ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం
వ్యాసం – తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారముగా.]
1. ధర్మరాజు ధ్వజం ఏమిటి?
2. పాండవుల కొడుకు ఒకడు, మనుమడొకడు ధర్మరాజు అశ్వమేధం చూశారు
– ఎవరు వారు?
3. తాను మరణిస్తూ భీష్ముడు పాండవులకు ఏమని సలహా ఇచ్చాడు?
4. “వీని మనస్సు ఇప్పుడు నిష్కల్మషమయింది” అని వ్యాసమహర్షి ఒకరిని మెచ్చుకున్నారు,
అతను ఎవరు?
5. చివరగా వ్యాసుడు ధృతరాష్ట్రునికి చెప్పిన ధర్మమేమిటి?
----------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.
చంద్రుడు –
2.
బభ్రువాహనుడు, పరీక్షిత్తుడు- అశ్వమేధపర్వము- చతుర్థాశ్వాసము – 208 పద్యము
తే॥బభ్రువాహనునకుఁ బరమవిశేషంబు
మెఱయ గారావించి మేలివస్తు
కోటు లొసఁగి ప్రీతిఁ గూరినమనముతో
నతనిఁ దత్పురమున కరుగఁబమనిచె.
(208)
3.ఆనృశంస్యము, సత్యము
విడువక బ్రతుకుడని – ఆనుశాసనికపర్వము – పంచమాశ్వాసము – 468 వచనము
వ॥నీకు నే ననుజ్ఞ యిచ్చితి వసువులం బొందు మనినం బరమానందంబునం
బొంది పాండునందనులను ధృతరాష్ట్రునిం దక్కటివారలను గనుంగొని మీచేత ననుజ్ఞాతుండన కదా
యని పలికి యందఱం గౌఁగలించుకొని ‘యానృశంస్యంబును (అక్రూరభావమును) సత్యంబును నిత్యంబులుగాఁ బాటించి బ్రదుకుం డని’చెప్పి తాను దొల్లి రాజులగెల్చి
తెచ్చినధనంబులు విప్రజనంబుల్ కిచ్చి ధర్మతనయుం జూచి యెల్ల బ్రాహ్మణులునుం బూజనీయులు
ఋత్విజులు నాచార్యులు వృద్ధులు విశేషించి పూజింపవలయువా రని నిర్దేశించి యూరకుండి ధారణానుక్రమంబున
సమాహితాత్ముండయి వాయువుల సన్నిరుద్ధంబుచేసిన నవిఉర్ధ్వగతిం గైకొనియె నమ్మహాత్ముండవయవంబులం
బ్రాణంబులు పాపికొనుచు వచ్చునయ్యై చోట్లు శల్యరహితంబులగు చుండె నట్లగుటం గాంచి కృష్ణాదులగు
నఖిల జనంబులు నాశ్చర్యభరితాంతఃకరణు లగుచుఁ గీర్తించి రాసంయమచతురునిచే సర్వావయతబను సన్నిరుధ్ధం
బై యాత్మ మూర్ధంబు భేదించి మహోల్కా కారంబున నాకసంబున కెగసి కొంతదవ్వరిగి యంత నంతర్హితం
బయ్యెనప్పుడు పుష్పవృష్టి గురిసె దేవదుందుభులు మొరసె నంబరంబున సిద్ధులు సాధ్యులుం బొగడుచుం
బ్రమోదంబునొంది రిట్లు దేవవ్రతుండు దివంబునకుం జనుటయు. (468)
4.ధృతరాష్ట్రుని – ఆశ్రమవావాసానికి వెళ్లేముందు. – ఆశ్రమవాసపర్వము – ప్రథమాశ్వాసము – 51,52 పద్యములు
సీ॥అనుటయుఁ బ్రియమంది యమ్మాహాముని యమ్మహీశ్వరుతోఁ బాండుఁనృపాలు
గద్దియ నిడికొని క్రతువులు చేయించి యవిరళభోగానుభవము నడిపి
యీతనివారలఁ బ్రీతి నీక్షించి తా శిష్యుండపోలె సంసేవనంబు
భక్తిమై నొనరించెఁ బదపడి నీవును దిగ్విజయాదులఁ దేజ మితని
తే॥నొందునట్లుగఁ జేసితి వొనరఁ బిదపఁ
దాన పదమూఁడువర్షముల్ ధరణియేలె
నీవు శుశ్రూష యెంతయు నియతి నడపి
తితనిమది లేదు కలఁక యొక్కింతయేని. (51)
క॥కేవలతపఃక్రియాసం
సేవనతాత్పర్య మిపుడు చిత్తంబునతయం
దావేశించినయది యీ
భూవరునకు నితని ననిచి పుచ్చు మడవికిన్.
(52)
5.ధీర్ఘవైరమూ, క్రోధమూ లేకుండా మనస్సు వాక్కూ ఏకాగ్రమయితే
అదే పరమపదాప్తి సాధనం. మోక్షకారణం. – ఆశ్రమవాసపర్వము
– ద్వితీయాశ్వాసము - 75పద్యము.
ఆ॥వినుము దీర్ఘవైరవృత్తియుఁ గ్రోధచిం
తనము లేక వాక్కు మనమునొక్క
అంద మగుట సకలజనముల కనుబద్ధ
సంపదా ప్తిపరమసాధనంబు.
(75)
సమాప్తము
__/\___
******************************************************************************
No comments:
Post a Comment