం||అజ్ఞానమె శూద్రత్వము;
      సుజ్ఞానము  బ్రహ్మమౌ`ట శ్రుతులను వినరా
      యజ్ఞాన ము`డిగి వాల్మికి
      సుజ్ఞానపు బ్రహ్మ మొం`దె జూడర వేమా!.                  

భావముః        
శ్రుతుల ప్రకారము అజ్ఞానమే శూద్రత్వము; పరిపూర్ణ జ్ఞానియే బ్రాహ్మణుడు (బ్రహ్మ జ్ఞానముతెల్సినవాడు).  నారద మహర్షి జ్ఞానోపదేశముచే బోయవృత్తిలోఉన్న రత్నాకరుడు అకుంఠిత పట్టుదలతో (తపస్సుతో) తన అజ్ఞానమునుపోగొట్టుకొని బ్రహ్మర్షి వాల్మీకి కాగలిగనది గుర్తించి బ్రహ్మ జ్ఞాన సముపార్జనకు కృషిచేసి తరించవలసినఆవశ్యకతను ఒక యోగిగా, నవతాళికుడుగావేమన మనకు గుర్తుచేస్తున్నారు. ||11-06-2014||

తెలుగు సుద్దులు…..(52)
ఆ.వె||నీళ్లలోని చేప నెరి మాంస మా`శకు
         గాల మం`దు జిక్కి గూలిన`ట్లు
         యాశ బుట్టి మనుజు డా`రీతి జెడిపోవు
         విశ్వదాభిరామ వినర వేమా!.           
భావముః        
నీళ్లలో సుఖంగా బ్రతుకుతున్న చేప జాలరి వేసిన గాలానికి తగిలించిన చిన్న ఎర్రని వానపాము ముక్కకు (ఎరకు) ఆశపడి గాలానికి చిక్కుకొని తన చావు (అంతం) కొనితెచ్చుకొంటుందో అలాగా మానవుడు అత్యాశకు చిక్కి తన వినాశనాన్ని కొనితెచ్చుకుంటాడు.  చేప కనీసము తను చనిపోయేముందు జాలరికి, అతని కుటుంబానికి జీవనోపాధికి దోహదపడుతున్నది. కాని, మానవుడు పరోపకార హితమన్నది లేకుండా స్వార్ధానికి చిక్కి అత్యాశతో జీవితాన్ని వ్యర్ధపర్చుకుంటుంటాడు. అది తగదని, ఉత్కర్షమైన మానవ జన్మను సార్ధకము జేసుకొనమని వేమన చక్కటి సుపరిచితమైన ఉపమానంతో హితవు పలుకుతున్నారు.||12-06-2014||

తెలుగు సుద్దులు…..(53)
ఆ.వె||బొంది యెవరి సొమ్ము పోషింప పలుమారు
         ప్రాణ మె`వరి సొమ్ము భక్తి సేయ
         ధనము యెవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము
         విశ్వదాభిరామ వినర వేమా!.           
భావముః        
మానవుడు, దహింపబడె దేహము (కృశించిపోయె శరీరము) తనదనే మోహంలో అనేక రకాలుగా దాన్ని పోషించి పెంచుకుంటాడు; అలాగే క్షణ భంగురమైన ప్రాణము తనదనుకొని సుఖవంతంగా ఉండటానికి ఎన్నోన్నో సేవలు చేసి ప్రయాస పడుతుంటాడు; అంతే కాకుండా తనువు చాలించిననాడు తన వెంట తీసుకొని వెళ్లలేని ధనము తనదని భ్రమలో పడి, మూర్ఖత్వముతో, తనవి కానివి తనవని భావించి అవివేకముగా ప్రవర్తిస్తుంటాడు.  ధర్మయుక్త (అహింస, న్యాయయు) జీవనము వలన సంపాదించుకొన్న పుణ్యము మాత్రమే తన వెంట వచ్చే నిజమైన సంపద (ధనము) అని గుర్తెరిగి వివేకంతో మసలుకోమని వేమన ఒక సద్గురువుగా హితవు పలుకుతున్నారు. ||13-06-2014||

తెలుగు సుద్దులు…..(54)
ఆ.వె||నమశివ యనవచ్చు, నారాయణ న`వచ్చు;
        మేలు వారి నమ్మి మెచ్చ వచ్చు;
        కొంగు కాసు విడిచి గొబ్బున నీ`లేడు
        విశ్వదాభిరామ వినర వేమా!.            
భావముః        
వేమన ఈ పద్యములో లోభి గుణం గురించి మనకు తెలుపుతున్నారు.శివ పంచాక్షరీ మంత్రము, నారాయణ మంత్రము సతతము జపిస్తుండవచ్చు; తన కిష్టమైనవారిని ధారాలంగ పొగడ్తలతో ముంచెత్తవచ్చుగాక;కొంగు ముడి విప్పి కాణి కూడా వెంటనే తీసివ్వడు. (పూర్వము డబ్బులు పైకండువా కొంగులోనో, బొడ్లో (పంచెలో) దాచుకొనేవారుకదా!)
పైకి ఎంత ధార్మికంగా నటించినా, ఇతరులతో ప్రియంగా నటించినా లోభి డబ్బు దగ్గర మటుకు చాలా కఠినంగా, పిసినారిగా ప్రవర్తిస్తుంటాడు. ఇతరులకు సాయం చేయడానికి అతనికి బుద్ధి పుట్టదు, మనసు రాదు.  కనుక అతని పైపై కబుర్లను నమ్మి మోసపోవద్దు అని వేమన మనకు హితవు పలుకుతున్నారు. ||14-06-2014||

తెలుగు సుద్దులు…..(55)
ఆ.వె||మేడి పండు జూడ మేలిమై` యుండును;
        పొట్ట విచ్చి చూడ పురుగులుం`డు    
        బెరుకు వాని మదిని బింకె మీ`లాగురా
        విశ్వదాభిరామ వినర వేమా!.            
భావముః        
మేడి పండు చూడ్డానికి పైకి చక్కగా ఉంటుంది.  కాని పండును చిదిపి లోపల చూస్తే పురుగులుంటాయి.  అలాగే పిరికివాని, భయస్థుని ధైర్యము, ధృడత్వము కూడా ఇలాగే ఉంటుంది. అంతా ప్రగల్భాలు, బడాయి కబుర్లే.  కనుక అటువంటి వాచాలత వల్ల, డాంబిక కబుర్ల వల్ల వరిగేది ఏముండదు కనుక జాగ్రత్తగ ఉండమని వేమన హెచ్చరిస్తున్నారు. ||15-06-2014||

తెలుగు సుద్దులు…..(56)
ఆ.వె||ఉసురులేని తిత్తి యిసు మం`త వూదిన
        పంచ లోహములును భస్మమౌ`ను;    
        పెద్ద లు`సురు మం`టె  పెనుమంట లె`గయవా?
        విశ్వదాభిరామ వినర వేమా!.            

భావముః        
ప్రాణము లేని కొలిమితిత్తి కొంచెం ఊదితేనే కొలిమి మండి, ఆ వేడికి పంచలోహాలు సైతము కరిగి, పొడిగా మారుతాయి. అలాంటిది ధర్మ నిష్టుల, మంచివారి మనసులు నొప్పిస్తే మహాప్రళయం ఉద్భవించదా? మన పురాణాలలోని మునుల, ఋషుల శాపాలూ అలాంటివే కదా? ఇక్కడ వేమన మనకు సజ్జనులను మన మాటలతో నొప్పించి కోపము తెప్పించి, వారి ఆగ్రహానికి గురికావద్దు అని హితవు పలుకుతున్నారు. ||16-06-2014||

తెలుగు సుద్దులు…..(57)
 కం||మందు దిన  బోటు  మానును
       మందు దినగ జేయ  పొలతి మహిలో వలచున్
       మందు దిన కుదురు రోగము
       మందు దినంగలదు పుష్టి మహిలోవేమా!.               
భావముః        
ఈ పద్యములో వేమన మందులు (ఆయుర్వేదఔషధములు) ఎన్ని విధములుగా ఉంటాయో, అవి ఎన్నివిధాలుగా వాడుకొనవచ్చో చెప్పుతున్నారు. మందు తినిన (వాడిన) కురుపులు (నెత్తురుగడ్డలు),వాపులు మానుతాయి. మందు తినిపింపజేస్తే(ప్రెమోద్రేకము కలిగించేవి, వశీకరణ మందులు లాంటివి)ఈ లోకంలో ప్రేమ యందు అయిష్టత కలిగిన స్త్రీలు సైతము అనురాగవతులుగా మారగలరు.అనారోగ్యము కలిగినపుడు మందు తీసుకుంటే రోగము పోయి స్వస్థత చేకూరుతుంది.మందు వాడి ఈ లోకంలో బలాన్ని, పరిపుష్టిని పెంపొందించుకొనవచ్చును.
అలాగే మనము మన మానసిక, భావ రుగ్మతలకు కూడా వివిధ రకముల ధార్మిక పద్ధతుల ద్వారా(మందులు) విమోచనము పొందవచ్చును అనేది; మంచి అనేదాన్ని కూడా వివిధ రకములుగా ఇతరులకు సహయపడటానికి ఉపయోగించవచ్చును అనేది మనం గ్రహించవలసియుంటుంది. ||17-06-2014||

తెలుగు సుద్దులు…..(58)
ఆ.వె॥తలను పాగ  పై`ని తగు పచ్చడము బొజ్జ
       చెవుల పోగు ల`రసి జేరున`ర్ధి;
       శుద్ధ  పశువు లౌ`ట బుద్ధిలో నె`రుగక
       విశ్వదాభిరామ వినర వేమా!.    

భావముః        
తలమీద చక్కని తలపాగ, చక్కటి అంగ వస్త్రము, కండువ లేదా శాలువా కప్పుకొని,బాన కడుపుతో(సహజంగా సంపన్నులు శారీరక శ్రమ లేకపోవటం వలన, మృష్టాన్నభోజనాదుల వలన పెద్దపొట్టతో ఉంటారు కనుక), చెవులకు పోగులు (పూర్వము ధనవంతులైన పురుషులు కర్ణాభరణాలు ధరించేవారు) ధరించినవారిని చూసి ధనవంతులు కదా సహాయము చేయకపోతారా అని ఆశతో దానం (సాయం) కోసం అమాయకులైన వేడుకొనేవారు ఆ అలంకార భూషితులు (డాంబికులు)  శుద్ధ పశువులుగా ప్రవర్తిస్తారని (ఇతరుల బాధలు వారికి పట్టవు, లేదా అర్ధం కానట్టు నటిస్తారు కనుక) తెలియక వారి దగ్గరికి వెళ్లుతారు.
ఈ పద్యంలో వేమన మనకు మనుషుల పైపై అలంకారాలు, వేషాలను జూసి వారి దాతృత్వాన్ని అంచనా వేయడం మూర్ఖత్వమని తెలియచెప్పుతున్నారు. కొంచము కటువుగానే డాంబికుల లక్షణాన్ని తెలియచెప్పారు. ||18-06-2014||

తెలుగు సుద్దులు…..(59)
ఆ.వె॥స్త్రీ సుఖము (ముఖము*) జూచి చిత్తంబు నిలుకడ
        సేయని మనుజుండు చెడు నిజంబు;
        యేటి గట్టు మాను కె`ప్పుడు చలనంబు?
        విశ్వదాభిరామ వినర వేమా!.   
*పాఠాంతరము
భావముః        
ఈ పద్యంలో వేమన స్త్రీ వ్యామోహంలో పడినవానిని చెఱువు గట్టు మీదనున్న చెట్టుతో పోల్చారు. 
స్త్రీల మీద కోరికతో, వారితోటే జీవితమని ప్రలోభంలోపడి (వ్యామోహములో పడి) తన కోరికలను, మనస్సును, తన అదుపులో పెట్టుకోలేని మనిషి (పురుషుడు) పతనం కావటం తధ్యము.చెఱువు గట్టు మీద చెట్టు పచ్చగా కళకళలాడుతూ ఉండవచ్చు; కాని, చెఱువులో నీళ్ళెక్కువై గట్టు ఏమాత్రం తెగినా అది కూలి పోవడం ఖాయంకదా! అంటే దాని నిలకడ ఎంత ప్రమాదకరమో కదా! వేమన స్త్రీ వాంఛను చెఱువులో నీళ్ళతో ఎంతో భావయుక్తంగా పోల్చారు. బహుశా వేమన తన చరిత్రనే (సంగతినే) లోకానికి (మనకు) కనువిప్పు కలిగించడానికిఇలా ప్రస్తావించారేమో! ॥19-06-2014||

తెలుగు సుద్దులు…..(60)
ఆ.వె॥కూలి నాలి జేసి గుల్లాపు పనిజేసి
        తెచ్చిపెట్ట యాలు మెచ్చ నేర్చు
        లేమి జిక్క విభుని వే మారు దిట్టును
        విశ్వదాభిరామ వినర వేమా!.  
భావముః
కూలి నాలి జేసి, అవసరమైతే జీతగాడిగా (పారికాపు) బానిస వృత్తిచేసి సంపాదించి డబ్బు భార్యకు ఇచ్చినంతవరకు భర్తను మెచ్చుకుంటుంది, గౌరవిస్తుంది. సంపాదన లేనినాడు (ఆర్ధికంగా చితికిననాడు) భార్యసైతము అతనిని వెయ్యిసార్లు (మాటి మాటికి) ఛీత్కరించుకొంటు, తిట్టుతుంది.
వేమన ఇదే భావాన్ని ఇంకొక కంద పద్యంలో కూడా వ్యక్తీకరించారు. అది సుమతీ శతకము పద్యము పోలి యుంటుంది.
కం॥గడన గల పురుషు గనుగొని
     యడుగులకును  మడుగు లి`డుదు ర`తివలు ధరలో,
     గడన విడు పురుషు గనుగొని
     నడ పీనుగ వ`చ్చెనండ్రు నాతులు వేమా!

కం॥గడనగలమగనిఁ జూచిన
     నడుగడుగున మడుఁగులిడుదు రతివలు తమలోఁ
     గడనుడుగు మగనిఁ జూచిన
     నడపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ!
    
 గడన – సంపాదన; నడ పీనుగ –జీవచ్ఛవము (బ్రతికున్నా చచ్చిన వానితో సమానము – వ్యర్ధము)
సంపాదనలేనివానిని భార్యసైతము గౌరవించదు కనుక పురుషుడు(భర్త) సోమరిగా బ్రతకక కష్టించి (సంపాదిస్తూ)  బ్రతకవలనని వేమన హితవు పలుకుతున్నారు.
వేదాంతపరంగా అన్వయించుకుంటే ప్రేమాభిమానాలు కేవలము తాత్కాలికము,అవి మన దగ్గర డబ్బు, సంపద ఉన్నంతవరకే. ప్రేమాభిమానాలు శాశ్వతమని సాంసారిక లంపటములో చిక్కుకొనక, భౌతికమైన భవబంధాలనుండి బయటపడి మానవజన్మను సార్ధకం చేసుకొంటూ, మోక్షప్రాప్తికి పరిపూర్ణంగా ప్రయత్నించమని ఒక యోగిగా వేమన మనకు దిశానిర్దేశము చేస్తున్నారు. ॥23-06-2014॥

తెలుగు సుద్దులు…..(61)
కం॥ఇంద్రియ పరవశు డ`ధముం
     డింద్రియ పరవశుడు భక్తి యడ మధ్యముడౌ;
     నింద్రియ జయు డు`త్తముడు జి
     తేంద్రియ సమ్మదుడు విన మహేశుడు వేమా!.   
భావముః
ఈ పద్యంలో వేమన మానవులను నాలుగు విధములుగా విభాగించారు.
కేవలము ఇంద్రియ సుఖములకు వశులై కనీసము భగవధ్యానము లేనివాడు అధముడు; ఇంద్రియ సుఖములను పూర్తిగా వర్జించలేకపోయినా, భక్తియందు అనురక్తుడు మధ్యముడు; పంచేంద్రియ సుఖములను కోరక వాటిని జయించినవాడు ఉత్తముడు.  సంపూర్ణంగా జితేంద్రియుడై మిక్కిలి అంతర్గత ఆనందానుభూతిని పొందేవాడు పరమేశ్వరునితో సమానుడు. ॥24-06-2014||

తెలుగు సుద్దులు…..(62)
కం॥తన గుణము తనకు నుం`డగ
     నెనయంగా నొరుని గుణము నెం` చును మదిలో
     తన గుణము తాను దెలియక,
     బరు నిందం`జేయువాడు$ భ్రష్టుడు వేమా!.        
$ వనరి యొరుని ననెడు వాడు (పాఠాంతరము)
భావముః
ఈ పద్యంలో వేమన మానవుల నైజాన్ని(స్వాభావికము) తెలుపుతున్నారు.
మానవుడు తనకున్నఅవలక్షణాలను (తనలోని తప్పులను) తెలుసుకోడు. ఎప్పుడూ ఇతరులలోని తప్పులను ఎత్తిచూపుతుంటాడు.తనకున్నఅవలక్షణాలను (తనలోని తప్పులను) గ్రహించి, గుర్తెరిగి, సరిచేసుకొనేప్రయత్నము చేయక ఎదుటివారి (ఇతరులలోని) గుణాలనుగురించి సతతము ఆలోచిస్తూ, వాటిని ఎత్తిచూపుతూ వారిని నిందించేవాడు (తప్పులు పట్టుకొనడమే ధ్యేయంగా పెట్టుకొన్నవాడు)దుష్టుడు, పతనము చెందుతాడు.
ఇదే  భావాన్ని వేమన మరి రెండు చక్కటి పద్యాలలో కూడా వ్యక్తీకరిస్తూ - ఇతరుల తప్పులెన్నుట, పరుల నింద కూడదని, మన లోపాలను (అవలక్షణాలను, చెడు గుణాలను) గుర్తెరిగిసరిజేసుకోమని హితోపదేశము చేస్తున్నారు.

ఆ.వె॥తనకుగల్గు పెక్కు తప్పులునుండగా
        ఓగు నేరమెంచు నొరులంగాంచి
        చక్కిలంబుగాంచి జంతిక నగినట్లు
        విశ్వదాభిరామ వినరవేమా!.(62అ)

ఓగుఃదుర్మార్గుడు, చక్కిలములో చుట్లు (వంకలు) తక్కువగా ఉన్నా ఎక్కువ చుట్లున్న జంతిక చక్కిలాన్ని వెక్కిరించినట్లు, తన తప్పులను ఎరగక ఎదుటి వారి తప్పులను ఎంచును.
ఆ.వె॥తప్పు లె`న్నువారు తండోపతండము      
       లు`ర్విజనుల కె`ల్ల నుం`డు తప్పు;
       తప్పులెన్నువారు తమ తప్పు లె`రుగరు
       విశ్వదాభిరామ వినర వేమా!. (62ఆ) ||25-06-2014||
 
తెలుగు సుద్దులు…..(63)
ఆ.వె॥వెర్రివానికై`న వేషధారికి నై`న,
        రోగి కై`న పరమయోగి కై`న,
        స్త్రీల జూచిన`పుడు చిత్తంబు రంజిల్లు
        విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
లోకజ్ఞానంలేనివాడైనా (అమాయకుడు), సన్యాసైనా, అనారోగ్యముతో బాధపడుతూ శక్తిలేని రోగైనా, గొప్పయోగి సైతము స్త్రీలను చూసినపుడు అనురాగము కల్గి వారి, వారి మనస్సు ఆనందంతో ఉరకలువేస్తుంది (ఎర్రబడుతుంది). మనోవికారము, కలవరము,తెవులు కలుగుతుంది.
వేమన ఈ పద్యం ద్వారా స్త్రీ ఆకర్షణ ఎంత బలవత్తరమైనదో తెలుపుతూ, సౌందర్యాన్ని ఆరాధనాపూర్వకంగా ఆనందించాలితప్ప, అధర్మంగా కతకాలని మతులు ప్రేరేపించినా వ్యామోహమును అదుపులో ఉంచుకొనవలసినదిగా హితవుపలుకుతున్నారు.||26-06-2014||

తెలుగు సుద్దులు…..(64)
ఆ.వె॥తా వసించు చోట తగ న`ల్జడా`యెనా
       సౌఖ్య భూమి కపుడు$ జరుగ వలయు;
       కొలకు లిం`కె నే`ని   కొంగ లం`దుం`డునా?
       విశ్వదాభిరామ వినర వేమా!.
$ సౌఖ్యమున్న దరికి (పాఠాంతరము)
భావముః
 తాను నివసిస్తున్న ప్రదేశంలో తీవ్రమైన అలజడులు, అల్లరులు, గొడవలు జరుగుతుంటే తక్షణము అక్కడినుండి ప్రశాంత ప్రదేశమునకు, జీవనము సౌఖ్యముగా ఉన్నచోటుకు తరలి వెళ్లాలి. దీనిని వేమన మనకు చక్కటి ఉపమానముతో తెలియచెప్పుతున్నారు. కొలను (మడుగు, చెరువు,సరస్సు) ఎండిపోతే (నీళ్లు ఇంకిపోతే) తమకు ఆహారమైన చేపలు వగైరా లభించవు కనుక, జాలర్ల తాకిడి కూడా ఎక్కువతుంది కనుక (తమకూ ప్రమాదం పొంచిఉంటుంది కనుక) కొంగలు ఆ కొలనులో ఇక ఎంతమాత్రమూ ఉండవుకదా! అలాగే మనుజులు కూడా ప్రమాదాన్ని గుర్తెరిగి మసలుకోవాలి అని హితోపదేశము చేస్తున్నారు. ||27-06-2014||

తెలుగు సుద్దులు…..(65)
ఆ.వె॥భూమిలోన పుణ్యపురుషులు లేకు`న్న
        జగము లే`ల నిల్చు పొగలుగాక
        నంత తరుచు దొరకరా`డ నాడను గాని
        విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
భూమిమీద పుణ్యాత్ములుండబట్టే ఈ ప్రపంచము అల్లకల్లోముకాకుండా, పూర్తిగా ఇబ్బందులపాలుకాకుండా మనగలుగుచున్నది. (జనులు, పశుపక్ష్యాదులు జీవించకలుగుచున్నారు). కాని, ఆ పుణ్యాత్ములు బహు అరుదుగా అక్కడక్కడా మాత్రమే కనిపిస్తారు.  పుణ్యాత్ములు తరగిపోతున్నారని వేమన తన ఆవేదనను వ్యక్తపరుస్తూ, కనీసము బహు అరుదుగా ఉన్నవారినన్నా జాగ్రత్తగా చూసుకొనపోతే, వారికి ఇబ్బందులు కలిగితే ప్రళయము తప్పదు సుమా అని హెచరిస్తున్నారు. ఎవరికివారు పాపజీవనానికి స్వస్తిపలికి పుణ్యజీవనమువైపు మరలమని, అది మన మనుగడకు అత్యవసరమని ఈ పద్యముద్వారా హితవు పలుకుతున్నారు. ||29-06-2014||

తెలుగు సుద్దులు…..(66)
ఆ.వె॥చిత్తశుద్ధి గల్గి చేసిన పుణ్యంబు
       కొంచ మై`న న`దియు కొదువ గాదు
       విత్తనంబు మర్రి వృక్షంబునకు నెం`త
       విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
మనస్ఫూర్తిగా చేసిన ఏ మంచిపనైనా (పుణ్యకార్యము), అది ఎంత చిన్నదైనా దానిగురించి న్యూన్యత చెందనవసరము లేదు. మహా వృక్షముగా ఎదిగే మర్రిచెట్టు మొలవడానికి ఆధారభూతమైన విత్తనము సైతము ఎంతో చిన్నదిగా ఉంటుంది కదా అని వేమన మనకు చక్కని ఉపమానంద్వారా ఉద్భోధ చేస్తున్నారు.
కనుక ఎవరి శక్తి కొలది వారు (ఉడతాభక్తిగా) సంతోషముతో, సేవాతర్పరతో, ఫలాపేక్షలేకుండా,మనస్ఫూర్తిగా మంచి పనులు చేయడానికి వెనుకంజ వేయవలసిన పనిలేదు. అవి తక్కువ అని బాధపడనవసరము అంతకన్నాలేదు, లేదా చిన్నతనముగా భావించవలసిన పనిలేదు.
మనలను మంచి పనులు చేయడానికి వెన్నుతట్టి ప్రోత్సహించడానికి వేమన ఈ పద్యమును చెప్పినట్లున్నది.  ||30-06-2014||

తెలుగు సుద్దులు…..(67)
ఆ.వె॥చెడ్డ వాని మిగుల జెరుచును దైవంబు;
        అడ్డ పడడు వాని కా`పదైన
       చెడిన చేను జూచి యొదడయడు మెచ్చునా?
       విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
పూర్వజన్మ పాప-పుణ్యాల ఫలితంగా మంచివారుగా, చెడ్డవారిగా ప్రవర్తిస్తుంటారు అని పెద్దలు చెప్పుతారు కదా; దాని అనుగుణంగా చెడ్డవారు త్వరగా వారి కర్మఫలాన్ని పూర్తిచేసుకొనటానికన్నట్లు, దైవం (దేవుడు)వారు చేసే చెడ్డపనులకు సాయం రూపంలో మరింత దోహదపడుతూ, ఆ అధర్మ కార్యకలాపాల వలన వారికి కష్టం, విపత్తు కలిగినపుడు మాత్రం కాపాడడు, అడ్డుపడడు.  ఈ భావన మనకు తేలికగా బోధపడడానికి –“ చెడిన పంటచేను చూసి ఏ రైతు (ఒడయుడు-ఆసామి, యజమాని)సంతోషపడి మెచ్చుకుంటాడు?”అనే ఉపమానము ద్వారా వేమన తెలిపినారు.
చెడిన పైరును ఎంత త్వరగా తీసివేసి పొలాన్ని ఆ చీడపీడలనుండి శుభ్రంచేసి మళ్లీ పంటవేద్దామని రైతు (ఆసామి) ఆతురతగా ఉంటాడు. “పాపి చిరాయువు” అంటారుగదా; అందుకని దయాళుడైన సర్వేశ్వరుడు చీడపట్టిన జీవితాలకి విముక్తి కలిగించడానికి ఆతురతతో ఎదురుచూస్తుంటాడని అన్వయించుకోవచ్చునేమో!  కాని, నేటి ఆధునికులు దీన్ని చెత్త (Trash!) అని కొట్టిపారవేయవచ్చు కూడా!! ||01-07-2014||

తెలుగు సుద్దులు…..(68)
ఆ.వె॥ఎక్కు డై`న యాశ లి`నుమడి యుండగా
       తిక్కబట్టి నరుడు తిరుగు చుం`డు;
       కుక్క వంటి యాశ కూర్చుండ నివ్వదు
       విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
అధికమైన కోరికలు రెట్టింపు అవటమువలన (అత్యాశ) మనిషి వాటిని సఫలీకృతము చేసుకోవడం, సాధించడం ఎలాగా అని పిచ్చిపట్టినవానివలె అన్యమస్కంగా తిరుగుతుంటాడు. అతనికి మిగతావి ఏవి పట్టవు, కండ్లముందున్నా, కనిపిస్తున్నా కనుపించవు; వినిపించవు.
వేమన, ఈ పద్యములో మానవుని ఆశను కుక్కతోపొల్చుతూ (వీధికుక్క సామాన్యంగా ఆహారం కోసము ఎవరి దొడ్డిలోకో వెళ్లి ఆ యజమానిచేత కఱ్ఱ దెబ్బలు తిని , ప్రక్క ఇంటి దొడ్డిలోని దాలిగుంటలో (నీళ్లు, పాలు కాచుకొనే పొయ్యి గుంట) వెచ్చగా పడుకొని, నొప్పులకు కాపడం పెట్టుకొంటూ ఇక దొంగతిండికి వెళ్లకూడదు అనుకుంటుందట; కాని కాసేపాగినాక మరలా ఇంకో ఇంట్లో జొరబడుతుంది, మళ్లీ తన్నులు మామూలే – ఇది ఆనాటి పరిస్థితి. ) ఆశ బుద్ధిని స్థిమితంగ ఉండనివ్వదు సుమా అని హెచ్చరిస్తున్నారు.
ఆశల వలయంలో చిక్కినవాని మనఃప్రవృత్తిని పిచ్చివానితో పోల్చడం ద్వారా ఆత్యాశ (లు) ఎంత ప్రమాదమో హెచ్చరిస్తూ ఆ విషవలయములో చిక్కుకొనకండని హితవు పలుకుతున్నారు. ||02-07-2014||

తెలుగు సుద్దులు…..(69)
ఆ.వె॥అరయ తరుచు కల్లలా`డెడు వారిం`డ్ల
        వెడల కే`ల లక్ష్మి విశ్రమించు?
        ఓటి కుండ నీరు పోసిన చందాన
        విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః

మనం పరిశీలించి చూస్తే, తరచూ అసత్యములాడెడి(అబద్ధాలు మాట్లాడే) వారిండ్ల లక్ష్మీదేవి నిలకడగా ఉన్నట్లు కన్పించదు.  అవును, ఆమె ఎందుకుంటుంది? ఓటి కుండ (పగులు బట్టిన కుండ) లో ఎంత నీరు పోసినా ఎలా నిల్వకుండా బీట (పగులు) నుండి కారిపోతాయో అలాగే వారి అసత్య ప్రవర్తన వలన వారింట సిరి,సంపదలు నిలువవు.
సంపద (ధనము) ఉన్నా లేదని చెప్పుతూ ఎవరికీ (పరులకు) సాయం చేయని, ధర్మకార్యాలు , పుణ్యకార్యాలు చేయడానికి ఇష్టపడని, ఎంత సంపద ఉన్నా అత్యాశతో ఏమిలేదని అసత్యాలు పలికేవారిండ్లలో ఆ సిరి, సంపదలు నిలకడగ ఉండవు కనుక ఉన్న సిరి,సంపదలను సద్వినియోగించాలని,డబ్బుకు కక్కుర్తి పడి అబద్ధాలు పలుకరాదని వేమన హితవు పలుకుతున్నారు.||03-07-2014||

తెలుగు సుద్దులు…..(70)
ఆ.వె॥గుణవతి యగు యువతి గృహము@ చక్కగ నుండు
        చీకటిం`ట దివ్వె చెలగు రీతి;
        దేవి యున్న యిల్లు దేవార్చన గృహంబు
        విశ్వదాభిరామ వినర వేమా!.
@గుఱి (పాఠాంతరము) – లక్ష్యము, నిర్ణయము
భావముః
గుణవంతురాలు (సౌశీలవతి) అయిన స్త్రీ (తల్లి/భార్య) ఉన్న ఇల్లు,చిన్న దీపము దట్టమైన చీకటిని పారద్రోలినట్లు (పోగొట్టినట్లు)కళాకాంతులతో దేదీప్యమానంగా ఉంటుంది.  ఆ ఇల్లు దేవతామూర్తులను అర్చించేదేవాలయము వంటిది. ఇక్కడ ఇంటిలో (కుటుంబములో)స్త్రీ మూర్తి యొక్క ప్రాధాన్యతను, సౌశీల్యము యొక్కవిశిష్టతను మనకు చక్కటి ఉన్నతమైన ఉపమానాలతో వక్కాణిస్తూ తెలియపర్చుతున్నారు.
ఇదేభావాన్ని వేమన ఇంకొక (ఈ దిగువ) పద్యంలోకూడా వ్యక్తీకరించారు.

ఆ.వె॥గుణవతి గల గృహము గోము నొందించును
       చీకటిం`ట దివిటె చెలఁగునట్లు;
       దేబెయున్న కొంప దివ్వెనిల్పినయట్లె
       విశ్వదాభిరామ వినరవేమా!. (70అ)
గోము-కోమలము, ఆనందము,ఆహ్లాదము; దేబె - పనికిమాలినది, దేవురుగొట్టు, మూఢురాలు, గుణవంతురాలు కానిది;దివ్వెనిల్పినయట్లె – దీపము ఆర్పివేసినట్లె – చీకటి మయము; కళాకాంతులుండవు. ||04-07-2014||

తెలుగు సుద్దులు…..(71)
ఆ.వె॥ఇంటియాలు విడిచి యిల జారకాంతల
        వెంట దిరుగువాడు వెర్రివాడు
        పంటచేను విడిచి పఱిగె యేరిన యట్లు    
        విశ్వదాభిరామ వినర వేమా!.

భావముః
ఈ భూమి మీద, ఇంటిలోని సలక్షణమైన భార్యను వదలి (పట్టించుకోకుండా) మాటకారులైన వేశ్యల వెంట వ్యామోహముతో తిరిగేవాడు, చక్కటి పంటను వదలి పఱిగి (పంటను కోస్తున్నప్పుడు రాలిన ఎన్ను) ఏరుకుంటున్న పరమ తెలివితక్కువాడితో సమానమని వేమన జారకాంతల పాలి పడి అమూల్యమైన కట్టుకున్నదానిని విస్మరించడము తెలివితక్కువతనమని హితవు పలుకుతున్నారు.  పరస్త్రీ వ్యామోహంలో ఎన్నో పచ్చటి సంసారాలు బీడువారటము నేటికీ చూస్తూనే ఉన్నాము కదా!!||15-07-2014||

తెలుగు సుద్దులు…..(72)
ఆ.వె॥రాజవరుల కె`పుడు రణరంగముల చింత;
       పరమ మునుల కె`ల్ల పరము చింత;
       యల్పనరుల కె`ల్ల  న`తివెలపై చింత    
       విశ్వదాభిరామ వినర వేమా!.

భావముః
ఈ పద్యంలో వేమన మూడు గుణాలకు (రాజసము, సత్త్వము, తామసము) సంబంధించి ఆలోచనాధోరణి ఎలా ఉంటుందో బహు చక్కగా, క్లుప్తంగా వివరించారు.
రాజ్యాధిపతులు యుద్ధాల గురించి ఆలోచిస్తుంటారు(రాజస గుణము కలవారు ఎప్పుడూ ఇతరులను ఎలా జయించాలి, ఇతరులపై ఆధిపత్యము ఎలా సంపాదించాలని ఆలోచిస్తుంటారు); ఉత్తములైన మునివరులు పరమాత్మ (పరబ్రహ్మము) గురించే ఆలోచిస్తుంటారు (సత్త్వ గుణము కలవారు ఇతరముల మీద ధ్యాసలేక, ధార్మిక చింతనతో పరబ్రహ్మ తత్వము గురించే ఆలోచిస్తుంటారు); కాని, అల్పులైన మానవులకు(తామసము గుణము వలన ఐహిక వాంఛలపై మమకారము ఎక్కవగా ఉంటుంది కనుక) స్త్రీల మీదే ధ్యాసుంటుందని (స్త్రీలోలత్వము వలన మిగతా తామస ప్రవృత్తి లక్షణాలూ అబ్బుతాయి కనుక) వేమన, స్త్రీవ్యామోహమున్న వారు వేటిమీద దృష్టిపెట్టలేరని,వారు అధమ తరగతి మానవులని, కనుక స్త్రీ లోలత్వము తగతదని కూడా హెచ్చరిస్తున్నారు. ||16-07-2014||


తెలుగు సుద్దులు…..(73)
ఆ.వె॥తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు
       పుట్టనే`మి? వాడు గిట్టనే`మి?
       పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా?
       విశ్వదాభిరామ వినర వేమా!.

భావముః
పెద్దైన తరువాత తల్లిదండ్రుల ఆలనాపాలనా (బాగోగులు) చూడనటువంటి కొడుకు బ్రతికిఉన్నా చచ్చినవానితో సమానము; వాని మానవజన్మకు సార్ధకతలేదు.అట్టివాడు చెదపురుగుతో సమానమని [చెదపురుగు వలన ఉపయోగము లేకపోగా వస్తువుకు (కర్ర, బట్టలు, కాగితాలు, పుస్తకాలు) హాని కలుగుతుంది; అలాగే పిల్లలు తల్లిదండ్రులను చూడకపోతె, వారు జీవనానికి ఇబ్బంది పడటమే కాకుండా మానసికంగా కూడా కృంగి కృశిస్తారు కదా!] వేమన పిల్లలకు తల్లిదండ్రుల పట్ల గల గురుతర బాధ్యతను గుర్తుచేస్తున్నారు.||17-07-2014||

తెలుగు సుద్దులు…..(74)
కం॥ముందరి పోటులు మాన్పను
     మందెం`దై`నాను గలదు మహి లోపలనే; 
     నిందల మాటలు మాన్పెడు
     మందెం`దై`నాను గలదె? మహిలో వేమా!.
భావముః
ఈ భూమి మీద పోట్లగిత్త (గొడ్డు) పోట్ల గాయాలు మానడానికి (స్వస్థత చేకూరడానికి)సైతమూ మందున్నదికాని (మనకు దొరుకుతుంది) దుష్టప్రచారకుల నిందలు కల్గించే (మానసిక) గాయాలను మాన్పగల మందు మటుకు లేదు (దొరకదు). మానసిక గాయాలను మాన్చడము  సులభతరము కాదు, కనుక నిందలు వేయడం మంచిది కాదని గుర్తెరిగి మసలుకోవలసినదిగ వేమన హితవుకూడా పలుకుతున్నారు.

ఇదే విషయాన్ని గతంలో ఇంకో పద్యంలో[తెలుగు సుద్దులు…..(49)]  కూడా తెలుసుకున్నాము.
ఆ.వె||ఇనుము విరిగె నే`ని యిను మారు ముమ్మారు
         కాచి యతక నేర్చు కమ్మరీడు;              
         మనసు విరిగెనే`ని మరి యంట నేర్చునా?
         విశ్వదాభిరామ వినర వేమా!.
అందుకని, ఇతరులను నొప్పించి తరువాత ఎన్ని సారీలు, క్షమార్పణలు చెప్పినా మనస్సుకు గాఢంగా తగిలిన గాయాలను మాన్పలేము కనుక నిందలు వేయడం, ఇతరుల మనస్సు నొప్పించడం తగదు. ||18-07-2014||

తెలుగు సుద్దులు…..(75)
ఆ.వె||తత్వమె`రుగువాడు దైవంబునె`రుగును;         
         సర్వసారములను జంపజేయు;
         కదళి మ్రింగువాడు గరళంబు మ్రింగునా?
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
పరమాత్మతత్వము (స్వరూపము), పరబ్రహ్మజ్ఞానము తెలుసుకొన్నవాడు మాత్రమే దైవత్వమును (దైవమును) దర్శించగలడు; అన్ని వేదసారములను సమాహారము చేసి ఆకలింపుచేయగలడు.  ఆట్టివాడు, లోకవిషయపరిజ్ఞానమునందు (ప్రాపంచిక విషయములందు) అనురక్తుడు కాడు. ఎలాగంటే మధురమైన కదళీఫలము (అరటిపండు) తినేవాడు విషమును తినడానికి ఇష్టపడడుకదా?
ఇక్కడ వేమన దైవత్వమందుట గురించి ప్రస్తావించారు.పరబ్రహ్మ జ్ఞానాన్ని అరటిపండుతో పోల్చారు. తెలుసుకొనేకొద్ది ఇంకా,ఇంకా తెలుసుకొనవలెననే జిజ్ఞాస కలుగుతుంది. ||19-07-2014||

తెలుగు సుద్దులు…..(76)
ఆ.వె||నీళ్ళ మీద బుగ్గ నిలచిన యప్పుడు    
         తళ్లు వేగవచ్చి తాకు గాకః
         విడెడు కుండ కిం`త విభ్రాంతి పడుదురు
         విశ్వదాభిరామ వినర వేమా!.         
భావముః
కెరటము, చిన్న అలలు తాకి వెళ్లగానే ఏర్పడే నీటిబుడగ కేవలము మరలా కెరటము వచ్చి తాకేవరకే ఉంటుంది. దాని జీవనము క్షణభంగురమాత్రమే. మానవుడు తన శరీరము (జీవితము) కూడా నీటిబుడగ మాదిరి జారిపోయె కుండవంటిదైనా (అశాశ్వతమైనా) అది శాశ్వతమని భ్రమలో పడుతుంటాడు. కనుక భ్రమవీడి సత్యాన్ని గ్రహించి, పరమాత్మను గుర్తెరిగి జీవితాన్ని ఉన్నంతవరకు సద్వినియొగించుకోవలసినదిగా వేమన తాత్వికదృష్టి గురించి బోధిస్తున్నారు.||20-07-2014||

తెలుగు సుద్దులు…..(77)
ఆ.వె||హేమకార విద్య నె`రిగిన వా`రెల్ల
        వెతల బడని యట్లు విద్యచేత
        తత్వ మె`రుగు వెనుక తనకు చింతే`లరా?            
        విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
రసవాదము (బంగారము తయారుచేయువిద్య) తెలిసినవారు ఎలా కష్టాలబారి పడరో (ఆర్ధికసమస్యలు తద్వారా మిగతా సమస్యలుండవో) అలాగే విద్య (సాధన ద్వారా ఆత్మజ్ఞానం పొందటం) ద్వారా పరమాత్వ తత్వము, స్వభావమును అర్ధము చేసుకొన్నపిదప ఇక వారికి ఐహిక చింతలు (బెంగలు, దిగుళ్లు, విచారాలు) ఎందుకుంటాయి? ఉండవు కనుక, ప్రాపంచిక విషయాలలో పడి వెతలబారి పడకుండా బంగారంలాంటి ఆత్మజ్ఞానాన్ని పొందేదానిమీద దృష్టి పెట్టి (యోగసాధన ద్వారా) పరమాత్మను గుర్తెరిగి దర్శించడానికి ప్రయత్నించండని ఒక మహాయోగిగా వేమన హితవు పలికితున్నారు.॥21-07-2014॥

తెలుగు సుద్దులు…..(78)
ఆ.వె||జీవభావ మె`రుగ జెడదె`న్నటికిమతి;
         దైవమును నె`రుంగ దనరు బుద్ధి;
         తేజము`దయమం`ద దిమిరంబు నిలువదు
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
పరమాత్మ(స్వరూపము -తత్వము-భావము)గురించి తెలుసుకొనగలిగితే బుద్ధి పెడదారిపట్టడం అనేది జరుగదు.  అసలు విషయాన్ని తెలిసిన అజ్ఞాన మెక్కడుంటుంది? సూర్యోదయము కాగానే (దీపము వెలిగించగానే) చీకటి ఎలా నిలువదో (పటాపంచలవుతుందో) అలాగే ఎప్పుడైతే దైవతత్వము బోధపడిందో అపుడు మానవ బుద్ధి అంధకారపు ఆలోచనలనుండి బయటిపడి అతిశయిస్తుంది. కనుక మానవుడు అజ్ఞానమనే చీకటిలో మ్రగ్గక అంతరంగ జ్యోతిని ప్రజ్వలింపజేసుకొని పరమాత్మ తత్వాన్ని తెలుసుకొనడానికి నిరంతరము కృషిచేయవలసిఉంటుందని వేమన బోధిస్తున్నారు. ॥22-07-2014॥

తెలుగు సుద్దులు…..(79)
ఆ.వె||ఆశచేత మనుజు లా`యువు గలనాళ్లు
         దిరుగుచుందురు భ్రమ ద్రిప్పలేక;
         మురిగి భాండ ముసరు నీ`గల భంగి
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
మనుషులు జీవించినంతకాలమూ ఆశ అనే వలయములో చిక్కుకొని (దురాశగా మారి) దానిమీద భ్రమను (ఆశను, కోరికను) మరల్చుకోలేక, మురికిపాత్ర (పదార్ధములు వండి బయటపడేసిన ఖాలీ వంటపాత్రలు లేదా మురికి నీటిపాత్ర) చుట్టూ ముసిరే (గుమిగూడే) ఈగలు మాదిరి ఆశను వదులు కోలేరు. మురికి పాత్రలు చుట్టూ ఎంత తిరిగినా ఎలా ఉపయోగముండదో అలాగే ఆశను వదలుకోలేని మనిషికి చింతలు తప్పవు, అజ్ఞానంతోపరమాత్మ తత్వము మీద దృష్టి నిలువదు. జీవాత్మను పరమాత్మకు అనుసంధానించడం దుర్లభం అవుతుంది. కనుక, మానవుడు ఈగలవలే ప్రవర్తించకుండా ఆశామోహము నుండి బయటపడి జీవాత్మను పరమాత్మకు అనుసంధానించడం ద్వారామానవ జన్మను సార్ధకము చేసుకొనమని వేమన బోధిస్తున్నారు. ||23-07-2014||

తెలుగు సుద్దులు…..(80)
ఆ.వె||పర(రు)సమి`నుము సోకి బంగారమైనట్లు;
         కప్పురంబు జ్యోతి గలసిన`ట్లు;
         పుష్పమందు తావి పొసగిన`ట్ల`గు ముక్తి
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
పరుసవేది (స్పర్శవేధి – ఒకప్రత్యేకమైన మూలికా రసముతో స్పర్శమాత్రమున ఏ లోహమునునైనా విలువైన మెరిసే బంగారంగా మార్చే ప్రక్రియ) వలన తక్కువ విలువైన యినుము విలువైన మెరిసే బంగారంగా ఎలా మారుతుందో; కర్పురము అగ్నితో కల్సి ఎలా చక్కగా ప్రజ్వలిస్తుందో అలాగా మానవునికి, జీవాత్మను పరమాత్మతో అనుసంధానము చేయటంవలన, పుష్పములో పరిమళము పొందుపర్చబడినట్లు ముక్తి లభిస్తుంది.
వేమన, ఈ పద్యంలో తాత్విక విషయాన్నితెలియపర్చడానికి, అందరికీ తెల్సిన బహు చక్కటి ఉపమాన, ఉపమేయాలను వాడారు. మానవుడు, ఇనుమనే అజ్ఞానముతో కూడుకున్న బుద్ధిని, కఠినమైన మనస్సును (జీవాత్మను) బంగారం అనే పరమాత్మ వైపు భక్తి, తత్వజ్ఞానము, సాత్వికత అనే పరసువేదితో మరల్చ (మార్చ) గలిగితే, జీవాత్మ కర్పూరంగా మారి అగ్నిలో (పరంజ్యోతిలో) కల్సి ప్రజ్వలిస్తుంది అలాగే సుందర, సుకుమారమైన పువ్వుకు (జీవాత్మకు) పరిమళం అబ్బినట్లు మానవునకు ముక్తి (పరమాత్మలో ఐక్యత) కూడా లభిస్తుంది.. ||24-07-2014||

తెలుగు సుద్దులు…..(81)
ఆ.వె||కుండ పగిలెనే`ని కొత్తది గొనవచ్చు;
        భూతలంబు నందు పొందుగాను
        కూలబడిన నరుడు కుదురుట యరుదయా  
        విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
అజాగ్రత్త వలన మట్టికుండ పగిలిపోతే చక్కగా మరియొకటి కొనుక్కోవచ్చు;కాని, స్వయం నియంత్రణ లేక (అజాగ్రత్త) ఒకసారి మనిషి నీతిమాలిన వానిగా చెడిపోతే తిరిగి మంచివానిగా బాగుపడటము లేదా స్థిరత్వము చెందటము దుర్లభము, జరిగితే అది అపురూపము, అద్భుతమే. కనుక మానవులు చెడుదారులలోకి మరలొద్దని వేమన హితవు పలుకుతున్నారు.తిరిగిబాగుపడటం డబ్బుతో క్రొత్తకుండ కొనుక్కున్నంత తేలికకాదు సుమా అని హెచ్చరిస్తున్నారు.॥26-07-2014॥
తెలుగు సుద్దులు…..(82)
ఆ.వె||జపము బాహ్యపూజ్య జాలజేసి పిదప
         కపటము విడలేక కష్టనరులు
         ముక్తి నొం`దలేక మునిగిరి తమమున               
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
మానవులు జపములు, పూజాపునస్కారాలు (మొక్కుబడిగా) చేస్తూ కూడా, కపటము (కుటిలత్వము - మోసము, డంబము, భేషజము, వంచన మొదలయినవి) నుండి బయటపడలేక పోవడము వలన పరమాత్మమీద సంపూర్ణదృష్టి పెట్టలేక, పాపం అమాయకులై, భవబంధాల చీకటి (మాయ) లోపడి ముక్తిపొందలేకపోతున్నారని వేమన విచారము వ్యక్తపరుస్తున్నారు,  సద్గురుముఖంగా సరిఐన జ్ఞానోపదేశము (గురు వాక్యము) పొంది ముక్తి కొరకు సరిఐన పద్ధతిలో ప్రయత్నము చేయవలసిన ఆవశ్యకతను కూడా ఇందులో నిఘూఢముగా తెలుపుతున్నారు. ॥27-07-2014॥

తెలుగు సుద్దులు…..(83)
ఆ.వె||ఊర్ధ్వలోకమందు ను`చిత క్రమంబున
          రూపమే`మి లేక రూఢి తోన;
          పరమయోగి చూచు పరమాత్ముడి`తడ`ని           
          విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
పరమయోగి నిరతర కఠోరసాధనద్వారా జీవాత్మయొక్క నిజమైన యునికి గుర్తెరిగి, సకారరూపభగవంతుని ధ్యానిస్తూ తుట్టతుదకు జ్ఞాన, విజ్ఞానముల సహాయంతో తప్పకుండా అనంతలోకంలో నిర్గుణరూపుడైన ఆ పరమాత్మను గుర్తెరిగిదర్శించగలడు.
భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మచెప్పినదానిని పూర్తిగా వంటబట్టించుకున్న ఒక పరమయోగిగా, వేమన మానవులకు పరమాత్ముని నిర్గుణ రూపములోచూడవలెను అని భోధిస్తున్నారు.
ఇంద్రియాణి మనో బుద్ధిః అస్యాధిష్ఠానముచ్యతే।
ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్॥ భగవద్గీత -3-40(కర్మయోగము)
కామమను (కోరిక) ఈ శత్రువు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి యను మూడావరణల నడుమ దాగి, జ్ఞానము నావరించి, ఈ మూడావరణల ద్వారా జీవుని భ్రమింపజేయును.
తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ!
పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాన నాశినమ్॥ భగవద్గీత-3-41
పార్ధా! కావున నీవు ప్ర్థమమున ఇంద్రియముల నిగ్రహించి, జ్ఞాన, విజ్ఞానముల రెంటిని నశింపచేయు కామమను మహాపాపిని నిర్మూలింపుము.
జ్ఞానముః ఆత్మజ్ఞానము లేక అవ్యక్తపరమాత్మజ్ఞానము; శాస్త్రజ్ఞానము లేక బుద్ధి జన్య జ్ఞానము
విజ్ఞానముః ప్రపంచజ్ఞానము లేక వ్యక్తపరమాత్మజ్ఞానము; అనుభవజ్ఞానము లేక అంతరాత్మ ప్రభోధ జనితజ్ఞానము
ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః ప్రం మనః।
మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః॥ భగవద్గీత-3-42
ఏవం బుద్ధేః పరం బుద్ద్వా సంస్తభ్యాత్మానమాత్మనా।
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్॥ భగవద్గీత-3-43
ఇంద్రియముల కంటే మనస్సు, మనస్సుకంటే బుద్ధి శ్రేష్ఠమైనవి, ప్రబలమైనవి.  బుద్ధికంటె కూడా శ్రేష్ఠుడు ఆత్మ. బుద్ధి గుహయందు అజ్ఞానతమోరూపమగు అహంకార మావరించి యుండిఅందు కాముడు దాగియుండును.  అక్కడే స్వయంప్రకాశకమగు ఆత్మజ్యోతి కూడా వెలుగుచుండును.  మూడావరణముల నతిక్రమించి కామమును నిర్మూలింపవలసియుంటుంది.  ఇంద్రియములు మొదటి ఆవరణ –వనిని నిగ్రహింపవలెను.  బుద్ధి మూడవ ఆవరణ –దీనిని పరిశుద్ధ మొనర్పవలెను.  పిమ్మట మధ్య్ యావరణ యగు మనస్సు ఎటు పోవుటకును దారిలేక చాచల్యము విడిచి యణిగి యుండును. కామము (శత్రువు) చీకటిలో దాగుకొని కానరకుండును.  ఆత్మప్రకాశముయొక్క వెలుగుచే నీకామమును కనిపెట్టి నిర్మూలింపవలెను.  అనగా ఆత్మసాక్షాత్కారము, లేక ఈశ్వరసాక్షాత్కారము గాక కమజయమసాధ్యము.
త్రిభిర్గుణమయైర్భావై  రేభిన్సర్వమిదం జగత్।
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమప్య్యమ్॥ భగవద్గీత-7-13(విజ్ఞానయోగము)
ఈ జగత్తంతయు సాత్విక, రాజస, తామస భావములచే భ్రమచెందుటవలన వీటి కటితుడును, నాశరహితుడును అగు నన్ను జనులు ఎరుగనేరరు
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా।
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే॥ భగవద్గీత- 7-14.
నాయీ మాయా శక్తి లేక యోగమాయ త్రుగుణాత్మకమైనది, దివ్యము దాట శక్యముకానిది. నన్నెవరాశ్రయింతురో, లేదా నాకు శరణాగతులగుదురో వారే నా మాయనతిక్రమింతురు, (దాన్ని ఛేధించుకొని ముందుకు పోతారు).
॥28-07-2014॥

తెలుగు సుద్దులు…..(84)
ఆ.వె||సత్యమ`మరి యుండ జ్ఞాన మ`మరి యుండు;
         జ్ఞానమ`మరి యుండ సత్యముం`డు   
         జ్ఞాన సత్యములును సమమై`న ద్విజుడ`గు
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
సత్యపరిపాలన కలవాడైతే జ్ఞానముకూడా అబ్బుతుంది.  అలాగే జ్ఞానముకలవాడైతే సత్యపరిపాలనా దక్షుడవుతాడు. సత్య, జ్ఞానములు రెండూ సర్వోత్కృష్టములు కనుక, ఎవరి యందు జ్ఞానము, సత్యము రెండూ సమపాలలో ఉంటే అట్టివాడు సర్వతోముఖుడగును.  ఆత్మజ్ఞానము కలిగి బ్రహ్మజ్ఞుడగును. (అజ్ఞానమునుండి బయటపడి సత్యము, జ్ఞానము సంపూర్ణముగా వంటపట్టిచ్చుకొని సంస్కారవంతమైన జీవనము గడుపువాడగును.పునర్జన్మనెత్తినవాడు.)||29-07-2014||

తెలుగు సుద్దులు…..(85)
ఆ.వె||దానమొ`సగు కన్న దేనంబు మరి హెచ్చు;
         దేన మొ`సగు కన్న తెలివి హెచ్చు;
         తెలివికన్న నాస దెగవేసినది హెచ్చు
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
దానధర్మాలు చేయటం కన్నా ధ్యాననిష్టుడగుట మరింత ఉత్తమము. ధ్యానంద్వారా యోగిగా మారి జీవాత్మ-పరమాత్మ తత్త్వాన్ని(భేదజ్ఞానాన్ని)తెలుసుకొనడం ఇంకా ఉత్తమము.  వీటన్నిటికన్నా ఆశాపాశాన్ని తెంపుకోవటముచాలా, చాలా ఉత్తమము, గొప్ప.  పరమాత్మను పుర్తిగా తెలుసుకొని పరమాత్మలో ఐక్యమవడానికి భక్తి, లేక ముముక్షుత్వము, ధ్యానము, వివేకము, వైరాగ్యము అనేనాలుగు అంచెలు దాటాలి అని వేమన సాధుపుంగవులు సైతము పూర్తిగా మోహము, ఆశను విడవలేక పోవడం గమనించి ఈ విధంగ తెలుపుతున్నారు..  అంతేగాక, ఆశఎంత ప్రమదకరమైనదో, దానిని అధిగమించడము ఎంత కష్టతరమో, అవసరమో కూడా మనకు సూచిస్తున్నారు.
శ్రీకృష్ణభగవానుడు శ్రీమద్భగవద్గీతా – సాంఖ్యయోగములో దీనిగురించే చెబుతూ….
విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః।
నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి॥ (71)
ఎవడు కోరికల నన్నిటినివదలి, నిపేక్షుడై అహంకారమమకారములను వీడి సంచరించునో వాడు పరమ శాంతిని పొందును.
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ! నైనాం ప్రాప్య విముహ్యతి।
స్థిత్వా2స్యామంతకాలే2పి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి॥ (72)
ఓ పార్థా! ఇదే బ్రాహ్మీస్థితియనబడును.  ఈ స్థితిని పొందినవాడు మరల మోహములో మునుగడు.  అనగా భ్రమలకు పాల్పడడు.  ఈ స్థితిని మరణసమయమునకు సాధింప గలిగినను నిర్వాణపదవి నధిష్ఠించును.
||31-07-2014||

తెలుగు సుద్దులు…..(86)
ఆ.వె||దొంగమాటలాడ దొరుకునా మోక్షంబు?
         చేతగాని కూత చెల్లదె`పుడు?
         గురువు పద్దుగాదు గుణహీనమది గాక
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
కల్లబొల్లి మాటలతో, ఆంతరిక అనుభవ సాధన లేకుండా, కేవలం పుస్తకపరిజ్ఞానంతో, లేదా గురువు దగ్గర నేర్చుకున్న నాలుగు ముక్కలు(ఇతరులమాటలనే) యాంత్రికంగా మారుపలుకుతూ ఉంటే వాటికివిలువ ఉండదు. అట్టివారు గురువులమని చెప్పుకొని చలామణి అయినా అదివారి కుటిలత్వమును, నీచత్వమును తెలుపుతుందే తప్ప వారు గురువులలెక్కలోకి రారు. దానివలన వారికీ ముక్తి లభించదు.
ఈ పద్యంలో ఎవరినైనా గురువుగా ఎన్నుకోవాలని అనుకున్నప్పుడు ఎటువంటి పరిశీలన చేయలి అనే విషయం తెలుపుతున్నారు. ||01-08-2014||

తెలుగు సుద్దులు…..(87)
ఆ.వె||గాలిలేని దీపకళిక చందంబున,
         నలలు సుళ్లులేని జలధి రీతి;
         నిశ్చలా`త్మ యెన్న నిర్వికారంబున
         నుండెనే`ని ముక్తి యండ్రు వేమా!      
భావముః
గాలితగలకుండా జాగ్రత్తపడితే దీపము ఏవిధముగా చక్కగా ఆరిపోకుండా స్థిరంగా వెలుగుతుందో ఆవిధంగా; మరియు అలలు, వాయుగుండాలు లేని సముద్రము ఎంత ప్రశాంతంగ ఉంటుందో అలాగా; మానవుడు గాలి, అలలు, సుడిగుండాలు లాంటి కోరికలను (భౌతిక, మానసిక వాంఛలను) దగ్గరికి రాకుండా జాగ్రత్తపడుతూ నిర్వికారంగా (ఎటువంటి వికారములు – ఉద్వేగములు పొందకుండా) ఆత్మను నిశ్చలస్థితిలో(యోగ సాధనద్వారా) ఉంచగలగటమే, దోషములంటకుండా జాగ్రత్త పడితే, దానినే ముక్తి అని అంటారు. ముక్తి సాధనకు మానవుడు ఏమి చేయాలి అనేదానిని వేమన చక్కని ఉదాహరణలతో బోధిస్తున్నారు.
బహుసా వేమన, శ్రీకృష్ణపరమాత్మ శ్రీమద్ భగవద్గీత కర్మసన్న్యాసయోగములో చెప్పిన-“ఎవరి మనస్సు సామ్యస్థియందు అనగా నిశ్చలమై యుండునో అట్టివారు ఈ లోకమందే జననమరణములను జయించినవారు లేక జీవన్ముక్తులు.  పరబ్రహ్మస్థితి దోష రహితమైనది. కావున దోష రహితమగు (కామవాసనులు-కోరికలు లేకుండుట) మనస్సు గలవారు పరబ్రహ్మస్థితి యందున్నవారే.” అనేది సామాన్య మానవులకు తేలికగ అర్ధమగుటకు నిత్యము చూచే ఉదహరణలతో చెప్పడానికి ప్రయత్నించినట్లున్నది.
ఇహైవ తైర్జితస్సర్గో యేశాం సామ్యే స్థితం మనః।
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ర్బహ్మణి తే స్థితాః।|5-19 ||02-08-2014||

 తెలుగు సుద్దులు…..(88)
ఆ.వె||మంట లోహములను మాను చీలలయందు
          బటము గోడల`లందు బరగ నిసుక
          బెట్టనం`టున`ట్ల బెనగు దేహము జీవి
          విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
నిప్పుకొలిమిలో లోహములను (ఇనుము, ఇత్తడి, వెండి, బంగారము) కాల్చి చీలలగా (మేకులుగా) చక్కగా తయారుచేయబడుతాయి – అగ్ని వలన రూపాంతరము పొందిన మేకును గోడకు కొట్టి చిత్తరువును (పటమును) వ్రేలాడతీస్తాము –గీడమీద చక్కగా అమర్చబడుతుంది (నిలుపబడుతుంది). దానికి ఆధారము, గోడలొ వాడబడిన ఇసుక రేణువులు మేకును గట్టిగా పట్టిఉంచుతాయి. మేకుకు, గోడకు (ఇసుకరేణువులకు) చిత్తరువుతో సంబంధము లేదు. కాని, అవి చక్కగా జతపడి ఉంటాయి. అలాగే దేహమునకు, దేహధారణకు (జీవాత్మ ఏ దేహములో నివసిస్తుందో) సంబంధము లేదు. దేహము శాశ్వితము కాదనే సత్యాన్ని గ్రహించాలని వేమన హితవు. ||04-08-2014||

తెలుగు సుద్దులు…..(89)
ఆ.వె||కలుషమె`ల్ల (దెలియ) దలవంపులకు మూల
         మ`రయ తత్వమె`ల్ల నా`త్మ బుట్టు;
         తెలిసినం`దుకు మరి ధీరుండు గావలె!
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
మనస్సులో పుట్టే పాపపు ఆలోచనలే మనలని తలవంచుకొనేటట్లు చేస్తాయి అని తెలుసుకొని జ్ఞానంతో ( చెడు ఆలోచనలకు లొంగకుండా – నిగ్రహంతో) మెలిగే వాడు ధైర్యంగా (ఆత్మ నూన్యతా భావము – ఆంధోళన లేకుండా) తలఎత్తుకొని ప్రశాంతంగాతిరుగగలడు. ఈ పద్యములో, ‘మానసిక నిగ్రహం యొక్క ఆవశ్యకత, గొప్పదనము’ గురించి వేమన మనకు తెలియచెప్పుతున్నారు. ॥06-08-2014॥

తెలుగు సుద్దులు…..(90)
ఆ.వె||అనగననగ రాగ మ`తిశయిల్లుచు నుండు
         తినగతినగ వేము తీపి నుం`డు
         సాధకమున బనులు సమకూరు ధరలోన
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
తరుచుగా పాడుతూ ఉంటే (సంగీత సాధనచేస్తుంటే) కంఠస్వరము మృధుమధురంగా బాగుగా ఉంటుంది. అలాగే చేదుగా ఉండే వేపచిగుళ్ళు (ఆకులు) సైతమూ తినగా తినగా (ఆరోగ్య రీత్యా రోజూ తింటూ ఉంటే) అరుచిగా అనిపించక రుచికరంగానే అనిపిస్తుంది. జిహ్వకు అలవాటుపడుతుంది. కనుక కఠోరశ్రమకోర్చి, నిరుత్సాహ పడక నిరంతర సాధన వలన ఎట్టి పనులైనా ఈ భూమిమీద సాధింపవచ్చును అని వేమన స్ఫూర్తిదాయకంగా హితవు పలుకుతున్నారు. “అభ్యాసము కూసువిద్య”, “అభ్యాసములేక అందలమెక్కితే అట్టిట్టైనది రెడ్డిపని” సామెతలు కూడా సాధన గురించి చెపుతుంటాయికద!||07-08-2014||

తెలుగు సుద్దులు…..(91)
ఆ.వె||స్థూలము కనుగుడ్డు సూక్ష్మంబుకన్పా`ప
         కంటిపాప నుం`డు కారణంబు,
         కారణమున బ్రహ్మ కళ నె`రుంగవలెను
            విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
పెద్దదైన కనుగుడ్డు కదలకుండా ఉండి సూక్ష్మమైన కనుపాపకు గుడారంలాగా పనిచేస్తుంటుంది. బ్రహ్మ యొక్క సృష్టిలీలావిశేషాలను మనముఅర్ధంచేసుకోవాలంటే అతి ప్రాధాన్యతకల్గిన కనుపాపను అంత చిన్నదిగా ఎందుకు పెట్టాడో తెలుసుకోకలగాలి.  అది తెలుసుకోవాలంటేసూక్ష్మబుద్ధి అవసరము.  అలాగే సూక్ష్మ బుద్ధితో (కనుపాపలాగా) మానవజన్మయొక్క పారమార్ధికత ఏమిటో గ్రహించి పరమాత్మయొక్క ఉనికిని గుర్తెరిగిపరమందమని ప్రాజ్ఞుడైన వేమన మనకు తెలుపుతున్నారు. ||11-08-2014||

తెలుగు సుద్దులు…..(92)
ఆ.వె||తేనె తెరల జాడ తేనెటీగ యెరుంగు
         సుమ రసంబు జాద భ్రమర మె`రుగు;
         పరమ యోగి జాడ భక్తుండె`రుంగును
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః

తేనె పట్టు/తుట్టె ఎక్కడుందో తేనెటీగకు తెలుస్తుంది;మకరందం (పువ్వులలోని తేనె) గురించి తుమ్మెద చక్కగా గ్రహించి ఆశ్వాదించ గలుగుతుంది. అదేవిధంగా జ్ఞానుల గురించి జ్ఞానమున్నవానికే తెలుస్తుంది, వారు చెప్పినది అర్ధం చేసుకొనగలుగుతారు. పరమాత్మను(దైవాన్ని) భక్తుడు మాత్రమే గుర్తించి,పరమాత్మ కృపకు పాత్రుడవుతాడని స్వయంగా పరమ యోగియైన వేమన చక్కటి తేలికైనఉపమానములద్వారా మనకు తేటతెల్లము చేసారు. ||12-08-2014||

తెలుగు సుద్దులు…..(93)
ఆ.వె||అడవి దిరుగలేదు యాకసమునలేదు,
         యవని దీర్థయాత్రలం`దు లేదు
         ఒడలు శుద్ధిజేసి యొడయని జూడరా!
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
అంతఃకరణ శుద్ధిలేకుండా,జీవాత్మ-పరమాత్మల తత్వాన్ని అర్థము చేసుకొనకుండా, ముక్కుమూసుకొని తపస్సుచేసుకొనడానికి అడవులు పట్టితిరిగినా; పైలోకాల్లో పరమాత్మ (భగవంతుడు) ఉన్నాడని పూజలు, పునస్కారాలు చేస్తూ ఎదురుచూపుచూసినా; భూమండలములోనున్న తీర్థములన్నిటిలోమున్గినా (తీర్థయాత్రలు చేసినా) నిష్ప్రయోజనము. ముందు దేహమును (మనస్సును) శుద్ధి పర్చుకొని ఆత్మ భగవంతుడి నిర్వికార, నిర్గుణ ప్రతిరూపం అని గ్రహించి, నీలోనే ఆ పరమాత్మను దర్శించమని పరమయోగి వేమన ఈ పద్యముద్వారా తెలియపరచినారు. మన దేహమే ఒక దేవాలయము, పరమాత్మ ప్రతియొక్కజీవిలోను అంతర్గతంగా జీవాత్మగా ఉంటాడుకనుక, మనలోని జీవాత్మను ఒక యోగిగా దర్శించమని హితవుపలుకుతున్నారు.
భగవద్గీత ఆరవ అధ్యాయము [ఆత్మసంయమ (జ్ఞాన) యోగము] లో శ్రీ కృష్ణభగవానుడు అర్జునుని ద్వారా మనకు తెల్పినది ఇదియేకదా….
యుఞ్జన్నేవం సదా22త్మానం యోగి విగత కల్మషః।
సుఖేన బ్రహ్మసంస్పర్శం అత్యన్తం సుఖ్ మశ్నుతే॥ (28)
సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని।
ఈక్షతే యొగయుక్తాత్మా సర్వత్రసమదర్శనః|| (29)
యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి।
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి॥ (30)
“మనస్సునెప్పుడూఆత్మమీదలగ్నం చేసి పాప రహితుడైన యోగి అతి సులభంగా సర్వోత్కృష్టమైన సుఖం పొందుతాడు. యోగ సిద్ధి పొందినవాడు సమస్త భూతాల పట్ల సమభావం కలిగి సర్వ భూతాలలో తన ఆత్మనూ, తన ఆత్మలో సర్వభూతాలనూ సందర్శిస్తాడు.  అన్నిభూతాలలో నన్నూ, నాలో అన్నిభూతాలనూ చూసే వాడికి నేను లేకుండా పోను; నాకు వాడు లేకుండా పోడు.” ||21-08-2014||

తెలుగు సుద్దులు…..(94)
ఆ.వె||కప్పురంపు మనసుగాంక్షించు యోగికి
         జ్ఞాన దీప శిఖయు దా నటించుః
         కానవచ్చునా`త్మ క్రమమాణమై`నిచ్చ       
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
యోగి (పరివ్రాజకుడు,నిరాసక్తుడు,సాధువు) తన యొక్కమనస్సు కర్పూరంలాగా స్వచ్ఛంగా చేసుకొన్నప్పుడు (చిత్తము, అహంకారము నుండి బయటపడినపుడు),దీప శిఖ వంటిబుద్ధి  కర్పూరంలాంటి మనస్సునుప్రజ్వలింపజేసి ఆత్మజ్ఞానమనే వెలుగుతో చీకటి గుహలో అంతర్గతంగా దాగికొని ఉన్నజీవాత్మను (పరమాత్మఅంశ) తాను కోరుకొన్నట్లు చూడగలుగుతాడు.  ఇందులో వేమన అంతఃకరణ చతుష్టయము (మనస్సు,బుద్ధి, చిత్తము, అహంకారము) మార్పుగురించిప్రస్తావించారు. ||22-08-2014||

తెలుగు సుద్దులు…..(95)
క||నీవా`డిన నేనా`డుదు;
     నీవుం`డిన నేను నుం`దు నిర్విణ్నుడనై,
     నీవు దలంచిన దలపుదు
     నీవు నగిన నేను నగుదు నిజముగ వేమా!
భావముః
 ఓ వేమా! తప్పకుండా నీవు ఆడిస్తే నేను ఆడుతాను; నీ అండ ఉంటే నేను నిర్వేదము (దిగిలు) లేకుండా నిశ్చింతగా విరాగిగా ఉంటాను. నీవు భావిస్తే (ఆలోచిస్తే, స్మరిస్తే) భావిస్తాను; నీవు నవ్వితే నేను నవ్వుతాను.  ఈ పద్యములో వేమన, మానవుని సర్వ కర్మలకు సర్వేశ్వరుడే కర్త అని, అతను పరమాత్మ చేతిలో కీలుబొమ్మ (తోలుబొమ్మ) లాంటివాడని; శారీరకంగా, మానసికంగా తాను చేసే ప్రతిదీ ఆసర్వేశ్వరుని అనుజ్ఞతోనే జరుగుతుంది తప్ప తనవల్ల కాదని గుర్తెరిగి అహం వదలి మసలుకోమనితెలియచెప్పుతున్నారు.ఇక్కడ ప్రత్యేకంగా మనము గుర్తించాల్సినది వేమన పద వైశిష్ట్యము - “ఆడు”అనే దేశ్యము (దేశీయ పదము) వాడి మానవుని దైనందిన పనులన్నిటిని (విహరించడము, సంచరించడము, చలించడం, మునగటము, నర్తించడము, క్రీడించడము, నిందించడము) తెలపడము. ||23-08-2014||

తెలుగు సుద్దులు…..(96)
ఆ.వె||నీరు కారమా`య, కారంబు నీరాయె;
         కారమై`న నీరు కారమా`య
         కారమం`దు నీరు కడు రమ్యమై`యుండు          
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
నీరు, ఉప్పు (క్షారము) గా మారుతుంది; ఆ ఉప్పు మరలా నీటిలో పూర్తిగా కరిగి  పోయి ఉప్పు  నీరుగా మారుతుంది. మళ్ళీ  ఆ ఉప్పు నీటినుండి ఉప్పు వస్తుంది.  నీరు-ఉప్పు  ఎంతో పొందికగా మిలితమై ఉంటాయి.   అందరికీ తెల్సిన ఈచక్కటి ఉపమానము ద్వారా వేమన ఎంతో గాంభీరమైన వేదాంతపరమైన జీవేశ్వరుల అభేధాన్ని(జీవాత్మ-ఉప్పు రూపము ధరించడము; అనంతమైన పరమాత్మ – జలము)గురించి తెలుపుతున్నారు. ||24-08-2014||
 తెలుగు సుద్దులు…..(97)
ఆ.వె||శివుని యనుభవంబు సృష్టిలోపల లేక
         సంశయంబు చెడదు (బుడుగదు$) సాధకులకు
         చెలగు దివ్వెలేక చీకటి వాయునా?
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
ప్రకాశవంతమైన(తేజోవంతమైన) దీపం లేకపోతే చీకటి ఎలాపోగొట్టలేమో అలాగే సాధకుల సంశయములు (అజ్ఞానము) తొలగాలంటే ఈ సృష్టి విలాసానికి మూలమైన - పరమాత్మ (సంశయ నివారుణుడు) శివుని (శంకరుని) ధ్యానము అవసరమని ఒక గొప్ప యోగిగా (సాధకుడుగా) వేమన దిశానిర్దేశము చేస్తున్నారు.  ||25-08-2014||
$ పాఠాంతరము

తెలుగు సుద్దులు…..(98)
ఆ.వె||ఇంద్రియముల చేత నె`గ్గొందు చుండెడు
         వెర్రి మనుజుడే`ల వెదకు శివుని?
         ఇంద్రియముల రోసి ఈశుని జూడుడీ
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
ఇంద్రియములకు లోబడి నడుచుకుంటూ (దాసోహమై) మూఢమానవుడు శివున్ని ఎందుకు వెదుకుతాడో? ఇంద్రియాలను జయించకుండా (తన్ను తాను గుర్తెరకుండా) అజ్ఞానంతో శివున్నిఎంత వెదికినా – పరమాత్మతత్వాన్ని అర్ధంచేసుకోవడానికి ప్రయత్నించినా ఉపయోగమేముండదని;   ముందు ఇంద్రియాలాను జయించి, మోహపాశాలనుండి బయటపడి జ్ఞానవేత్తై  సంపూర్ణ సాధకుడిగా, పరిపూర్ణ భక్తిభావంతో (విరాగిగా) పరమేశ్వరుని దర్శించండీ అని వేమన జ్ఞానబోధచేస్తున్నారు.

“ఇంద్రియాలకు బానిసలయినవాళ్ళు ప్రపంచంలో ఆనందం ఎలా పొందగలరు?  అసహ్యమైన బురదలో పొర్లాడుతున్నప్పుడు, ప్రపంచపు సూక్ష్మసుగంధాలు వాళ్లకు సోకవు.  పాంచభౌతిక సుఖాలకు లోబడ్డ మనిషికి సున్నితమైన విచక్షణలన్నీ నశిస్తాయి. ….. మీ శక్తుల్ని పదిలపరుచుకోండి.  ఇంద్రియాలనే ఉపనదులన్నింటినీ తనలో కలుపుకొనే విశాలమైన మహా సముద్రంలా ఉండండి.  ప్రతి నిత్యం మళ్ళీ మళ్ళీ కలిగే ఇంద్రియవాంఛలు మీ అంతరంగంలో ఉన్న శాంతిని తొలిచేస్తాయి.  అవి జలాశయాని కున్న బెజ్జాలలాంటివి; దానిలోని అమృతతుల్యమైన జలాన్ని భౌతికత్వమైన ఎడారి నేలలో వ్యర్థమయ్యేట్లు చేస్తాయవి. చెడుకోరిక తాలుకు బలీయమైన ప్రచోదకప్రేరణ మానవుడి సంతోషానికి మహాశత్రువు.  ఆత్మనిగ్రహ సింహంలా ఈ ప్రపంచంలో తిరగండి; ఇంద్రియ దౌర్భల్యాలనే కప్పలు మిమ్మల్ని లోకువకట్టి ఆటపట్టించకుండా చూసుకోండి!”(ఒక యోగి ఆత్మకథ – 161పుట.)||26-08-2014||

తెలుగు సుద్దులు…..(99)
ఆ.వె||కడుపు నిండ సుధను గ్రమముతో ద్రావిన
         పాల మీదనే`ల పారు మనసు?
         తత్వమె`రుగ వెనుక తత్వంబు లే`టికో
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
కడుపునిండా అమృతంలాంటి తేనెను జుర్రుకొని త్రాగినవానికి పాలమీదకు మనసు ఎందుకు పోతుంది? (పాలు త్రాగాలనే కోరిక కలుగదుకదా?) అలాగే పరమాత్మ గురించి తెలుసుకున్నవానికి (భగవత్పరమైన జాగృతి కలిగిన సాధకునికి, దైవసాక్షాత్కారం పొందినవారికి) పరమాత్మ గురించి ఇతర తత్వబోధనలెందుకు? వారికి అవసరముండదు . పరమాత్మ తత్వము తెలుసుకొనడంలో ఉన్న మాధుర్యాన్ని (అలౌకిక ఆనందాన్ని) వేమన ఈ పద్యంలో చక్కటి ఉపమానంద్వారా తెలియపర్చారు. ||27-08-2014||

తెలుగు సుద్దులు…..(100)
ఆ.వె||ఉత్తమోత్తముండు తత్వజ్ఞుడి` (లమీద)
         మహిమ జూపువాడు మధ్యముండు
         వేషధారి యుదర పోషకుడ`ధముండు
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
వేమన ఈ పద్యంలో సాధువులలోని తరగతులను (రకములు) గురించి చెప్పుతున్నారు. ఈ భూమిమీద భగవత్పరమైన జాగృతి కలిగి, దైవసాక్షాత్కారం పొందిన పరిపూర్ణ విరాగిసద్గురువు (తత్వజ్ఞుడు) ఉత్తమోత్తముండు;  భగవత్పరమైన జాగృతి కలిగి,దైవసాక్షాత్కారం పొంది, ప్రపంచశ్రేయస్సుకు,  శ్రేష్ఠమైన మానవాభ్యదయ లక్ష్యాలకితన సాధనశక్తులద్వారా మహిమలను చూపేవాడు మధ్యముడు (ఉత్తముడు).గడించిన సాధన శక్తులను, కేవలము ధనము, ప్రాపకము కోసం స్వార్ధపూరితంగా ఉపయోగించేవాడు, ఎటువంటిసాధన శక్తులులేకున్నా, కేవలము సాధువుల వేషధారణతో పొట్టపోసుకొనేవాడుఅధముడు.
భజగోవింద శ్లోకములో కూడా ఈ మూడవతరగతి సాధువుల గురించి ప్రస్తావన ఉందికదా….
జటిలో ముణ్డీలుఞ్చితకేశః
కాషాయాంబర బహుకృత వేషః |
పశ్యన్నపి చ న పశ్యతిమూఢో
హ్యూదర నిమిత్తో బహుకృతవేషః || ||భజగోవిందం||||28-08-2014||


తెలుగు సుద్దులు…..(101)
.వె||హృదయమందు నున్న యీశుని (యాతనిఁ) దెలియక
        శిలలకె`ల్ల మ్రొక్కు జీవులార!
           శిలలనే`మి యుండు జీవులందే కాక?
           విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
హృదయంలో (తనలోనే) ఉన్న పరమేశ్వరుని (జీవాత్మ-పరమాత్మను) ముందుతెలుసుకొనకుండా, అంతరదృష్ఠిలేకుండా) రాతిబొమ్మలకు మ్రొక్కే మానవులారా! మానవులయందు కాక రాతిబొమ్మలలో ఏముంటుంది?
పద్యము బాహ్యమునకు విగ్రహారాధన వ్యర్ధమనట్లున్నా, పరమహంస వేమన ఒక ద్రష్టగా మానవులకు పరమాత్మను నిర్గుణునిగా దర్శించవలసిన అవసరమును, మనోనిబ్బరముతోకూడిన మానసిక ఆరాధనను, అంతిమముగా ప్రతివ్యక్తిలో పరమాత్మను దర్శించగల స్థితికి రావలని (మానవసేవయె మాధవసేవ) తెలియచెప్పుతున్నారు. ||29-08-2014||



 

No comments:

Post a Comment