ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం
వ్యాసం – తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారముగా.]
1.
“సనత్సుజాతీయం”భారతంలో ఒక ఘట్టం కదా! దానిఅర్ధం ఏమిటి?
2.
యుద్ధానంతరము ధర్మరాజుకు రాజ్యాభిషేకం
చేసినదెవరు?
3.
మహాప్రస్థానంలో అర్జునుడు పడటానికి కారణం
ఏమిటి?
4.
అశ్వత్థామ శిరోరత్నాన్ని ద్రౌపది ఎవరికి
ఇచ్చింది?
5.
అర్జునునకు ద్రౌపది కాకుండా ముగ్గురు
భార్యలున్నారు, వారికి ముగ్గురు కొడుకులున్నారు - ఎవరు?
----------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. సనత్సుజాతుడు ధృతరాష్ట్రునకు అధ్యాత్మతత్త్వం
చెప్పడం. ఇది విదురనీతి
తర్వాత చెప్పబడింది. తెలుగులో విడువబడింది. – ఉద్యోగపర్వము
- ద్వితీయాశ్వాసము –
106వచనము
వ॥…..బ్రసన్నుం డై సనత్సుజాతుం
డధ్యాత్మ విషయంబు లగువివిధవాక్యంబుల సోపానప్రకరంబున నంతకంతకు సూక్ష్మంబులగునర్థంబులు
సమర్థించుచు నందుఁ బ్రజ్ఞాచక్షుం డెయ్యది యేర్పడ నడిగెనదియెల్ల వివరించుచు హృదయపుష్కరకలితం
బగుపరతత్త్వంబు ప్రసాదించినట్టి గూఢోక్తులను గ్రహించుచుండ నెట్టకెలకుఁ బ్రభాతం బగుటయు
ధృతరాష్త్రువిదురుల నామంత్రణంబు సేసి యద్దేవముని యంతర్థానంబు నొందె నట్టిసమయంబున.
(106)
2.
శ్రీకృష్ణుడు – శాంతిపర్వము – ప్రథమాశ్వాసము –
374పద్యము
తే॥నంత నూర్జితశుభ వేళ యగుడు శంఖ
చక్రధరుఁ డాసమర్చిత శంఖ మెత్తి
పృథివి కధిపతి వగు మని ప్రీతి నాపృ
థాసుతుని నభిషిక్తునిఁ జేసె నధిప.
(374)
3.1.కౌరవులందరినీ ఒక్కరోజులో చంపుతానని
చంపలేకపోయాడు; 2.విలుకాండ్రందరినీ నిందించేవాడు. - మహాప్రస్థానికపర్వము – ఏకాశ్వాసము – 41
పద్యము
సీ॥ద్రౌపదిపాటును దనయనుజన్ముల పడుటయుఁ గనుఁగొని పార్థుఁ డా త్మ
యలమట మునిఁగిన నిల విగతాసుఁ డై
పడినఁ గుందుచుఁ జూచి బకవిరోధి
యన్నకుఁ జూపి యీయమలచరిత్రునియం
దెన్నఁడును నసత్యంబుఁ గాన
మిటు పడుటకుఁ గత మేమి నావుడు నీతఁ డక్కౌరవుల నెల్ల నొక్కనాఁడ
తే॥యాహవంబునఁ దెగ టార్తు ననియె నట్లు
చేయఁ డయ్యెఁ బ ల్కొక్కటిచేఁత యొకటి
యగుట చాల దోషము విను మదియుఁ గాక
యెల్లకోదండధరుల గర్హించుచుండు.
(41)
4.పాండవులకు – ధర్మరాజుకు
– సౌప్తికపర్వము- ద్వితీయశ్వాసము
– 99పద్యము
ఉ॥నామన మార దీనిఁ గని నందముఁ బొందితి నింత సాలు నా
కీ మహనీయరత్నము వహింపఁగ నర్హుఁ
డితండ యంచు నా
భూమిపుచేతఁ బెట్టుటయు భూవర యాతఁడు
ద్రౌణిగౌరవ
శ్రీ మది భక్తిఁ బెంపఁగ ధరించె శిరంబున దానిఁ బ్రీతుఁ డై. (99)
5.
సుభద్ర- అభిమన్యుడు;
చిత్రాంగద – బభ్రువాహనుడు; ఉలూపి- ఇరావంతుడు
*************************************
No comments:
Post a Comment