Translate

22 November, 2014

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 005 (021 – 025)

 ఓం గణేశాయనమః గురుభ్యోనమః 
__/\__
నారాయణం నమస్కృత్య  నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి(క్విజ్)పుస్తకము (1994) ఆధారంగా]


1. కుమారాస్త్ర విద్యాప్రదర్శనం తరువాత దుర్యోధనుడు “ఱొమ్ము మీదచేయి వేసుకొని హాయిగా నిద్రపోయాడు”
    ఎందుచేత?
2. కృపుని తండ్రి ఎవరు? అతడు చిన్నతనంలో ఎవరి దగ్గర పెరిగాడు?
3. తన అల్లునికి ముసలితనం కలుగుగాక అని శపించినది ఎవరు? ఆ అల్లుడెవరు?
4. శతశృంగం నుండి వచ్చిన తరువాత పాండవులు హస్తినలో ఎన్నేళ్ళు ఉన్నారు?
5. లక్కయింటికి వెళ్ళేటప్పటికి ధర్మరాజు వయస్సెంత?

సమాధానములు (జవాబులు):

1. కర్ణుని సాయంతో అర్జునుని మీద భయం పోయింది. – ఆదిపర్వం – షష్ఠాశ్వాసము – 63 పద్యం.
క|| వినుతధనుర్విద్యావిదు,
     ఘనుఁ గర్ణు సహయుఁ బడసి కౌరవవిభుఁ డ
     ర్జునువలనిభయము సెడి ఱొ,
     మ్మునఁ జే యిడి నిద్రవోయె ముదితాత్ముండై. (63)

2. శరద్వంతుడు. గౌతముని పుత్రుడైన శరద్వంతు ఘోరతపస్సుకు భయపడి, ఇంద్రుడు, జానపది అనె ఆమెను
    పంపగా, ఆమెను జూసి మోహితుడై రేతఃపాతము (వీర్యము పడుట) గావించె. అది తెలుసుకొని, శరద్వంతుడు
    అక్కడినుండి తప్పస్సు చేసుకొనుటకు వేరే ప్రదేశమునకు పోయెను. ఆ వీర్యము ఒక శరస్తంబంబున (రెల్లు)
    పడి, రెండు భాగములై, ఒక పిల్లవాడు, ఒక పిల్ల గా జన్మించిరి.  తదనంతరము వేటకు వచ్చిన శంతనుని,
    సేనాధిపతి ఆ పిల్లలను, శరచాపకృష్ణాజినంబులను జూచి, శంతనునికి చూపగా, అతను కృపతో (దయతో)
    వారిని తీసుకొని వెళ్ళి పెంచెను.  అందుకని వారిని, కృపుడు, కృపి అని పిలవబడిరి. కృపుడు చిన్నతనంలో
    శంతనుని దగ్గర పెరిగాడు.ఆదిపర్వం –  పంచమాశ్వాసము -185-187 పద్యములు &188 వచనము
సీ॥వినవయ్య గౌతముం డనఁ బ్రసిద్దుం డైనమునికి శరద్వంతుఁ డనుమహాత్ముఁ
     డురుతర తేజుఁ డై శరసమూహంబుతో నుదయించి వేదముల్ చదువ నొల్ల
     కతి ఘోరతపమున నుతభూసురోత్తముల్ వేదముల్ చదువున ట్లాదరమున
     సర్వాస్త్రవిదుఁడు ధనుర్వేద మొప్పఁగఁ బడసి మహానిష్ఠఁ గడఁగి తపము
ఆ॥సేయు చున్న దివిజనాయకుఁ డతిభీతి
      నెఱిఁగి వానితపముఁ జెఱుపఁ బనిచె
      జలజనయనఁ దరుణి జానపది యనెడు
      దాని నదియు వచ్చె వానికడకు. (185)
క॥అమ్ముదితఁ జూచి కాముశ
     రమ్ములచేవిద్ధుఁ డై శరద్వంతుఁడు చి
     త్తమ్మలర మదనరాగర
     సమ్మునఁ ద న్నెఱుఁగ కుండెఁ జంచలతనుఁ డై. (186)
క॥ఆతరుణి కటాక్షేక్షణ
     పతము గౌతమున కపుడు పటుబాణధనుః
     పాతముతోడన రేతః
     పాతము గావించె రాగపరవశుఁ డగుటన్.(187)
వ॥దాని నెఱంగి శరద్వంతుం డయ్యాశ్రమంబు విడిచి చని యొండు చోటం దపంబు సేయు చుండె నవ్వీర్యం
     బొక్కశరస్తంబంబున ద్వివిధం బయి పడిన నందొక కొడుకునుం గూఁతురుం బుట్టి రంత శంతనుండు
     మృగయావినోదార్థం బరిగి వానిసేనాగ్రచరుండాశర స్తంబంబున నున్నకొడుకుం గూఁతుఁదత్సమీపంబున నున్న
     శరచాపకృష్ణాజినంబులుం జూచి యివి యెయ్యేనియు నొక్కధనుర్వేదవిదుం డయినబ్రాహ్మణునపత్యం బగు నని
     శంతనునకుం జూపిన శంతనుండును వారలఁ జేకొని కృపాయత్తచిత్తుం డయి పెనుచుటం జేసి
     యయ్యిరువురుఁగృపుడును గృపియు ననం బెరుగు చున్నంత. (188)

3. శుక్రుడు.  యయాతి – ఆదిపర్వం – తృతీయాశ్వాసము – 187 వచనము
 వ॥అయ్యయాతియు దానిం బట్టువఱచుచుఁ దోడన చని శుక్రుం గని నమస్కరించి యున్న నద్దేవయాని
      గద్గదవచన యై యధర్మంబున ధర్మంబు గీడ్పఱిచి యిమ్మహీశుం డాసురంబున నాసురియం దనురక్తుండై
      పుత్రత్రయంబు వడసి నా కవమానంబు సేసె ననిన విని శుక్రుండు యయాతి కలిగి నీవు యౌవన గర్వంబున
      రాగాంధుండ వై నాకూఁతున క ప్రియంబు సేసితివి కావున జరాభారపీడితుండవు గమ్మని శాపం బిచ్చిన
      నయ్యాయాతి శుక్రున కిట్లనియె. (187)

4. 13 సంవత్సరములు. ఆదిపర్వం – షష్ఠాశ్వాసము – 142 వచనము
 వ॥అని పంచినం బురోచనుం డతిత్వరితగతి నరిగి దుర్యోధను కఱపినరూపున వారణావతంబున లాక్షాగృహంబు
      రచియించుచుండె నిట యుధిష్ఠిర భీమార్జున యములుంగ్రమంబునం దొల్లి షోడశపంచదశ చతుర్దశ
      త్రయోదశవర్ష జాతులయి శతశృంగంబున నుండి హస్తిపురంబునకు వచ్చి యందుఁ గౌరవులం గలసి
      యస్త్రవిద్యలం గఱచుచుం బదుమూఁడేం డ్లుండి యపుడు ధృతరాష్ట్రునియోగంబున వారణావతంబునకు
      జననీసహితంబుగాఁ బోవ సమకట్టి మహాజవసత్త్వ సమేతంబు లయిన హయంబులం బూనినరథంబు లెక్కి
      ధనుర్ధరు లయి హస్తిపురంబు వెలువడునపు డప్పురంబునం గలబ్రాహ్మణక్షత్రియ ప్రముఖానేకజనంబులు
      శోకసంతప్త హృదయు లయి. (142)

5. 29 సంవత్సరములు (16+13=29; ధర్మరాజుకు పదహారు సంవత్సరము లప్పుడు శతశృంగమునుండి హస్తినకు
    వచ్చెను; అచట పదమూడు సంవత్సరములు ఉన్న తరువాత వారణావతమునకు (లక్క ఇంటికి)
    పంపబడెను.). – ఆదిపర్వం - షష్ఠాశ్వాసము – 142 వచనము
*****

No comments:

Post a Comment