Translate

07 February, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 059 (291 – 295)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]


  1. సాత్యకిని చంపటానికి ఎత్తిన భూరిశ్రవుని చేయి నరికినదెవరు?
  2. ఘటోత్కచుని కొడుకు ఎవరు? ఎవరిచేత చచ్చాడు?
  3. అలంబుసుడు’’ అనే పేరుతో భారతంలో ముగ్గురున్నారు, వారెవరెవరు? ఎవరి చేతిలో చచ్చారు?
  4. సాత్యకి భూరిశ్రవులకు వైరం ఎందుకుంది?
  5. అర్జునుడు ఒకరోజున యుద్ధభూమిలో మధ్య ఒక కొలను సృష్టించాడు ఎప్పుడు? -------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. అర్జునుడు ద్రోణపర్వము చతుర్థాశ్వాసము 267 వచనము
|| నెచ్చెలిచావునుం జూడం జాల నీరథికులను వారించెద నయ్యోధవరునింగా చెదనినియె నప్పుడు సాత్యకి చాల డస్సిన సౌమదత్తి యతిక్రమించి యెగసి (పడవైచి) వానివలచేయు నురంబును నిరుగాలం ద్రొక్కి యెక్కుడుమదంబున మణి కంకణకిరణస్ఫురణసుందరం బగు కరంబు మెఱయం గృపాణం బెత్తి గళంబు దునియ వ్రేయువాఁ డై  పూఁచిన నాభుజం బింద్రధ్వజంబునుంబోలెఁ  బొలిచి నీసైనికులచూడ్కులకు వేడ్కలుచేయ వాసుదేవుండు వేగిరపడి యేయుమేయు మని పలికినఁ బార్థుం డక్కౌరవోత్తముం జిత్తంబున నగ్గించుచువెడంద వాతియమ్ము గ్రక్కునం దొడగి గాఢాకర్షణంబును దీవ్రతేజంబును  రయంబునుం బరఁగం జేసి యేసినం దునిసి పడి యబ్బాహువు మహాభుజంగబు చందంబున శోభిల్లె నిచ్చటిసేన లెల్ల దురపిల్లె నాభూరిశ్రవుండు తన్ను నఫలితప్రయత్నుం జేసినవాడు గాండీవి యగు టెఱింగి యాఱనికోపంబున గర్హించు మనంబుతో నతనిదిక్కుచూచి తగునెలుంగున ని ట్లనియె. (267)

2.అంజనపర్వుడు అశ్వత్థామ చేత ద్రోణపర్వము పంచమాశ్వాసము 72 వచనము
|| అప్పుడద్దనుజునితనయుం డంజనపర్వుం డశ్వత్థామం దలపడి బలుతూపులంబొదివిన బెదరక యతం డయ్యసురవీరునివిల్లు ద్రుంచి విరథుం జేయుటయు వాఁడు కరవాలంబుఁగొనినం దునిమె గద వైచిన దుమురు చేసె నింగి కెగసి మ్రోఁగుచుం బాషాణవర్షంబు గురియ నదియును వారించి యమ్మాయావిమేన మేఘంబున గిఱిగొనుతరణికిరణంబులం గ్రేణిచేయుపటుబాణంబుల నిగిడించె మగిడి యొండురథంబున నరుదెంచినఁ దలద్రెంచె నిట్లు గురుపుత్రుండు వా నిం బరిమార్చి పేర్చి పాండవబలంబులఁ బరిమార్పం దొడంగినం గని కడంగి హిడింబానందనుండు నిలు నిలు నాబారిం బడి యెందుఁ బో వచ్చు ననవుడు నారథికుం డతని నవలోకించి. (72)

3. (1) అలంబుసుడు ఒకరాజు సాత్యకి చేత
   (2) జటాసురుని కొడుకు ఘటోత్కచునిచేత - ద్రోణపర్వము పంచమాశ్వాసము 203 వచనము & 204  
       పద్యము
అనియె ధనంజయుండును దదనురూపంబు లైనయాలాపంబుల ననుమతిచేసినం గడంగి ఘటొత్కచుండు కర్ణుదెసకుం గవిసె నట్టియెడ జటాసురసుతుం డగు నలంబుసుం డేతెంచి కురుపతిం గాంచి నాకుఁ బాండవులదెసం బూర్వవైరంబు కలదు నీకును బ్రియంబుగా వారిని వారివారిని వధియించెద నని పలికి యతండు ప్రీతుం డై యభినందింపనాసూతనందనుం గలసి తలకడచి హిడింబానందనుం దాఁకిన దారుణరణం బయ్యె నయ్యిరువురును వివిధవిశిఖస్ఫురణంబుల నొండరులం దెరల్పంజలక రథికు లగుట యుడిగి మాయలకుం జొచ్చి మహోరగ గరుడాకారంబులను వరణకంఠీరవరూపంబులను రవిసైంహికేయాకృతులను మేఘమారుతమూర్తులను మఱియు బహువిధవికారంబులను జూపుచుబోరి యేపునం గదిసి బాహాబాహిం బెనగునపుడు మేనులు బెరసిన నాభీమనందనుండు. (203)
పట్టి బలువుగ జటాసురు
    పట్టిం బడవైచి యురము పాదమునఁ గడున్
    బిట్టుగఁ ద్రొక్కి యతని తల
    యట్టకుఁ బయంగఁ జేసి యార్చెం బెలుచన్. (204)
 (3) బకాసురుని తమ్ముడు - ఘటోత్కచునిచేత - ద్రోణపర్వము తృతీయాశ్వాసము 268 వచనము
|| ……. ననేక ప్రకారంబుల వీరత్వంబును విశారదత్వంబు సేనలకు వెఱఁగు పుట్టింపం బోరాడి రట్టియెడన్ బకావరజుండు డస్సినం బవమానపౌత్రుండు పడవైచి తాను మీఁ దై జానుకూర్పరముష్టిఘాతంబులు నిర్ఘాతపాతంబులుంబోలెఁ బ్రయోగించి నొప్పించి యతనితొడలుఁ నెమ్ములు నొక్కుమ్మడిం బొడిపొడిచేసి నుఱిపిడికిం జొచ్చినప్రబలహలికునిలీల నేలం బెట్టి కాలం జమరి చంపి పొంపిరివోవు మగంటిమిం బేర్చి యార్చినం  బాండవబలంబుల సింహనాదంబులుఁ దూర్యనినదంబులుం జెలంగె నప్పు డాఘటోత్క చుండు ధర్మనందనున కభివందనంబు చేసిన….(268)

4.దేవకి స్వయం వరానికి సంబంధించి ద్రోణ పర్వము చతుర్థాశ్వాసము 275 వచనము
|| అనవుడు నతఁ డమ్మహీపతి కి ట్లను దీనికిం గారణంబు కల దాకర్ణింపుము సోమ వంశపరుం డగుయయాతినందనుం డయినయదునికులంబున జనియించినదేవమీఢునకుఁ బుట్టినసూరునికొడుకు వసుదేవుండు రూపగుణంబులం బ్రసిద్ధుండై పెరుఁగుచుండ దేవకుం డనుభూవల్లభుండు తనపుత్రికి దేవకికి స్వయంవర మహోత్సవం బాచరించిన నవ్వసుదేవునకై యయ్యాదవాన్వయజాతుండగుశిని యవ్వనితఁబరాక్రమంబునఁ దేరంగూడిన రాజలోకంబుఁదొడరిపోరంజాలకనిలిచిన సోమదత్తుం డొక్కరుండునుం బోక పెనంగె నయ్యిరువురు నొండొరుల చేత విరథు లై కృపాణంబులు కొని ధరణికి లంఘించి పోరునెడ నయ్యదువీరుండాక్రమించి బాహ్లికతన్యుం గొప్పువట్టి యొఱగం దిగిచి యనుకంపపెంపునం జంప నొల్లక తన్ని విడిచినం బోయి సిగ్గునఁ దలయెత్తి తిరుగ నేరక వనంబున కరిగి హరు నుద్దేశించి పెద్దకాలంబు తపంబుచేసిన నప్పరమేశ్వరుండు ప్రత్యక్షంబై వరంబు వేఁడు మనినఁ దత్కాలంబునకు శినియును దదీయసుతుండును గడ చనుటంజేసి శినిమనుమని ననిం బడ వైచి తన్నం జాలుతనయు నీ వలయు నని యడిగిన నద్దేవుం డట్ల యగుంగాక యని యానతిచ్చి యంతర్హితుండయ్యెఁ దద్వర ప్రభావంబున భూరిశ్రవుండు సాత్యకి నిట్లుచేసె నని చెప్పిన నాంబికేయుండు కయ్యం బటమీఁద నెట్లు చెల్లెననుటయు సంజయుండతని కి ట్లనియె. (275)

5. సైంధవుని చంపే 14వ రోజున గుర్రాల అలసట తీరటానికి అవి మునిగే లోతు నీళ్లతో చెరువు సృష్టించాడు - ద్రోణపర్వము తృతీయాశ్వాసము 162 &163 పద్యములు
|| ధర దివ్యాస్త్రహతిం బగిల్చి కొల నుత్పాదించి వే దానికి
     న్శరజాలంబుల నిల్లు గట్ట మనసైన్యంబుల్ వెఱం బొందె న
     చ్చెరు వందెన్ సురసంఘముల్ హరి నుతించెం బొంగి యప్పార్థు భూ
      వర ము న్నిట్టివి చూడరున్ వినరు నెవ్వారుం ద్రిలోకంబులన్ (162)
తే|| హర్ష మందస్మితముతోడ నమ్మురారి
    యపుడ హయముల మేయి పెట్టునట్లు చేసి
    తఱిమి నీళులు ద్రావించి తడవి మగుడఁ
    దెచ్చె మనయోధు లెల్లను బిచ్చలింప (163)  
******************************************************************************************************

No comments:

Post a Comment