Translate

11 October, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి – 97(481-485)



ఓం గణేశాయనమః గురుభ్యోనమః  
 __/\__
నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారముగా.]


1. మహాప్రస్థానంలో సహదేవుడు పడిపోవటానిక్ కారణం ఏమిటి?
2. భారతయుద్ధంలో చనిపోయిన జనాభా ఎంత?
3. కృష్ణుని చక్రాన్ని తనకిమ్మని అడిగిన వీరుడెవరు?
4. కంటికి ఉన్న పట్టా విప్పి గాంధారి కొడుకుల నందరినీ చూసింది ఎపుడు?
5.   సుఘోష, మణిపుష్పకములు ఇవి వేటిపేర్లు?
---------------------------------------------------------------------------------------------------- 
సమాధానములు (జవాబులు):
1. తనను మించిన ప్రాజ్ఞుడు లేడని అనికుంటాడు. - మహాప్రస్థానికపర్వము ఏకాశ్వాసము – 36 పద్యము
సీభూవర యమ్మెయిఁ బోవంగ సహదేవు డపగతప్రాణుఁ డై యవనిఁ బడినఁ
    గని వాయుజుఁడు ధర్మతనయున కెఱిఁగించి యితఁ డనహంకారుఁ డెపుడు నీకు
    నతిభక్తి శుశ్రూష యాచరించుచు నుండు మాలోన నెల్ల సన్మార్గవర్తి
    యితనికి నేలొకో యిద్దెస పాటిల్లె ననిన నమ్మనుజేంద్రుఁ డతనితోడ
తేవీఁడుతనకంటెఁ బ్రాజ్ఞుండు లేఁడు జగతి
     నెందు నని సంతతమ్ముఁదానెదఁదలంచు
     దాన ని ట్లయ్యె నం చుపేక్షానిరూఢ
     బుద్ధి నరుగుచు నుండె నప్పురుషవరుఁడు. (36)
2. 76 కోట్ల 44 వేల 320 మంది ధృతరాష్ట్రుడు ధర్మరాజు నడిగితే ధర్మరాజు చెప్పిన లెక్కయిది. స్త్రీపర్వము  
  ద్వితీయాశ్వాసము 168 వచనము
అని చెవి సూఁడినట్లు పలికిన విని నిరుత్తరయై గాంధారి యూరకుండె నట్టియెడ ధృతరాష్ట్రుండు ధర్మనందనతో నీవు మన మొనలంగలజనులకొలంది యెఱుంగుదు చచ్చినవారిలెక్క తలం తేని నాకెఱింగుపు మని పల్కిన విను మెఱుక పడ్డవారు త్తమజనంబులు డెబ్బదియాఱుకోట్లు నిరువది వేలును మ్రుక్కడి మూఁకయిరువదినాలుగువేలు మున్నూటయిరువండ్రుఁ దెగి రని చెప్పిన నమ్మనుజపతి వీరిందఱు నేగతికిఁ బోదు రనుటయు. (168)
3. అశ్వత్థామ అడిగాడు కాని అశ్వత్థామ దాన్ని ఎత్తలేక పోయాడు.  అందుచేత తీసుకో లేకపోయాడు.
 సౌప్తికపర్వము ద్వితీయాశ్వాసము 48 వచనము
ఆదివ్యాస్త్రంబు  నీ కిచ్చెద నీవు నాకుఁ జక్రం బొసంగ వలయు నని పలికిన నే నద్దురభిమాని  నాయెడం బరమస్పర్ధ కలిగి యట్లడుగుట యెఱింగియు నొండనక యతనికి మదీయచక్రధనుర్గదాఖడ్గంబులు చూపి వీనిలోన నీకు ధరింపఁ బ్రయోగింప శక్యం బైనదాని ధరింపు మని చెప్పి నీవు నీయస్త్రంబు నాకు నీవలదు మిత్రుని కోరినయది యిచ్చుచుండి దానికి మాఱుగా నొకటి పుచ్చు కొనుట పురుషార్థంబు తెరువే యనుటయు నతండు సుదర్శనంబు వరియించినఁ బుచ్చుకొమ్మంటి నమ్మాటకు ముదితుం డగుచు నమ్మూఢుండు తనవామకరంబునఁ జక్రం బవలంబించి యెత్తం జాలక దక్షిణపాణిం బట్టి యెట్లును గదలఁ దివియు శక్తుండు కాక యుభయహస్తంబులను లావుచేసి తివిసినను నది కదలకుండె నాతండు డస్సి నిలిచి విషణ్ణుండై యున్న నతనినాలోకించి యిట్లంటి. (48)
4. వ్యాసుడు మృతుల నందరినీ చూపించినపుడు. ఆశ్రమవాసపర్వము ద్వితీయాశ్వాసము 122 వచనము
అవ్వి శేషంబు విని యద్భుతప్రమదభరితయై నిజనయనంబుల బంధించిన పట్టం బపనయించి గాంధారియును గనుంగొనుచుండ. (122)
5. నకుల, సహదేవుల శంఖములు. - భీష్మపర్వము ప్రథమాశ్వాసము 176 వచనము
అప్పుడు కృష్ణార్జునులు పాంచజన్యదేవదత్తంబులును భీమసేనుండు పౌండ్రంబును యుధిష్థిరుం డనంతవిజయంబును నకులసహదేవులు సుఘోషమణిపుష్పకంబులును పాంచాల విరాట సాత్యకి ధృష్టద్యుమ్న శిఖండి ప్రముఖదండనాయకులు తమతమశంఖంబులుఁ బూరించిన. (176)
***************

No comments:

Post a Comment