ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం
సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల
రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. భీష్ముడు వేదాభ్యాసం ఎవరిదగ్గర చేసాడు?
2. వ్యాసుని భారతాన్ని మనుష్యలోకంలో చెప్పినదెవరు?
3. ద్రోణుని గురుదక్షిణ తీర్చటానికి పాండవులలో ఒకరు తప్ప నల్వురూ వెళ్ళారు – ఆ మిగిలిన ఒక్కరూ ఎవరు?
4. తెలుగు భారతంలో ఎక్కువ ఆశ్వాసాలున్న పర్వం ఏది? ఎన్ని?
5. జనమేజయుని తమ్ములు ఎంతమంది? ఎవరు?
సమాధానములు (జవాబులు):
1. వసిష్టుని దగ్గర - ఆదిపర్వం – చతుర్థాశ్వాసము -169 పద్యముసీ|| సాంగంబు లగుచుండ సకలవేదంబులు సదివె వసిష్టుతో సకలధర్మ
శాస్త్రాదిబహువిధ శాస్త్రముల్ శుక్రబృహస్పతుల్ నేర్చినయట్ల నేర్చె
బరమాస్త్రవిద్య నప్పరశురాముండెంత దక్షుఁ డంతియ కడుదక్షుఁ డయ్యె
నాత్మవిజ్ఞాణబునందు సనత్కుమారాదులయట్టిఁడ యనఘమూర్తి
ఆ|| నొప్పుకొనుమ వీని నుర్వీశ యని సుతు
నిచ్చి గంగ సనిన నెఱిఁగి తనయు
నెమ్మిఁ దోడుకోనుచు నిధిఁ గన్నపేదయ
పోలె సంతసిల్లి భూవిభుండు.(169)
2. వైశంపాయనుడు.- ఆదిపర్వం – ప్రథమాశ్వాసము -66 వచనము
దేవలోకం- నారదుడు
పితృలోకం – దేవలుడు
గరుడ,గంధర్వ,యక్ష,రాక్షస లోకములు – శుకుడు
నాగలోకం – సుమంతుడు
మనుష్యలోకం- వైశంపాయనుడు
వ॥ఇట్టిమహాభారతంబు ననేకవిధపదార్థప్రపంచసంచితంబు నుపపర్వమహాపర్వోప శోభితంబు
నుపద్వీపసంభృతం బయినభువనం బజుండు నిర్మించినట్లు కృష్ణద్వైపాయనుండు నిఖిలలోకహితార్థంబు
దత్తావధానుం డై సంవత్సర త్రయంబు నిర్మించి దాని దేవలోకంబునందు వక్కాణింప నారదుం బనిచెఁ బితృ
లోకంబున వక్కాణింప నసితుం డైనదేవలుం బనిచె గరుడగంధర్వయక్షరాక్షసలోకంబులందు వక్కాణింప
శుకుం బనిచె నాగలోకంబునందు వక్కాణింప సుమంతుం బనిచె మనుష్యలోకంబున జనమేజయునకు
వక్కాణింప వైశంపాయనునిం బనిచె నే నావైశంపాయనమహామునివలన విని వచ్చితిఁ దొల్లి
కృతత్రేతావసానసమయంబుల దేవాసుర రామరావణ యుద్ధంబులునుం బోలె ద్వాపరాంతంబునం
బాండవధార్తరాష్ట్రులకు మహాఘోరయుద్ధంబయ్యె నందు. (66)
3. ధర్మరాజు ( అర్జునుడు ధర్మరాజును మీరు చూస్తూ ఉండండి, మేము వెళ్ళి ద్రుపదుని బంధించి తెస్తామన్నాడు.)
- ఆదిపర్వం – షష్ఠాశ్వాసము-76 వచనము
వ॥ఇట్లు పాంచాలుబాణవృష్టికి నిలుపోపక కురుకుమారులు కుమారశర నిహత సురారికుమారులుంబోలె
వెఱచఱిచి పాండ్వులయొద్దకుం బఱతెంచినం జూచి యర్జునుం డాచార్యధర్మజులకు నమస్కరించి మీర లింద
యుండుం డేనీక్షణంబ యప్పాంచాలుం బట్టి తెచ్చెద నని విజృంభించి సంరంభంబున భీమసేనుండు దనకు
సేనాగ్రచరుండు గా మాద్రేయులు రథచక్రరక్షకులుగా ద్రుపదరాజ వాహినీ సముద్రంబు దఱియం జొచ్చిన. (76)
4. ఆదిపర్వం – 8 ఆశ్వాసాలు
5. జనమేజయుని తమ్ములు ముగ్గురు. – అ)శ్రుతసేనుడు ఆ)భీమసేనుడు ఇ)ఉగ్రసేనుడు - ఆదిపర్వం –
ప్రథమాశ్వాసము - 83 వచనము
వ॥ఆ ప్రదేశంబునకు సమర యను దేవశునికొడుకు సారమేయుం డను కుర్కుర కుమారుండు క్రీడార్థంబు వచ్చి
క్రుమ్మరుచున్న నలిగి జనమేజయుతమ్ములు శ్రుతసేనుండును భీమసేనుండును నుగ్రసేనుండును ననువార
లాసార మేయు నడిచిన నది యఱచుచుం బఱ తెంచి తమతల్లికిం జెప్పిన నాసరమయు నతికోపాన్విత యై
జనమేజయునొద్దకు వచ్చి యి ట్లనియె. (83)
****
No comments:
Post a Comment