Translate

27 March, 2017

బ్రహ్మశ్రీ గుండ్ల పుండరీకాక్షరావుగారి కార్తీకంలో భగవద్గీత ప్రవచనములు🙏🏼

బ్రహ్మశ్రీ గుండ్ల పుండరీకాక్షరావుగారి ప్రవచనములు:

1.కార్తీకములో - భగవద్గీత - కర్మయోగము శ్లో.నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయోహ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిధ్యేదకర్మణః. (3-8) భగవద్గీత అర్థములు: త్వం- నీవు; నియతం - విధిగా చేయదగిన, తప్పకచేయవలసిన; కర్మ- కర్మను(Duty); కురు- చేయుము అకర్మణః - కర్మచేయకపోవడముకంటే; కర్మ- కర్మచేయడం; జ్యాయః - శ్రేష్ఠము మంచిది; అకర్మణః - కర్మచేయకపోవడమువలన; తే- నీకు;శరీరయాత్రాపి- జీవయాత్రకూడ; నప్రసిధ్యేత్- సాగదు. భావముః నీవు విధిగా శాస్త్రవిహితకర్మను చేయవలెను. కర్మ చేయకుండా తప్పించుకొనకుము. కర్మ చేయడం చాలా మంచిది. నీవు కర్మ చేయక ఉండినచో జీవయాత్ర సాగదు. కర్మయోగమే క్రమశిక్షణ. కాలమును వృధాగా గడుపువారు కర్మయోగమును పాటించలేరు.కర్మయోగమువలననే భక్తి సాధ్యము. కర్మయోగములోనే సర్వము ఉన్నది. మాతృదేవో భవ! పితృదేవోభవ భవ! ఆచార్యదేవో భవ!అతిథిదేవో భవ! ఈ వేదవాక్యములను ఆచరించనివారు కర్మయోగమును పాటంచలేరు. పెద్దవారిని, జ్ఞానులను, గురువులను, తల్లితండ్రులను అవమానపర్చువారు, కర్మయోగమును పాటించక అశాశ్వతమైనసుఖములను అనుభవించుచూ కాలమును వృధాగా గడుపువారు అనేక కష్టములను,ఆపదలను పొందుదురు. పరమాత్మ వెంటనే శిక్షించడు. చాలా అవకాశము ఇస్తాడు. నిగమశర్మను(పుండరీక) వెంటనే శిక్షించలేదు. పుండరీకుడు చివరకు తాను చేసిన తప్పును తెలిసికున్నాడు. మారీచుడు రాముని చంపవలలెనని రెండుసార్లు ప్రయత్నములు చేసినాడు. అయిననూ, రాముడు చంపకవదలివేసినాడు. తరువాత ధర్మమూర్తి రాముని చరిత్ర తెలిసికొని పశ్త్చాత్తాపముచెందాడు. సాధువుగామారాడు. కర్మయోగము పాటించుటకు నియమములుః 1)కాలమును అర్థము చేసికొనవలెను. కాలముతోపాటు శరీరము వికారముచెందుచుండును. గడిచిన శరీరము, గడిచిన కాలము నీకు తిరిగిరావు. అందువలన పరమాత్మ ఉపదేశానుసారము కాలమును వృధాచేయక తమ ధర్మమును తాము తప్పక పాటించవలెను. 2)ముందుగా తన్నుతాను కర్మ(క్రమశిక్షణ)యోగములో నిమగ్నము కావలెను. 3)మొదటిగా పెద్దలకు నమస్కరించుట అనగా పరమాత్మకు నమస్కరించుట. ఆలయములోని దేవుడికి నమస్కరిస్తాను కాని పెద్దలకు నమస్కరించననువాడు మూర్ఖుడు. 4)ఎదుటివానిలోని పరమాత్మను దర్శించినవాడు కర్మయోగమును పాటించినవాడు. అతడే భక్తుడు లేక మనీషి. ఓం శాంతిఃశాంతిఃశాంతిః.

2. కార్తికములో భగవద్గీత - మనస్సు(ఆత్మా).

శ్లో. ఉధ్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత
ఆత్మైవహ్యాత్మనో బంధురాత్మైరివ రిపురాత్మనః (6-5)
అర్థములు: ఆత్మానం - తనను; ఆత్మనా - తనమనస్సుచేతనే; ఆత్మానం - తనను; అవసాదయేత్ - నశింపచేసికొనకూడదు; ఆత్మా ఏవ - తనే; ఆత్మనః - తనకు; బంధుః - బంధువు; హి - కదా; ఆత్మాఏవ - తానే; ఆత్మనా - తనకు; రిపుః - శత్రువు.
భావముః ఆత్మా- మనస్సు, శరీరము, బుద్ది, పరమాత్మ. తాను తన మనస్సుతోనే తాను ఉధ్ధరించుకొనవలెను. తన మనస్సును తాను నశింపచేసికొనరాదు. తన మనస్సే తనకు బంధువు, తన మనస్సే తనకు శత్రువు. అయిదు ఇంద్రియములకు మనస్సు అధికారి. ఇంద్రియములను మనస్సుతో వశము చేసికొనినచో నీవు ఉధ్ధరింపబడుదువు. తన మనస్సును తాను తక్కువగా అంచనా వేయరాదు. మనస్సుఎవరోకాదు పరమాత్మయే. మనస్సును సదా పవిత్రముగా ఉంచుకొనవలెను. అదియే యోగము. ఎవరు మనస్సును అపవిత్రముగా చేసికొందురో వారు తమంతటతామే క్షీణతలో ఉందురు. మారీచుడు చివరకు తన్నుతాను ఉధ్ధరించుకొనినాడు. “రామోవిగ్రహవాన్ ధర్మః“ అని తెలిసికొనినవాడు. రాముని ధర్మగుణమే అతని మనస్సును ఉధ్ధరించినది.
1)మనస్సే అన్నిటికి మూలము. మనస్సు నిర్మలముగా ఉంచుకొనుటకు ధర్మాచరణ అవశ్యము అనుసరణీయము.
2)ఆహారనియమములు, విహారనియమములు యుక్తములుగా ఉండవలెను.
3)ధ్యానయోగముచే మనస్సును వశముచేసికొనవచ్చును.
4)నిష్కామకర్మయోగముచే వశము చేసికొనవచ్చును.
5)సత్సంగముచే వశము చేసికొనవచ్చును.
6)నామసంకీర్తనచే వశము చేసికొనవచ్చును.
7)గురువును ఆశ్రయించి వశము చేసికొనవచ్చును.
మనస్సు వశము చేసికొనినవాడు, పరమాత్మ సాక్షాత్కారమును పొందును. (6-6&6-7) శ్లోకములను అనుసంధానము చేయవలెను. మనస్సును వశము చేసికొనినచో స్వర్గము. లేనిచో, నరకము. అర్జునుడు మనస్సును వశము చేసికొనలేక, గురువును (శ్రీకృష్ణపరమాత్మను)ఆశ్రయించాడు. మహర్షులు ధ్యానయోగముచే మనస్సును వశము చేసికొని పరమాత్మను దర్శించుచున్నారు.
శ్రీలలితామాత పాశము, బాణము, చెరకుగడ, పుష్పబాణములను ధరించిన రూపమునకు అర్థము- మనస్సును వశము చేసికొనుము. మనస్సును వశము చేసికొనినవాడు మోహమును చెందడు. సుందరకాండలో, శ్రీమాన్హనుమ లంకలో సౌందర్యమంతా చూసాడు. కాని, మనస్సుచే ఇంద్రియములు జయించిన జితేంద్రియుడు కనుక, రామకార్యమును సఫలము చేసిన మహాత్ముడు. మనస్సును వశము చేసికొనినవానికే భక్తి కలుగును.
ఓం శాంతిఃశాంతిఃశాంతిః.

3. కార్తికములో భగవద్గీత - మిథ్యాచారము.

శ్లో. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. (3-6)
అర్థములు: యః - ఎవడు; కర్మేంద్రియాణి- వాక్, పాణి, పాద, పాయు,ఉపస్థలను; సంయమ్య- బలవంతంగా నిగ్రహించి; మనసా - మనస్సుతో; ఇంద్రియార్థాన్ - ఇంద్రియవిషయములను; స్మరన్ - తలంచుచూ; ఆస్తే - జీవించుచండునో; సః- అట్టి' ; విమూఢాత్మా- మూఢబుద్ధికలవాడు; మిథ్యాచారః - అసత్యమైన లేక దురాచారమైన ప్రవర్తన కలవాడని; ఉచ్యతే - చెప్పబడును.
భావముః కర్మేంద్రియములును,జ్ఞానేంద్రియములను(10)మనస్సులో బలవంతంగా అదిమి పెట్టి, ఆ మనస్సుతోనే ఇంద్రియవిషయములను స్మరించుచూ ఉండువాడు మూఢబుద్ధికలవాడు. ఇతని ఆచరణ మిథ్యాచారము. అనగా ధర్మబద్ధముకాని ఆచారము. దురాచారము. రావణుడు ఇంద్రియములను మనస్సుతో బలవంతంగా అదిమిపెట్టి తపస్సు చేసి శక్తిని పొందాడు. అదిమిపెట్టిన ఇంద్రియములు విజృంభించాయి. అధర్మప్రవర్తనతో లోకాలను బాధించాడు, ఫలితముగా సర్వ నాశనమయినాడు.
1)పైకి కాషాయాంబరములు లోపల ఇంద్రియలోలత్వము.
2)పైకి మృదుత్వం లోపల త్రికరణశుద్ధి లేకపోవడం.
3)పైకి వేషము (కట్టు , బొట్టు ) లోపల ఇంద్రియ ఘోష.
4)పైకి నామసంకీర్తనాదులు లోపల బహు ఆలోచనలు. (పారాయణములు, సంకీర్తనములు మనస్సును వశము చేసికొనుటకు. కొందరు తద్వతిరేకము.)
5)పైకి వేషము. కొందరు గురువులను, తల్లిదండ్రులను, అత్తమామలను, మంత్రులను ధిక్కరించుచూ పారాయణాలు చేయువారు
ఈ విధముగా ప్రవర్తించువారు మిధ్యాచారులు. వీరికి శ్రేయోమార్గము దుర్లభము. నరకము తధ్యము. మిథ్యాచారము లేకుండా సదాచారమున ప్రవర్తించువారు ధర్మమును ఆచరించినవారగుదురు. సదాచారము అందరికి వర్తించును. ‘సదాచారప్రవర్తికా‘ - లలితానామము. ఎవరు సదాచారులో వారిని లలితామాత అనుగ్రహించును.
ఓం శాంతిఃశాంతిఃశాంతిః.

4.కార్తికములో భగవద్గీత - జ్ఞానసముపార్జన.

శ్లో. తత్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. (4-34)
అర్థములు: తత్ - ఆ పరమాత్మను గురించిన జ్ఞానమును; విద్ధి - తెలిసికొనుము; ప్రణిపాతేన - సాష్టాంగప్రణామముచేసి; పరిప్రశ్నేన - భక్తిపూర్వకముగా ప్రశ్నించి; సేవయా - సేవచేత; తే - నీకు; తత్వదర్శినః - పరమాత్మను గురించిన జ్ఞానము పొందినవారు; జ్ఞానినః - జ్ఞానులు; జ్ఞానం- జ్ఞానమును. ఉపదేక్ష్యంతి - ఉపదేశించుదురు.
భావముః పరమాత్మను గురించిన జ్ఞానమును తెలిసికొనుము. అందుకొరకై తత్వవేత్తలకు సాష్టాంగనమస్కారముచేసి వారికి సేవచేసి వినయపూర్వకముగా ప్రశ్నించి తెలిసికొనుము. జ్ఞానము మనిషికి మూడవ నేత్రము వంటిది. అజ్ఞానమను నల్లనిపొరను గురువను వైద్యుడు జ్ఞానమను శలాకతో(పుల్ల) చికిత్స చేయును. కనుక గురువును ఆశ్రయించి జ్ఞానము పొందవలెను.
టివి మరియు పుస్తకములున్నవి కదా, అవి ప్రసాదించునని అనుకొనరాదు. అవి గురువు నుండి పొందిన తరువాత సహాయకారులగును. మన భారతీయ సాహిత్యమంతయూ గురుశిష్యుల పరిప్రశ్నల, సమాధానములతోనిండి ఉన్నది.
గురువును ఆశ్రయించి జ్ఞానమును పొందినవారు....
1)శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశము - భగవద్గీత.
2)యముడు నచికేతునకు ఆత్మవిద్యా ఉపదేశము - కఠోపనిషత్
3) 1)సుకేశుడు 2)సత్యకాముడు 3)గర్గవంశమున సూర్యుడు 4)కౌసల్యుడు 5)భార్గవుడు. 6)కబంధీ. ఈ ఆరుగురు శిష్యులు పిప్పలాదమహర్షిని సేవించి ఆరు ప్రశ్నలు వేసి బ్రహ్మజ్ఞానమును పొందిరి- ప్రశ్నోపనిషత్.
4)తైత్తిరీయమంతా - గురు శిష్యులు.
ఈ విధముగా ఉపనిషత్తులన్నియూ గురుశిష్యుల పరిప్రశ్నేన సేవయా. భారత భాగవత రామాయణాదులు కూడా పరిప్రశ్నేన సేవయా. శంకరాచార్యస్వామికి, వివేకానందస్వామికి ఇంకా ఎందరో మహానుభావులకు గురువులున్నారు. గురువులవలననే వారు మహాత్ములయినారు.
1)న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే.
2)శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
జ్ఞానము పరమాత్మ స్వరూపము. కనుక జ్ఞానమును పొందినవారు పరమాత్మ సాక్షాత్కారమును పొందుదురు. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం.
లౌకికవిద్య, అలౌకికవిద్య అని విద్యలు రెండు విధములు. లౌకికవిద్య జీవించడానికి అవసరమగునంత ధన సంపాదన. ఇది ఇహమునకు.
అలౌకికవిద్య(పరమాత్మ జ్ఞానము) ఇహమునకు శాంతి మరియు పరమునకు సుఖమును కలిగించును. . తేజస్వి నావధీతమస్తు! ఓం శాంతిఃశాంతిఃశాంతిః.

5. కార్తికములో భగవద్గీత - ఆహారనియమములు

శ్లో. యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు
యుక్తస్వప్నావబోధస్య యోగో భవితి దుఃఖహా (6-17)
అర్థములు:
యుక్త - తగిన; ఆహార - నియమిత ఆహారమును; విహారస్య- శబ్దస్పర్శాదివిషయాలను ధర్మయుక్తముగా అనుభవించువాడు; కర్మసు - కర్మలయందు; యుక్తచేష్టస్య - ధర్మయుక్తమైన ప్రవృత్తులు కలవాడు; యుక్త - తగిన /నియమితమైన; స్వప్న- నిద్ర,; అవబోధస్య- మేలుకొని ఉండుయోగికి; దుఃఖహా - దుఃఖమును నశింపచేయు; యోగః - యోగము; భవతి- కలుగును.
భావముః యుక్తమైన ఆహారమును తీసికొనవలెను . ధర్మయుక్తమైన ఇంద్రియవిషయములను అనుభవించవలెను. కర్మలయందు, చేష్టలయందు నియమములు పాటించవలెను. నిద్ర, జాగరణలందు నియమములు పాటించవలెను. ఈ నియమములు పాటించు యోగికి సంసారమువలన కలుగు దుఃఖము నశించును.యోగము సిద్ధించును.
మన ఉదరములో వైశ్వానరాగ్ని ఉన్నది (15-14) ఈ అగ్ని పరమాత్మ స్వరూపము. ఉదరము ఒక యజ్ఞగుండము. యజ్ఞగుండములోని అగ్నికి పవిత్రమైన హవిస్సు అనగా శుచిగల ఆహారమును సమర్పింతుము . ఉదరమును సదా ఒకవంతు ఖాళీగా ఉంచవలెను. మిగిలిన మూడు వంతులలో ఒకవంతు నీరు రెండు వంతులు ఆహారమును నింపవలెను. (17-7-10) ఈ ప్రకారము ఆహారమును తీసికొనవలెను. మనము తీసికొనే ఆహారముయొక్క శక్తి(సూక్ష్మాంశము) మన మనస్సుకు చేరును. సాత్వికాహారమువలన సత్వగుణము కలుగును.ఈ విధముగా తక్కినవి. సాత్వికాహారమువలన, ధర్మయుక్తములైన కర్మలవలన, ప్రవృత్తులవలన, నిద్ర జాగరణలవలన యోగము సిద్ధించును. యోగము కలిగినపుడే సంసారదుఃఖము నశించును. అతిగా తినడం, అతిగా విహారములనుభవించుట, అతిగా నిద్ర, అతిగా జాగరణ, అతిగా కర్మలను చేయుట - ఇవి పనికిరావు. ఇవి అనారోగ్యమును కలిగించును కూడా.
కార్తికమాసములో ముఖ్యముగా ఉపవాసములుండి ఆహారనియమములు పాటింతురు. కాని ఎల్లపుడు పాటించవలెను. ధ్యానయోగము పాటించువారు తప్పనిసరి గా ఈ శ్లోకములలోని నియమములను పాటించవలెను. ముఖ్యముగా గర్భవతులుగా ఉన్న స్త్రీలు తప్పక ఈ నియమములను పాటించవలెను. తొమ్మిదినెలలు యోగమును అనుభవించుదురు. ఈ కాలమున ఈ శ్లోకమును అర్థము చేసికొని పవిత్రత పాటించినవారు ధన్యులు.
ఓం శాంతిఃశాంతిఃశాంతిః.

6 కార్తికములో భగవద్గీత - యోగక్షేమాలు


శ్లో. అనన్యాః చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్।। (9-22).
అర్థములు: యే - ఏ; జనాః - భక్తులు; అనన్యాః - మరియొక ఆలోచన లేక; చింతయంతః - నన్నే ధ్యానించుచూ; మాం - నన్నే; నిత్యఅభియుక్తానాం - సదా నిర్మలమైన మనస్సుతో ఏకాగ్రతతో; పరి - ఉపాసతే - భక్తితో సేవించుచున్నారో వారి; యోగ - యోగమును; క్షేమం - క్షేమమును; అహం -నేను; వహామి- మోయుచున్నాను.
భావము: ఏ భక్తులు ఎటువంటి ఇతర ఆలోచనలు లేక నిర్మలమైన మనస్సుతో సదా నన్ను భక్తితో సేవించుచున్నారో  
వారియొక్క యోగక్షేమాల బాధ్యతను నేనే వహించుచున్నాను.
యోగము - ఆత్మ పరమాత్మలో కలిసే ప్రయత్నము; పర్యుపాసతే - అనన్య భక్తితో కవులు రచనలు చేయుట; సంగీతము, చిత్రలేఖనమ, శిల్పము, నృత్యాదులచే పరమాత్మను సేవించుట; ధ్యానయోగము ద్వారా ఆత్మ సాక్షాత్కారము - నిష్కామకర్మయోగముచే ఆత్మదర్శనము- భక్తియోగము ద్వారా సేవించుట. వీటిలో ఏమార్గముచేతనైనా పరమాత్మను సేవించుట.
క్షేమము - యోగమువలన ఏది సిద్ధించినదో దానిని రక్షించుట క్షేమము
కృష్ణపరమాత్మ ఈ రెంటి బాధ్యతలను నేను వహిస్తానని దృఢముగా చెప్పుచున్నాడు.
అనన్యచింతన - ఇంద్రియములను ఇంద్రియవిషయములందు లగ్నము చేయకుండుట. నిర్మలమైన మనస్సును బుద్ధియందు నిలుపుట.
వ్యాస, వాల్మీకి, కాళిదాసాది గీర్వాణభాషామహాకవులు అనన్యచింతనతో రచించిన మహాకావ్యములు నేటికినీ అజరామరముగా ఉన్న అమృతకలశములు; నన్నయ, తిక్కన, ఎర్రన, పోతనాది తెలుగుకవుల రచనలు తెలుగువారికి జ్ఞానమకరందములు; శతాధికగ్రంథకర్త కీ.శే.విశ్వనాథ సత్యనారాయణగారి రచనలు సాహిత్య సౌరభాలు; ఇంకనూ అనేకకవులు పరమాత్మను అనన్యచింతనతో ధ్యానించి రచించిరి.
సంగీతము ద్వారా త్యాగయ్య, ముత్తుస్వామి మొదలగువారు, శిల్పకళ, చిత్రకళల ద్వారా పరమాత్మను ధ్యానించి తరించిన వారందరో కలరు. వీరి రచనలన్నింటి బాధ్యతను పరమాత్మ చేపట్టి వారికి యశ్చంద్రికలను అనుగ్రహించుచున్నాడు. కేవలము భక్తితో తనను సేవించినవారి యోగక్షేమాల బాధ్యతను తాను వహిస్తానని పరమాత్మ మనకు భరోసా ఇస్తున్నాడు.
ఓం శాంతిఃశాంతిఃశాంతిః.







No comments:

Post a Comment