తెలుగు సుద్దులు…..(102)
ఆ.వె|| గంగి గోవు పాలు గంటెడై`నను జాలు;
కడివెడైన నే`మి ఖరముపాలు;
భక్తి గలుగు కూడు పట్టెడై`నను జాలు
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
ఆధ్యాత్మికముగా పవిత్రము, ఆరోగ్యరీత్యా శ్రేష్టమైన ఆవుపాలు గరిటెడైన (కొంచమైనా) చాలు; గాడిద
పాలు (గాడిదను కించపర్చటం కాదనుకుంటాను, గాడిద పాలు మానవులకు సరిఐనవి కాదనేమో) కడెవడున్నా(పుష్కలంగా ఉన్నా) వ్యర్ధము. అదేవిధంగా ఆప్యాయంగా, ప్రేమానురాగంతో పిడికెడు (పట్టెడు) అన్నం పెట్టినా అది స్వీకరించినవారికి ఆనందకరము. బలవంత
మాఘ స్నానం లాగా విసుక్కుంటూ, ఎందుకొచ్చిన దండుగ, ఈపీడేమిటనుకొంటూ షడ్రసోపేతమైన విందులిచ్చిన అది వ్యర్ధము. ముఖ్యంగా స్త్రీలు, ఇంటిలో భోజనము వడ్డించేటప్పుడు ఇది
గుర్తెరెగాలి. బిక్షపెట్టేటప్పుడు ఆడంబరముకన్నాకూడా భక్తి, శ్రద్ధలు అవసరము అని గ్రహించాలి. ||02-11-2014||
తెలుగు
సుద్దులు…..(103)
ఆ.వె|| బండ మీద చెలమ పాటించి తవ్విన*,
నలయికె`క్కుడౌ`ను యాశలేదు; @
గుంట పట్టు చెలమ కులము*`ద్ధరించురా!
విశ్వదాభిరామ వినర వేమా!.
* త్రవ్విన @ నలవికెక్కుడౌ జలాశ లేదు * గుణము -- పాఠాంతరములు
భావముః
రాతిబండ క్రింద నీటి ఊటున్నదని (కొంతమంది అనుభవంతో చెపుతుంటారు) అక్కడ చెలమ (ఎండిపోయిన ఏటిలో, చెరువులలో నీటికోసం త్రవ్వుకొనే చిన్న, చిన్న నీటి గుంటలు) తొవ్వితే వృధాప్రయాశ, శ్రమేకాని అక్కడ నీరు దొరకదు (పడదు); అదే, నీటి గుంట ఎండిపోయినా దాని దగ్గర తొవ్వుకుంటే చెలమ (ఊట) పడి త్రవ్వుకొన్నవానికి, ఆ
జనాభాకి,
ఊరికి నీటి వసతి కలిగి బతికి, జీవనం కొనసాగించగలుగుతారు (అభివృద్ధి) చెందుతారు. ఒక వ్యక్తి నుండి మొత్తం సమాజం, ఊరు, అన్నిటిని, చదివే వారి భావన బట్టి, అర్ధం వచ్చేటట్లు ‘కులము’అనే ఒకే పదంతో, చెప్పడం వేమన యొక్క ప్రత్యేకత. విజ్ఞతలేని నిరర్ధకమైన పనులవలన అనవసర
అలసట, బడలిక, నిరుత్సాహం, శ్రమ తప్ప ఎటువంటి ఉపయోగముండదని, చేసే పని ఆలోచించి, గుర్తెరిగి చేస్తేనే ఫలముంటుందని, వేమన ఈ పద్యం ద్వారా తెలియచెప్పుతున్నారు.
నా చిన్నప్పుడు, మా ఊరిలో (నందనవనంలో - ఉప్పునీటి ప్రదేశం) మంచినీటి వసతి లేనందున దగ్గరలో పారుతున్న
పాలేరుఏటి ప్రక్కన ఇసుకలోగుంటలు (చెలమలు) త్రవ్వుకొని స్వఛ్ఛమైన తియ్యటి తాగునీరు తెచ్చుకొనేవారు. ||04-11-2014||
తెలుగు సుద్దులు…..(104)
ఆ.వె|| కాకి గూటి లోన కోకిల మన్న`ట్లు*
భ్రమరమ`గుచు పురువు* బ్రతికినట్లు
గురుని గొల్చు వెనక గురువు తానౌ`నయా
విశ్వదాభిరామ వినర వేమా!.
* మున్నట్లు; పురుగు - పాఠాంతరములు
భావముః
కోకిలపిల్లలు కాకి గూటిలో పెరిగినట్లు; పురుగు పిల్ల భ్రమరము (తుమ్మెద) గా మారి జీవించినట్లు, శిష్యుడు కఠినమైన గురు శుశ్రూషచేసి, గురు భోదనలవలన, నిరంతరము
గురుబోధనల చుట్టూ మనస్సును పరిభ్రమింప
చేయుటవలన తానూ విజ్ఞుడై తదనంతరము తానూ వేరొకరికి గురువై శోభిల్లుతాడు. ఈ
పద్యం ద్వారా, వేమన మనకు రెండు విషయాలు బోధిస్తున్నట్లున్నది.
మొదటిది- కష్టే ఫలి యని. మధురమైన గొంతుకలిగిన కోకిల తన పిల్లలను, కాకి గూటిలో పెట్టి పొదిగించినప్పుడు కోయిల పిల్లలు కాకిగోల భరించినట్లు; అలాగే, పురుగు పిల్ల తుమ్మెదగా
మారడానికి విపరీతమైన భ్రమరధ్వని విన్నట్లు మానవుడు ఏదన్నా సాధించాలంటే లేదా ఫలితం పొందాలంటే మొదట ఆటుపోట్లకు, విభిన్న పరిస్థితులకు నిలబడకలగాలి మరియు విపరీత పరిస్థితులను సైతము ఓర్మితో భరించాలి.
రెండవది, భ్రమర కీటక న్యాయం లాగా, (భ్రమరము అనగా తుమ్మెద గుడ్లను పెట్టి పొదగదు. పిల్లలను కనదు. వేరొక జాతి కీటకం యొక్క పిల్లను
ఎత్తుకొనివచ్చి, తన గూటిలో పెట్టి, దాని చుట్టూ ఘూమ్మని శబ్దం
(ఝుంకారం) చేస్తూ తిరుగుతుంది. అలా, ఆ కీటకపు
పిల్ల భ్రమరశబ్దాన్నే వింటూ ఉండటం వలన, భ్రమరాన్నే చూస్తూ
ఉండటం వలన కొంతకాలానికి అది కూడ భ్రమరంగానే తయారైపోతుంది.) శిష్యుడు గురువు గారి కఠోర నియమ నిష్టలను నిత్యంచూస్తూ, బోధనలను, ఉపదేశాలను వింటూ, మననం చేసుకుంటూ గురువుగారి రూపం, బోధనల చుట్టూ తన మనస్సును పరిభ్రమింప చేయుటవలన, ఆ శిష్యుని మనస్సు కొన్నాళ్ళకు తన గురువుగారి మనస్సుతో లయమవుతుంది. కఠోర శిక్షణకు, పరీక్షలకు నిలబడగలిగిన శిష్యుడు, తానూ గురువంతటివాడై, మరికొంతమందికి గురువు కాగకలుగుతాడు. ఈ విధంగా శిష్యరికానికి కావలసిన (శిష్యునికి ఉండవలసిన) లక్షణాలను, చక్కటి ఉదాహరణలతో తెలియచెప్పారు. ||06-11-14||
తెలుగు సుద్దులు…..(105)
ఆ.వె|| మాట దిద్ద వచ్చు మరి యెగ్గు లేకుండ,
దిద్దవచ్చు రాయి తిన్నగాను*
మనసు దిద్దరాదు మహినెం`తవారికి
విశ్వదాభిరామ వినర వేమా!.
* తిన్ననగను-పాఠాంతరము
భావముః
మాటలో దోషము (తప్పు) ఉంటే సవరించవచ్చు లేదా సరిచేసి చెప్పవచ్చు. అదేవిధంగా, రాతిలో సైతం దోషమున్నా (వంకర టింకరలు, ఎత్తు పల్లాలు మొ.వి) జాగ్రత్తగా వాటిని సవరించి రాతిని మనోజ్ఞంగా, యుక్తంగా చేయవచ్చు. కాని, ఈ భూమండలంలో మనిషి మనస్సును మాత్రము ఎవరూ సవరించలేరు (మార్చలేరు, దారిలో పెట్టలేరు).
ఈ పద్యంలో వేమన ఒక విశిష్ట యోగిగా, మానవ మనస్సు యొక్క స్వభావాన్ని, దాని నియంత్రణ గురించి నర్మగర్భంగా తెలియ చెప్పుతున్నారు. మనస్సును మార్చటం ఆ పరమాత్మకు మాత్రమే సాధ్యము. అంటే, మానవుడు తన్ను తాను పరమాత్మగా గుర్తెరిగిననాడే (పరమాత్మ-జీవాత్మ సంయోగము ద్వారా పరమ యోగిగా, పరమ హంసగా మారినపుడు మాత్రమే) తన మనస్సును తాను సరిచేసుకొనగలడు
(నియంత్రించుకొనగలడు);
లేదా మరణమే మనస్సును నియింత్రించగలదు. మన తెలుగులో బహుళ ప్రాచుర్యమున్న సామెత - “పుర్రెన పుట్టిన బుద్ధి పుడకల్తో గాని పోదు.”కూడా ఇదే చెప్పుతున్నది కదా! ||08-11-2014||
తెలుగు సుద్దులు…..(106)
ఆ.వె|| మనసునందు ముక్తి మలయుచు నుం`డంగ
మనసు నె`రుగలేక* మనుజులె`ల్ల
మనసు నం`టలేక మాయమై పోదురు
విశ్వదాభిరామ వినర వేమా!.
* నెరుగలేని -పాఠాంతరము
భావముః
హృదయంలో (అంతరాత్మ) పరమేశ్వరుడు (ముక్తి –
భగవంతునితో-పరమేశ్వరునితో సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం (ఐక్యము)) తిరుగుచుండ (వ్యాపించియుండ), మానవులు ఆత్మ- పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేక, ఆత్మవిశిష్టతను పట్టుకోలేక (గుర్తించకుండానే) మాయమై పోదురు (మానవజన్మను విడిచిపెట్టెదరు-చనిపోవుదురు). ఈ పద్యంలో వేమన అంతరాత్మ యొక్క విశిష్టతను తెలుపుతూ, భగవంతుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు అది గుర్తెరిగి మసలుకో ఓ
మానవుడా;
దాన్ని పట్టుకోలేకపోతే మానవ జన్మ నిరర్ధకమవుతుందని హెచ్చరిస్తున్నారు. ||10-11-2014||
తెలుగు సుద్దులు…..(107)
ఆ.వె|| మనసు ముక్తి యనచు మదినె`రుంగగ లేరు
మనసు చేతఁదగిలి మాయమైరి;
మనసు తాను యైన మర్మజ్ఞుడ`గు యోగి
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
క్రితం పద్యానికి అనుసంధానంగా మనోతత్వాన్ని వివరించడం జరిగింది. మనస్సు (అంతరాత్మ), ముక్తి (పరమాత్మను చేరుట) అంటూ నిజమైన బుద్ధిని (జ్ఞానాన్ని) తెలుసుకోలెకపోతున్నారు. కోరికల వలయంలో చిక్కుకొని భ్రమలో (మోహం/మాయలో) పడుతున్నారు. ఆత్మ, పరమాత్మ ఒక్కటే (పరమాత్మ నాలో, అందరిలో నెలకొని ఉన్నాడు) అన్న జ్ఞానాని పొందినవాడు నిరాసక్తుడై, రహస్యమెరిగినవాడై (అజ్ఞానంలొ నుండి బయటపడి) యోగవుతాడు. శ్రీ శంకర భగవత్పాదుల అద్వైతవాదాన్ని తెలుపుతున్నట్లున్నది||12-11-2014||
No comments:
Post a Comment