Translate

10 March, 2015

శ్రీరామ దండకము

శ్రీరామ దండకము

రచన - శ్రీ కుందేటి రామచంద్రయ్య గారు 

శ్రీరామ రామా పరంధామ సంపూర్ణకామా దశస్యందనానందధామా ధరాభృల్లలామా భవారణ్య దావానలా జానకీలోల సద్భక్తపాలా కృపాశీల శ్రీరామ భూపాల నీరేజ పత్రేక్షణా రావణధ్వాంత పద్మాప్త బంధుప్రియా యాంజనేయార్చితా నిత్యముక్తా!

ధరాభారమున్ బాప బ్రహ్మాది గీర్వాణులర్థింపగా నిర్వికారుండవైనట్టి దేవుండవై యుండియున్ యా యయోధ్యాపురీ భర్తకున్ బెంపు దీపింప కౌసల్యగర్భంబునన్ బుట్టినావయ్య దేవా!
విచారింప నీకున్నవే జన్మముల్ జన్మకున్ గారణం బైన కర్మంబులున్ మూఢచేతస్కులీ నిన్ను గానంగ నేర్పింతయున్ లేక సంసార కల్లోలినిన్ దాటగాలేక కామాది షడ్వైరి వర్గంబు చేజిక్కి దుఃఖంబులే సంతతానందముల్ గా మనంబందు భావించుచున్ జచ్చుచున్ బుట్టుచు న్నుందురేకాని సంసార సారమ్ము జేరంగలేరట్టి యజ్ఞానులన్ జెప్పగానేల నే నీకు దాసుండ కైవల్య మర్తించి యశ్రాంతమున్ దావకీ నాంఘ్రి పద్మంబులన్ మానసాంభోజ పీఠంబునన్నిల్పి నీ రూపుపై జూడ్కులన్ జేర్చి తయాత్మేతరంబైన కోర్కెల్ మదిన్ గోరకన్ తారక బ్రహ్మవై యొప్పు నిన్నే సమస్తంబుగానెంచి యోంకార యుక్తంబుగా "శ్రీమతే దేవ దేవాయ రామాయ నిత్యాయ సత్యాయ శుద్ధాత్మనే జానకీ ప్రాణనాథాయ వేదాంత వేద్యాయ విశ్వాత్మవే నిర్వికల్పాయ సూత్రాత్మనే దుఃఖహంత్రేనమో" యంచు ధ్యానించుచున్నాడ ఘోరాఘసందోహమున్ బాపుమా!

పాపమే బీజమై కర్మలే శాఖలై యింద్రియాలన్నియు న్నాకులై మారుడే పుష్పమైయున్న సంసార వృక్షంబుపైనెక్కి దుఃఖాబ్దిలో ద్రెళ్లితిన్ వచ్చి రక్షింపవే వేగరావే మొఱాలింపవే భక్తవంద్యా భవదాస దాసుండ కైవల్య సంప్రాప్తునిన్ జేయవే ముక్తి యన్నా మహాభాగ్య మిప్బింపవే చాలు సంసార సౌఖ్యంబు లీ భార్య లీ బిడ్డ లీ మేడ లీ దూడ లీ భూము లీ విత్తముల్ కూడరానేర్చునే వీనిపై నాకు మోహంబులేకుండగా జేయవే యున్న కాలంబు వ్యర్థంబుగాకుండ నీసేవ చేనింపగా నెంచితిన్ వేయునేలా "కలౌ నామ సంకీర్తనాన్ముక్తి" యన్ సత్యవాక్యంబులుండన్ భయంబేల 'రామా హరేరామ రామా హరేరామ, కృష్ణా హరే కృష్ణ కృష్ణా హరే కృష్ణ' యంచాత్మలోనే స్మరింతున్ వచింతున్ లిఖింతున్ వెసన్ ముక్తి కాంతా మణిన్ బొందుదు న్నింతకున్నీవయేదిక్కు వేఱేమియున్ లేదు రక్షింపు రక్షింపు సీతాపతీ పుణ్యకీర్తీ నమస్తే నమస్తే నమస్తే నమః!!
సర్వం శ్రీరామార్పణమస్తు

 

No comments:

Post a Comment