ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం
వ్యాసం – తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారముగా.]
1.
కృష్ణుడు రాయబారానికి వెళుతూ మధ్యలో
ఎక్కడ ఆగాడు?
2.
వానప్రస్థానానికి ధృతరాష్ట్రునితో వెళ్ళిన
సంజయుడు ఏమయ్యాడు?
3. ధర్మరాజు తనతల్లిని రెండేసార్లు నిందిస్తాడు,
ఎప్పుడెప్పుడు?
4.వానప్రస్థంలోని ధృతరాష్ట్రుని చూడడానికి
వచ్చిన ధర్మజుడు అడవిలో ఎంతకాల మున్నాడు?
5.అర్జునుడు తన గాండీవాన్ని చివరకు ఏం
చేసాడు?
----------------------------------------------------------------------------------------------------
సమాధానములు
(జవాబులు):
1.
కుశస్థలంలోః ఉపప్లావ్యానికి హస్తినాపురానికి
మధ్యనున్న ఊరు అది. అక్కడ
కృష్ణుడు ఒక రాత్రి ఉన్నాడు. అక్కడ నుండి స్వాగత సత్కారాలు చేశాడు ధృతరాష్ట్రుడు. –ఊద్యోగపర్వము
– తృతీయాశ్వాసము – 147వచనము
వ॥కమలనాభుండు గదలిపోయి సూర్యాస్తమయసమయంబునఁ గుశస్థలంబు సేరం జనునప్పు డందలివిప్రు
లెదురు వచ్చి కాంచి నిజనివాసంబులకుం జనుదెండని పిలిచినం బ్రసన్నవదనుం డగుచు సమ్మర్దంబు
వలవ దని పలికి విశాలరమణీయం బైనబహిరంగణంబునం బటకుటీరప్రకరం బెత్తించి విడిసి తగువారును
దానును వారలగృహంబుల కరిగి యభ్యాగతపూజలు గైకొని వారిని సంభావించి విడిదలకుం జని సమయసముచితవృత్తిం
బ్రవర్తిల్లు చుండె నంత నక్కడ. (147)
2. దావాగ్నిలోంచి తప్పించుకొని హిమవంతం చేరాడు. – ఆశ్రమవాసపర్వము – ద్వితీయాశ్వాసము – 155పద్యము
ఆ॥ఒక్క తెఱపి సంజయుఁడు చని హిమశైల
మెక్కె నంత వారి నెల్ల నగ్ని
పొదివికొనియె నిట్లు పోయి రమ్మువ్వురుఁ
బుణ్యలోకమునకు భూపవర్య. (155)
3. ౧.భీముని బకునకు ఆహారంగా పంపుతానన్నపుడు – ఆదిపర్వము – షష్ఠాశ్వాసము – 280&282వచనములు; 281 పద్యము
వ॥అని యడిగిన ధర్మతనయునకుఁ గుంతీదేవి యీయేకచక్రంబున బ్రాహ్మణుల బకాసురుండు బాధించుటయుఁ
దమవిడిసినయింటిబ్రాహ్మణుని కైనయపదయు దాని దీర్పం బవనతనయు బ్రాహ్మణార్ధంబుగాఁ దనసమర్పించుటయుం
జెప్పిన విని ధర్మజుండు దుఃఖించి యిది యేమిసాహసంబు సేసితి రొడ్లకొడుకులకుంగాఁ దమకొడుకుల
విడుచుదుర్బుద్ధులునుం గలరె యిది లోకాచారవిరుద్ధంబు మఱి భీమసేనుండు మీకు విడువం దగియెడికొడుకే.
(280)
సీ॥ఇతనివిక్రమ మాశ్రియించియకాదె యయ్యెడ లక్కయిల్లు వెల్వడఁగఁ గంటి
మడవిలో నిద్రవశాత్ములమై యున్న మననిద్రఁ జెఱుపఁగా దని హిడింబు
నెడ గల్గఁ గొనిపోయి యెక్కటి సంపిన
దండితశత్రుఁ డీతండ కాఁడె
యితనిబల్మిన కాదె యెమ్తయు భీతు
లై ధృతరాష్ట్రనందనుల్ ధృతి దలంకి
ఆ॥నిద్ర లేక తమకు నిలుచునుపాయంబు
లొండు దక్కి వెదకుచున్నవారు
బలియు నట్టిభీము బ్రాహ్మాణార్థముగా
నసురవాతఁ ద్రోతు రవ్వ యిట్లు.
(281)
వ॥అక్కట దుఃఖాతిశయంబున మతిభ్రమణం బయ్యెం గా కేమి యనినఁ గొడుకునకుఁ గుంతి యి ట్లనియె.
(282)
౨.కర్ణుడు తనకు అన్న అని చెప్పినపుడు –
స్త్రీపర్వము – ద్వితీయాశ్వాసము -179&181పద్యములు
తే॥మమ్ము నందఱ నెవ్వనిమహితశక్తి
యెక్కుడై సంగరంబునఁ జిక్కుపఱిచె
నట్టికర్ణునిఁ గొంగున నగ్ని డాఁచి
నట్టు లెమ్మెయి డాఁచి తోయమ్మ చెపుమ.
(179)
తే॥కర్ణుఁ దొలుచూలుగా నేల కంటి తల్లి
నీదుమంత్రంబు పరమవిషాదకారి
యయ్యె మాకెల్ల నట్టిమహాబలైక
గణ్యుబ్రుంగుడుపఱచుట కారణముగ.
(181)
4. ఒక నెల పైని - ఆశ్రమవాసపర్వము – ద్వితీయాశ్వాసము – 69పద్యము
సీ॥ధరణీశ పాండునందను లట్లు సాంతఃపురంబును సపరివారంబుఁ గాఁగ
నడవికి నేగి యయ్యంబికానందనుఁ గాంచినదినమునఁ
గరము నియతి
ఫలమూలసమితి నాఁకలి పుచ్చి భూమిశయనమున
నిద్రించి రాగరిష్ఠుఁ
డమ్మహితాత్ముల కర్థితో మఱునాఁ డనుజ్ఞ యిచ్చిన సుమనోజ్ఞములును
ఆ॥సన్నుతములు నైనయన్నపానాదుల
ననుభవించి మృదులహారితల్ప
ముల శయించి రట్లు నెలనాళు లయ్యెడ
నతని గొల్చియుండి రధిపముఖ్య.
(69)
5.సముద్రంలో పెట్టాడు – మహాప్రస్థానానికి పోతుంటే గాండీవం పని ముగిసిందనీ అది సముద్రంలో పడవేయుమనీ
అగ్ని అర్జునునకు చెపుతాడు.- మహాప్రస్థానికపర్వము – ఏకాశ్వాసము – 28పద్యము
సీ॥నిలిచి బీభత్సుండు నిర్భర స్నేహంబుకతమున విడువక గాండీవంబుఁ
గొని వచ్చుచున్న నాతనితోడ నవ్వాయుసఖుఁ
డోధనంజయ శౌరిచక్ర
మెన్నఁడే దివమున కేగె నీ వేల గాండీవంబు
విడువవు దేవ కార్య
మునకుఁ గ వరుణదేవునిచేత నేను దెచ్చినయది
యీధనుశ్శ్రేష్ఠ మమ్మ
తే॥హానుభావుని కొప్పింపు మనిన లెస్స
యట్లుచేయుదుఁ గా కని యక్కీరీటి
యగ్రజానుజులకుఁ జెప్పి యాదరమున
నాతఁ డచ్చాప మంబుధియందుఁబెట్టె.
(28)
**************************************************************
No comments:
Post a Comment