ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
_/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల
రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి ((క్విజ్ పుస్తకము (1994) ఆధారంగా]
1. తెలుగు భారతంలోని పర్వాలెన్ని, అవిఏవి? ఆశ్వాసాల సంఖ్య ఎంత?
2. నిద్రాభంగం చేసినందులకు భార్యను విడిచిపెట్టి తపోవనానికి వెళ్ళిన దెవరు?
3. భారతంలో కృష్ణుడు మొదటగా ఎపుడు కనిపిస్తాడు?
4. శమంత పంచకం ఎక్కడుంది?
5. అర్జునుడు తన తండ్రి అయిన ఇంద్రునితో యుద్ధం ఎప్పుడు, ఎందుకు చేసాడు?
సమాధానములు (జవాబులు):
1. 18 పర్వములు; 63 ఆశ్వాసములు– 63 ఆశ్లేషానికి గుర్తు; 63 లో ఆరూ మూడూ ఒకదాని కొకటికౌగలించుకొన్నట్లు అభిముఖంగా ఉంటాయి. భారత సారాంశమైన “ మునుజులతో పొంది పొసగి మనుటొప్పు”
అనుదానికి సంకేతముగా కూడా 63 ని తీసుకొనవచ్చునేమో. -
ఆది పర్వము – 8 ఆశ్వాసములు ; సభా పర్వము – 2 ఆశ్వాసములు;
ఆరణ్య పర్వము – 7 ఆశ్వాసములు; విరాట పర్వము – 5 ఆశ్వాసములు
ఉద్యోగ పర్వము – 4 ఆశ్వాసములు; భీష్మ పర్వము – 3 ఆశ్వాసములు
ద్రోణ పర్వము – 5 ఆశ్వాసములు; కర్ణ పర్వము – 3 ఆశ్వాసములు
శల్య పర్వము – 2 ఆశ్వాసములు; సౌప్తిక పర్వము – 2 ఆశ్వాసములు
స్త్రీ పర్వము – 2 ఆశ్వాసములు; శాంతి పర్వము – 5 ఆశ్వాసములు
అనుశాసనిక పర్వము – 5 ఆశ్వాసములు; అశ్వమేధ పర్వము – 4 ఆశ్వాసములు
ఆశ్రమవాస పర్వము – 2 ఆశ్వాసములు; మౌసల పర్వము – 1 ఆశ్వాసము
మహాప్రస్థానిక పర్వము – 1 ఆశ్వాసము; స్వర్గారోహణ పర్వము – 1 ఆశ్వాసము
2. జరత్కారుడు. - ఆదిపర్వం – ద్వితీయాశ్వాసము - 160 పద్యము & 161 వచనము
కం॥ఇనుఁ డస్తమింపఁ బోయిన
ననఘా బోధింప వలసె ననవుడు నామే
ల్కనునంతకు నుండక యినుఁ
డొనరఁగ నస్తాద్రి కేగ నోడఁడె చెపుమా. (160)
వ॥నీవు నా కవమానంబు దలంచితివి నీయొద్ద నుండ నొల్లఁ దొల్లి నీకు నాచేసిన సమయంబు నిట్టిద నీగర్భంబున
నున్నవాడు సూర్యానలసమప్రభుం డైన పుత్రుం డుభయ కులదుఃఖోద్ధరణసమర్థుండు సుమ్ము నీవు వగవక
నీయగ్రజు నొద్దనుండు మని జరత్కారువు నూరార్చి జరత్కారుండు తపోవనంబునకుం జనియె.... (161)
3. ద్రౌపదీ స్వయంవరంలో – ఆది పర్వము– సప్తమాశ్వాసము – 171 వచనము; 174 పద్యము
వ॥అని ధృష్టద్యుమ్నుండు మూఁగిన రాజపుత్రులకు నెల్ల నెఱుంగం జెప్పి ద్రుపద రజపుత్రిం జూచి
యఖిలజలధివేలావలయవల్యితమహీతలంబునం గలరాజనందనులెల్ల నీస్వయంవరంబునకు వచ్చినవారు
వీరలం జూడు మని దుర్యోధన దుశ్శాసన దుర్ముఖ ప్రముఖ లయినధృతరాష్ట్రనందనుల నూర్వురం,
దత్సమీపంబున నున్న కర్ణాశ్వత్థామసోమదత్తభూరిశ్రవ శ్శ్రుతసేనాదులను, బుత్రభ్రాతృసమేతు లయి యున్న
శల్య విరాట జరాసంధ గాంధారపతులను, నక్రూర సారణ సత్యకిసాంబ సంకర్షణ ప్రద్యుమ్న కృష్ణ
కృతవర్మానిరుద్ధయు యుధానప్రముఖు లైనయదు వృష్ణి భోజాంధకవరులను, సుమిత్ర సుకుమార సుశర్మ
సుదక్షిణ సుషేణ సేనాబిందు చంద్రసేన సముద్రసే నౌశీనర చేకితాన శిశుపాల శ్రేణిమ జ్జన మేజయ జయద్రథ
బృహద్రథ సత్యవ్రత చిత్రాంగద శుభాంగద భగీరథ భగదత్త పౌండ్రకవాసుదేవ వత్సరాజ ప్రభృతు లయిన
నాదేశాధీశులను వేదధ్వనిసనాథం బై యొప్పుచున్న బ్రాహ్మణసమూహంబును జూపి. (171)
చ॥అవిరళభస్మ మధ్యమున నగ్నికణంబులువోలె బ్రాహ్మణ
ప్రవరులలోన నేర్పడక పాండవు లేవురు నున్నఁ జూచి యా
దవవృషభుండు కృష్ణుండు ముదంబున వారి నెఱింగి పార్థుఁ డీ
యువతిఁ బరిగ్రహించు ననియుం దలఁచెన్ హృదయంబులోపలన్. (174)
4. కురుక్షేత్ర ప్రదేశము. పరశురాముడు దుర్జనులైన రాజులను 21 మార్లు చంపినపుడు రక్తం అయిదు మడుగులు
కట్టింది. అపుడు పరశురాముడు తమ పిత్రుదేవతలకు తర్పణములిచ్చి శాంతించాడు. అదే శమంతపంచకం.
కురు పాండవులు యుద్ధం అక్కడ చేయటంవలన ఆ ప్రదేశానికి కురుక్షేత్రము అని పేరు వచ్చినది. - ఆదిపర్వం
– ప్రథమాశ్వాసము – 78 పద్యము; 79&81 వచనములు
శా॥త్రేతాద్వాపరసంధి నుద్ధతమదాంధీభూతవిద్వేషిజీ
మూతోగ్రశ్వసనుండు రాముఁ డలుకన్ ముయ్యేడుమాఱుల్ రణ
ప్రీతిన్ వైరిధరాతలేశరులఁ జంపెం బల్వురన్ దీర్ఘ ని
ర్ఘాతక్రూరకుఠారలూననిఖిలక్షత్త్రోరుకాంతారుఁ డై. (78)
వ॥అప్పరశురాముండు నిజనిశితకుఠారధారావిదళితసకల క్షత్త్రురుధిరాపురంబులుగానేనుమడుంగులు గావించి
తద్రుధిరజలంబులఁబితృతర్పణంబుసేసి తత్పితృగణప్రార్థన నుపశమితక్రోధుం డయ్యె దాననచేసి
తత్సమీపప్రదేశంబు శమంతపంచకంబు నాఁ బరఁగె మఱి యక్షౌహిణీసంఖ్య వినుండు. (79)
వ॥....కురుపాండవులు యుద్ధంబు సేయుటం జేసి యాశమంతపంచకంబు కురుక్షేత్రంబు నాఁబరెంగె నట్టి
కురుక్షేత్రంబు నందు. (81)
5. ఖాండవవనం దహించే సమయంలో ఇంద్రుడు వర్షం కురిపిస్తే, దాని నుండి తొలగించేందుకు.ఆదిపర్వం –
అష్టమాశ్వాసము -276,277&282 పద్యములు
ఉ|| ఆనరుమీద ఘోరనిశితాశని వైచె నఖండచండఝుం
ఝూనిలజర్జరీకృతమహాజలధారలతో నిరంతరా
నూనపయోధరప్రకర ముద్ధత మై హరిదంతరంబులనన్
భానుపథంబు నొక్క మొగిఁ బర్వి భయంకర లీలఁ గప్పగాన్. (276)
ఉ|| అన్నవవారివాహనివహమ్ములఁ జూచి భయప్రసున్నుఁ డై
యున్న హుతాశనున్ విజయుఁ డొడకు మంచును మారుతాస్త్ర మ
త్యున్నతచిత్తుఁ డేసె నదియున్ విరియించె రయంబుతో సము
త్పన్న సమీరణాహతి నపార పయోదకదంబకంబులన్, (277)
క॥కొడుకుభుజవిక్రమమునకుఁ
గడు సంతసపడియుఁ దృప్తిగనక చల మే
ర్పడఁగ హూతాశను నార్పం
గడఁగి మహారౌద్రభంగిఁ గౌశికుఁడు వడిన్. (282)
*****************************************************
No comments:
Post a Comment