Translate

16 November, 2014

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి – 002 (006 - 010)

ఓం గణేశాయనమః గురుభ్యోనమః
 __/\__
నారాయణం నమస్కృత్య  నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి(క్విజ్)పుస్తకము (1994) ఆధారంగా]
  1.  శకుంతల అనే పేరు ఎవరు పెట్టారు? ఎందుచేత?
  2.  అంగారపర్ణుడెవరు? తర్వాత ఏ పేరుతో అతడు ప్రసిద్ధుడయ్యాడు?
  3.  కచుడు (కచుండు)ఎవరి కొడుకు? ఎవరి మనుమడు?
  4.  దుష్యంతుడు శకుంతలను తిరస్కరించటానికి (భారతం ప్రకారం) కారణ మేమిటి?
  5.  చాక్షుషీ విద్య అంటే ఏమిటి? ఇది భారతంలో ఎవరు, ఎవరి నుండి పొందారు?

సమాధానములు (జవాబులు):

1. కణ్వుడు. తాను చూసేటప్పటికి శకుంతములచే (పక్షులచే) లాలింపబడుతోంది కనుక. (శకుంత పక్షి కూడా కావచ్చు)- ఆదిపర్వం –చతుర్థాశ్వాసము – 47 పద్యం & 48 వచనం
ఆ|| చెలఁగి లేవ నేడ్చుచిఱుతుక దానిఁ గ్ర
      వ్యాద ఘోరమృగము లశనబుద్ధిఁ
      బట్ట కుండఁ జెట్టుపలఁ గప్పి రక్షించు
      కొని శకుంతతతులు గూడి యుండె. (47) 
వ|| అంత నేను శిష్యగణంబులతోడ సమిత్కుసుమఫలాహరణార్థం బక్కడకుంజని యమ్మాలినీపులినతలంబున  శకుంతరక్షిత యై యున్నకూఁతునత్యంత కాంతిమతి నవనీతలంబున కవతరించినతరుణశశిరేఖయుంబోనిదాని నెత్తుకొని వచ్చి శకుంతరక్షిత యగుటంజేసి శకుంతల యనునామం బిడి కరంబు గారవంబునం బెనిచితిమి. (48)

2. పాండవులకు అడివిలో కనబడిన గంధర్వుడు; అతనిని అర్జునుండు జయిస్తాడు.  చిత్రరధుడు. - ఆదిపర్వం – సప్తమాశ్వాసము – 39 వచనము & 51 వచనము
వ|| ఇవ్వేళలయందుఁ గ్రుమ్మరియెడువారి నెంత బలవంతులనైనను రాజుల నయినను నిగ్రహింతుము నన్ను డాయకుం డెడ గలిగి పొం డే నంగారపర్ణుం డనుగంధర్వుండఁ గుబేరుసఖుండ నెప్పుడు నిందు విహరించుచుండుదు న న్నెఱుంగరె యివ్వనంబును నంగారపర్ణంబు నాజగద్విదితంబులు దీని మానవులు సొర నోడుదు రనిన వాని కర్జునుం డిట్లనియె. (39)
వ|| నీయాగ్నేయాస్త్రంబున దగ్ధరథుండ నయ్యును గంధర్వమాయ ననేకరత్నవిచిత్రితం బైనరథంబు వడసి యిది మొదలుగాఁ జిత్రరథుండ నయ్యెద…. (51)

3. బృహస్పతి కొడుకు.  అంగిరసుని మనుమడు. – ఆది పర్వము – తృతీయాశ్వాసము – 118 పద్యం
మ|| మతిలోకోత్తరుఁ డైనయంగిరసుమన్మం డాశ్రితుండాబృహ
        స్పతికిం బుత్త్రుఁడు మీకు శిష్యుఁడు సురూపబ్రహ్మచర్యాశ్రమ
        వ్రతసంపన్నుఁ డకారణంబ దనుజవ్యాపాదితుం డైన న
        చ్యుతధర్మజ్ఞ మహత్మ యక్కచున కే శోకింప కెట్లుండుదున్ (118)

4. లోకులు అపవాదం వేస్తారనే భయం. - ఆదిపర్వం – చతుర్థాశ్వాసము –108 పద్యం.
తే|| అన్యు లెఱుఁగిమిఁ జేసి లోకాపవాద,
      భీతి నెఱిఁగియు నిత్తన్విఁ బ్రీతి దప్పి
      యెఱుఁగ నంటిని నిందఱ కిప్పు డెఱుఁగఁ
      జెప్పె నాకాశవాణి యచ్చెరువుగాఁగ. (108)

5.చాక్షుషీ విద్య అంటే మూడులోకాల్లో దేన్నయినా చూడగలిగే విద్య.  అంగారపర్ణుడు అర్జునకు ఇచ్చాడు.  ఆదిపర్వం – సప్తమాశ్వాసము – 51 వచనము
వ|| …….నాతపంబునంబడయంబడిన చాక్షుషి యను విద్య నీ కిచ్చెద దీనిం దొల్లి మనువువలన సోముండు వడసె సోమునివలన గంధర్వపతి యయిన విశ్వావసుండు వడసె నాతనివలన నేను బడిసితి నెవ్వం డేని మూడు లోకంబులుం జూడ నిచ్చగించు నాతండు తన యిచ్చకుం దగ నివ్విద్య పెంపున సర్వంబునుం జూచు నేము దీననచేసి కాదె మానవులకు విశేషుల మై వేల్పులచేత శాసింపంబడక జీవించెద మిది కాపురుష (కుత్సిత పురుషుడు) ప్రాప్తం బై ఫలియింపదు నీవు తాపత్యవంశవర్ధనుండవు మహాపురుషుండవు నీకు సఫలం బగు నీదివ్యవిద్య గొను మిచ్చెద దీనిఁ గొను నప్పుడు షణ్మాస వ్రతంబు సేయవలయు నీవు నాకు నాగ్నేయాస్త్రం బిచ్చునది మఱి మహాజవసత్త్వంబులుఁ గామవర్ణంబులుఁ గామగమనంబులు నయిన గంధర్వహయంబులు మీ కేవురకు నూఱేసి యిచ్చెద. (51)
****

No comments:

Post a Comment