Translate

06 February, 2015

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి) -145



తెలుగు సుద్దులు…..(145)
కం||ఎండిన మానొ`కట`డవిని
      ఉండిన నం`దగ్ని పుట్టి యూడ్చును చెట్లన్;
      దండి గల వంశమె`ల్లను
      చండాలుండొ`కడు పుట్టి చదుపును వేమా!          
భావముః           
పచ్చని చెట్లున్నఅడవిలో ఒక ఎండిపోయిన చెట్టున్నా దాని (కొమ్మలరాపిడికి) వలన నిప్పురవ్వపుట్టి మెల్లమెల్లగా మొత్తం అడివిని తుడిచి పెట్టుతుంది (బూడిద గుట్టగా చేస్తుంది).  అలాగే, ఎంతో పేరుప్రతిష్ఠలున్న వంశంలో (కుటుంబములో) ఒక్క చెడ్డవాడు పుట్టినా (ఉన్నా) వాని వలన మొత్తం వంశానికి (కుటుంబానికి) అపకీర్తి (చెడ్డపేరు) వచ్చి, వారితో ఎవరూ సంబంధబాంధవ్యములు పెట్టుకొనకపోవడం వలన వంశము అంతరించిపోవడం జరుగగలదని వేమన హెచ్చరిస్తున్నారు. కనుక, తల్లిదండ్రులు తమ సంతానం పట్ల కడు జాగ్రత్త వహించవలసినదిగా వేమన హితవుపలుకుతున్నారు.
మరొక చక్కటి ఉపమానంతో, ఎంతో పేరుప్రతిష్ఠలున్న వంశంలో (కుటుంబములో) ఒక్క దుర్మార్గుడు (చెడ్డవాడు) పుట్టినా (ఉన్నా) వాని వలన మొత్తం వంశానికి (కుటుంబానికి) అపకీర్తి (చెడ్డపేరు) వస్తుందనే భావము తెలిపే మరిరెండు పద్యములు కూడా మనము వేమన పద్యాలలో చూడవచ్చు.
.వె||కులములోన నొకడు గుణహీనుడుండినఁ
       కులముచెడును వాని గుణమువలన
       వెలయుఁజెఱకునందు వెన్నువెడలినట్లు
         విశ్వదాభిరామ వినర వేమా!.
.వె||ఉత్తముని కడుపున నోగు జన్మించిన
       వాఁడుచెఱచు వాని వంశమెల్లఁ
       జెఱకు వెన్నుపుట్టి చెరపదా తీపెల్ల?
         విశ్వదాభిరామ వినర వేమా!.        
          కులము=వంశము; వెలయు=పెరుగుచున్న; వెన్ను=ఎన్ను, కంకి; వెడలినట్లు=పుట్టినట్లు; ఓగు=దుర్మార్గుడు
ఇదే విషయాన్ని సుమతీశతకకారుడు బద్దెన కూడా తెలిపియున్నారుకదా
కంకొఱగాని కొడుకు పుట్టినఁ
       గొఱగామియె కాదు తండ్రి, గుణముల జెఱచున్
       జెఱకుతుద వెన్ను పుట్టినఁ
       జెఱకునఁ దీపెల్ల జెఱచు సిద్ధము సుమతీ! ||04-02-2015||

No comments:

Post a Comment