Translate

06 March, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 066 (326 – 330)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]

1.              మహాప్రస్థానానికి పోతున్న వారిలో ముందెవరు పడిపోయారు?
2.             గాంధారి కూతురి పేరేమి?
3.             ఈశ్వరుడు తప్ప నాకు సాటి ఎవరూ లేరని ఆత్మస్తుతి చేసుకొన్నాడు అర్జునుడు ఎప్పుడు?
4.             ధర్మవిషయంలో ధృతరాష్ట్రుని తఱచుగా ఇద్దరు నిందించేవారు చివరదాకా ఎవరు వారు?
5.             పాండురాజు తల్లి యెవరు?

సమాధానములు (జవాబులు):
1.              ద్రౌపది మహాప్రస్థానికపర్వము ఏకాశ్వాసము -34పద్యము
సీ|| చనునప్పు డయ్యేడ్వురును నతిస్థిరయోగసాధనపరు లయి సత్వరముగఁ
          బోవంగఁ బాంచాలభూపపుత్రికయోగ మెడలిన మేదినిఁ బడియె నధిప
    పడిన సమీరణుకొడుకు కనుంగొని యన్నతోఁ జెప్పి యయ్యతివవలనఁ
    గాన మెన్నఁడు ధర్మహాని యిట్లగుటకు నరయంగఁ గత మేమి యని విషణ్ణుఁ
తే|| డగుచు నడిగిన నాతఁ డిమ్మగువ యింద్ర
    తనయుదెసఁ బక్షపాతిని దానఁజేసి
    సుకృతములు ఫలియింపమిఁ జూవె దీని
    కిట్టిదురవస్థ పాటిల్లె నీడ్యచరిత. (34)
|| అని పలికి సమాధానము
    తనబుద్ధిం దిరము చేసి ధైర్యస్థైర్యం
    బున వికృతి లేనిగతి నా
    వనితశవము విడిచి కౌరవవిభుం డేగెన్. (35) 

2.             దుస్సల- దుశ్శలా- సుఖాంతమున దుఃఖమును తెచ్చునది. ఆదిపర్వము పంచమాశ్వాసము 107 వచనము & 108 పద్యము
|| మఱియు దుర్యోధనజన్మానంతరంబున ధృతరాష్ట్రునకు వైశ్యాపుత్రుం డయిన యుయుత్సుండుపుట్టెనంతగాంధారికి నొక్కొక్క దివసంబున నొక్కొక్కరుండుగా గ్రమంబున దుశ్శాసన దుస్సహ దుశ్శల జలసంధ సమ సహ విందానువింద దుర్ధర్ష సుబాహు దుష్ప్రధర్షణ దుర్మర్షణ దుర్మఖ దుష్కర్ణ కర్ణ వివింశతి వికర్ణ శల సత్త్వ సులోచన చిత్రోపచిత్ర చిత్రాక్ష చారుచిత్ర శరాసన దుర్మద దుర్విగాహ వివిత్సు వికటాన నోర్ణనాభ సునాభ నం దోపనందక చిత్రాంగ చిత్ర కుండల భీమవేగ భీమబల బలాకి బలవర్ధనోగ్రాయుధ సుషేణ కుండధార మహోధర చిత్రాయుధ నిషంగి పాశి బృందారక దృఢవర్మ దృఢక్షత్ర సోమకీ ర్త్యనూదర దృఢసంధ జరాసంధ సద సువా గుగ్రశ్రవ ఉగ్రసేన సేనానీ దుష్పరాజ యాపరాజిత కుండశాయి విశాలాక్ష దురాధర దృఢహస్త సుహస్త వాతవేగ సువర్చ ఆదిత్యకేతు బహ్వాళి నాగదత్తాగ్రయాయి కవచి క్రథన కుండ ధనుర్ధరోగ్ర భీమరథవీరబా హ్వలోలు పాభయ రౌద్రకర్మదృఢరథాశ్రయా నాధృష్య కుండభేది విరావి ప్రమథ ప్రమాథి దీర్ఘ రోమ దీర్ఘ బాహు వ్యూఢోరు కనకధ్వజ కుండాశి విరజసు లనంగా నూర్వురు కొడుకులు పుట్టిన. (107)
  తే|| ఆతనూజుల కందఱకనుజ యై ల
              తాంగి దుశ్శల యను కూఁతు రమరఁబుట్టె
      నందు దౌహిత్రవంతులదైనపుణ్య
      గతియుఁ గాంతు నేనని పొంగెఁగౌరవుండు (108)

3.             ఆత్మస్తుతి మరణంతో సమానమని కృష్ణుడు చెప్పడంవల్ల కర్ణ వధ ముందు కర్ణపర్వము తృతీయాశ్వాసము 90 వచనము; 91పద్యము
|| అని యగ్రుజు నప్రియంబు పలికి యంతరంగంబు సంతాపంబు పొంద నిట్టూర్పు నిగిడించి  యంతకము న్నొఱఁబెట్టినవాలు పెఱికినం గనుంగొని పద్మనాభుండు క్రమ్మఱ నిది యేమి యని యడిగిన నతం డే నిన్నరనాథు నో నాడిన పలుకులకుఁ బ్రాయశ్చిత్తంబు తలద్రెంచుకొనుటయకా నిశ్చయించితి ననుటయు నమ్మహాత్ముఁ డాత్మప్రశంస చేయు మది మరణం బని పెద్దలు చెప్పుదు రనుటయు నీచెప్పినట్ల చేయ కునికికిం గడచిన యధర్మంబును గలదె యిట్లు చేయు వాఁడన కాక యని యాధనంజయుండు ధనుర్ధరుం డై ధర్మనందనున కిట్లనియె. (90)
|| హరుఁడు తక్కఁ జాపధరుఁ డొరుఁ డెన నాకుఁ
    ద్రిభువనముల లేఁడు దిశలు గెలిచి
    తెచ్చి నీకుఁ బ్రీతి నిచ్చితిఁ బెనుపారు
    ధనము రాజసూయదక్షిణలకు (91)

4.             విదురుడు సంజయుడు

5.             అంబాలిక వ్యాసునివల్ల అంబాలికకు పాండురాజు జన్మించాడు ఆదిపర్వము చతుర్థాశ్వాసము 257పద్యము
|| అంబాలికకును గుణర
    త్నాంబుధి పాండురవిరాజితాంగుఁడు ప్రభవిం
     చెం బాండురాజు గురువం
     శంబు ప్రతిష్టింప ధర్మ సర్వజ్ఞుం డై. (257)
 

 



No comments:

Post a Comment