Translate

15 February, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 063 (311 – 315)



ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]

1.    అర్జునుని శంఖము పేరేమి? దానిని ఎవరు ఇచ్చారు?
2.   అర్జునుని కిరీటాన్ని పడగొట్టడానికి యత్నించిన వీరుడు ఎవరు? దేనితో?
3.   శతశృంగం నుండి వచ్చేటప్పటికి ధర్మరాజు వయస్సెంత?
4.   సంస్కృత శ్రీమహాభారతంలోని శ్లోకాల సంఖ్య సుమారుగా ఎంత?
5.    ధర్మవ్యాధుడెవరు? అతడెవరికి ధర్మబోధ చేశాడు?
--------------------------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.    దేవదత్తము – ఇచ్చినవాడు అగ్ని -  ఆదిపర్వము – అష్టమాశ్వాసము –

2.   కర్ణుడు – నాగాస్త్రంతో – నాగాస్త్రంనుండి అర్జునుని తప్పించడానికి కృష్ణుడు రథాన్ని అయిదు అంగుళాలు భూమిలోకి దించేశాడు.  దానితో ఆ నాగాస్త్రం అర్జునుని కిరీటాన్ని కొట్టిపోయింది. – కర్ణపర్వము – తృతీయాశ్వాసము – 319-322 పద్యములు
క|| పలుదెస మంటలు ప్రబ్బఁగ
     నలఘుస్ఫురణమున నిగుడు నయ్యస్త్రంబున్
     జలజాక్షుఁడు కని పంచాం
     గుళమాత్రము రథము ధరణిఁ గ్రుంగనదుముడున్. (319)
క|| సుర గరుడఖచర విద్యా
    ధరఖేచరు లంబరం బుదాత్తధ్వనిసం
    భరితముగఁ బొగడి రమ్ముర
    హరు దివ్యప్ర సవిరచితార్చనతోడన్. (320)
మ|| కురువంశోత్తమ వారిదిక్కు ప్రజ సంక్షోభింప నప్పాఁపతూ
      పు రయం బుగ్రము కాగ బి ట్టడరి దంభోళిప్రభగ్నక్షమా
      ధర శృంగాకృతి గా హరించె బహురత్నస్ఫీతరశ్మిచ్ఛటా
      స్ఫురితం బైనకిరీటమున్ విజయునొప్పుం దేజముం గుందఁగన్. (321)
తే|| జనులు విహ్వలు లగునట్టి ఘనరవంబు
     దిశలయందు నాకసమున దీటుకొనఁగఁ
     గర్ణుఁ డట్లు భేధించె దిక్పతులచేత
     నైనఁ జెడనికిరీట మయ్యహిశరమున. (322)

3.   16 సంవత్సరాలు- ఆదిపర్వము – షష్ఠాశ్వాసము – 142వచనము
వ॥అని పంచినం బురోచనుం డతిత్వరితగతి నరిగి దుర్యోధను కఱపినరూపున వారణావతంబున లాక్షాగృహంబు రచియించుచుండె నిట యుధిష్ఠర భీమార్జున యములుంగ్రమంబునం దొల్లి షోడశపంచదశ చతుర్దశ త్రయోదశవర్ష జాతులయి శతశృంగంబున నుండి హస్తిపురంబునకు వచ్చి యందుఁ గౌరవులం గలసి యస్త్రవిద్యలం గఱచుచుం బదుమూఁడేం డ్లుండి యపుడు ధృతరాష్ట్రునియోగంబున వారణావతంబునకు జననీసహితంబుగాఁ బోవ సమకట్టి మహాజవసత్త్వ సమేతంబు లయిన హయంబులం బూనినరథంబు లెక్కి ధనుర్ధరు లయి హస్తిపురంబు వెలువడునపు డప్పురంబునం గల బ్రాహ్మణక్షత్రియ ప్రముఖానేకజనంబులు శోకతప్త హృదయు లయి. (142)


4.   సుమారు లక్ష శ్లోకాలు – ఆది పర్వము ప్రథమాశ్వాసము – పర్వ సంగ్రహము -34-64 (వచనములు, పద్యములు)
 ఆది పర్వము – 9,984 ; సభా పర్వము – 4,311 ; ఆరణ్య పర్వము –   13,664 ; విరాట పర్వము – 3,500 ;    
 ఉద్యోగ పర్వము – 6,998 ; భీష్మ పర్వము – 5,884 ; ద్రోణ పర్వము – 10,919 ; కర్ణ పర్వము –   4,900 ;  
 శల్య పర్వము – 3,220 ; సౌప్తిక పర్వము – 2,874 ; స్త్రీ పర్వము – 1,775 ; శాంతి పర్వము 14,528 ;
  అనుశాసనిక పర్వము – 12,000 ; అశ్వ మేధ పర్వము – 4,520 ; ఆశ్రమవాస పర్వము – 1,106 ;  
 మౌసల పర్వము – 300 ; మహాప్రస్థానీక పర్వము – 120; స్వర్గారోహణ పర్వము - 200
 మొత్తము శ్లోకాలు – 1,00,803

5.    ధర్మవ్యాధుడు మాంసం అమ్ముకునే బోయవాడు – కౌశికునకు పతివ్రత పంపితే ధర్మములు బోధిస్తాడు – ఆరణ్యపర్వము – పంచమాశ్వాసము – 25 వచనము
వ|| ధర్మంబు బహుమార్గదృష్టం బయి సూక్ష్మం బయి యుండు నీవు కేవలస్వాధ్యాయ పరుండవు గాని ధర్మసూక్ష్మత యెఱుగవు కావున దడయక మిథిలానగరంబున కరుగు మందు జితేంద్రియుండును సత్యవాదియు మాతాపితృ భక్తుండును నయినవాఁడు ధర్మవ్యాధుం డనుకిరాతుండు నీకు నఖిలధర్మంబులు నెఱింగించి సంశయచ్ఛేదంబు సేయు నాదెసం బ్రసన్నుండ వగునది వనితలకుం బరిజ్ఞాంబు లేదు గావున వారెట్టియపరాధంబు సేసినను సహింపవలయుఁ గదా యనినఁ గౌశికుం డి ట్లనియె. (25)
**********************************************************

No comments:

Post a Comment