శ్రీ వేంకటేశ్వర శతకమురచన: బ్రహ్మశ్రీ నందనవనము వెంకట సుబ్బరామయ్య శర్మ గారుఆనంద-ఉగాది (1974)సర్వకర్మలు నావిగా సంస్మరించి
భక్తితోనుండువారల బాధలుడిపి
కాచుభారము నాదని ఘనతబల్కు
విమల నందనవన వెంకటేశు డితడు.
|
శతకములోని పద్యములను Face Book లో ఉంచుటకు ప్రేమతో అనుమతించిన, మా బాబాయిగారు బ్రహ్మశ్రీ
నందనవనము వెంకటసుబ్బరామయ్య శర్మగారికి నా హృదయపూర్వక నమస్కారములు. __/\__
Posted in Face book during 10th January, 2013 – 1st May, 2013 & 26th May, 2014 – 20th September, 2014.
అభినందనము
*****
‘సాహిత్యసుధాకర’ ప్రభాకర శ్రీకృష్ణభగవాన్ M.A.
ప్రిన్సిపాల్
S.B.S.S.కాలేజి, పొన్నూరు.
నాస్తికత, అక్ర్మణ్యత, మితిమీరి పెచ్చుపెరిగి
పోవుచున్న అద్యతన ఆంధ్రావనికి ఆరాధ్యదైవం
సత్య, శివ, సుందర స్వరూపుడైన శ్రీవేంకటేశ్వర స్వామివారి విభూతి వైభవాలకు సర్వాంగ సుందరంగా రూపకల్పనచేసి
ధన్యతములైనారు, శ్రీ నందనవనం సుబ్బరామయ్యగారు.
ఉదాత్తమైన
భావాలకు వన్నెతెచ్చే భాషను జోడించి సహృదయ హృదయైకవేద్యంగా శ్రీవేంకటేశ్వర శతకాన్ని రచించి, ఆంధ్ర్భాషాసరస్వతికి మణిహారాన్ని సమర్పించిన శ్రీ సుబ్బరామయ్యగారు అభినందనీయులు.
ఆంధ్రుల కరకమలాలలో
ఈ శతకరాజం నూత్నవినూత్న శోభలతో విరాజిల్లాలని
ఆశిస్తూ, శ్రీ సుబ్బరామయ్యగారిని శ్రీ శ్రీనివాస
చక్రవర్తి అనుగ్రహించాలని ప్రార్ధిస్తున్నాను.
************
సుకృతి
శ్రీమాన్ బృందావనం రంగాచార్యులు
వెంకటేశ్వర
కారుణ్య వీక్షణముల
బలము ‘నందనవనము’న పరిమళింప
కోరి శతకము రచియించుకొనియె, ఘనుడు
సుబ్బరామయ్య-నిరుపమ నుకృతి యగుచు.
*************
అభిప్రాయము
చేజర్ల వేంకటరమణాచార్యులు ఎం.ఏ.
ఆంధ్రోపన్యాసకులు
సి.యస్.ఆర్.శర్మ కళాశాల
ఒంగోలు
శ్రీ నందనవనం వెంకట సుబ్బరామయ్యగారికి
మీకు చిరుతప్రాయముననే ఆధ్యాత్మికచింతన యలవడి భగత్కృపాగతమైన
కవితను మీరు భగవదంకితము చేయుట విశేషము.
భక్తి, జ్ఞాన, వైరాగ్య, నిందాస్తుతి
పరములగు శతకము లెన్నియో వెలసియున్నవి. కాని ఈ శతకమునందు
పైఁజెప్పి అన్ని భావములు నాకు గోచరించినవి. ఇది మీ ప్రధమ రచనయే యైనను మనోహరముగ నున్నది. భగవానుఁడు మీకు ప్రౌఢ కవితా శక్తినిచ్చి
గ్రంధరచనకు తోడై ప్రొచుగాత.
*************************
మనవి
శ్రీ వేంకటేశ్వర
స్వామివారి కృప అసాధారణమైనట్టిది.
ఆ దేవదేవుని అనుగ్రహమే నాచే శతకరచన సాగింపచేసినది. ఆ దయయే – గ్రంధముద్రణకు దగిన యవకశము నమర్చినది. ఇది యంతయు పరమేశ్వర విలాసము. కాకున్న నేను పద్యములు వ్రాయుటేమిటి? అదియే వింతగనుండ
– అది అచ్చునకు నోచుకొనుట
వింతలలో వింత:-
గ్రంధము రూపశోభను గల్గియుండునని
– అట్లుండవలెనని కలగంటిని.
ఆ కలను ఫలిపజేసినాడు
మిత్రుడు నారాయణం శ్రీనివాసాచార్యులు. బహువిధముల
గ్రంధమును నిర్ధుష్టముగ ముద్రణలో తెచ్చుటకై
సహకరించిన వారు శ్రీ బృందావనం రంగాచార్యులుగారు కోరిన వెంట్నే పీఠికలిచ్చి
ఆశ్వీరదించినారు, శ్రీమాన్ ఆర్.పార్ధసారధి భట్టాచార్యులు, శ్రీమాన్పళ్ళెపూర్ణ ప్రజ్ఞాచార్యులు, శ్రీయుతులు కె.పి.యస్. శ్రీకృష్ణభగవాన్గారు,
పోతుకుచ్చి సుబ్రహ్మణ్యంగారు మొదలైనవారు; మంచి పీఠికలను వ్రాసి నా రచన నాశీర్వదించిరి. ఆ సారస్వత కుసుమమే వేంకటేశ్వర
శతకము – భక్తి, శ్రద్ధలతో నా నేర్చిన కొలదిగ వ్రాసినాను.
పెద్దలాశీస్సులతో అభిప్రాయముల నొసగిరి. వీరి కందరికి నా హృదయపూర్వక
నమస్కారములు.
రచయిత
************
రచయిత నతులు
__/\__
సర్వకర్మలు నావిగా సంస్మరించి
భక్తితో నుండువారల బాధలుడిపి
కాచుభారము నాదని ఘనతబల్కు
విమలనందనవన సీమ విభుడితండు.
శ్రీవిష్ణుపాద సంసేవనాచిత్తులౌ
వారిల నందనవనము వారు
సాధు సేవాభావసక్త మానసులైన
వారిల నందనవనము వారు
దానధర్మ క్రియాతత్పరులైనట్టి
వారిల నందనవనము వారు
విజ్ఞాన ధనులంచు వినుతి కెక్కినయట్టి
వారిల నందనవనము వారు
అట్టి వంశమునం బుట్టినట్టి మేటి
ఘనుడు వేంకటసుబ్బయ కల్కి సుబ్బ
మాంబలకు చిన్నబిడ్డనాయ మహిని జెలగు
రామపదదాసుడను సుబ్బరాముడండ్రు
ఊసరభూమియో మదికి నొప్పుగ విద్యను నొండ్రు మన్నుగా
వేసరిజేర్చి భక్తియను విత్తుల్నాటి కృపారసమ్ము తా
బోసి సువిద్య సస్యముల బొల్పుగ బెంచిన దివ్యతేజుడౌ
దాసవరేణ్యుడారమణ దాసుని మ్రొక్కెద మద్గురూత్తముణ్.
@@@@@
శ్రీ రమాదేవి భూదేవి సేవజేయ
భక్త జనులను గానగ పరమ పురుష!
వెలసినాడవు థరలోన వేడ్కతోడ
విమల నందనవనవాస! వేంకటేశ! (001)
భక్తితో నీదు నామంబు భజన జేయ
ముక్తి నిడు దైవ మీవంచు మ్రొక్కుచుంటి
శక్తి నిడుమయ్య!
నాకు నీశతకమల్ల
విమల నందనవనవాస! వేంకటేశ! (002)
ఒక్కపరి నీదు నామమునుచ్చరింప
సంచితాఘములన్నియు సమయునంచు
మురిసి భజియింతు మదిని నీమూర్తి నిల్పి
విమల నందనవనవాస! వేంకటేశ! (003)
సగుణుడవటంచు కొందరు సన్నుతింప
నిర్గుణుడ వంచు కొందరు నిన్నువేడ
ఎల్లరిని యలరించెడి చల్లనయ్య !
విమల నందనవనవాస! వేంకటేశ! (004)
అణువు నందున బ్రహ్మాండ మందు నీవ
అణగి యున్నాడవని విని యరయ లేక
ఆత్మ సంధానమున గాంచి రఖిలమునులు
విమల నందనవనవాస! వేంకటేశ! (005)
సకల జీవుల యందును సంచరించు
పూర్ణరూపుడ వీవని బుధులు పొగడ
వినియు గననైతి విసిగితి వెదకివెదకి
విమల నందనవనవాస! వేంకటేశ! (006)
నీరజాసనుడాదిగ నిఖిలసురులు
మునులు భక్తర్షి బ్రుందముల్ ముక్తినిచ్చి
కాచుదొరవని కొల్చిరి కైటభారి!
విమల నందనవనవాస! వేంకటేశ! (007)
కంజదళనేత్ర! నీరూపుగాంచ తెలియ
పంకజాసన వాసవప్రముఖు లెల్ల
నేరరైరిక నేనెట్టుల నేర్తు నెరుగ?
విమల నందనవనవాస! వేంకటేశ! (008)
సచ్చిదానంద రూపమై సగుణమైన
నీదు మంగళరూపంబు నెపుడుగాంతు
నిఖిల భువనైక మోహన
! నిరుపమాన !
విమల నందనవనవాస! వేంకటేశ! (009)
నిరుపమానంద పరిపూ ర్ణ!
నిర్మలాంగ!
నిఖిల కల్మష విదళన! నిగమపోష!
చలిత కుండల భూషణ! చారుహాస!
విమల నందనవనవాస! వేంకటేశ! (010)
నీదు మాయల నిలయమౌ నిఖిలజగతి
వెలసి లయమందుచుండును విశ్వవినుత!
దీన జన పోష! సకల సద్వినుత భూష!
విమల నందనవనవాస! వేంకటేశ! (011)
కనక నవరత్న మణిమయ కాంతులీను
చారు సింహాసన స్థలి సభ యొనర్చి
లీల భువనంబు లేలిడి మూల పురుష!
విమల నందనవనవాస! వేంకటేశ! (012)
అభయ హస్తము జూపుచు నార్త జనుల
గాతు నంచీవు కట్టిన కంకణమును
నమ్ముకొని యుంటికావుమా! నాగశయన!
విమల నందనవనవాస! వేంకటేశ! (013)
ముగ్ధ మోహన సుకుమారమూర్తి వంచు
మునులు కామించిరట నిన్ను మురళిగాన
లోల! కన్పింపవేడద జాలమేల?
విమల నందనవనవాస! వేంకటేశ! (014)
స్త్రీ పురుషభావమే లేక చిద్విలాస!
మోహినీ రూపధారివై ముదము మీర
సురలకున్ పంచితివి సుధచోద్యము గను
విమల నందనవనవాస! వేంకటేశ! (015)
వెన్న మింగితి వీవం చు వెఱ్ఱులౌచు
పలికిరది లెస్సయౌనొకో ! పరమ పురుష !
సకలమును బొజ్జనిడుకొన జాలుదీవు
విమల నందనవనవాస! వేంకటేశ! (016)
శబరి యెంగలి ఫలమిడ సమ్మతించి
మోక్షమిచ్చితివని విని మురిసి నీదు
శ్రీచరణ సేవ జేయంగ చేరినాడ
విమల నందనవనవాస! వేంకటేశ! (017)
పద్మ భవుడవో!
భవుడవో! పతగవాహ
నుండవో ! శక్తివో
! ఎట్లునుడవ గలను?
నీవెవరి వైననేమి? నాకీవె దిక్కు
విమల నందనవనవాస! వేంకటేశ! (018)
భక్త మందార
! ఘనధీర! పాపదూర!
గర్వితాసురసంహార! కదనశూర!
కనులవిందుగ నినుగను కలిమినిమ్ము,
విమల నందనవనవాస! వేంకటేశ! (19)
మునివరులు సర్వమునువీడి ముక్తిగాంచ
ఘోర తపములు చేసియు గూఢమైన
నీదు పదమును చేరంగ నేరరైరి
విమల నందనవనవాస! వేంకటేశ! (20)
ధర్మ హీనతగల్గిన ధరణి బుట్టి
ఖలుల దండించి సుజన సంఘమును గాచి
వేడ్కచరియింతు వీవని వింటినయ్య!
విమల నందనవనవాస! వేంకటేశ! (21)
నింగివాయువు నగ్నియు నీరు భువియు,
శబ్దమును, స్పర్శ, రూప, రసమ్ము గంధ
గుణగణమ్ముల నొప్పు నీ గొప్ప సృష్టి
విమల నందనవనవాస! వేంకటేశ! (22)
చిత్కళా స్వరూపంబున చెలువు మిగుల
దేహ మందున నెలకొని దేహివగుచు
మాయచే మసలెద వీవ మాయవౌచు
విమల నందనవనవాస! వేంకటేశ! (23)
జ్ఞానమై జ్ఞేయమై నీవజ్ఞాతమగుచు
వెలయుచుందువు మహిమతో వేడ్క మీర
జ్ఞానమొసగుము దేవ! అజ్ఞానినయ్యా !
విమల నందనవనవాస! వేంకటేశ! (24)
సకల బ్రహ్మాండములనిండి సగుణమగుచు
నిర్గుణత్వంబు తోడుత నిశ్చలముగ
ఆత్మరూపాన నిలిచిన ఆదిపురుష!
విమల నందనవనవాస! వేంకటేశ! (25)
హంసవై దేహకుహరమంద మరియుండి
ప్రవిమలజ్ఞాన తేజః ప్రభావపటిమ
మూడవస్తల సాక్షియై మురియుచుండు
విమల నందనవనవాస! వేంకటేశ! (26)
“తత్త్వమసి”
యంచు దలచెడు తత్త్వమేమొ
బ్రహ్మమననేమొ ! అద్దానిభావమేమొ
,
ఎరుగ నీపాదములు దక్క యితర మెపుడు
విమల నందనవనవాస! వేంకటేశ! (27)
గుహల గూర్చుండి యోగినై గూఢమైన
యోగసాధన జేసెడి యోర్చులేదు
నీదు సంకీర్తనావళి నేనొనర్తు
విమల నందనవనవాస! వేంకటేశ! (28)
త్రీవ మగుపెనుగాలిలో దీపమట్లు
సంచలించెడి మనమును చక్కజేసి
నీదు కమనీయ మూర్తిపై నిలుపనిమ్ము
విమల నందనవనవాస! వేంకటేశ!! (29)
సుందరశరీర ! సుకుమార! సొంపుమీర
సాగరకుమారితో క్షీర సాగరమున
శేషపర్యంకముననున్న సేవ్యచరణ
విమల నందనవనవాస! వేంకటేశ! (30)
నాదు హృదయమనెడి యొక నందనమున
వెలుగు వాడవు నీవని విదిత పడక
చింతచే మ్రగ్గుచుంటిని చిత్స్వరూ ప !
విమల నందనవనవాస! వేంకటేశ! (31)
తన్నుదా దెలియు టొకటె నీతత్త్వమంచు
తెలుప తుదకేను నీవౌట తెలిసికొంటి
భావమందున నిను గంటి పాహి ! పాహి!
విమల నందనవనవాస! వేంకటేశ! (32)
నీల నీరద నిభగాత్ర ! నిరుపమాన!
నిశ్చలానంద పరిపూర్ణ ! నిర్మలత్వ
సౌఖ్యసంధాన నిపుణ! ఈశా! ప్రసన్న!
విమల నందనవనవాస! వేంకటేశ! (33)
దాసులను వారి దాసాను దాసజనుల
ముక్తినిడి బ్రోచు దొరవని ముదము మీర
నీదు దాసుల భజనంబు నేనొనర్తు
విమల నందనవనవాస! వేంకటేశ! (34) |
కోరనే, దేవ కామినీ కూటములను
కోర బ్రహ్మాదిపదముల కోర సిరుల
కోరుకొనియెద నీసేవ కోమలాంగ!
విమల నందనవనవాస! వేంకటేశ! (35)
ఆర్తతో నీదుపదముల నాశ్రయింప
నేలకనరావు! గోవింద! యేలజాగు?
రమ్ముకాపాడుమో రమారమణ! దేవ!
విమల నందనవనవాస! వేంకటేశ! (36)
కలుషభంజన! నీపాదకమలసేవ
ఘోరతర పాప నీరధి గ్రుంగు నరుని
తేల్చి దరిజేర్చు పుణ్యంపు తెప్పసుమ్మి!
విమల నందనవనవాస! వేంకటేశ! (37)
భేదమేటికి నాపైని ప్రేమవీడి
మిన్నకుండుట న్యాయమా! మీదుపాద
రజమునొక్కింత శిరమున దాల్పదగనె?
విమల నందనవనవాస! వేంకటేశ! (38)
చిక్కి సంసారమందు నేస్రుక్కియుంటి
నిక్కమో వేంకటేశ్వర!
నీవెదిక్కు
వెక్కసమ్మేల? కనరమ్మువేడ్క మీర
విమల నందనవనవాస! వేంకటేశ! (39)
తొలుతజన్మమునందున దోషినగుచు
చేసి నాడనుకాబోలు చెడ్డపనులు;
కట్టికుడుపుచున్నవి కావుమయ్య!
విమల నందనవనవాస! వేంకటేశ! (40)
ఎన్ని జన్మంబులెత్తితో! యెరుగమున్ను
ఎన్నిటంబుట్టబోదునో!యెరుగనింక
ఎన్నటికి దరిజేర్తు వాపన్నశరణ!
విమల నందనవనవాస! వేంకటేశ! (41)
వయసు పొంగున కామవినశుడనౌచు
చెలులతో గూడి తిరుగుచు చింతలేక
అరయనైతిని సద్గతి నందు తెరవు
విమల నందనవనవాస! వేంకటేశ! (42)
ఒక్కసతిని భరింపగ నోర్వలేము
సతులుపదియారువేలట! సరియె! సరియె!
బాధలుండవహ!జగన్నాధ! నీకు!
విమల నందనవనవాస! వేంకటేశ! (43)
పరులభార్యల పొందుట పాపమంచు
తెలిసియే గోపిక ల గూడితిరిగినావ?
తెలిసె తామరకంటునే తేమజూడ?
విమల నందనవనవాస! వేంకటేశ! (44)
నీలజీమూతసన్నిభ! నీదుమేన
చందనాగరుకస్తూరి చర్చజేసి
తులసిదళమిడెదన్ పాదతోయజముల,
విమల నందనవనవాస! వేంకటేశ! (45)
ఫలమొ! పుష్పమొ! తోయమొ! పత్రమేని
భక్తినిడ పొంగిపోయెడి ప్రభుడ వీవు
ఎంత కరుణారసార్ద్రుడ వెంతగుణివి
విమల నందనవనవాస! వేంకటేశ! (46)
క్షరములౌ నిహసుఖములక్షరములంచు
మాంసరుధిరమయమ్మగుమలిన తరువు
శాశ్వతమటంచు నెంచితి చక్రధారి!
విమల నందనవనవాస! వేంకటేశ! (47)
తెలియకయె కొన్ని యఘములు తెలిసికొన్ని;
చేసినాడను పద్మాక్ష! చేతులార
నే డు కుములుచునుంటిని నిజము తెలిసి
విమల నందనవనవాస! వేంకటేశ! (48)
తల్లి తండ్రియు గురువునుదై వమీవ
తలప వీరేటి చుట్టాలు ధరణిలోన
బలిమికలుములు దప్పినపలుకరొకరు
విమల నందనవనవాస! వేంకటేశ!! (49)
నిఖిల జీవులయందును నిశ్చలముగ
వెల్గు నినుగననేరక వెతలబడుచు
పుణ్యభూముల దిరుగగ బోవనేల
విమల నందనవనవాస! వేంకటేశ! (50)
జాడకనరాని సంసారసాగరమున
సుతులు సతులును బంధువుల్ సుడులరీతి
ముంచదరిజేర్చు
దివని మ్రొక్కుచుంటి
విమల నందనవనవాస! వేంకటేశ! (51)
నీదు పదనఖరము లందలి నీటి బొట్టు
నిఖిల భవ రోగ హరముగ నెగడు నంట
పూర్ణమగు నీ ప్రభావమున్ బొగడ తరమె!
విమల నందనవనవాస! వేంకటేశ! (52)
సూర్య శతకోటి సమతేజ ! సుందరాంగ
సుజన శుభకర ! శ్రీధర! సుగుణజాల
సురుచిరానంద పరిపూర్ణ! సుందరాంగ!
విమల నందనవనవాస! వేంకటేశ! (53)
మధుర మంజుల భావనామయము నీదు
దివ్యగాధా విశేషమ్ము భవ్యతరము,
వినగ వినగను సుధలూరు మనసు మురియు
విమల నందనవనవాస! వేంకటేశ! (54)
కర్మ వశులౌచు సంసార కాననమున
చిక్కి యేతెరవెరుగక చింత జెందు
జ్ఞాన హీనుల మము దయ గానవేల?
విమల నందనవనవాస! వేంకటేశ! (55)
సకల శాస్ర్తపురాణముల్జదివి తెలిసి
నీదు పద సేవ మరచిన లేదు ఫలము
సంద్రమున నీరు తృనొసంగనట్లు
విమల నందనవనవాస! వేంకటేశ! (56)
సుమమరందాల తారతమ్యములె యున్న
తేనె రుచి యొక్కటైనట్లు తెలిసిచూడ
సర్వ గుణములు నీవెకా నిర్వచింప
విమల నందనవనవాస! వేంకటేశ! (57)
పలు నదులు సాగరుని చేరి వరలునపుడు
వాని వేర్వేర నెరుగగవశమె
మనకు
అట్లె భూతాళి నీయందు నణగి యుంట
విమల నందనవనవాస! వేంకటేశ! (58)
{సముద్రంలో కలసిన విభిన్న నదులను ఎలా గుర్తించ లేమొ; అలాగే, నీయందు (పరమాత్మునిలో- వేంకటేశ్వర స్వామి) ఉన్న సమస్త జగత్తును గుర్తించడం మా వశము కాదు స్వామీ!}
నేను నేనని యందురు నిఖిల జనులు
నేననెడు వాడె వండొకో! నీవె కాక
నిశ్చల జ్జ్ఞానమున జూడ నేనె నీవు
విమల నందనవనవాస! వేంకటేశ! (59)
{నేను, నేను అని అందరు అనుకొంటారు; వాస్తవ దృష్టితో తెలుసుకుంటె సర్వము “నీవు”
కాక “నేను”
అనే వేరె ఎవరున్నారు స్వామీ!}
[శ్రీ కృ ష్ణ పరమాత్మ భగవద్గీత విభూతి యోగము
(10-20) లో
“అహమాత్మా గుడాకేశ!-సర్వభూతాశయస్థితః|
అహమాదిశ్చ మధ్యం చ – భూతానామంత ఏవ చ||”
సర్వభూతహృదయములందలి ఆత్మను నేనే
; సర్వ భూతముల పుట్టుక,
ఉనికి, అంతము
(సృష్టి స్థితి లయలు)
నేనే … అని చెప్పిన దానికి ప్రేరణ]
కర్మబంధల తాళిచే గట్టువడియు
విడివడెడు మార్గ మెరుగక వెతలజెందు
నా మొరాలింప వేటికి నళిననాభ!
విమల నందనవనవాస! వేంకటేశ! 60)
{కర్మ బంధాల నుండి బయటపడలేక బాధపడుతున్న నా మొర వినవేమి పద్మనాభా! అని వేడుకొనుచున్నారు కవి. ఇది మనకూ వర్తించుకోవచ్చు.}
అచ్యుతు ననంతు గోవిందునాది పురుషు
నిత్యుసత్యాత్ము నీశ్వరునిరుపమాను
నిన్ను బొడగను టెన్నడో! నేనెరుంగ
విమల నందనవనవాస! వేంకటేశ! (61)
{ఓ వెంకటేశా!
అచ్యుతుడవు , అనంతుడవు , గోవిందుడవు
, ఆదిపురుషుడవు , నిత్యుడవు, సత్యాత్ముడవు,
ఈశ్వరుడవు ,
నిరుపమానుడవు అగు నిన్ను ఎప్పుడు దర్శించగలనో (చూడగలనో) నాకు తెలియదు స్వామీ!- (దర్శనము కష్టతరము)}
వేదవేద్య! పరాత్పర! విభుధవినుత!
వివిధ గుణరూప విరహిత! విమల చరిత!
కేశవ! ముకుంద! కావుము కీరిసాంద్ర!
విమల నందనవనవాస! వేంకటేశ! (62)
{వేదములచే తెలియగలిగిన వాడా (పరమాత్మా); శ్రేష్టులకందఱికి శ్రేష్టుడైనవాడా; పండితులు, వేల్పులచే కొలవబడేవాడా;
నిర్గుణాకారా; స్వచ్ఛమైన, అపారమైన (సముద్రమంత) కీర్తికలవాడా;
మంచివెండ్రుకలు కలవాడా, కేశి రాక్షసుని సంహరించినవాడా, బ్రహ్మ,రుద్రుల జననమునకు కారణమైనవాడా; ముక్తినిచ్చువాడా నన్ను రక్షించుము.}
శ్రీ హరీ!
నీదు భజనను సేయు నేర్పు
కలిగినను జాలు తక్కిన కలిమియేల?
మనసు రంజిల్ల నీ నామమాలపింతు
విమల నందనవనవాస! వేంకటేశ! (63)
[శ్రీహరీ! {సమూలంగా సంసారమును హరించువాడైన వాడా (హరిః)} నీ భజనలు చేసే (కీర్తించే) భాగ్యముంటె చాలు, హృదయపూర్వకంగా నీ నామాన్ని జపింస్తాను, నాకు వేరే సంపదలు అక్కరలేదని నిస్వార్ధ భక్తిని ప్రకటిస్తున్నారు.
]
బ్రతుకు భారము మోయగ భయము జెంది
నీవె నా భారమంటిని – నిఖిల లోక
భారమును దాల్చు నీకు నే బరువె?
స్వామి?
విమల నందనవనవాస! వేంకటేశ! (64)
కాయమున శక్తిహీనమై కలిమి బాసి
బంధువులు రోసి దీనతన్బడలియుండు
నాకు దిక్కీ వెయంచును నమ్మియుంటి
విమల నందనవనవాస! వేంకటేశ! (65)
[శరీరమున శక్తి తగ్గినది
(ముసలితనము); సంపద కరిగిపోయినది;
చుట్టాలు చీదరించుకొంటున్నారు; దర్పమంతా పోయి అలసి యున్న నాకు,
నందనవనం లో వెలసియున్న ఓ అందమైన వేంకటేశా!
నీవె దిక్కని నమ్మియున్నాను. (శరణాగతి)]
జపతపాద్య నుష్టానంబు సలుపలేను
గురువులం జేరి విద్యల గురు తెరుంగ
భకితో నీదు నామము పలుక నేర్తు
విమల నందనవనవాస! వేంకటేశ! (66)
[పూజపునస్కారాలు చేయలేను, గురువుల దగ్గర గురోపదేశం తీసుకోలేదు, కాని, భక్తితో నీ నామ జపం చేయగలవాడను అని, నామ జప విలువ తెయజేయడమైనది.]
చేతనా చేతనాత్మక వ్రాతమెల్ల
నీదు లీలా విభూతియై నెగడుచుండు
సాక్షివై చూచుచుందువు సర్వజగతి
విమల నందనవనవాస! వేంకటేశ! (67)
[ఈ జగత్తులోని చరాచర (కదులనవి, కదలనవి –ప్రాణులు, ప్రకృతి, పర్వతములు…)
సమూహములు నీ లీలా సంపదగా వర్ధిల్లుతుండటము సాక్షీభూతిగా చూచుచుందువు- శ్రీ వేంకటేశుని సర్వాంతరయామిగా, జగన్నాటక సూత్రధారిగా కవి భావించి కొలుచుచున్నారు.]
శ్రీపతీ! నీపదంబుల సేవజేయు
భాగ్యమే భాగ్యమౌగాని ప్రకృతియందు
అన్యసంపద లెనయౌనె? యరయదేవ!
విమల నందనవనవాస! వేంకటేశ! (68) |
{లక్ష్మీనాధా! నీపాదసేవ చేసే భాగ్యముతో సరితూగే సంపద సృష్టిలో ఎంతవెదికినా దొరకదు.}
చిక్కులేటికి పెట్టెదో చిత్స్వరూప!
దిక్కు నీవని నమ్మిన దీనుజనుడ!
మక్కువన్ కావరమ్మింక
మదన జనక!
విమల నందనవనవాస! వేంకటేశ! (69)
{నీవే దిక్కని నమ్మినవాడను,
ఎందుకు ఇబ్బందులు కలిగిస్తావు సర్వాంతరయామీ, ప్రేమతో నన్ను కాపాడుము ఓ!మన్మధుని తండ్రీ!}
పలుకవదియేల? పరమాత్మ! పాహి! పాహి!
యంచు కరిరాజు పిల్చిన యాలకించి
మకరిబరిమార్చి
కావవే? మాన్యచరిత!
విమల నందనవనవాస! వేంకటేశ! (70)
{రక్షించమని వేడుకొన్న గజరాజు మొర ఆలకించి వచ్చి మొసలిని సంహరించి గజరాజును రక్షించి ప్రసిద్ధిచెందిన నీవు, ఓ పరమాత్మా! నా మొరఆలకింపవేమి
స్వామీ?}
జాతియు మతంబు కులమని జగతిలోన
నొండొరులు భేధభావంబు నొందుటేల?
సర్వమును నీదు మహిమయే నిర్వచింప
విమల నందనవనవాస! వేంకటేశ! (71)
{విచారిస్తే (లోతుగా పరిశీలిస్తే)
సర్వము నీవే (నీ మహిమ) అయినపుడు; కులము, మతము, జాతంటూ ఒకరికొకరు వేరని అనుకోవటం ఎందులకో}
బడుగు బాపడు నిను జేరి భక్తితోడ
పిడికెడటుకుల నిడగొని ప్రీతిమీర
పెన్నిధుల నిచ్చినావట ప్రేమ మిగుల
విమల నందనవనవాస! వేంకటేశ! (72)
{భక్తితో కుచేలుడు పిడికెడు అటుకులిస్తే ఎంతో ప్రేమతో వాటిని స్వీకరించి ఏనలేని సంపదలు నిచ్చినావట స్వామీ! (నందనవనంలో వెలసియున్న ఓ అందమైన శ్రీనివాసా!)}
భోగ భాగ్యంబులన్
గాంచి పొంగ నేల
నీటిపై బుద్బుదంబు లేపాటి సిరులు?
శాశ్వతానంద లక్ష్మి నీ చరణ సేవ
విమల నందనవనవాస! వేంకటేశ!! (73)
{శాశ్వతమైన నీ పాద సేవనే సంపదను ఒదిలి,
క్షణ భంగురములైన నీటి బుడ్గలాంటి భోగ, భాగ్యాలను చూసుకొని పొంగిపోవడం ఏమిటి? (మూర్ఖత్వం)}
పతిత మానవానీకపు పాతకములు
పాయునీనామ భజనచే పరమపురుష!
హరిని గని పార మృగ సమూహములమాడ్కి
విమల నందనవనవాస! వేంకటేశ! (74)
{ఓ పరమ పురుషా!
సింహమును చూచి లేళ్ళ
(పశువుల మంద) గుంపు పారిపోయినట్లు, చెడిన (సన్మార్గమువీడిన) మానవుల పాపములు నీనామ భజన మాత్రముచే తొలగి పోవును.}
“రామా”
యని నీదు పేరు నోరారబలుక
ఘోరతర పాపగిరులెల్ల గులునంచు
నుడువ వినియును మూర్ఖులు నోటననరు
విమల నందనవనవాస! వేంకటేశ! (75)
{రామా అని నోరార స్మరించిన మాత్రాన ఘోర పాపపు గుట్టలు (కొండలు) కూలునని (తొలగిపోవునని)
తెలిసీ మూర్ఖులు (తెలిసి తెలియని వారు) నిన్ను స్మరించరు.}
విమల బృందావనాంతర వీధులందు
గోపకాంతలు గొలువగ కొలువుదీర్చి
వేణుగాన వినోదివై వెలసినట్టి
విమల నందనవనవాస! వేంకటేశ! (76)
{ఓ వేంకటేశా! అందమైన బృందావన వీధులలో గోపకాంతలు
నీ వేణుగానమునకు బారులతీరగా
వారినానందపర్చుటకు వేణుగాన్డువై వెలసినావుగదా!}
బాలుడై దేండ్ల వాడునిన్ భక్తిగొలువ
అంకమున జేర్చి మురిపించి యార్తి దీర్చి
శాశ్వతపదంబు గూర్పవె? సరసిజాక్ష!
విమల నందనవనవాస! వేంకటేశ! (77)
{ఓ పద్మములవంటి కన్నులుకలవాడా! దయాళుడవై, ఐదేండ్ల ప్రహల్లాదుడు
నిన్ను భక్తితో ఆరాధించి, వేదుకొనగా ఆతనిని నీ ఒడిలో కుర్చోబెట్టుకొని,
లాలించి అతని దుఃఖము తీర్చి శాశ్వత మోక్షము ప్రసాదించితివి గదా!}
రామ! రఘురామ! శ్రీరామ! రామ! యనుచు
రమ్యనామ రసామృత రక్తిజూపి
గ్రోలు జీవికి భవముల గోడుకలదె?
విమల నందనవనవాస! వేంకటేశ! (78)
{రామ, రఘురామ, శ్రీరామ, రామ అనుచు నీ నామామృతము
గ్రోలె వారికి, సంసార బంధముల గురించి ఆలోచన ఉంటుందా స్వామీ!}
ఉడుత జేసిన సాయము నొప్పు మీర
తెలిసి నరిజేర్చి ప్రోచిన దివ్యమూర్తి!
ఎంత దయగల స్వామివో ఎరుగ తరమె?
విమల నందనవనవాస! వేంకటేశ! (79)
{ఉడుత భక్తితో తన వంతు చేసిన సాయంకి ఎంతో ప్రేమమీర దగ్గరకు తీసుకొని కరుణించిన
స్వామి నీ దయార్ధ్రతను చెప్పటం మాకు సాధ్యమా?}
శ్రుతులగాపాడి సోమకు స్రుక్క జేసి
మత్స్యరూపము దాల్చియు మహిని వెలసి
విధికి వేదములిడినట్టి వేదరూప
విమల నందనవనవాస! వేంకటేశ! (80)
{మత్స్యరూపము
దాల్చి, వేదములను సోమకాసురుని నుండీ కాపడి బ్రహ్మకు తిరిగి అందజేసి వేదరూపుడవైతివిగదా స్వామి!}
అమృతముగొన సురల సురలబ్ధిజిల్క
కవ్వమౌమందరము మున్గగాచుకొరకు
కూర్మరూపంబుదాల్చిన కువలయేశ!
విమల నందనవనవాస! వేంకటేశ! (81)
ధరనుదొంగిలిదాచిన దనుజవిభుని
వరవరాహమ్మువైనిల్చి వధయొనర్చి
ఇలనుకాపాడినట్టియో! ఇనకులేశ!
విమల నందనవనవాస! వేంకటేశ! (82)
కనకకశ్యపుబరిమార్ప గరుడగమన!
శ్రీనృసింహస్వరూపమున్ జెందినావు
భక్తసంకటములు బాపు బాంధవుడవు
విమల నందనవనవాస! వేంకటేశ! (83)
బలినియాచించి యాతని భంగపరచి
వాసవుని నక సౌఖ్యనివాసుజేసి
వామనుండవుగానొప్పు వారిజాక్ష!
విమల నందనవనవాస! వేంకటేశ! (84)
పరశువుందాల్చి యిద్ధర్బ్రబలియున్న
కులయాధీశవంశముల్ గూల్చినట్టి
పరశురామావతార! నిన్ బ్రస్తుతింతు
విమల నందనవనవాస! వేంకటేశ! (85)
తండ్రిపలుకును తలదల్చి తరుణిగూడి
వనములకు నేగి తాపసవరులగాచి
రావణువధించినట్టి శ్రీరామచంద్ర!
విమల నందనవనవాస! వేంకటేశ! (86)
యదుకులంబున జన్మించి యశముగాంచి
హలము చేదాల్చి యసురులనణచినట్టి
దేవ! బలరామ! కావుము దీనజనుడ!
విమల నందనవనవాస! వేంకటేశ! (87)
బుద్ధరూపంబునంబుట్టి బుధులుపొగడ
ధర్మరక్షణ మొనరించి దనుజమార్గ
వృత్తిదొలగించి భువిమించి వెలసినావు
విమల నందనవనవాస! వేంకటేశ! (88)
కలిన ధర్మంబు ప్రబలి దుష్కలితమైన
ధరణి బరిపాలనము జేయ దైవతేజ
మొప్ప జన్మించుకల్కి! నే మ్రొక్కుచుంటి
విమల నందనవనవాస! వేంకటేశ! (89)
కంసుబరిమర్చి దేవకి కాంక్ష దీర్చి
పాండవులగాచి నరునకు భండనమున
గీతనుడివిన గోవింద! కీర్తిసాంద్ర!
విమల నందనవనవాస! వేంకటేశ! (90)
మునివరుని పాదహతి కోపముననులక్ష్మి
పృధ్వి జన్మింప నఅమెను వెదకికొనును
శేషగిరియందు వేలసిన శిష్టచరిత!
విమల నందనవనవాస! వేంకటేశ! (91)
గిరిని కొనగోటనెత్తిన కీర్తి యేమి?
దనుజులను సంహరించిన దర్పమేమి?
కరుణతో దీనజనులను గాచుటేమి?
విమల నందనవనవాస! వేంకటేశ! (92)
మాయలో ముంచి మమ్మిట్లమాయకులుగ
జగతి పుట్టించి పెంచి యక్షయమొనర్చి
యేమి ఫలమందుచుంటివో! ఎరుగరాదు?
విమల నందనవన వాస! వేంకటేశ! (93)
ప్రీతి పద్మావతీదేవి బెండ్లియాడి
శ్రీగిరిని జేరి భక్తుల సేవలంది
మమ్ముగాపాడుచున్న యో మహిత చరిత!
విమల నందనవనవాస! వేంకటేశ! (94)
కన్న పుత్రికనిచ్చి నీకాళ్ళుకడిగి
మన్ననల్గని నీచేత మాన్యుడగుట
ఘనులలోమిన్నయయ్యె నాకాశరాజు
విమల నందనవనవాస! వేంకటేశ! (95)
వెలుగు కర్పూరఖండము విధిగతనువు
దినదినము క్షీణమగుచుండు దివ్యపురుష
బలిమికలనేచె నీపద భజనసేతు
విమల నందనవనవాస! వేంకటేశ! (96)
ప్రియముమీరగ నిను బెంచిపెద్దజేసి
ముద్దుముచ్చటలన్ గన్న ముదితవకుళ
భాగ్యమునుబోలు భాగ్యమ్ము బడయరెవరు
విమల నందనవనవాస! వేంకటేశ! (97)
శిరముపై వజ్రమకుటము చెలుగుచుండ
మొగముపై నూర్ధ్వపుండ్రమ్ము మురువులీన
కంఠమున రత్నహారాలు కదలి యాడ
కంకణాల్ కుండలంబులు కాంతులీన
మొలను బంగారు చేల్మబు ముద్దులొలక
గజ్జెలందెలు పాదాల ఘల్లుమనగ
వెలయునందన వనవాస! వెంకటేశ! (98)
పుణ్యనదులందు గ్రుంకంగ బోవజాల
క్షేత్ర సందర్శనములు సేయజాల
చరణహీనుడ దీనుడ జలిగనుము
విమల నందనవనవాస! వేంకటేశ! (99)
కవితలోనిపుణత జూపి కవ్యమల్ల
పాండితియు ప్రజ్ఞ లేమిచే ప్రముఖులెల్ల
మెచ్చరనుకొనియెదగాని మెప్పులేల?
వి మ ల నం ద న వ న వా స! వేం క టే శ! (100)
సర్వసుఖములినిచ్చు నీ చరితములను
వినక చదవక వ్రాయక విమతులెల్ల
తుచ్ఛ విషయములం బ్రొద్దు త్రోయుచుంద్రు
విమల నందనవనవాస! వేంకటేశ!! (101)
వేదవిద్యల నేర్చిన వేత్తగాను
కవిత లల్లగజాలిన కవినిగను
నీదు మహిమల వివరింప నేర్పులేదు
విమల నందనవనవాస! వేంకటేశ! (102)
పతగవాహన! శ్రీ సతీ ప్రాణలోల!
మేల! నీదాసుబ్రోవక మిన్నకుంట?
ఏల యీ లీలగన్ దయమాలియుంట
విమల నందనవనవాస! వేంకటేశ! (103)
అహరహము నీదు రూపము నాత్మదలచి
బాహ్యసంగమునేమరి ప్రధిత సౌఖ్య
మందు పూజ్యుల భాగ్యమేమందునయ్యా!
విమల నందనవనవాస! వేంకటేశ! (104)
దేవ! నీ దివ్యపాద సత్సేవనాదు
జన్మ జన్మల బాయక సాగనిమ్ము
దర్శనమునిమ్ము కావుము దనుజ హరణ!
విమల నందనవనవాస! వేంకటేశ! (105)
స్వామి నీ పాదదాసుడ సాధుజనుడ
రామదాసుడ ననుగావ
రమ్మువేగ దోషముల నెంచకోయయ్య!
దురితహారి!
విమల నందనవనవాస! వేంకటేశ! (106)
{పాపములను పోగొట్టు ఓ స్వామీ! నా దోషములను మన్నించి, నీ పాదదాసుడను, సాధు మనస్కుడను, రామభక్తుడనగు నన్ను(భవబంధ బాధలనుండి) త్వరగా రక్షింపుము (కాపాడుము).
జయము శ్రీవేంకటేశ్వర! జయము జయము
జయము పద్మావతీప్రియ! జయము జయము
జయము శేషాద్రిశేఖర! జయము జయము
జయము భక్తార్తిభంజన! జయము జయము
జయము కలిలోకవందిత! జయము జయము
జయము సర్వాంతరాత్మక! జయము జయము
జయము భవదోషసంహార! జయము జయము
జయము నందనవాస! జయము జయము (107)
మంగళము సర్వలోకైకమాన్యునకును
మంగళము శ్రీవిలాసన్మందిరునకు
మంగళము నిరుపమానాత్మమండలునకు
మంగళము లోకకళ్యాణమహిమునకును (108)
మంగళంమహత్
******సమాప్తమ్******
No comments:
Post a Comment