Translate

04 March, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 065 (321 – 325)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
 

1.    సంపద పొందడానికి మూలం ఏమిటి?
2.   ధర్మరాజు కాలిగోళ్ళు కందిపోయాయట ఎప్పుడు? ఎందుచేత?
3.   యుద్ధంలో జయించి పట్టాభిషిక్తుడైన ధర్మరాజుకు మనోవేదన కలిగిందిట ఎందుకు?
4.   ఉపపాండవుల పేరులేవి?
5.    కర్ణునికి అర్జునుడు తప్ప మిగిలిన నల్వురూ దొరికితే వారిని దెప్పి పొడిచి విడిచాడు వారు ఏ వరుసలో దొరికారు?
------------------------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. నిర్వేదం చెందని ఉత్సాహం సం ఉద్యోగపర్వము 39-58
శ్లో అనిర్వేద శ్శ్రియోమూలం లాభస్యచ శుభస్యచ
     మహాన్ భవ త్యనిర్విణ్ణః సుఖం చానంత్య మశ్నుతే ||(39-58)       

2.  గాంధారికి నమస్కరింపబోయినపుడు కొడుకుల నందరినీ పాండవులు చంపారని కోపంతో ఉన్న గాంధారి  
    దృష్టి  పట్టాసందులోంచి ధర్మరాజు కాలిగోళ్లమీద పడింది.  పతివ్రత అయిన గాంధారి కోపాగ్నికి అవి  
   మాడిపోయాయి.     స్త్రీపర్వము ప్రమాశ్వాసము 176 వచనము
|| ఇ ట్లాధృతరాష్ట్రమహిషి యతనియుచితవచనంబులు విని యూరకయుండె నతం డంజలిపుటంబు ఫాలంబున మోపి యానతుం డయ్యెఁ బట్టావృతనయనయగు నప్పతివ్రతదృష్టి పట్టంబునంచుసందునం జని యజ్జనపతిపదనఖంబులం జెందిన నవి కందినం జూచి సవ్యసాచి జనార్దనువెనుకకుం జనియె సమీరసుతుండును మాద్రిసుతులునుం దిరుగుడువడి రప్పుడు గాంధార రాజనందన క్రోధంబు తక్కి ధర్మపుత్రాదులదెస మాతృభావం బలవడ సాంత్వనస్వరంబునం గుంతీసందర్శనంబు చేయరన్నా యని పలికిన నప్పురుషసత్తములు చిత్తంబుల కలంక డిందు వడ నందఱు నొక్కటఁ గుంతి యున్న దెసకుఁ జన నక్కుంతి భోజనందన వారిం గలయం గనుంగొని. (176)

3. 1.ప్రజానాశనము; 2. భీష్ముడు, కర్ణుని వధవలన అశ్వమేధపర్వము ప్రమాశ్వాసము 11 వచనము
|| బితామహకర్ణులం జంపించిన క్రూరకర్మునకు శాంతి యెట్లు కలుగు నమ్మహాకల్మషం బేమిటం బాయు నయ్యనుష్ఠానంబు విధింపుం డని పలుకుటయు నాధర్మధుర్యునకుఁ పారాశర్యుం డిట్లనియె. (11)

4.  ప్రతివింధ్యుడు; శ్రుతసోముడు; శ్రుతకీర్తి; శతానీకుడు; శ్రుతసేనుడు ఆదిపర్వము అష్టమాశ్వాసము- 228
   వచనము
   ప్రతివింద్యుడు ధర్మరాజు పుత్రుడు ; శ్రుతసోముడు భీముని పుత్రుడు; శ్రుతకీర్తి అర్జుని పుత్రుడు 
  శతానీకుడు నకులుని పుత్రుడు; శ్రుతసేనుడు – సహదేవుని పుత్రుడు; – వీరే ద్రౌవదీతనయ పంచకం.
అంత ద్రుపదరాజనందనయుం గ్రమంబునఁ బాండురాజనందనులవలనఁ బ్రతివింధ్య శ్రుతసోమ శ్రుతకీర్తి శతానీక శ్రుతసేను లనువారిఁ బంచోపపాండవులను సుపుత్రులం బడసిన. (228)
  
5. 1.భీముడు; 2.సహదేవుడు; 3.నకులుడు; 4.ధర్మరాజు ద్రోణపర్వము చతుర్థాశ్వాసము 239, 241 & 243;
   పద్యములు; పంచమాశ్వాసము 161 వచనము; కర్ణపర్వము ప్రథమాశ్వాసము 137&138 పద్యములు;
   కర్ణపర్వము ద్వితీయాశ్వాసము 194 పద్యము & 195 వచనము
భీముడు -
|| తిండిపోత నీకు భండనం బేటికిఁ
      గడవఁ జేరి మనసు కాంక్ష తీఱ
      నోపుకొలది మ్రింగి యూరక నీ వింటి
      కడన యుండు మింక నడిచిపడక. (239)
|| వనమున ఫలమూలంబులు
     తినిముని వై యుండఁ గాక ధీరోద్ధతిమై
     నని చేయ నీకు వచ్చునె
     చను మచటికి నుడిఁగి మడిఁగి శాంతుఁడపోలేన్.(241)
అట్లు నీయొడ లుండ దేని (242)
|| చేయలఁతిం గని సమరము
     చేయుము ననుబోఁటితోడఁ జెనయకు నరనా
     రాయణులు వారె యచటికిఁ
     బోయదవేఁ బోయి బ్రతుకుపొంక ముడుగుమీ.(243)
సహదేవుడు -
|| ఇత్తెఱంగునఁ గర్ణుండు కదిసి నిశ్చేష్టితుం డగుసహదేవు నాలోకించి కుంతిమాటలు తలంచి యొండు చేయ నొల్లక యల్లన వింటికోపునం గడుపు పొడిచి నవ్వుచు నెక్కు డైనపగఱ నుక్కునం దలపడకు మల్లవాఁడె నరుండు గురుసేనతోడ బిరు దై పెనంగెడు నతనికడకుం బొ మ్మని పలికి పోయె నక్కుమారుండును నట్లు కర్ణునేటులను మాటలను గడు నొచ్చి తనబ్రదుకునకు రోయు చుం బోయి వేఱొక్కరథమ బెక్కె(161)
నకులుడు - 
|| అల వెఱిఁగి పెనఁగు పెనఁగం
    దలఁచిన నది గాక సిగ్గుతలకొని యనికిం
    దొలఁగుట యిం కిటతగు వి
    చ్చలవిడి నర్జునునికడకుఁ జనుము కుమారా. (137)
|| అని విడిచె నకులుఁ గుంతివ
    చనములు దృఢవృత్తి చిత్తసంకలితము లై         
    యునికిం గర్ణుం డతఁడును
    జని ధర్మజునరద మెక్కె సవ్రీడముగన్. (138)
ధర్మరాజు -
సీ|| క్షత్రియకులమున జన్మించి యిది ధర్మ మిది యధర్మం బని యెల్ల నెఱిఁగి
     నట్టి నీ కిట్టు మహాభావమునఁ బ్రాణములు డాఁచికొన శాత్రవులకుఁ దొలఁగి 
     పోవుట తగునె నీబుద్ధి కానఁగ నయ్యె నృప నీతి యెఱుఁగవు నీవు బ్రాహ్మ
     ణాచార వేదివి యాగాధ్యయనముల వ ర్తింపు కయ్యంబు వలవ దుడుగు
తే|| మింక ననుబోఁటిఁ దొడరిన నింతకంటె
     నెడరు పాటిల్లు వేగ పొ మ్మింటికడకు
     హరియుఁ బార్థుఁడు నున్నెడకైన నరుగు       
     మేను దెగ నీదుప్రాణాన కింతవినుము (194)
|| అని పలికి కొంతివచనంబులు మనంబున నునికింజేసి వధియింప నొల్లనివాఁ డై యప్పాండవాగ్రజు విడిచి    
    యాపురుషసత్తముండు తదీయసేనాసముదయంబు నానాస్త్రనిహతంబు చేసె లజ్జాకులమానసుం డగు    
    నమ్మానవపతియును దత్ప్రదేశంబున నిలువక తొలంగి పోయెం బోవుటయు (195)
*************************

No comments:

Post a Comment