Translate

29 November, 2014

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి)-114

తెలుగు సుద్దులు…..(114)
ఆ.వె||స్వానుభూతి లేక శాస్త్రవాసనలచే
        సంశయంబు చెడదు సాధకునకు;
        చిత్రదీపమునను జీకటి చెడన`ట్లు
        విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
దీపము చిత్రము (బొమ్మ) వలన, బొమ్మ ఎంత సహజత్వము ఉట్టిపడుతున్నా, ప్రజ్వలనము చూపిస్తున్నా ఎలా చీకటిపోదో అలాగే కేవలము శాస్త్రపఠనవలన, తెలుసుకొనుటవలన సాధకునికి సంశయములు (సందేహములు) తీరవు, పోవు. అనగా, పరమాత్మ (తత్వము) గురించిన సత్యము, చేరు మార్గము; లేదా తెలుసుకున్న ఏవిషయముపైననైనా పూర్తిగా అవగాహన కలుగదు. ఈ పద్యములో వేమన సాధకునికి, లేదా సామాన్య విద్యార్ధికి, ఎవరికైనా సైతము తెలుసుకున్నది, చదివినది, విన్నది పూర్తిగా అవగాహన చేసుకొని, జీర్ణించుకొని, ఆచరణకు ప్రయత్నించి ఆచరించినపుడే, సాధనచేసి స్వానుభవము సంపాదించినపుడే, ఉపయోగముంటుంది; కేవలము చిలుకపలుకల వలన ఉపయోగముండదని హితవు పలుకుతున్నారు. కనుకనే ప్రతి విద్యకు శిక్షణ, అభ్యాసము, ఆచరణ, అనుభవము అవసరము. శిక్షణ, అనుభవము లేకుండా ఎన్ని ఉన్నతమైన డిగ్రీలున్నా ఉపయోగముండదు. ||28-11-2014||

No comments:

Post a Comment