Translate

03 February, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 056 (276 – 280)




ఓం గణేశాయనమఃగురుభ్యోనమః

                 __/\__                             
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|

[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]

1.నీలుడెవరు? ఎవరిచేత చనిపోయాడు?


2.ద్రణుడు ఒకే రోజున నాలుగు వ్యూహాలు పన్నాడు, ఏమా వ్యూహాలు? ఏరోజున?

3.అలాయుధుడెవరు? ఎవరిచేతిలో చనిపోయాడు?

4.భీష్ముడొకసారి ధర్మరాజును నిన్నుశపించి ఉండేవాడను అన్నాడు, ఎప్పుడు?

5.విష్ణుసహస్రనామం ఎవరు ఎవరికి చెప్పారు?
----------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. నీలుడు పాండవపక్షములో పోరాడిన రాజు 12 రోజున యుద్ధంలో అశ్వత్థామచే చంపబడ్డాడు.   
ద్రోణపర్వము ప్రమాశ్వాసము 371 పద్యము
|| నీలుఁ డనురాజు గురుసుతు
    పై లీలం దేఱు పఱపఁ బటువిశిఖమునం
    గీ లెడపినజంత్రముక్రియ
    నేలం బడ నేసె నతఁడు నృపుఁ డగ్గింపన్. (371)

2.1.శకట వ్యూహము 2.పద్మవ్యూహము 3.సూచీవ్యూహము 4.చక్రవ్యూహము. 14 రోజున సైంధవుని రక్షణ కోసం. ద్రోణపర్వము తృతీయాశ్వాసము 31 వచనము
|| .. భారద్వాజుండును ద్వాదశగవ్యూతిదీర్ఘంబును బంచ గవ్యూతివివిస్తృతంబును గా శకటవ్యూహంబు సమకట్టి దానికిఁ బశ్చిమార్ధంబున గర్భవ్యూహంబుగాఁ బద్మవ్యూహంబు పన్నించి న్మధ్యంబు మొదలుకొని యోలిన సేనాముఖంబుదెసకుం జాలి నిగుడునట్లుగా సూచీవ్యూహంబు గావించి సూచీముఖంబునం గృతవర్మయు నట పిఱుందం గాంభోజరాజును మఱియుఁ బిఱుచన నాప్తులైనశతసహస్ర యోధుల మున్నిడికొని కురురాజును సూచీమూలస్థానంబునఁ బూర్వోక్తప్రకారంబున నాజయద్రథుండును నిలుచు నట్లుగా నొనర్చిన నమ్మహావ్యూహంబు వేడుకం జూచి ఖేచరులు మెచ్చి రట్టియెడ. (31)
 
3.అలాయుధుడు బకాసురుని తమ్ముడు ఘటోత్కచుని చేతిలో చనిపోయాడు. ద్రోణపర్వము పంచమాశ్వాసము 222 వచనము
వ||…… నాయోధు లాయోధనంబుచేసి రట్టియెడఁ గరవాలంబు గొనిమదంబునఁ గవిసినచో ఘటోత్కచుం డలాయుధుం దలపట్టి బలువిడి నిలం బడఁదిగిచి మెడఁదెగవ్రేసి యార్చినం బేర్చినపాండవబలంబులఁ దూర్యనినంబులు సింహనాదంబులుం జెలంగె నప్పుడు. (222)

4.యుద్ధానికి ముందు తనకు నమస్కరించకపోతే. భీష్మపర్వము ప్రమాశ్వాసము 157 పద్యము
సీ|| అన విని గాంగేయుఁ డక్కట నీ విట్లు చనుదేక తక్కిన శాప మిత్తు
    వచ్చితి మే లయ్యె వైరుల నిర్జింపు మిది గాకయును వర మెద్ది యైన
    నడుగుము నీకుఁ గా నని చేయు టొక్కటి దక్కంగ నావుడు ధర్మసుతుఁడు
    రారాజుపక్ష మై రణము చేయుము నాకు హిత మగు కార్యంబు మతిఁ దలంపు
|| మనుడు నట్ల కాక యట నీతలం పేమి
    యనిన భీష్ముతోడ నతఁడు నిన్నుఁ
    బోర గెలుచువిధము బోధింపు మనుటయు
    సస్మితాస్యుఁ డగుచుశాంతనవుడు. (157)

5.భీష్ముడు ధర్మరాజుకు విష్ణుసహస్రనామం చెప్పాడు. ఆనుశాసనికపర్వము పంచమాశ్వాసము 320 - 323 & 325 - 334 పద్యములు; 324 వచనము
సీ|| అఖిలజగత్ప్రభు వగుదేవ దేవు ననంతునిఁ బురుషోత్తమాభిధాను
    నంచితనామసహస్రకంబున సంస్తుతించుచు సంతతోత్థితమనస్కుఁ
    డై యజమానుఁ డవ్యయుఁ డైనయాతని నర్చించుచును దృఢధ్యాననిరతుఁ
    డగుచు నమస్కృతి యాచరించుచు ననాద్యంతు నవ్విష్ణు నధ్యక్షు నెల్ల
తే|| లోకములకు బ్రహ్మణ్యుఁ ద్రిలోకకీర్తి
    వర్ధనుని సర్వధర్మజ్ఞు వరదు లోక
    నాధు భూతభవోద్భవు నమ్మి భక్తిఁ
    గొలిచి సర్వదుఃఖంబులఁ దొలఁగఁ ద్రోచు (320)
తే|| ప్రస్తుతులఁబుండరీకాక్షుఁబరమభక్తిఁ
    దలఁచియర్చించుటయ నామతంబుసర్వ
    ధర్మములకును సమధికతమము నైన
    ధర్మ మింతయెఱుంగుముధర్మతనయ. (321)
సీ|| పరమ తేజంబును బరమపదంబును బర మైన బ్రహ్మంబుఁ బరపరాయ
    ణముఁ బవిత్రంబులు నాఁ దగువానికి నెల్లఁ బవిత్రంబు నెల్లమంగ
    ళంబులకును మంగళంబును నెల్ల దేవతలకు బరమదైవతము భూత
    సమితికి నవ్యయజనకుండు నగునట్టివాఁ డెవ్వఁ డెవ్వానివలనఁ దోఁచు
తే|| నాదియుగమునాగమమున నంత్యవేళ
    నడఁగు నెవ్వనియందుఁ జరాచరములు
    విశ్వలోకప్రధానుఁ డవ్విష్ణువేయు
    భవ్యనామంబులును బాపభయహరములు. (322)
తే|| భూరిగుణయోగవిఖ్యాతములును ఋషిస
    మాజపరిగీతములును నై మహిమఁ దనరు
    నమ్మాహాత్మునినామంబు లధికతరవి
    భూతికై చెప్పెదను విను భూపవర్య. (323)
|| అని పలికి విశ్వంబు విష్ణుండు వషట్కారుండు భూతభవ్యభవత్పృభు వను నివి మొద లైన రథాంగపాణి యక్షోభ్యుండు సర్వప్రహరణాయుధుం డనియెడు నివి తుదగాఁ గల సహస్రనామంబు లుపన్యసించి (324)
|| కీర్తినీయుఁ డైన కేశవు దివ్యనా
    మంబు లివి భవద్ధితంబుఁ గోరి
    తరతరంబు కీర్తితంబు లయ్యె నశేష
    భంగి వేయుఁ గురునృపాలవర్య. (325)
సీ|| విష్ణునామంబులు వేయును నిత్యంబు వినినఁ బఠించిన మనుజుఁ డిహము
    నందుఁ బరమ్మున నశుభంబు నొందక యత్యంత శుభముల ననుభవించు
    విప్రుండు వేదాంతవిదుఁ డగు రాజు విజయమొందు వైశ్యుఁ డక్షయధనంబుఁ
    బడయు శూద్రుఁడు సుఖభాగిత వెలయు ధర్మార్థకామ ప్రజాభ్యర్ధిజనులు
తే|| గాంతు రయ్యై తెఱంగు లేకాంతభక్తి
    శౌచియై విని కీర్తించి సారయశము
    నచలలక్ష్మియు వంశవర్యతయు మేలి
    పెంపుసొంపును గలిగి శోభిల్లు నరుఁడు (326)
సీ || పురుషోత్తమునినామములువేయుఁగీర్తించు నాతఁడొక్కెడనుభయంబుఁబొందఁ
     డమితవీర్యమునఁ దేజమునఁ గాంతిని బలరూపగుణంబుల రూఢి కెక్కు
     రోగబంధాపదార్తులకుఁ బఠనమాత్ర నయ్యయిదురితము లడఁగు వాసు
     దేవాశ్రయుఁడు వాసుదేవపరాయణుఁడును నగుమర్త్యుఁ డవ్వినుతనామ
|| కము లుపన్యసించి కల్మషంబుల నెల్లఁ
    దొఱఁగి దుర్గతులకుఁ దొలఁగి జన్మ
    మరణములకు రోగజరలకు నందని
    పరమ మైనబ్రహ్మపదము నొందు. (327)
|| స్మృతిసౌఖ్యక్షాంతిశ్రీ
    ధృతికీర్తులు కలుగు దుర్మతియుఁ గ్రోధము లు
    బ్ధతయును మాత్సర్యము లే
    వతి పుణ్యత విష్ణుభక్తు లైనజనులకున్. (328)
సీ|| చంద్రార్కనక్షత్రసహిత మైననభంబు
    సచరాచరోర్వియు జలనిధులును
    సురదైత్యగంధర్వగరుడయక్షోరగ
    వ్రజములు హరివశవర్తనములు
    బుద్ధియు నింద్రియములును మనంబు
    త్వంబును బలముఁ దేజంబు ధృతియు
    క్షేత్రంబుఁ దద్గతక్షేత్రజవస్తువు
    లరయఁ గా వాసుదేవాత్మకంబు
తే|| లాగమోదితాచారమయంబు ధర్మ
    మచ్యుతుండు తత్పృభువు సాంఖ్యమును యోగ
    తంత్రమును శిల్పవేదశాస్త్రములుఁ గర్మ
    ములు జనార్దనువలన సముద్భవించె. (329)
|| విష్ణుఁ డొక్కరుండ విను మహాభూతంబు
    తక్కుభూతతులు పెక్కు కలవు
    సరిఁ ద్రిలోకములను బరఁగి విశ్వంబు భూ
    తాత్ముఁ డమ్మహాత్ముఁ డనుభవించు. (330)
|| వ్యాససంప్రణీత మైనయీవిష్ణుస్త
    వంబు సకలశోభనంబులును సు
    ఖములుఁ గోరుపురుషుఁ డమలినబుద్ధిఁ
    ఠిపవలయు భక్తిపెంపుతోడ. (331)
|| అజు విశ్వాధీశ్వరు
    ర్వజగత్పృభవావ్యయప్రవర్తనకరు నం
    బుజలోచను నెవ్వారలు
    భజింతురు పరాభవమునఁ బడ రప్పుణ్యుల్. (332)
|| కావున విష్ణునిపేళ్లగుఁ
    నీవేయుఁ బఠింపు నీకు నెప్పుడు నాయు
    శ్శ్రీవిభవారోగ్యంబులు
    భూవర సిద్ధించుఁ బరమబోధముఁ గలుగున్. (333)
|| అని యి ట్లుపదేశించిన
    విని మోదము నెమ్మనమున వెల్లిగొనఁగ బాం
    డునియగ్రసుతుఁడు గాంగే
    యుని కభివందన మొనర్చి యుచితవినయుఁ డై. (334)
*********************************************************************************

No comments:

Post a Comment