Translate

21 November, 2014

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 004 (016 – 020)

 ఓం గణేశాయనమః గురుభ్యోనమః 
__/\__
నారాయణం నమస్కృత్య  నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి(క్విజ్)పుస్తకము (1994) ఆధారంగా]

  1. దుష్యంతుని కొడుకు భరతుని మొదటి పేరేమి?
  2. భారతంలో “కణికనీతి” అని ఒక ప్రసిద్ధ ఘట్టం – అది ఎవరు ఎవరికి చెప్పారు?
  3. జనమేజయుని సర్పయాగమును మాన్పించినదెవరు?
  4. శకుంతల జన్మతః ఎవరి కూతురు?
  5. అగ్నికి అజీర్ణరోగం ఎందువల్ల వచ్చింది? ఎలా పోయింది?

సమాధానములు (జవాబులు):

1. సర్వదమనుడు. భరతుడు అడవిలోని జంతువులన్నిటినీ దమియించుటచే(అణఁచు), ఆశ్రమములోని
    మునులు అతనికి ‘సర్వదమనుడ’ ను పేరు పెట్టారు. - ఆదిపర్వం – చతుర్థాశ్వాసము – 65 వచనం
వ॥ఇట్లు వనంబులోని సర్వసత్త్వంబులను దనమహాసత్త్వంబునంబునంజేసి దయియించుచున్నయాతనిం జూచి
     యాశ్చర్యం బంది యందలిమును లెల్ల నాతనికి సర్వదమనుం డనునమంబుఁ జేసిరి కణ్వమహామునియు
     నక్కుమారు నుదార తేజోరూపవిక్రమగుణంబులకు సంతసిల్లి వీఁ డఖిలభువన యౌవతరాజ్యాభిషేకంబునకు
     సమర్థుం డగు (సమయం బరుగు) దెంచె నని విచారించి యొక్కనాఁడు గూఁతునకి ట్లనియె.(65)

2. కణికుఁడు, శకుని ఆప్తమంత్రి, దుర్యోధనునకు చెప్పిన రాజనీతియే ‘కణికనీతి’. - ఆదిపర్వం – షష్ఠాశ్వాసము –
   101-119 పద్యములు; 120 వచనము
ఆ॥ననిన వినియుఁ గణికుఁ డనువాఁడు సౌబలు
      నాప్తమంత్రి నీతులందుఁ గరము
      కుశలుఁ డైనవాఁడు కురుకులవల్లభు
      నిష్టమునకుఁ దగఁగ నిట్టు లనియె.(101)
తరువోజ॥ధరణిశుఁ డుద్యతదండుఁ డై యుచితదండవిధానంబుఁ దప్పక ధర్మ
               చరితులఁగా మహీజనుల రక్షించి సద్వృత్తుఁ డగునది సర్వవర్ణములు
               వరుసన తమతమవర్నధర్మముల వర్తిల్లుదురు గడవక దండభీతి
               నరిమిత్రవర్జితుఁ డై సమబుద్ధి యగుమహీవలభుననుశాసనమున.(102)
క॥గుఱుకొని కార్యాకార్యము
     లెఱుఁగక దుశ్చరితుఁడయి యహితుఁ డగునేనిన్
     మఱవక గురు నైనను జను
     లెఱుఁగఁగ శాసించునది మహీశుఁడు బుధ్ధిన్.(103)
క॥ధీరమతియుతులతోడ వి
     చారము సేయునది మును విచారితపూర్వ
     ప్రారబ్ధమైనకార్యము
     పారముఁ బొందును విఘాతపదదూరం బై. (104)
క॥జనపాలుఁడు మృదుకర్మం
     బున నైనను గ్రూరకర్మమున నైనను నే
     ర్పున నుద్ధరించునది త
     న్ననపాయతం బొంది చేయునది ధర్మంబుల్. (105)
క॥అమలినమతి నాత్మచ్ఛి
     ద్రము లన్యు లెఱుంగ కుండఁ దా నన్యచ్ఛి
     ద్రము లిమ్ముగ నెఱుఁగుచు దే
     శముఁ గాలము నెఱిఁగి మిత్రసంపన్నుం డై. (106)
క॥బలహీను లైనచొ శ
     త్రులఁ జెఱచుట నీతి యధికదోర్వీర్యసుహృ
     ద్బలు లైనవారిఁ జెఱుపఁగ
     నలవియె యక్లేశసాధ్యు లగుదురె మీఁదన్. (107)
క॥అలయక పరాత్మకృత్యం
    బుల మది నెఱుఁగునది దూతముఖమునఁ బర భూ
    ములవృత్తాంతము లెఱుఁగఁగఁ
    బలుమఱుఁ బుచ్చునది వివిధపాషాండతతిన్. (108)
క॥నానావిహారశైలో
     ద్యానసభాతీర్థదేవతానుగృహమృగయా
     స్థానముల కరుగునెడ మును
     మానుగ శోధింపవలయు మానవపతికిన్. (109)
తే॥వీరు నమ్మంగఁ దగుదురు వీరు నమ్మఁ
     దగరు నాఁగను వలవదు తత్త్వబుద్ధి
     నెవ్వరిని విశ్వసింపక యెల్లప్రొద్దు
     నాత్మరక్షాపరుం డగునది విభుండు. (110)
ఉ॥ఇమ్ముగ నాత్మరక్ష విధియించువిధంబున మంత్రరక్ష య
     త్నమ్మునఁ  జేయఁగా వలయుఁ దత్పరిరక్షణశక్తి నెల్ల కా
     ర్యమ్ములు సిద్ధిఁ బొందుఁ బరమార్థము మంత్రవిభేద మైనఁ గా
     ర్యమ్ములు నిర్వహింపఁగ బృహస్పతికై నను నేరఁ బోలునే. (111)
క॥పలుమఱు శపథంబులు నం
     జలియును నభివాదనములు సామప్రియభా
     షలు మిథ్యావినయంబులుఁ
     గలయవి దుష్టస్వభావకపురుషులకున్. (112)
క॥తన కి  మ్మగునంతకు దు
    ర్జనుఁ డిష్టుఁడపోలె నుండి సర్పమపోలెం
    దన కి మ్మగుడును గఱచును
    ఘనదరుణకర్మగరళ ఘనదంష్ట్రలచేన్. (113)

క॥కడునలకయుఁ గూర్మియు నే
    ర్పడ నెఱిఁగించునది వానిఫలకాలము పె
    న్బిడుగును గాడ్పును జనులకుఁ
    బడుటయు వీచుటయు నెఱుక పడియెడుభంగిన్. (114)
క॥తఱి యగునంతకు రిపుఁ దన
     యఱకటఁ బెట్టికొని యుండునది దఱి యగుడుం
     జెఱుచునది ఱాతిమీఁదను
     వఱలఁగ మృద్ఘటము నెత్తివైచినభంగిన్. (115)
క॥తన కపకరము మదిఁజే
     సినజనుఁ డల్పుఁ డని నమ్మి చేకొని యుండం
     జన దొకయించుకము ల్లయి
     నను బాదతలమున నున్న నడవఁగ నగునే. (116)
క॥బాలుఁ డని తలఁచి రిపుతో
     నేలిదమునఁ గలసి యునికి యిదికార్యమె యు
     త్కీలానలకణ మించుక
     చాలదె కాల్పంగ నుగ్రశైలాటవులన్. (117)
క॥మొనసి యపకారిఁ గడనిడి
     కొనియుండెడుకుమతి దీర్ఘకుజఖాశాగ్రం
     బున నుండి నిద్రవోయెడు
     మనుజునకు సమానుఁ డగుఁ బ్రమత్తత్వమనన్. (118)
చ॥తడయక సామభేదముల దానములన్ దయతోడ నమ్మఁగా
     నొడివియు సత్య మిచ్చియుఁ జనున్ జననాథకృతాపకారులం
     గడఁగి వధింపఁగా ననుట కావ్యమతం బిది గాన యెట్టులుం
     గడుకొని శత్రులం జెఱుపఁ గాంచుట కార్యము రాజనీతిమైన్. (119)
వ॥కావున సర్వప్రకారంబుల నపకారు లయినవారిం బరుల నయిన బాంధవుల నయిన నుపేక్షింపక
     యాత్మరక్షాపరుండ వయి దూరంబు సేసి దూషించునది యనినకణికుమతంబు విని దుర్యోధనుం డొడంబడి
     చింతాపరుం డై యొక్కనాఁడు ధృతరాష్ట్రున్ కి ట్లనియె. (120)
   

3. తన తల్లి జరత్కారువు కోరికమేర, ఆస్తీకుడు (నాగుల, వాసుకి మేనల్లుడు) జనమేజయుని సర్పయాగమును
    మాన్పించెను.- ఆదిపర్వం –  ద్వితీయాశ్వాసము – 231&232 పద్యములు; 221,230&233 వచనములు.

వ॥బ్రహ్మవచనంబు నిట్టిద కా విని యేలాపుత్రుండు మాకుఁ జెప్పె జరత్కారు మహామునికి నిన్ను వివాహంబు
      సేయుటయు నేతదర్థంబ యిం కొక్కనిమేషంబేని యుపేక్షించిన సకలసర్పప్రళయం బగుం గావున నాస్తీకుండు
      జనమేజయ మహీపాలుపాలికిం బోయి సర్పయాగం బుడిగించి రక్షింపవలయు ననిన నయ్యగ్రజువచనంబులు
      విని జరత్కారువు గొడుగుమొగంబు సూచిభవన్మాతులనియోగంబు సేయు మనిన నాస్తీకుం డి ట్లనియె. (221)
వ॥అని జనమేజయ నాతనియజ్ఞ మహిమను ఋత్విజులను సదస్యులను నగ్నిభట్టారకు
     ననురూపశుభవచనంబులఁ బ్ర్స్తుతించిన నాస్తీకున కందఱును బ్రి తులయిరంత జనమేజయుం డాస్తీకుం జూచి
     మునీంద్రా నీ కెద్ది యిష్టంబు దానిన యిత్తు నడుగు మనినఁ గరంబు సంతసిల్లి యాస్తీకుం డి ట్లనియె. (230)

ఉ॥మానితసత్యవాక్య యభిమన్యు కులోద్భవ శాంతమన్యుసం
      తానుఁడ వై దయాభి నిరతస్థితి నీవు మదీయబంధుసం
      తానమనోజ్వరం బుపరతంబుగ నాకుఁ బ్రియంబుగా మహో
      ర్వీనుత సర్పయాగ ముడివింపుము కావుము సర్పసంహతిన్. (231)
చ॥అనిన సదస్యు లందఱుఁ బ్రియంబున నిట్టివిశిష్టవిప్రము
     ఖ్యునకు మహాతపోధనునకుం దగుపాత్రున కెద్ది యిచ్చినన్
     ఘనముగ నక్షయమ్ బగును గావున నీద్విజనాథుకోర్కిఁ బెం
     పున వృథ సెయఁగా దగదు భూవలయేశ్వర యిమ్ము నెమ్మితోన్. (232)
వ॥అనిన సర్వజనానుమతంబుగా జనమేజయుం డాస్తికప్రార్థనం జేసి సర్పయాగం బుడిగించె నయ్యవసరంబున.
     (233)


4. మేనకావిశ్వామిత్రుల కూతురు. - ఆదిపర్వం – చతుర్థాశ్వాసము – 46&48 వచనములు; 47 పద్యము
వ॥మేనకయు విశ్వామిత్రునిష్టంబునకుం దగినకామోపభోగంబులం బెద్దకాలంబు రమియించిన నయ్యిద్దఱకు
     నిక్కన్యక పుట్టిన దీని మాలిని యనునొక్కయేటి పులినతలంబునం బెట్టి మేనక దేవలోకంబునకుం జనియె
     విశ్వామిత్రుండును దపోవనంబునకుం జనియె నంత నమ్మునిప్రభావంబున. (46)
ఆ|| చెలఁగి లేవ నేడ్చుచిఱుతుక దానిఁ గ్ర
      వ్యాద ఘోరమృగము లశనబుద్ధిఁ
      బట్ట కుండఁ జెట్టుపలఁ గప్పి రక్షించు
      కొని శకుంతతతులు గూడి యుండె. (47) 
వ|| అంత నేను శిష్యగణంబులతోడ సమిత్కుసుమఫలాహరణార్థం బక్కడకుంజని యమ్మాలినీపులినతలంబున
     శకుంతరక్షిత యై యున్నకూఁతునత్యంత కాంతిమతి నవనీతలంబున కవతరించినతరుణశశిరేఖయుంబోని
     దాని నెత్తుకొని వచ్చి శకుంతరక్షిత యగుటంజేసి శకుంతల యనునామం బిడి కరంబు గారవంబునం
     బెనిచితిమి. (48)

5.శ్వేతకి యను రాజర్షి చేసిన శతవార్షిక సత్త్రయాగములో సమర్పించిన నిరంతర ఘృతవసుధారా (నెయ్యి త్రాగడం)
   కారణంబున అగ్నిదేవునికి అగ్ని మాంద్యము (అజీర్ణరోగము)వచ్చింది. దివ్యౌషధయుక్తమైన ఖాండవవనము
   దహించడమువలన ఆ వ్యాధి తగ్గినది. ఆదిపర్వం – అష్టమాశ్వాసము – 247,250& 318వచనములు &
   248-317 పద్యములు
వ॥శ్వేతకియుఁ దనకు దుర్వాసుండు ఋషిగణంబులతో ఋత్విజుండుగా నభిమతంబయిన సత్త్రయాగంబు సేసె
     నట్లా శ్వేతకి చేసిన నిరంతర ఘృతవసుధారా కారణంబున నగ్నిదేవుండు దన కగ్నిమాంద్యంబును
     దేజోహీనతయు దప్పియు నైనఁ బితామహుపాలికిం జని శరీరస్థితి చెప్పినఁ బితమహుండును దాని నపరిమిత
     ఘృతోపయోగంబున నయిన మహావ్యాధిఁగా నెఱింగి యగ్నిదేవున కి ట్లనియె. (247)
క॥ఈవ్యాధి యొంటఁ దీఱదు
     దివ్యౌషధయుక్త మైనదివిజవనంబున్
     హవ్యాశన భక్షింపు మ్
     హావ్యాధిశమంబు దన నగు నీ కనినన్. (248)
క॥చని ఖాండవంబుఁ గాల్పఁగ
     మొనసి మహాహస్తియూధములఁ బోనిఘనా
     ఘనములచే బాధితుఁ డయి
     వనజుకడ కరిగి హవ్యవహుఁడిట్లనియెన్. (249)
వ॥ఏను మీయానతిచ్చినవిధంబున ఖాండవం బుపయోగింపం బోయి తద్రక్షకులు గావించువిఘాతంబులు
     వారింపనేరక యేడుమాఱులువిఫలప్రయత్నుండనైతి నింక నెద్ది యుపాయంబు నాకు నెవ్విధంబున
     ఖాండవభక్షణంబు దొరకొను నని దుఃఖించిన వానిం జూచి కమలభవుండు కరుణించి భావి కార్యంబు అప్పుడు
     దలంచియుఁ గొంతకాలంబునకు నరనారాయణు లనునాదిమునులు నరలోకంబున దేవహితార్థం
     బర్జునవాసుదేవు లయి జన్మించి యా ఖాండవసమీపంబున విహరింతురు వారు భవత్ప్రార్థితు లై
     తమయస్త్రబలంబున నఖిలవిఘ్నంబుల నపనయించి నిరాకులంబున నీకు ఖాండవోపయోగంబు ప్రసాదింతు
     రనిన నగ్ని దేవుండు కరంబు సంతసిల్లి కమలజువచనం బవలంబంబుగాఁ బెద్దకాలం బుండి
     తద్వచనమార్గంబున నప్పుడు కృష్ణార్జునులం గని ఖాండవదహనాథంబు ప్రార్థించిన నగ్ని దేవున కర్జునుం డి
     ట్లనియె.(250)
 వ॥.....నగ్ని దేఉండు నిట్లు నిర్విఘ్నంబున ఖాండవవనౌషధంబు లుపయోగించి విగతరోగుం డయి కృష్ణార్జునుల
      దీవించి చనియె నంత. (318)
****

No comments:

Post a Comment