శ్రీ విఘ్నేశ్వర దండకము
శ్రీపార్వతీపుత్ర!
లోకత్రయస్తోత్ర! సత్పుణ్యచారిత్ర! భద్రే భవక్త్రా! మహాకాయ! కాత్యాయనీనాధ
సంజాతస్వామీ! శివాసిద్ధి విఘ్నేశ! నీ పాదపద్మంబులఁ, నీదుకంఠంబు, నీబొజ్జ,
నీమోము, నీమోవి, బాలేందు ఖండంబు, నీనాల్గుహస్తంబులఁ, నీకరాళంబు, నీపెద్ద
వక్త్రంబు, నీఏకదంతంబు, నీపాదహస్తంబు, లంబోదరంబుఁ, సదా మూషికాశ్వంబు,
నీమందహాసంబు,
నీచిన్నతుండంబు,
నీగుజ్జురూపంబు, నీశూర్పకర్ణంబు, నీనాగయజ్ఞోపవీతంబు, నీభవ్యరూపంబు
దర్శించి హర్షించి సంప్రీతిమొక్కంగ, శ్రీగంధముఁ, కుంకుమంబక్షతల్లాజులఁ,
చంపకంబుల్, దగఁ మల్లెలఁ, మంచిచేమంతులఁ, దెల్లగన్నేరులఁ, మంకెనల్, పొన్నలుఁ,
పువ్వులుఁ మంచిదూర్వంబులుఁ దెచ్చిశాస్త్రోక్తరితిఁ సమర్పించి, బూజించి,
సాష్టాంగముఁ జేసి విఘ్నేశ్వరా నీకుటెంకాయలున్నరటిపండ్లుఁ, మదిఁమంచివౌ
నిక్షుఖండంబుులఁ, రేగుబండ్లప్పడంబుల్, నడల్,
నేతిబూరెల్ మరిం గోధుమన్పడంబుల్, వడియముల్, పుణ్కులుఁ, బూరెలుఁ, గారెలుఁ,
చక్కనౌ చక్కెరల్ చల్మిడిఁ, దేనియుఁ, జున్ను, శాల్యన్నము, న్నాన్నబియ్యంబు,
నామ్రంబు, బిల్వంబు, మేల్ బంగరుఁ పళ్ళెమందుంచి నైవేద్యముఁ బెట్టి,
నీరాజనంబుఁ, నమస్కారముల్ జేసి, విఘ్నేశ్వరా! నిన్ను పూజింపకే అన్యదైవంబులఁ
బ్రార్థనల్ సేయటల్ కాంచన బొల్లకేయిన్ముదాగోరు చందంబుగాదే మహాదేవా!
యోభక్తమందార! యోసుందరాకారా! యోభాగ్యగంభీర! ఓ దైవచూడామణీ! లోకరక్షామణీ!
బంధుచింతామణీ! స్వామి, నిన్నెంచ నేనెంత! నీదాసదాసాన దాసుండ, శ్రీదొడ్డ
రాజన్వయుండఁ రమానాథదాసుండ నన్నిపుడు చేపట్టి సుశ్రేయునింజేసి,
శ్రీమంతుగాజూచి, హృత్పద్మసింహాస నారూఢతన్నిచ్చి కాపాడుటే కాదు, నిల్గొల్చి
ప్రార్థించు భక్తాళికి కొంగుబంగారమై, కంటికిఁ రెప్పవై, బుద్ధియుఁ,
విద్యయుఁ, బాడియుఁ, బంటయుఁ బుత్రపౌత్రాభివృద్ధిఁ దగఁ గల్గగాజేసి,
పోషించుమంటిఁ, గృపగావుమంటిఁ, మహాత్మా! యివే వందనంబుల్ సదా శ్రీగణేశా!
నమస్తే, నమస్తే నమ:!
__/\__ __/\__ __/\__
No comments:
Post a Comment