Translate

25 November, 2014

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 008 (036 – 040)


ఓం గణేశాయనమఃగురుభ్యోనమః 
 __/\__

నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్| 

[డా.తిప్పాభట్లరామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్)పుస్తకము (1994) ఆధారంగా[

1.‘వసుషేణుడు’ ఈ పేరు భారతంలో ఒక ప్రసిద్ధ వ్యక్తిది, ఆ వ్యక్తి ఎవరు?
2. ద్రౌపది స్వయంవరం ఎప్పుడు జరిగింది?
3. భీష్మునికి స్వచ్ఛంద మరణం అనే వరం ఎవరివల్ల వచ్చింది?
4. ఇది నాకు తప్ప ఇతరులకు తెలియదు కదా అని ధార్మికులు అసత్యమాడవచ్చునా? అని ఒక  రాజును ఒక స్త్రీ
    అడిగింది, ఎవరా స్త్రీ? ఎవరిని?
5. ద్రోణునికి పూర్వం కురు కుమారులకు విలువిద్య నేర్పినదెవరు?
----------------------------------------------------------------------------------------------------------

సమాధానములు (జవాబులు):

1. కర్ణుడు.  కుంతి తన కొడుకును ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలింది.  అందులో రత్నాలు, మణులు, బంగారమూ
    పెట్టింది.  వసువంటే బంగారము.  బంగారముతో సహా దొరికాడు కనుక వసుషేణుడు అయ్యాడు. - ఆదిపర్వం –
    పంచమాశ్వాసము -33 వచనము
వ॥ఇట్లు వసునివహంబుతో వచ్చుటంజేసి వసుషేణుం డనునామంబునం బరఁగి కర్ణుండు రాధేయుం డై
     సూతగృహంబునం బెరుఁగు చుండె నంత నిట. (33)

2. పౌష్య శుక్ల అష్టమి రోహిణి నక్షత్రమున. - ఆదిపర్వం – సప్తమాశ్వాసము -25 వచనము & 282 పద్యము.
వ॥...నేను నుపశ్రుతిం జూచితి నిది దప్పదు పాండవులు పరలోకగతులు గారు పరమానందంబున నున్నవారు
      వార లెందుండియు నిందులకు వత్తురు నీవును సుచిత్తుండ వయి స్వయంవరం బిప్పురంబున ఘోషింపం
      బంపు మిది కన్యాదానంబునందు రాజులకు శాస్త్ర చోదితం బనినం బురోహితువచనంబునం జేసి యూఱడి
      ద్రుపదుండు నేఁటికిడెబ్బదియే నగుదివసంబునం బౌషమాసంబున శుక్ల పక్షంబున నష్టమియు రోహిణినాఁడు
      స్వయంవరం బని ఘోషింపంబంచి. (25)
ఆ|| నేఁడు పుణ్యదినము నెమ్మితో రోహిణీ
     యుక్తుఁ డయి శశాంకుఁ డున్నవాఁడు
     మంత్రవంతముగఁ  గ్రమంబున  నేవురుఁ
     బెండ్లి యగుఁడు కృష్ణఁ బ్రీతితొడ. (282)

3. శంతనుని వలన.  తనతండ్రి వివాహము కొరకు తను వివాహమాడనని భీష్మమయిన ప్రతిజ్ఞ చేసినందులకు
    సంతసించి శంతనుడావరమిచ్చాడు. - ఆదిపర్వం – చతుర్థాశ్వాసము-193 వచనము
వ॥శంతనుండును బరమానురాగంబున సత్యవతిని వివహం బై యతిమానుషంబయినయాభీష్ము
      సత్యవ్రతంబునకు సంతసిల్లి యాతనికి స్వచ్ఛందమరణంబుగా వరం బిచ్చి .... (193)

4. శకుంతల దుష్యంతునితో అన్న మాటలివి. - ఆదిపర్వం – చతుర్థాశ్వాసము -79 పద్యము
ఆ|| ఏల యెఱుక లేని యితరులయట్ల నీ,
      వెఱుఁగ ననుచుఁబలికె దెఱిఁగి యెఱిఁగి
      యేన కాని దీని నెఱుఁగ రిందొరు లని,
      తప్పఁ బలుక నగునె ధార్మికులకు. (79)

5. కృపాచార్యుడు. - ఆదిపర్వం – పంచమాశ్వాసము – 191 వచనము &192 పద్యము
వ|| అట్టి కృపాచార్యు రావించి భీష్ముం డతిభక్తిం బూజించి వానితోడఁ దనమనుమల నందఱ
      విలువిద్యఁ గఱవం బంచిన.(191)
క||సవిశేషముగ ధనుర్వే
    దవిశారదు లైరి కడుజితశ్రములై పాం
    డవధృతరాష్ట్రాత్మజయా
    దవు లాదిగ రాజసుతులు తత్కృపశిక్షన్. (192)
********************************************************** 

No comments:

Post a Comment