Translate

18 November, 2014

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి - 003 (011 – 015)

ఓం గణేశాయనమః గురుభ్యోనమః
 __/\__
నారాయణం నమస్కృత్య  నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి(క్విజ్)పుస్తకము (1994) ఆధారంగా] 

1. శకుని ఎవరి అంశతో పుట్టాడు?
2. నన్నయ తెలుగులో ధర్మాధర్మాలు రెండింటినీ ఒక్క ఆటవెలదిలో చెప్పాడు– ఆ పద్యం ఏది? దాని అర్ధం ఏమిటి?
3. దేవయాని ప్రేమించినదెవరిని? పెండ్లియాడినదెవరిని?
4. సర్పయాగము చేయుమని జన్మేజయుని పురికొల్పినదెవరు?
5. అగ్నిని సర్వభక్షకుడవు కమ్మని శపించినదెవరు?

సమాధానములు (జవాబులు):

1. ద్వాపరుని అంశ – ఆదిపర్వం – తృతీయాశ్వాసము– 80 వచనము
వ||మఱియు నేకాదశ రుద్రుల యంశంబునఁ గృపుడు పుట్టె సూర్యునంశంబునఁ గర్ణుండు పుట్టె ద్వాపరాంశంబున
    శకుని పుట్టె నరిష్టాపుత్రుం డయిన హంసుండను గంధర్వవిభుండు ధృతరాష్ట్రుం డయి పుట్టె… (80)

2. ఆదిపర్వం – తృతీయాశ్వాసము-219 పద్యము
ఆ|| సర్వభూతదయకు సత్యవాక్యమునకు
     నుత్తమంబు ధర్ము వొండెఱుంగ నొరుల
     నొప్పికోడ కుపతాప మొనరించు
     నదియ కడు నధర్మమనిరి బుధులు. (219)
    అర్ధం: భూతదయ, సత్యము ఈ రెండింటికి మించిన ధర్మం లేదు. ఇతరులబాధకువెనుకాడక హింసించడమే
             అధర్మం. (ఇది యయాతి తన దౌహిత్రులగు యష్టకుడు, బ్రతర్ధనుడు, వసుమంతుడు, నౌశీనరుండయిన
             శిబియు ననువారలకు చెపుతాడు.)

3. దేవయాని కచుని ప్రేమించినది.  యయాతిని పెళ్ళి చేసుకొన్నది. కచుని ప్రేమిస్తే, అతడు తిరస్కరించాడు.
    అపుడు కచుని “నీకు  మృత సంజీవని విద్య పనిచేయదు” అని దేవయాని శపించగా; అతడు, “నిన్ను
   బ్రాహ్మణుడు వివాహమాడుకుండు గాక” అని శపించాడు.   ఆందుకే రాజైన యయాతిని చేసుకొన్నది. -
   ఆదిపర్వం – తృతీయాశ్వాసము – 129-131పద్యములు & 132 & 169 వచనము
ఉ|| నీవునుబ్రహ్మచారివి వినీతుఁడ వేనును గన్యకన్ మహీ
     దేవకులావతంస రవితేజ వివాహము నీకు నాకు మున్
     భావజశక్తి నైనయది పన్నుగ నన్నుఁ బరిగ్రహింపు సం
     జీవనితోడ శుక్రుదయఁ జేయుము నాకుఁ బ్రియంబు నావుడున్. (129)
క॥ఆకచుఁ డత్యంతవిషా
     దాకులుఁ డై లోకనింద్య  మగు నర్థము నీ
     వాకునకుఁ దెచ్చు టుచితమె
     నాకు సహోదరివి నీవు నాచిత్తమునన్. (130)
క|| గురులకు శిష్యులు పుత్రులు,
     పరమార్ధమలోకధర్మపథ మిది దీనిం
     బరికింపక యీపలుకులు,
     తరుణీ గురుపుత్రి నీకుఁ దగునే పలుకన్. (131)
వ॥అనిన నాకచునకు దేవయాని కరం బలిగి నీవు నామనోరథంబు విఫలంబుగాఁ జేసినవాఁడవు నీకి సంజీవని
     పనిసేయ కుండెడుమని శపం బిచ్చినఁ గచుం డేను ధర్మపథంబు దప్పనివాడఁను నీవచ నంబున నాకుఁ
     సంజీవని పనిసేయదయ్యెనేని నాచేత నుపదేశంబు గొన్నవారికిఁ బని సేయుంగాక మర్ఇ నీవు ధర్మనిరోధంబు
     దలంచితివి కావున నిన్ను బ్రాహ్మణుండు వివాహంబు గా కుండెడు మని దేవయానికిఁ బ్రతిశపం బిచ్చి
     తత్క్షణంబ. (132)
వ|| కావున నాకు నీజన్మంబునఁ బతి యయాతియ యితండు భవద్వచనంబున నన్ను వివాహం బగుదు ననియే
     నిందు ధర్మవిరోధంబు లేకుంటునట్లుగాఁ బ్రసాదింపవలయు ననిన శుక్రుండు గరుణించి యయాతికి నీకును
     నయిన యీ వివాహంబునం దపక్రమదోషంబు లేకుండెడు మని వరమ బిచ్చి యయ్యిరువురకుం
     బరమోత్సవంబున వివాహంబు సేసి….(169)

4. ఉదంకుండు. పౌష్యుమహాదేవి కుండలాలు తెస్తున్న ఉదంకుని మోసగించి తక్షకుడు కుండలాలు హరిస్తాడు.
    అందుకే ఉదంకుండు జనమేజయుని సర్పయాగం చేయమన్నాడు; తన తండ్రి కూడా పాము కాటువల్లనే
    చనిపోయాడని జనమేజయుడు సర్పయాగం చేసాడు. - ఆదిపర్వం – ప్రథమాశ్వాసము –
    121-125  పద్యములు;120,122,126 వచనములు
వ॥నీవలనం బరమసంప్రీతహృదయుండ నయితి నీవును గుర్వర్థంబునందుఋణవిముక్తుండ వయితివి నిజేచ్ఛ
     నుండు మనినఁ దదనుజ్ఞ వడసి యుదంకుం డనేక కాలంబు దపంబుసేసె నట్టియుదంకుండు తక్షకుచేసిన
     యపకారంబునకుం బ్రతీకారంబుసేయం జింతించి యొక్కనాఁడు జనమేజయుపాలికిం బోయి యిట్లనియె. (120)
చ॥మితహితసత్యవాక్య జనమేజయ భూజనవంద్య యేను సు
     స్థితి గురుదేవకార్యములు సేయఁగఁ బూను టెఱింగి వంచనో
     న్నతమతి యై యకారణమ నా కపకారము సేసెఁ దక్షకుం
     డతికుటిలస్వభావుఁడు పరాత్మవిశేషవివేకశూన్యుఁ డై. (121)
వ॥మఱి యదియునుం గాక. (122)
చ॥అనవరతార్థదానయజనాభిరతున్ భరతాన్వయాభివ
     ర్థను సకలప్రజాహితవిధాను ధనంజయసన్నిభున్ భవ
     జ్జనకుఁ బరీక్షితున్ భుజగజాల్ముఁ డసహ్యవిషోగ్ర ధూమకే
     తనహతిఁజేసి చేసె నతిదాంతుఁ గృతాంతనికేతనాతిథిన్. (123)
ఉ॥కా దన కిట్టిపాటియపకారముఁ దక్షకుఁ డేక విప్రసం
     బోధనఁ జేసి చేసె నృపపుంగవ నీవు ననేకభూసురా
     పాదితసర్పయాగమున భస్మము సేయుము తక్ష కాది కా
     కోదరసంహతిన్ హూతవహోగ్రసమగ్రశిఖాచయంబులన్. (124)
ఉ|| ప్రల్లదుఁ డైనయొక్క కులపాంసను చేసినదానఁ దత్కులం
      బెల్లను దూషితం బగుట యేమియపూర్వము గావునన్ మహీ
      వల్లభ తక్షకాధమునెపంబున సర్పము లెల్ల నగ్నిలోఁ
      ద్రెళ్లఁగ సర్పయాగ మతి ధీయుత చేయుము విప్రసన్నిధిన్.(125)
వ|| అని యి ట్లయ్యుదంకుడు జనమేజయునకు సర్పయాగబుద్ధిపుట్టించె ననిన విని శౌనకాదిమహామును
     లక్కథకున కి ట్లనిరి. (126)

5. భృగుడు. గర్భవతి అయిన తన భార్య పులోమను అగ్ని ప్రజ్వరిల్లజేయుమని భృగుడు నదికి వెళ్ళాడు.  ఇంతలో
    పులోముడనే రాక్షసుడు వచ్చి ఆమెను చూశాడు.  “ఆమెవరని?” అగ్నిని అడిగాడు; అగ్ని అసత్యము
    చెప్పుటకన్నా ముని శాపమునుండి విముక్తి పొందవచ్చని,“ఆమె పరమపతివ్రత భృగుపత్ని” యని సమాధానం
    చెప్పాడు.  వెంటనే రాక్షసుడు వరాహరూపములో పులోమను ఎత్తుకొని పోయాడు.  అపుడు ఆమె
    గర్భస్తశిశువు బయటకు వచ్చి (చ్యవనుడు) ఆరాక్షసుని భస్మీపటలం చేస్తాడు. తరువాత భృగుడు, తన 
    భార్యద్వారా జరిగినది తెలుసుకొని, అగ్నిని సర్వభక్షకుడవు కమ్మని శపించాడు. ఆదిపర్వం – ప్రథమాశ్వాసము
     – 129,131,133,134 పద్యములు& 130,132,135 వచనములు.
సీ॥భృగుఁ డనువిప్రుండు మగువఁ బులోమ యన్ దాని గర్భిణిఁ దనధర్మపత్ని
     నగ్నిహోత్రమునకు నగ్నులు విహరింపు మని పంచి యభిషేచనార్థ మరుగ
     నంతఁ బులోముఁ డన్ వింతరక్కసుఁ డగ్నిహోత్రగృహంబున కొయ్య వచ్చి
     యత్తన్విఁ జూచి యున్మత్తుఁ డై యెవ్వరిసతి యిది సెప్పుమా జాతవేద
ఆ॥యనఁగ నగ్నిదేవుఁడనృతంబునకు విప్ర
      శాపమునకు వెఱచి శాపభయము
      దీర్చుకొనఁగఁబోలుఁదీర్పరాదనృతాభి
      భాషణమున నైన పాపచయము. (129)
వ॥అని విచారించి యప్పరమపతివ్రత భృగుపత్ని యని కలరూపుఁజెప్పినప్పులోముండు నిది నాకుఁ దొల్లి
     వరియింపంబడినభార్య పదంపడి భృగుండు పెండ్లియయ్యె నని వరాహరూపంబున నాసాధ్విసచిత్త నెత్తుకొని
     పర్వంబర్వం దద్గర్భంబున నున్న యర్భకుండు గరం బలిగి కుక్షిచ్యుతుం డై చ్యవనుండు నాఁ  బరఁగె
     నమ్మునికుమారుని.(130)
క॥సముదితసూర్యసహస్రో
     పమదుస్సహతేజు జగదుపప్లవ సమయా
     సమదీప్తి తీవ్రపావక
     సముఁజూచుచు నసుర భస్మ సాత్కృతుఁడయ్యెన్. (131)
వ॥పులోమయు నక్కొడుకు భృగుకులవర్ధను నెత్తికొని నిజాశ్రమంబునకు వచె ముందఱ్ నారక్కసునకు వెఱచి
     యక్కోమలి యేడ్చుచుం బోయినఁ దద్బాష్ప ధారాప్రవాహంబు మహానదియై తదాశ్రమసమీపంబునం బాఱిన
     దానికి వధూసర యనునమంబు లోకపితామహుండు సేసె నంతఁ గృతస్నానుం డై భృగుండు సనుదెంచి
     బాలార్కుండునుంబోనిబాలకు నెత్తికొని యేడ్చుచున్ననిజ పత్నింజూచి యసుర సేసినయపకారంబున కలిగి
     యయ్యసుర ని న్నెట్లెఱింగె నెవ్వరు సెప్పి రనిన విని పులోమ యి ట్లనియె. (132)
క॥ఈయగ్ని దేవుఁ డసురకు
     నోయనఁ జెప్పుటయు విని మహోగ్రాకృతితో
     నాయసుర నన్ను సూకర
     మై యప్పుడ యెత్తికొని రయంబునఁ జనుచోన్. (133)
క॥కుక్షిచ్యుతుఁడై సుతుఁ డా
     రాక్షసు భస్మంబు సేసి రాజితశక్తిన్
     రక్షించె నన్ను ననవుడు
     నాక్షణమ మునీంద్రుఁ డగ్ని కతిరోషమునన్. (134)
వ॥నీవతిక్రూరుండవు సర్వభక్షకుండవు గమ్మనిశాపంబిచ్చిన నగ్ని దేవుండిట్లనియె. (135)
క॥తనయెఱిఁగినయర్థం బొరుఁ
     డనఘా యిదియెట్లు సెప్పుమని యడిగిన జెఁ
     ప్పనివాఁడును సత్యము సె
     ప్పనివాఁడును ఘోరనరకపంకమునఁ బడున్. (136)
****

No comments:

Post a Comment