Translate

30 March, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 072 (356 – 360)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1.              యుద్ధానికి ముందు కౌరవ పక్షంలోంచి పాండవపక్షంలోకి వచ్చిన దెవరు?
2.             చాక్షుషి విద్య గ్రహించి అర్జునుడు అంగారపర్ణున కేమిచ్చాడు?
3.             యుద్ధానికి ధర్మరాజు వయస్సెంత?
4.             ద్రోణునికి బ్రహ్మ శిరోనామకాస్త్రం ఎవరిచ్చారు?
5.             జరాసంధుని కొడుకు ఎవరు?
---------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. యుయుత్సుడు   భీష్మ పర్వము ప్రథమాశ్వాసము 167 పద్యము; 168 వచనము
తేమమ్ము నెమ్మిమై గలయఁ జిత్తమ్ముగలుగు
    వార లెవ్వరు గలిగిన వచ్చికలయుఁ
    డట్టివారిని నాతమ్ములంతవారిఁ
    గాగఁ బాటింతు నెంతయు గారవమున. (167)
అనిన విని నీపుత్రుండు యుయుత్సుం డేను వచ్చెద నన్నుం గలపికొనుమని పలికిన దానికిం బాండవాగ్రజుండు ప్రియంబందినపలుకులు పలుకుటయును నతండు దుర్యోధనాదులదు శ్చేష్టితంబు లుగ్గడించుచుఁ గౌంతేయులగుణంబు లగ్గించుచు నిజసేనాసమేతంబుగా నిస్సాణాదిరావంబులుచెలంగంజని ధర్మనందనుబలంబులం గలసె నది యట్టిద కాక సవతాలిప్రజలు పొంద నేర్తురే యది య ట్లుండె నిట్లు తన్నుం గలసిన సంతుష్టాంతరంగుం డగుచు నయ్యుధిష్ఠిరుండు యుయుత్సునకు నత్యుపచారసమాచారంబులం బ్రమోదం బొనరించి. (168)

2. ఆగ్నేయాస్త్రము ఆదిపర్వము సప్తమాశ్వాసము 157 వచనము
|| .ననిన సంతసిల్లి వానికి నాగ్నేయాస్త్రంబు విధియుక్తంబుగా నిచ్చి మాకు నీ యిచ్చినహయంబుల నీయంద సంగ్రహించి యుండుము ప్రయోజనంబు గలనాఁడు గొనిపోయెద మని గంధర్వు వీడ్కొని పాండవులు భాగీరథి నుత్తరించి యుత్కచం బను పుణ్యతీర్థంబున కరిగి యందు. (157)

3. 72 సంవత్సరములు  

4. అగ్నవేశుడనే ముని ద్రోణుని గురువు   ఆదిపర్వము పంచమాశ్వాసము 196వచనము
|| ద్రోణుం డగ్నివేశుం డనుమహామునివలన ధనుర్విద్యాపారగుం డై తత్ప్రసాదంబున నాగ్నేయాస్త్రం బాదిగా ననేకదివ్యబాణంబులు వడసి భరద్వాజునియోగంబునఁ బుత్రలాభార్థంబు కృపునిచెలియలిఁగృపి యనుదాని వివాహం బయి దానియం దశ్వత్థామ యనుకొడుకుం బడసి యొక్కనాడు. (196)

5.మగధ సహదేవుడు ఇతడు ఒక అక్షోణి సైన్యంతో పాండవ పక్షంలో యుద్ధం చేసాశాడు. ఉద్యోగపర్వము-  
     చతుర్థాశ్వాసము 109పద్యము
సీ||పటుపరాక్రమనిధి పాంచాలపతియు నమానుషతేజుండు మత్స్యవిభుఁడు
    శత్రుభీకరమూర్తి సాత్యకియును జరాసంథాగ్రతనయుండు శౌర్యఘనుఁడు
    సహదేవుఁడును ధైర్యశాలి యాదవశిరోమణి చేకితానుండు మహితవిభవ
    ఖని యగుశిశుపాలతనయుండు దోర్దర్పధుర్యుండు ధృష్టకేతుండు సమర
తే||లంపటుండు శిఖండియు లావు వెరవుఁ
      గలరు నీయెడ ననురక్తి గలరు సాలఁ
       బెంపు గలరుక్కు ముట్టిన తెంపుగలరు
       కోరి పతులుగఁజేయు మక్షోహిణులకు. (109)

************************************************************************************************
 

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి) -161



తెలుగు సుద్దులు…..(161)
ఆ.వెదానములను సేయ ధర చేతులా`డక
       బహు ధనంబు గూర్చి పాతిబెట్టి,            
       తుదను దండుగ ని`డి మొదలు చెడు నరుడు   
       విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః                            
భూమిమీద మానవుడు అత్యాసతో ధనం (సంపద) ప్రోగుసుకొని, లోభత్వముతో తన జీవితకాలంలో దాన్ని సద్వినియోగనికి (దానధర్మాలకు, పుణ్యకార్యాలకు, భగవంతుని సేవలకు, ఆరాధనలకు, కనీసం తన కుటుంబ సభ్యులకు, బంధు,మిత్రులకు సాయపడటము మొ.వి) వినియోగించకుండా కూడబెట్టి, దాచిపెట్టి చివరకు, వట్టిచేతులతోనే తన చివరి ప్రయాణం చేస్తాడు. తద్వారా అతనికి ఇక్కడా సంపద మంచి చేకూర్చదు, పరలోకములోను పుణ్యఫలాలు అనుభవించడానికీ ఉపయోగపడక వ్యర్థం అవుతుంది. కనుక, లోభత్వము కూడదు సుమా! పరమేశ్వరుడు ప్రసాదించిన సంపదను తగురీతిలో ధార్మికంగా అనుభవిస్తూ, పరులకు ఉపయోగపడేటట్లు పాటుపడుతూ, భగవంతుని సేవలకు వినియోగిస్తూ ధార్మిక జీవనం గడపమని వేమన హితవు పలుకుతున్నారు.   ||27-03-2015||