Translate

06 February, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి – 58 (286-290)




ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. కౌరవపాండవులు ఏ దిక్కు మొగంతో యుద్ధం చేశారు?
2. యుద్ధంలో కర్ణుని చేతికి భీముడు చిక్కితే తూలనాడి విడిచాడు; ఏపర్వంలో ఇది జరిగినది? ఎన్నవరోజున?


3. భగదత్తుడు ఎవరు? అతనిని చంపినదెవరు?
4. శ్రుతాయుధుడెవరు? ఏ పక్షంలో యుద్ధము చేసి చనిపోయాడు?
5. సంజయుడు యుద్ధ విశేషాలే కాకుండా యుద్ధ సమయంలో ఒకరికి వచ్చిన కలకూడ వివరించాడు, ఆ కల
          ఎవరిది?
----------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. కౌరవులు పడమర మొగం; పాండవులు తూర్పు మొగం భీష్మపర్వము ప్రథమాశ్వాసము 103 & 122
  వచనములు
|| ఇట్లు పితామహునెత్తికోలునకుం జిత్తంబు వికసిల్ల ననుజసహితంబుగా నతనిం బరివేష్టించి యన్నరపతి నిబిడచారుసన్నాహంబుగా నుచితవ్యూహంబమర్పుమని యతనికిం జెప్పిన నతండును బడమరమొగం బయి తానును ద్రోణుండును దాలధ్వజంబును వేదికాకేతనంబును గ్రాలుచుండ ముందఱ నిలిచి వలపటఁ గృపాశ్వత్థామలును దాపటం గృతవర్మమద్రేశ్వరులును వెనుక బాహ్లికసోమదత్త భూరిశ్రవసులును నడుమం గురుకుమారసమేతముగా నమ్మహీనాథుండును నతని యగ్రభాగమున నర్జునుఁ జంపుదుము చత్తు మింతియు కాని యొండు లేదని శపథంబులు పలికి సంశప్తకులనం బ్రఖ్యాతులయినసుశర్మ మొదలుగాఁగల పదివేవురురథికకముఖ్యులును గలయ నెడనెడం దక్కినయోధవీరులును నిలుచు నట్లుగా నియమించి. (103)
|| దాని కయ్యుధిష్ఠిరుండు ప్రముదితచిత్తుం డగుచు బ్రీతచేతస్కు లగుతమ్ములుం బాంచాలమాత్స్యాధిపతులును సకలజనంబులును బరివేష్టింపం దూర్పుమొగంబై కౌరవు లున్న చక్కటికిం కట్టెదురుగా నిలిచి యెల్లవారిసైన్యంబులుం గ్రమంబునఁ గొలంది వెట్టుకొనుచు నందఱకు సంజ్ఞలు నదియాలంబులుం గల్పించి. (122)

2.ద్రోణపర్వములో 14వ రోజున. ద్రోణపర్వము చతుర్థాశ్వాసము -239 పద్యము
|| తిండిపోత నీకు భండనం బేటికిఁ
     గడవఁ జేరి మనసు కాంక్ష తీఱ
     నోపుకొలది మ్రింగి యూరక నీ వింటి
     కడన యుండు మింక నడిచిపడక (239)

3. ప్రాగ్జ్యోతిషాధిపతి 12వ రోజున అర్జునుని చేతిలో ద్రోణపర్వము ప్రథమాశ్వాసము 358 పద్యము
    || వాలికదొడ్డనారసము వజ్రము శైలము దాఁకునాకృతిన్
        ఫాలముమీఁదఁ దాఁకిన నిభంబు వెసం బడి కొమ్ము లూఁతగా
        వ్రాలుడు నర్ధ చంద్రరుచిర ప్రదరంబునఁ ద్రుంచె బాణవి
        ద్యాలసితుండు  క్రీడి భగదత్తునికంఠ మకుంఠితోద్ధతిన్. (358)

4.శ్రుతాయుధుడు వరుణుని కుమారుడు, కౌరవ పక్షంలో 14వ రోజున చనిపోయాడు. ద్రోణపర్వము
  తృతీయాశ్వాసము 91 పద్యము & 92 వచనము.
|| అశనికరణి వచ్చి యాశ్రుతాయుధునిపై
    నమ్మహోజ్జ్వలాయుధమ్ము పడినఁ
    బార్ధుచేత మున్ను బాహులు దెగిపడ్డ
    యతఁడు కొండ కూలినట్లు కూలె. (91)
|| ఇట్లు వరునతనయుఁడు పడినం గనుంగొని (92)

5.అర్జునుని కలను. ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము 378 వచనము
|| నిజశిబిరంబు చొత్తెంచి రవ్విధంబున నర్జునుండు కల గాంచెఁ గృష్ణుండు దారుకు తోడం దగుమాటలాడు చుండఁ దెల తెల వేగె నది యాధనంజయస్వప్నాంత సమయం బై సంఘటించె నని యిట్లు సంజయుండు సవ్యసాచివర్తనంబు తెఱంగు  ధృతరాష్ట్రున కెఱింగించె ననుటయు. (378)

****************************************************************

No comments:

Post a Comment