ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం
సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల
రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి(క్విజ్)పుస్తకము (1994) ఆధారంగా]
- లాక్షా గృహం నిర్మించినదెవరు? నిప్పు పెట్టినదెవరు?
- దేవయానిని నూతిలోకి త్రోసినదెవరు? ఉద్ధరించినదెవరు?
- సుదర్శనచక్రం కృష్ణునికి ఎలా వచ్చింది?
- లక్కయింటి నుండి సొరంగం త్రవ్వటానికి ఖనకుని పంపించినదెవరు?
- భీష్ముడు ఎవరి అంశతో పుట్టాడు?
సమాధానములు (జవాబులు):
1. (అ) పురోచనుడు (ఆ) భీముడు.దుర్యో ధనుడునిర్ణయించిన సమయానికి కొద్దిముందుగానే భీముడు,తల్లినీ,సోదరులనూ సొరంగంలో ప్రవేశపెట్టి,
లక్కయిల్లుకు నిప్పుపెట్టి సొరంగంలోకి వెళ్ళిపోతాడు.– ఆది పర్వము - షష్ఠాశ్వాసము – 160 వచనము
వ॥ఆకృష్ణచతుర్దశినాఁడు కుంతీదేవి యప్పురంబునం గల బ్రాహ్మణ పుణ్యాంగనా జనంబుల కెల్ల
నిష్టాన్నపానదానంబులం దుష్టి సేసి దేవపూజగావించియున్నెడం బురోచను పంపిన నిషాదవనిత సపుత్ర యై
బహువిధ వన్యమూలఫలంబులు దెచ్చి యిచ్చుచ్చుం గుంతీదేవిం బాయక సేవించి పాండవకృత్యంబులు
నిత్యంబును నెఱింగించు చుండెడునది నాఁటిరాత్రి యుత్సవంబునం గాల చోదిత యై తానునుం
దనయేవురుగొడుకులు నధిక మధుపానమదంబున మెయి యెఱుంగక లక్కయింటి పక్కంబున నిద్రవోయిన
నర్ధరాత్రంబు నప్పుడు భీముండు మేల్కని పురోచనుకంటె ముందఱఁ దాన యుత్సహించి
వానిశయనగృహద్వారంబున ఘోరానలంబు దరికొలిపి చెచ్చెరఁ దల్లిని నన్ననుం దమ్ములను బిలంబులోని
కనిచి యాయుధాగారంబుతోడన లాక్షాగారంబు హుతాశనున కశనంబు సేసి ఖనకునకుం దమకుశలగమనం
బెఱింగించి బిలప్రవిష్టుం డయి కుంతిని ధర్మార్జున నకుల సహదేవులను బిలంబు వెలువరించి తోడ్కొని
చనునప్పుడు. (160)
2. (అ) వృషపర్వు కూతురు, శర్మిష్ట (ఆ) యయాతి.
శర్మిష్ట, తన చెలులు, దేవయానితో కలసి ఉద్యానవనానికి వెళ్ళి, ఒక సరోవరంలో జలక్రీడలాడుకొన్నాక,
ముందుగా వచ్చి, సుడిగాలి వలన వారి వస్త్రములు కలసిపోగా, దేవయాని చీర కట్టుకొంటుంది. అందువలన,
శర్మిష్ట దేవయానిని తన చీర కట్టుకొనమంటుంది.దేవయాని శర్మిష్ట విడిచిన చీర కట్టనంటుంది. ఇద్దరూ ఎవరకు
వారు తాము గొప్పని, పరస్పరము వాదులాడుకొంటారు. అప్పుడు శర్మిష్ట కోపంతో తన సఖులతో కలసి
దేవయానిని నూతిలోకి త్రోసి వెళ్ళుతుంది. వేటకై వచ్చిన యయాతి మహారాజు చూసి దేవయానిని ఉద్ధరించాడు
(రక్షించాడు).– ఆది పర్వము - తృతీయాశ్వాసము – 134,136,138,141,143,145 వచనములు &
135,137,139,140,142,144 పద్యములు
వ॥ఇట వృషపర్వుకూఁతురు శర్మిష్ట యనుకన్యక యొక్కనాఁడు కన్యకాసహస్రపరివృత యయి
దేవయానీసహితంబు వనంబునకుం జని యొక్కసరోవరతీరంబునఁ దమతమ్ పరిధానంబులు పెట్టి జలక్రీడ
లాడుచున్న నవి సురకరువలిచేతం బ్రేరితంబు లయి కల్సిన నొండొరులం గడవఁ గొలను వెలువడు
సంభ్రమంబున నక్కన్యక లన్యోన్యపరిధానంబులు వీడ్వడం గొని కట్టునెడ దేవయానిపుట్టంబు శర్మిష్ఠం గట్టికొనిన
మఱి దానిపరిధానంబు దేవయాని పుచ్చుకొనక రోసి శర్మిష్ఠం జూచి యి ట్లనియె. (134)
క॥లోకోత్తర చరితుం డగు
నాకావ్యుతనూజ నీకు నారాధ్యను నేఁ
బ్రాకటభూసురకన్యక
నీకట్టినమైల గట్ట నేర్తునె చెపుమా. (135)
వ॥అనిన శర్మిష్ఠ యి ట్లనియె. (136)
క॥మాయయ్యకుఁ బాయక పని
సేయుచు దీవించి ప్రియముసేయుచు నుండున్
మీయయ్య యేటి మహిమలు
నాయొద్దనె పలుక నీకు నానయు లేదే. (137)
వ॥నాకట్టినపుట్టంబు నీకుం గట్టంగాదు గాకేమి యని గర్వంబున నెగ్గులాడి దేవయాని నొక్కనూతం ద్రోచి శర్మిష్ఠ
కన్యకాసహస్రపరివృత యయి క్రమ్మఱి వచ్చి నిజనివాసంబున నుండె నంత. (138)
ఉ॥ఆనహూషాత్మజుం డగుయయాతి యధిజ్యధనుస్సహాయుఁ డై
యానత శాత్రవుండు మృగయాలస్లొలనిబద్ధబుద్ధిఁ ద
త్కానన మెల్లఁ గ్రుమ్మరి నికామపథిశ్రముఁ డేగుదెంచె నం
దానలినాక్షి యున్నవిపినాంతరకూపతటంబునొద్దకున్. (139)
సీ॥చనుదెంచి యమ్మహాజనపతి జల మపేక్షించి యచ్చో విశ్రమించి చూచి
తత్కూపమున విలసత్కూలఘనవల్లి యన్నిష్టసఖి సూఁది యున్న దాని
గురుకుచయుగముపైఁ బరువడిఁ దొరఁగెడు కన్నీరు పూరించుచున్న దానిఁ
దనసమీపమునకు జనులయాగమనంబు పన్నుగాఁ గోరుచు నున్నదాని
ఆ॥వరుణ దేవుతోడఁ గర మల్గి జలనివా
సంబు విడిచి భూస్థలంబువలని
కరుగుదేర నున్న వరుణేంద్రు దేవియ
పోనిదాని దేవయానిఁ గనియె. (140)
వ॥కని నీ వెవ్వరిదాన వి ట్లేల యేకతంబ యివ్విపినాంతరకూపంబున నున్నదాన వనిన విని దేవయాని
యెప్పుడుం దమవిహరించు చున్న యవ్వనంబునకు మృగ యావినోదార్థంబు యయాతి వచ్చుటం జేసి
తొల్లియుఁ జూచినది గావున నాతని నెఱింగి యి ట్లనియె. (141)
తరలము॥అమరసన్నిభ యేను ఘోరసురాసురాహవభూమి న
య్యమరవీరుల చేత మర్దితు లైనదానవులన్ గత
భ్రములఁగాఁ దనవిద్య పెంపునఁ బ్రాప్తజీవులఁ జేసి య
త్యమితశక్తిమెయిన్ వెలింగినయట్టిభార్గవుకూఁతురన్. (142)
వ॥దేవయాని యనుదానఁ బ్రమాదవశంబున నిన్నూతం బడి వెలువడ నేరకున్న దానను న న్నుద్ధరించి రక్షింపు
మనిన నవ్విప్రకన్యకయందుఁ దద్దయు దయాళుం డై. (143)
చ॥జలధివిలోలవీచివిలసత్కలకాంచిసమంచితావనీ
తలవహనక్షమం బయిన దక్షిణహస్తమునం దదున్నమ
ద్గళదురుఘర్మవారికణకమ్రకరాబ్జము వట్టి నూతిలో
వెలువడఁ గోమలిం దిగిచె విశ్రుతకీర్తి యయాతి ప్రీతితోన్. (144)
వ॥ఇఅట్లు దేవయాని నుద్ధరించి యయాతి నిజపురంబున కరిగె.... (145)
3.కృష్ణునికి సుదర్శన చక్రము అగ్నిదేవుడిచ్చాడు. - ఆది పర్వము - అష్టమాశ్వాసము – 254 వచనము
వ॥....సహస్రకరసహస్రదుస్సహమహఃపటలభాసురం బగుచు దేవ దైత్య దానవ యక్ష రాక్షస పిశా
చోరగప్రశమనంబయి వెలుంగు చున్న సుదర్శనం బను చక్రంబును గౌమోదకి యనుగదయును నారాయణున
కిచ్చె నట్లు సంప్రాప్తదివ్యచాపరథాయుధులయి యున్ననరనారాయణులం జూచి యగ్ని దేవుం డి ట్లనియె.
(254)
4.విదురుడు. - ఆది పర్వము - షష్ఠాశ్వాసము – 158 వచనము
వ॥అట హస్తిపురంబున విదురుండు దుర్యోధనుదుర్మంత్రం బంతయు నిమ్ముగా నెఱంగి కడువిశ్వాసి నొక్కఖనకు
నతికుశలుం బాండవులపాలికిం బుత్తెంచిన వాఁడును వచ్చి రహస్యంబునం బాండవులం గని తన్ను
నమ్మునట్లుగా విదురు సాభిజ్ఞానవచనంబు లెఱింగించి యీ కృష్ణచతుర్దశినాఁటిరాత్రి పురోచనుండు లక్కయింట
దహనంబు దరికొల్పుం గావున నిం దుండి మీకు వెలువడి పోవు నట్టియుపాయంబు మారాజునియోగంబునం
జేయ వచ్చితి నని చెప్పి లక్కయిల్లు వెలువడునట్లుగా నొక్కబిలంబు నెవ్వరు నెఱుంగకుండం జేసి వారల
కెఱింగించిన భీముండు దాని నిమ్ముగా శోధించి యెఱింగి యుండునంత. (158)
5.అష్టవసువులలో ఎనిమిదవ వాడయిన ప్రభాసుని అంశతో భీష్ముడు పుట్టాడు. - ఆది పర్వము –
తృతీయాశ్వాసము – 77 పద్యము
క|| ముదమునఁ బ్రభాసుఁ డను నెని
మిదియవ వసునంశమునను మేదినభీష్ముం
డుదయించె సర్వవిద్యా
విదుఁ డపజితపరశురామవీర్యుఁడు బలిమిన్. (77)
******
No comments:
Post a Comment