ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం
సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల
రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. శుక్రుని కూతురెవరు?2. విదురుడు పూర్వం ఎవరు? ఎవరి శాపం వలన విదురుడయ్యాడు?
3. పాండవులు చనిపోలేదని ద్రుపదునకు ధైర్యం చెప్పినది ఎవరు?
4. ద్రౌపది గాక సహదేవుని భార్య ఎవరు? ఆమె కొడుకు ఎవరు?
5. వ్యాసుడు ఎవరి ఆజ్ఞతో సోదరక్షేత్రాలలో సంతానం కన్నాడు?
--------------------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. దేవయాని. - ఆదిపర్వం – తృతీయాశ్వాసము – 107 వచనము
వ॥దుహితృ స్నేహంబునం జేసి యద్దేవయానిపలుకులు శుక్రుం డతిక్రమింపండు గావున నీనేర్చువిధంబున దాని
చిత్తంబు వడసి శుక్రు నారాధించిన నీకిష్ట్సిద్ధియగు నని దేవతలు ప్రార్థించి పంచినం.... (107)
2. యముడు. మాండవ్యుని శాపం వలన. [బాల్యంలో (పదునాలుగు సంవత్సరములు దాటువరకు) చేసిన
తప్పులకు తల్లిదండ్రులు బాధ్యులు. ఈ న్యాయం విడిచి యముడు మాండవ్యునికి కొఱత వేశాడు. అందుచేత
(మర్త్య) మనుష్య లోకములో శూద్రయోని పుట్టమని మాండవ్యుడు యముని శపించాడు.] - ఆదిపర్వం –
చతుర్థాశ్వాసము -270&272 వచనములు; 271పద్యము
వ॥అనిన మాండవ్యునకు ధర్మరాజిట్లనియె. (270)
కం॥సొలయక తూనిఁగలం గొ
ఱ్ఱుల్ఁ బెట్టితి నీవు నీ చిఱుతకాలము త
త్ఫల మిప్పు డనుభవించితి
తొలఁగునె హింసాపరులకు దుఃఖప్రాప్తుల్.(271)
వ॥అనిన విని మాండవ్యుం డలిగి జన్మంబు మొదలుగాఁ బదునాలుగువత్సరంబులు దాటునంతకుఁ బురుషుండు
బాలుండు వాఁ డెద్దిసేసినఁ బాపంబుం బెద్ద పొరయండు వానికి నొరు లెగ్గుసేసినఁ బాతకు లగుదు రిది నా చేసిన
మర్యాదనీవిట్టి ధర్మంబు దలంపక బల్యంబున నల్పదోషంబుఁ జేసిన నాకు బ్రాహ్మణోచితంబుగాని
క్రూరదండంబు గావించిన వాఁడవు మర్త్యలోకంబున శూద్రయోనింబుట్టు మని శాపం బిచ్చుటంజేసి వాఁడు
విదురుండై పుట్టె.(272)
3. పురోహితుడు. ఉపశ్రుతితో అతడు గ్రహిస్తాడు. ఇతడే రాయబారానికి కౌరవసభకు వెళ్ళాడు. - ఆదిపర్వం –
సప్తమాశ్వాసము– 25వచనము
వ॥తొల్లి దేవేంద్రుండు గొండొకకాలం బదృశ్యుం డై యుండిన నతనిం గానక శచీదేవి శోకింపం బోయిన నుపశ్రుతిం
జేసి బృహస్పతి దనికి దేవేంద్రాగమనంబు సెప్పె నని వేదవచనంబుల వినంబడుం గావున నేను
నుపశ్రుతింజూచితినిది దప్పదు పాండవులు పరలోకగతులు గరు పరమానందంబున నున్నవారు వార
లెందుండియు నిందులకు వత్తురు నీవును సుచిత్తుండ వయి స్వయంవరం బిప్పురంబున ఘోషింపం బంపు
మిది కన్యాదానంబునందు రాజులకు శాస్త్ర చోదితం బనినం బురోహితువచనంబునమ్ జ్సి యూఱడి
ద్రుపదుండు నేఁటికి డెబ్బదియే నగుదివసంబునం బౌషమాసంబున శుక్లపక్షంబున నష్టమియు రోహిణినాఁడు
స్వయంవరం బని ఘోషింపంబంచి. (25)
4. స్వయంవర లబ్ధయైన విజయ; సుహోత్రుడు- ఆదిపర్వం – చతుర్థాశ్వాసము -116 వచనము
వ॥....స్వయంవరలబ్ధయైనవిజయకు సుహోత్రుండుపుట్టె మఱియు భీమసేనునకు హిడింబకు
ఘటోత్కచుండుపుట్టె నిప్పాటం బాండవపుత్రు లైనపదునొక్కండ్రయందును వంశకరుం డైనయభిమన్యునకు
విరాట్పుత్రి యయినయుత్తరకుం బరీక్షితుండు పుట్టె. (116)
5. తల్లియైన సత్యవతి ఆజ్ఞతో. - ఆదిపర్వం – చతుర్థాశ్వాసము -245-247 పద్యములు; 248 వచనము
కం॥ధృతి నీయనుజుండై వి
శ్రుతుఁ డైనవిచిత్రవీర్యుసుక్షేత్రముల న్
సుతులం బడయుము కులమవి
రతసంతతి నెగడ దేవరన్యాయమునన్. (245)
కం॥నీకారణమున వంశ మ
నకుల మై నిలుచుటయుఁ దదాప్తులుఁ బ్రజలున్
శోక భయంబులువిడుతురు
నాకును భీష్మునకుఁ గడు మనఃప్రియ మెసంగున్. (246)
కం॥అని సత్యవతి నియోగిం
చిన వేదవ్యాసుఁ డట్ల చేయుదు నిది యెం
దును గలధర్మువ యెప్పుడు
వినఁబడు నానాపురాణవివిధశ్రుతులన్.(247)
వ॥ఇక్కాశీరాజదుహితలయందు ధర్మస్థితిం బుత్రోత్పత్తిఁ గావించెద వీరలు నా చెప్పినవ్రతంబొకసంవత్సరంబు సేసి
శుద్ధాత్మలగుదురురేని సత్పుత్త్రులు పుట్టుదురనిన సత్యవతి యి ట్లనియె. (248)
****************************************************************
No comments:
Post a Comment