Translate

08 February, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి – 060 (296-300)




ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]

1. యుద్ధంలో “ఈ రేయి గదా సుఖించియే నిద్రింతున్” అన్నాడు కృష్ణుడు – ఆ రాత్రి ఏది?
2. భీష్ముడు తటస్థుడై ఉండకుండా యుద్ధం ఎందుకు చేశాడు?
3. “కృష్ణుడు పాండవులకు సహాయపడలేదు – పాండవులే కృష్ణునికి సహాయపడ్డారు” అంటారు – ఎలా?
4. శల్యుడెవరి చేతిలో చనిపోయాడు? ఎన్నవరోజున?
5. అర్జునుడొకసారి కొడుకు చేతిలో చనిపోయి బ్రతికాడు – ఎపుడు?
--------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. ఘటోత్కచుడు చనిపోయిన రోజు రాత్రి. ద్రోణపర్వము పంచమాశ్వాసము 252 పద్యము.
|| మీరును బ్రాణములుఁ ద్రిలో
     కీరాజ్యము నాదుబుద్ధికిం బార్ధుక్రియం
     గూరిమికిం బాత్రంబులె
     ఈరేయి గదా సుఖించి యేనిద్రింతున్. (252)

2. ఇంటిలో, జబ్బుతో చచ్చుటకంటే వేరే పాపముండదని, యుద్ధంచేసి చనిపోవడం క్షత్రియధర్మం కనుక. భీష్మపర్వము ప్రథమాశ్వాసము -99 పద్యము.
|| ఇంటం దెవులునఁ జచ్చుట
     కంటెను బాపంబు లొండు గలవె నృపులకున్
     బంటకలను పొలికల నిది
     కంట నిధానంబు కంట గాదె మనకున్. (99)

3. కృష్ణుడు భూభారం తీర్చటానికి అవతరించిన విష్ణువు; ఆయనకు కౌరవులు, పాండవులు అంతా తోడ్పడ్డారు.  సభాపర్వము ద్వితీయాశ్వాసము 2 వచనము
|| ……నారదుం డాసదనంబున సకలరాజసమూహంబును రాజలోకంబులో మనుష్యసామాన్యుండయి యున్న జనార్ధునుం జూచి తొల్లి బ్రహ్మాదిసురగణప్రార్ధితుం డయి యఖిల మహీభారావతరణార్ధంబు నారాయణుండు యదువంశంబున నుదయించుటయు నయ్యయిక్షత్రియకులంబుల సురదైత్యదానవయక్షరాక్షసగంధర్వాదుల యంశావ తారంబులుం దలంచి భవిష్యద్భారతరణంబునకు సంహృష్ట హృదయుం డయి యుండునంత. (2)

4. 18వ రోజు ధర్మరాజు చేతిలో శల్యుడు చనిపోయాడు.  శల్యుని తమ్ముని, చక్రరక్షకులను కూడా ధర్మరాజే చంపాడు. - శల్యపర్వము  - ప్రథమాశ్వాసము 285 పద్యము
|| క్షతమున ముక్కునం జెవులఁ గన్నుల నొల్కెడురక్త మంగ మా
    ప్లుతముగఁ జేయఁగా నతఁడు బోరగిలం బడియెన్ ధరం గద
    ద్వితయము సాఁచి ధర్మజునిదిక్కు శిరంబుగ వజ్రదారుణా
    హతిఁ బడు భూరిభూధరమహత్తరశృంగముభంగి భూవరా. (285)

5. అశ్వమేధయాగ సందర్భంలో యాగాశ్వ రక్షణకోసం వెళ్లి బభ్రువాహనుని చేతిలో చనిపోయాడు. తరువాత ఉలూపి వల్ల బ్రతికాడు. -  అశ్వమేధపర్వము తుర్థాశ్వాసము 64,80,82 & 84 పద్యములు; 81&83 వచనమలు.
|| వడి నది వీపున వెడలినఁ
    బడియె బుడమి నర్జునుండు పదపడి త్రెళ్లెం
    గొడుకును ము న్నతఁ డేసిన
    బెడిదపు టేటులయలంతఁ బృథ్వీనాథా. (64)
|| అట్లు తెంపు చేసి యాసీను లైనయా
     తల్లిఁ గొడుకు నవనిఁ ద్రెళ్లి యున్న
     విజయుఁ జూచి పాఁపవెలఁది సంజీవన
     మణి దలంచెఁ గురుసమాజముఖ్య. (80)
|| తలంచిన భుజంగమంబులకుఁ బరాయణం బైనయమ్మణి యమ్మహాభాగహస్త తలంబునకు వచ్చిన నాభామిని బభ్రువాహనునాననం బాలోకించి (81)
సీ||విజయుండు చచ్చునే వేఁదుఱులార యింద్రునిచేత నైన నీతనికి నొక్క
    ప్రియము చేయంగఁ గోరియును నీకొలదియారయుబుద్ధి నీతండు రణమొనర్పఁ
    దలఁచిన నవ్వీరుతలఁపు సిద్ధింపంగఁ జేయుటకును నింతచేయవలసె
    నాకుఁ గావున మోహనం బగుమాయాప్రయోగంబు నడపితి నుజ్జ్వలాత్మ
తే||నరుఁడు నారాయణుఁడు మహత్తరము సువ్వె
    యితని తేజమెవ్వరికినినెట్లుదాని
    నార్పవచ్చు మీవగపెల్ల దీర్ప నిపుడ
    యుత్థితుం డగు నీకౌరవోత్తముండు. (82)
||మాయాప్రయోగంబ వేఱొండు కాదు నీకు మీతండ్రితోడ భండనంబు చేయబుద్ధి పుట్టించితి నింతమాత్ర యని తత్ప్రదేశంబున నున్న యెల్లజనంబుల నుల్లంబుల నానందంబు నొందఁ బలికి యమ్మణిపూరపురతికరతలంబున నమ్మణి యిడి దీని నిమ్మహాత్మునిహృదయ దేశంబుమోపు మనవుడు నతం డట్ల చేయుటయుం బార్థుండు ప్రత్యుజ్జీవితుం డై. (83)
తె||లేచికూర్చుండి కలయంగఁ జూచి యెఱ్ఱ
    సెరలకాంతియు దంతరుచియును బెరయు
    టతిమనోహరముగఁ దనసుతునితోడ
    మనుజనాయక కుశలమే యనుడు నతఁడు. (84)

************************************************************************

No comments:

Post a Comment