శ్రీ ఆంజనేయ దండకము
శ్లో|| ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణుశివాత్మకమ్ |
తరుణార్క ప్రభో శాన్తమ్ రామదూతం నమామ్యహం||
శ్రీ
ఆంజనేెయం! ప్రసన్నాంజనేయం! ప్రభాదివ్యకాయం! ప్రకీర్తిప్రదాయం! భజేవాయుపుత్రం!
భజేవాలగాత్రం! భజేహం పవిత్రం! భజే సూర్యమిత్రం! భజే రుద్రరూపం! భజే
బ్రహ్మతేజం! బటంచుఁ ప్రభాతంబు, సాయంత్రమున్నీనామ సంకీర్తనల్ చేసి, నీరూపు
వర్ణించి, నీమీద నే దండకం బొక్కటిం జేయ నూహించి, నీ మూర్తినిన్ గాంచి, నీ
సుందరంబెంచి, నీదాస దాసాన దాసుండనై, రామభక్తుండనై నిన్ను నే గొల్చెదన్, నీ
కటాక్షంబునన్ జూచితే, వేడుకల్ జేసితే, నామొరాలించితే నన్ను రక్షించితే,
అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచ నేనెంతవాడన్, దయాశాలివై జూచితే, దాతవై
బ్రోచితే, దగ్గరన్ బిల్చితే, తొల్లిసుగ్రీవునకు న్మంత్రివై
స్వామికార్యార్థివై యేగి శ్రీరామ సౌమిత్రులన్ జూచి, వారన్విిచారించి,
సర్వేశుబూజించి, యబ్భానుజుం బంటుగావించి, యవ్వాలినిన్ జంపి
కాకుత్ఠ్సతిలకున్ దయాదృష్టివీక్షించి, కిష్కింధ కేతెంచి, శ్రీరామ
కార్యార్థమై లంకకేతెంచియున్, యాలంకిణిన్ జంపి, యాలంకయున్ గాల్చి,
యాబ్భూమిజంజూచి, యానంద ముప్పొంగ యాయుంగరంబిచ్చి, యారత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషునిన్ జేసి, సుగ్రీవున్నింగదుఁ జాంబవంతున్నలున్నీలునిన్ గూడి యా సేతువున్ దాటి, వానరల్పెన్మూకలై దైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగావచ్చి కోరి బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వైచి యాలక్ష్మణున్ మూర్ఛ నొందింపగా, నప్పుడే బోయి నీవు సంజీవినిన్ దెచ్చి సౌమిత్రి కిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా, కుంభకర్ణాది వీరాళితోబోరి చెండాడి శ్రీరామ బాణాగ్ని వారందరిన్, రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ, నవ్వేళనన్ నవ్వీభీషణున్ వేడుకన్ దోడుకన్వచ్చి పట్టాభిషేకంబు జేయించి సీతా మహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి, నయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమై యున్న నీకన్ననాకెవ్వరుంగూర్మిలేరంచు మన్నించినన్, శ్రీరామభక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ నామసంకీర్తనల్ జేసినన్ బాపముల్బాయునే, భయములున్దీరునే, భాగ్యముల్గల్గునే, సకలసామ్రాజ్యము ల్సకల సమ్పత్తులున్ గల్గునోవానరాకార! యో భక్తమందార! యో పుణ్యసంచార! యో వీర!యో శూర! నీవే సమస్తంబు, నీవే మహాఫలమ్ముగ వెలసి యా తారకబ్రహ్మమంత్రంబు పఠించుచున్ స్థిరమ్ముగా వజ్ర దేహంబునుం దాల్చి 'శ్రీరామ, శ్రీరామ' యంచున్ మనఃపూతమై (పూర్ణమై) యెప్పుడున్ తప్పకన్ తలతునాజిహ్వయందుండి నీ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారివై, రామనామాంకిత ధ్యానివై, బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ వెల్గొందువో, రౌద్రనిజ్వాల, కల్లోల హా! వీరహనుమంత! యోంకార హ్రీంకార శబ్దంబులన్, భూత,ప్రేత,పిశాచ,శాకినీ,డాకినీ,గాలి, దెయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలం బడంగొట్టి నీ ముష్టిఘాతంబులన్, బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభాభాసితంబైన నీ దివ్య తేజంబునుం జూపి రారా నా ముద్దు నరసింహా యనుచున్, దయాదృష్టివీక్షించి నన్నేలు నా స్వామి! యోయాంజనేయా! నమస్తే సదా బ్రహ్మచారీ! వ్రతాపూర్ణహారీ! నమస్తే వాయుపుత్రా! నమస్తే నమస్తే నమః.
__/\__ __/\__ __/\__